వయోజనులు 103 కోట్లైతే, ఓటర్లు 88 కోట్లా?
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:15 AM
అవునా?– ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలైనప్పుడు చట్టబద్ధమైన ఓటర్ల సంఖ్యకు సంభవించే మొత్తం నష్టానికి సంబంధించి మా తొలి అంచనాలపై చాలామంది...
అవునా?– ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలైనప్పుడు చట్టబద్ధమైన ఓటర్ల సంఖ్యకు సంభవించే మొత్తం నష్టానికి సంబంధించి మా తొలి అంచనాలపై చాలామంది ప్రతిస్పందన అది. ఒక సత్యాన్ని తెలుసుకున్నామన్న ఆశ్చర్యకరమైన భావన కొంతమంది స్పందనలో ధ్వనించగా మరి కొంతమంది ఆ ఏక పద ప్రశ్న రూప స్పందనలో మా అంచనాల పట్ల వ్యంగ్యాన్ని ధ్వనింపజేశారు. ఇదలా ఉంచి అసలు విషయానికి వద్దాం. బిహార్‌లో ఓటర్ జాబితాల నుంచి 65 లక్షల పేర్ల తొలగింపునకు సర్ దారితీసింది. ఆ ప్రకారం చూస్తే, దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటర్ జాబితాల నుంచి తొలగించేందుకు సర్ దారితీస్తుందని మేము అంచనా వేశాం. అయితే ఎవరూ మా మాటను విశ్వసించలేదు. అప్పటికీ మేము చేసిన హెచ్చరికల వల్లే బిహార్‌లో అంతిమ తొలగింపుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో తగ్గింది. సర్ అమలులో అసంగతాలపై మేము దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు తుది గణాంకాలు వచ్చేశాయి. మొత్తం తొలగింపులు మేము ఊహించిన దానికంటే అత్యధికంగా ఉన్నాయి. దీనిపై మనం సత్వరమే మేల్కొనకపోతే మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.
ప్రధాన రాష్ట్రాలకు సంబంధించిన ముసాయిదా సర్ ఓటర్ జాబితాల విడుదలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గతవారం పూర్తి చేసింది. నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల ముసాయిదా ఓటర్ జాబితాలను ఇంకా విడుదల చేయవలసి ఉన్నది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రాలలో సర్ ప్రక్రియ అమలు ఇంకా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ దేశవ్యాప్త సర్ ఫలితాల ధోరణి స్పష్టంగా ఉంది. ముసాయిదా స్థాయిలో జరిగిన తొలగింపుల సంఖ్య 13 కోట్ల 37 లక్షలుగా ఉన్నది. ముసాయిదా జాబితాల విడుదల తరువాత మరికొంత మందిని జాబితాలలో చేర్చడం లేదా తొలగించడం సహజం కనుక సర్ అంతిమ జాబితాలలో తొలగింపుల సంఖ్య కొంచెం తక్కువగా ఉండవచ్చు. అదనపు చేర్పులు, సర్ ఇంకా ప్రారంభం కాని రాష్ట్రాలనూ పరిగణనలోకి తీసుకున్నప్పుడు భారత్ ఓటర్ జాబితాల నుంచి అంతిమ తొలగింపులు పన్నెండు కోట్లకు పైగా ఉండవచ్చనేది మా అంచనా.
ఈ విషయాన్ని మరింత లోతుగా, విశాలంగా చూద్దాం. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో భారతదేశ ఓటర్ల సంఖ్య 98 కోట్లుగా ఉన్నది. అదే కాలంలో వయోజనుల సంఖ్య (99 కోట్లు)కు ఓటర్ల సంఖ్య ఇంచుమించు సమానంగా ఉన్నది. సర్ లాంఛనంగా ముగిసే నాటికి భారతదేశ వయోజన జనాభా అంచనా 103 కోట్లుగా ఉంటుంది, అంతిమ జాబితాలలోని ఓటర్ల సంఖ్య 88 కోట్లకు తగ్గిపోతుంది. వయోజన జనాభాకు, ఓటర్ల సంఖ్యకు మధ్య ఇంత పెద్ద వ్యత్యాసానికి కారణమేమిటో నిశితంగా చూడవలసిన అవసరమున్నది. ఆ భారీ వ్యత్యాసం రెండు అవకాశాలను సూచిస్తుంది: ఒకటి– బహుశా జనాభా అంచనా భారీగా వేసి ఉండాలి. అంటే అధికారిక అంచనాలలో ఉన్నట్లుగా 145 కోట్లకు పైగా కాకుండా భారత జనాభా 125 కోట్ల లోపే ఉండి ఉండాలి. రెండు– ఓటు వేసే వయసుగల 15 కోట్ల మంది యువత ఓటర్ జాబితాల నుంచి గల్లంతవడం. వీటిలో ఏది నిజం? ఏది నిజమైనప్పటికీ ఆ ‘వాస్తవం’ అక్షరాలా ఒక లజ్జాకర విషయమని చెప్పక తప్పదు.
సర్ ప్రక్రియలో తొలగింపులు అన్నీ తప్పుడువేనని భావించనవసరం లేదు. ప్రస్తుత ఓటర్ జాబితాలలో లొసుగులు, నకిలీ పేర్లు చాలా ఉన్నాయి. కనుక తొలగింపులలో అత్యధిక భాగం న్యాయబద్ధమైనవేనని అంగీకరించాలి. అయినప్పటికీ మూడోవంతు తొలగింపులు సక్రమమైనవి కాకపోయినా ఓటర్ జాబితాలు తారుమారు కావడమనేది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాని స్థాయిలో జరిగిందనే వాస్తవాన్ని మనం గుర్తించాలి.
ఓటు హక్కు ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేనివారు, అసలు ఓటు హక్కు అందుబాటులోకి రానివారిని కూడా పరిగణనలోకి తీసుకోవల్సివుంది. సర్‌కు పూర్వపు జాబితాలలో లేని అర్హులైన ఓటర్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలామంది పేర్లను సర్ ప్రారంభం కాకముందే జాబితాల నుంచి తొలగించారు. ఈ అవకతవకలన్నిటినీ సర్ సరిదిద్దలేదు. దీన్నిబట్టి వయోజన జనాభా సంఖ్యకు, ఓటర్ల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఎందుకు ఉన్నదో అర్థమవుతుంది.
మరి ఆ వ్యత్యాసం సర్ తదుపరి దశలలో క్రమేణా తగ్గిందా? లేదు. లేకపోగా ప్రతి దశలోనూ ఓటర్ తొలగింపుల విస్తృతి, స్వభావం మరింత ప్రతికూల మార్పులకు లోనయ్యాయి. ‘సర్’ను తొట్ట తొలుత బిహార్‌లో అమలుపరిచారు. అది తొలి మార్గదర్శక దశ. బిహార్‌కే పరిమితమైన ఆ దశలో ఓటర్ జాబితాల నుంచి తొలుత 65 లక్షల పేర్లను తొలగించారు. అయితే న్యాయవ్యవస్థ జోక్యంతో ఆ తొలగింపులు అంతిమంగా 45 లక్షలకు తగ్గిపోయాయి. బిహార్ తరువాత 13 రాష్ట్రాలలో సర్ రెండో దశ ప్రారంభమయ్యే నాటికే ఆ ప్రక్రియ పట్ల ప్రజలు ఉదాసీనత వహించారు. రాజకీయ పక్షాలు ఉపేక్షాభావం చూపాయి. అప్పటికే బిహార్ ఎన్నికలు జరిగిపోయినందున ప్రజలు ‘సర్’కు అలవాటుపడ్డారు. ఓటర్ల సంఖ్యలో దాదాపు 13శాతం తగ్గుదలను చాలావరకు ఎవరూ ప్రశ్నించలేదు. అయితే పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఓటర్ల తొలగింపు మీద మాత్రం జాతీయ స్థాయిలో పౌరసమాజం దృష్టి పెట్టింది. సర్ అమలు తీరుతెన్నులపై సంపూర్ణ నిర్ణయాధికారం ఎన్నికల సంఘానిదేనని సుప్రీంకోర్టు ఒక తీర్పులో స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల సంఘం ఆ ప్రక్రియను తాను నిర్ణయించుకున్న రీతిలో అమలుపరిచింది. మూడో దశ ముసాయిదా సర్ జాబితాలలో ఓటర్ల తొలగింపులు 17శాతానికి పైగా పెరిగాయి!
సర్ మూడో దశ అమలైన హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణతో పాటు ఢిల్లీలో ఓటర్ల తొలగింపులు అసాధారణంగా అత్యధిక సంఖ్యలో చోటుచేసుకున్నాయి. మూడు దశలలోను ‘మృతుల’ కేటగిరీలోని ఓటర్ల నిష్పత్తి స్థిరంగా ఉన్నది. మొత్తం తొలగింపులలో ‘మృతుల’ తొలగింపులు ఇంచుమించు 3శాతంగా ఉన్నాయి. ఇవి కాకుండా ‘అందుబాటులో లేకపోవడం’ (ఆబ్సెంట్), ‘వలస వెళ్లడం’ (షిఫ్టెడ్) కారణాలతో కూడా పెద్ద ఎత్తున ఓటర్లను తొలగిం చారు. గమనార్హమైన విషయమేమిటంటే ఆబ్సెంట్, షిఫ్టెడ్ కేటగిరీలను ఇప్పటివరకు స్పష్టంగా నిర్వచించలేదు. దీంతో స్థానిక ఎన్నికల అధికారులు తమకు తోచిన విధంగా ఆ కేటగిరీలను ఉపయోగించారు. ముసాయిదా ఓటర్ జాబితాల నుంచి తొలగింపునకు గురైనవారే కాకుండా అదనంగా మరో అయిదోవంతు మంది ఓటర్లు ‘అన్ మ్యాప్డ్’ (జాబితాలో చేర్చని) లేదా ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ (తార్కిక వ్యత్యాసం) కారణాల వల్ల మరింత పరిశీలనను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒడిషా, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘తార్కిక వ్యత్యాసం’ నిష్పత్తి అసాధారణంగా హెచ్చుస్థాయిలో ఉన్నది. కారణమేమిటి? కంప్యూటర్ అల్గారిథమ్ కంటే మరేదో పెద్ద కారణం ఉందని చెప్పక తప్పదు. అటువంటి వ్యత్యాసాలను ఎలా పరిష్కరించాలనే దానికి సంబంధించి ఎలాంటి ప్రామాణిక కార్యాచరణ విధానం కూడా లేదు. నిష్కర్షగా చెప్పాలంటే ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ అనేది ఒక పద్ధతి కాదనేది స్పష్టం. ఉద్దేశపూర్వకంగా రూపొందించిన, అనుసరిస్తున్న ఒక ఏకపక్ష వైఖరి.
సర్ మూడో దశలో ఒక కొత్త దురాచారం ఆరంభమయింది: చాలా రాష్ట్రాలలో సర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కాకముందే ఓటర్ జాబితాల నుంచి పెద్ద ఎత్తున తొలగింపులు జరిగాయి. వీరు మళ్లీ ఓటర్‌గా నమోదయ్యేందుకు వీలుగా కనీసం ఒక ఎన్యూమరేషన్ ఫామ్‌ను సైతం అందుకోలేదు. వారి తొలగింపులు చాలా అనామకంగా జరిగిపోయాయి. ‘ఇవి సర్ తొలగింపుల కిందకు రావు’ అనేది గమనార్హమైన వాస్తవం. సర్ మూడో దశకు షెడ్యూలు ప్రకటించిన మే 12, సర్ అధికారికంగా ప్రారంభమైన రోజుకు మధ్య 14 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లను ఓటర్ జాబితాల నుంచి తొలగించారు. వీటిలో అత్యధిక భాగం –8 లక్షలు– మహారాష్ట్రలో జరిగాయి. 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం, 2026లో సర్ ప్రక్రియ అమలు ఆరంభం మధ్య కాలంలో ఢిల్లీలో ఓటర్ల సంఖ్య 11 లక్షలకు పైగా తగ్గిపోయింది. ఇదీ కారణం అని చెప్పేందుకు వీలుకాని పరిణామమిది. గత ఏడాది 1.56 కోట్లుగా ఉన్న ఢిల్లీ ఓటర్ల సంఖ్య సర్ ముసాయిదా ఓటర్ జాబితాల విడుదల నాటికి 98 లక్షలకు తగ్గిపోయింది.
ఇవన్నీ స్పష్టం చేస్తున్నదేమిటి? సర్ డేటా అవకతవకలమయంగానూ, అసంబద్ధంగానూ ఉన్నది. డేటా క్రమరాహిత్యం, అసంగతాన్ని మాత్రమే మనం ఎదుర్కొనడం లేదు. సర్ రూపేణా ఎన్నికల ప్రజాస్వామ్య పునాదులనే పునర్నిర్మించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య నైతికతకు విరుద్ధం. ‘సర్’ రూపకల్పన, అమలు, ఫలితాలతో సహా మొత్తం ప్రక్రియపై పూర్తి స్థాయి బహిరంగ తనిఖీ (పబ్లిక్ ఆడిట్) జరిగి తీరాలి. ఇది అత్యవసరం. ఇందుకు భారత ఎన్నికల సంఘంతో సంబంధంలేని ఒక స్వతంత్ర సంస్థ మనకు కావాలి. ఈ ప్రజా తనిఖీ సత్వరమే జరగడం శ్రేయస్కరం. సర్ సత్యాసత్యాలను తెలుసుకోవాలని సమస్త భారతీయులూ కోరుకుంటున్నారు.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News