ఎన్నికల్లో లబ్ధి కోసమే వందేమాతరం వివాదం!
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:15 AM
గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జాతీయగేయం వందేమాతరం వివాదాన్ని పాలకులు మళ్లీ...
గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జాతీయగేయం వందేమాతరం వివాదాన్ని పాలకులు మళ్లీ లేవనెత్తారు. వందేమాతరంపై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ దేశవ్యాప్త ప్రచార ఉద్యమం నిర్వహిస్తామంటూ బీజేపీ కేంద్రకమిటీ తీర్మానించింది. 1937 ‘రాజకీయ రాజీ’ని, నాడు ముస్లింలీగ్ లేవనెత్తిన అభ్యంతరాలనూ, మతోన్మాద రాజకీయాల చారిత్రక నేపథ్యాన్నీ ప్రజల ముందుకు తెస్తామనీ, కాంగ్రెస్ నేడు ముస్లింలీగ్‌లా తయారయిందని బీజేపీ పేర్కొంది. నిజానికి హిందూ సంస్థలూ, నేతలూ రెండు చరణాల వందేమాతరం గేయాన్నే బలపరిచారు. స్వదేశీ ఉద్యమం సందర్భంగా ‘వందేమాతరం’ అన్న ఉర్దూ పత్రికలో లజపతిరాయ్ 1907లోనే సంపాదకీయం రాశారు: ‘‘వందేమాతరం మతపరమైన మంత్రం కాదు, స్వతంత్ర పోరాట నినాదం. ‘సుజలాం సుఫలాం’ అంటూ మొదటి రెండు చరణాలతో దేశాన్ని స్మరిస్తాం. హిందూ, ముస్లిం, సిక్కు సహా ప్రతి పంజాబీ దీన్ని పాడుతారు. ఇందులో పూజ భాగాన్ని తిరస్కరిస్తాం.’’ ఆయన మాటలనే కాంగ్రెస్ తన 1937 తీర్మానంలో ఉటంకించింది. ‘ఇండియాను తల్లిగా ప్రేమిస్తాం, గుడిలో దేవతగా ఆరాధించము. మాతృభూమిని దుర్గగా పూజించటం వేద విరుద్ధం. మా దేశభక్తి విగ్రహారాధనతో కూడినది కాదు, హేతుబద్ధమైనది (రేషనల్)’ అని లజపతిరాయ్ 1915లోనే తన పుస్తకం ‘ఆర్య సమాజ్’లో రాశారు. అందుకే రాజ్యాంగ సభ సభ్యుడైన పండిత నరేంద్రదేవ్ కూడా 1950లో దాన్నే అనుసరించారు. 1937 తీర్మానాన్ని రూపొందించింది కూడా ఆయనే కావడం విశేషం. ‘సమాజ్‌వాద్, ఔర్ ధర్మ నిరపేక్షితా కేలియే దేవపూజకో రాష్ట్రీయ గానా నహీ బనాసక్తే’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. 1939 ‘కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ’ మహాసభలోనూ, ‘సోషలిజం–జాతీయ విప్లవం’ అన్న పుస్తకంలోనూ ఆయన దాన్నే పునరుద్ఘాటించారు. నిజానికి రెండు చరణాల నిర్ణయాన్ని అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ స్వయంగా 1950 జనవరి 24న రాజ్యాంగ సభలోనే ప్రకటించారు. అది మూజువాణీ పద్ధతిలో ఆమోదం పొందగానే.. ‘ఇది మతపర తంతుపై హేతువు విజయం, మనం తీర్మానంలో తల్లిని ఉంచాం, దేవతను తొలగించాం’ అని లోహియాతో నరేంద్రదేవ్ అన్నారు. రాజ్యాంగ సభ తీర్మానాన్ని, వందేమాతరంను – మౌలానా ఆజాద్, కిద్వాయ్, బేగం రసూల్ సహా మొత్తం 28 మంది ముస్లిం ఎంపీలూ బలపరిచారు. ‘హిందూ మహాసభ’ సభ్యులు నలుగురు మినహా మిగతా వారందరూ బలపరిచారు.
‘వందేమాతరం సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదం’ అన్న గాంధీ మాటనూ ప్రజలలోకి తీసుకువెళతామని బీజేపీ అంటోంది. 1937 తీర్మానాన్ని, రెండు చరణాల గేయంపై ఠాగూర్ సూచనలను పూర్తిగా బలపరుస్తూ గాంధీ ఇలా అన్నారు: ‘బెంగాల్ విభజన రోజుల్లో హిందూ ముస్లింలందరికీ వందేమాతరం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట నినాదం అయింది; కేవలం హిందువులకే కాదు. ఈ విషయంలో ఒక్క తగాదానైనా ఆమోదించను. ముస్లింలను అవమానించడానికిది నినాదం కారాదు.’ వాట్సప్ సేనలే కాక, బీజేపీ ముఖ్యనేతలూ ‘అసత్యమేవ జయతే’ అంటూ రానున్న ఎన్నికలకోసం నినదిస్తున్నారు!
యం. జయలక్ష్మి
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ
శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News