Share News

ఎవరికోసం ఈ ‘వందేమాతరం’?

ABN , Publish Date - Sep 03 , 2026 | 03:31 AM

ప్రముఖ బెంగాలీ కవి బంకించంద్ర 1870వ సంవత్సరంలో ‘ఆనంద మఠ్‌’ నవలలో ఆరు చరణాల వందేమాతరం గీతాన్ని రచించారు. బెంగాల్‌లోని శాక్తేయ తాత్త్విక చింతన, శక్తిపూజ, కాళికాదేవి ఆరాధన...

ఎవరికోసం ఈ ‘వందేమాతరం’?

ప్రముఖ బెంగాలీ కవి బంకించంద్ర 1870వ సంవత్సరంలో ‘ఆనంద మఠ్‌’ నవలలో ఆరు చరణాల వందేమాతరం గీతాన్ని రచించారు. బెంగాల్‌లోని శాక్తేయ తాత్త్విక చింతన, శక్తిపూజ, కాళికాదేవి ఆరాధన, రామకృష్ణ పరమహంస బోధనలే గాక శంకరాచార్య విరచిత ‘లలితా సహస్రనామ’ శ్లోకాల ప్రభావంతో దేశమాతను శక్తిస్వరూపిణిగా ఆరాధిస్తూ, కీర్తిస్తూ శిష్ట బెంగాలీ, సంస్కృత పదాలతో ఆ గీతాన్ని రచించారు. చివరి నాలుగు చరణాలలో మహిషాసుర మర్దని, దుర్గామాత, కాళికాదేవి, లక్ష్మి, సరస్వతి దేవతల ప్రతీకలను, సంకేతాలను విరివిగా భక్తి ప్రపత్తులతో శ్లాఘించారు.

ఈ నాలుగు చరణాలు జైనం, బౌద్ధ, సిక్కు, ముస్లిం మతాల వారికే గాక కమ్యూనిస్టులకు, నాస్తికులకు, ఆర్యసమాజం, బ్రహ్మసమాజంలోని వారికి కూడా ఆమోదయోగ్యంగా ఉండవన్న విశాల ఉదార భావనలతో మొదటి రెండు చరణాలనే ఆనాటి కాంగ్రెసు పార్టీ 1937లో జాతీయ గేయంగా నిర్ణయం చేసింది.

స్వాతంత్ర్యం అనంతరం 1950లో ‘రాజ్యాంగ సభ’ దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించడంతో పాటు ఈ గీతంలోని రెండు చరణాలను ‘జాతీయ గేయం’గా నిర్ణయించింది. ఈ తీర్మానాన్ని ఆమోదించిన వారిలో గాంధీ, నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌లతో పాటు పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, మదన్‌మోహన్‌ మాలవీయ, శ్యాంప్రసాద్‌ ముఖర్జీలు కూడా ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు అన్ని పార్టీలు, వర్గాలు, మతాల వారి ఆమోదముద్ర ఆ తొలి రెండు చరణాలకు లభించింది.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన కేంద్ర హోంశాఖ మొత్తం ఆరు చరణాలను అందరూ ఆలపించాలని సర్క్యులర్‌ జారీ చేయటమేగాక, ఆ గేయానికి తగ్గట్లు మార్చింగ్‌ సాంగ్‌, సంగీత వాయిద్య పరికరాలు– అంటే డ్రమ్‌ రోల్స్‌, ట్రంపెట్‌, మేళతాళాలు ఉండాలని విధివిధానాలను విడుదల చేసింది. ఈ పద్ధతి అంతా దసరా పండగ రోజు ఆరెస్సెస్‌ వారి కవాతును తలపించేటట్లు ఉంది. మొత్తం ఆరు చరణాలను పాడని వారందరూ దేశద్రోహులనీ, జాతి వ్యతిరేకులని ముద్రవేస్తున్నారు. ఈ లెక్కన రాజ్యాంగసభలో మొదటి రెండు చరణాలను ఆమోదించిన పటేల్‌, శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కూడా నేటి బీజేపీ నాయకుల దృష్టిలో కొత్తగా దేశద్రోహులైనారు. రాజ్యాంగాన్ని రచించిన ‘రాజ్యాంగ సభ’ కన్నా పార్లమెంటు, మంత్రివర్గం గొప్పది కాదన్న సత్యాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవాలి.

నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం, దేశంలో 20శాతం మంది ప్రజలు ఇంకా నిరక్షరాస్యులే. ఇటువంటి భారతంలో కఠినమైన సంస్కృత పదాలు మేళవించిన వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించడం పామరులకే కాదు, పండితులం అనుకునే వారికి కూడా ‘ఇనుప గుగ్గిళ్లను’ నమలడం లాంటిదే.


ప్రజాప్రతినిధులు చాలా మంది తెలుగులో ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ‘సార్వభౌమాధికారం’ అన్న పదాన్ని ఉచ్చరించడంలో తికమకకు గురికావడం తెలిసిన సంగతే. దేశంలో ఏ భాష మాట్లాడే ప్రజలకైనా, అలవాటు లేని సంస్కృత పదాలతో పూర్తి గేయాన్ని ఆలపించడం సంకట పరిస్థితే గాక కాలాపహరణం కూడా. గత 80 సంవత్సరాల నుంచి అలవాటైన తొలి రెండు చరణాలు మాత్రం అందరికీ ఆనందమే గాక ఆమోదయోగ్యం కూడా!

పూర్తి గేయాన్ని తు.చ తప్పకుండా పాడి దేశభక్తిని నిరూపించుకోవాలని పెడబొబ్బలు పెడుతున్న బీజేపీ బడా నాయకులు కాగితం వైపు చూడకుండా స్పష్టమైన సంస్కృత ఉచ్చారణతో దీనిని పాడగలరా? అని ముందు తాము ఆత్మపరిశీలన చేసుకొని ఇతరులకు చెప్పాలి. దేశ బహుళత్వంపై దాడి ఇది. దేశ ప్రజలను నిలువునా చీల్చి వారి మధ్య గోడలను లేపాలని, గోతులు తవ్వాలని కుతంత్రం. తమ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని, సంకుచిత జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టి భవిష్యత్తులో హిందూ రాష్ట్రానికి పునాదులు వేయాలని వారి దుర్మార్గపు ఆలోచన.

పరవస్తు లోకేశ్వర్‌

ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్

ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 03:31 AM