ఉరికే విద్వత్తు వైరముత్తు
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:32 AM
బలమైన కెరటం ఎవరినీ బతిమాలుకుంటూ ముందుకు సాగదు, సునామీలా విరుచుకుపడుతుంది. తన సుడిగాలి ఉధృతితో పాతని తుడిచిపెట్టి చాపచుట్టేస్తుంది. తమిళ కవిత్వంలోకి...
2017లో వైరముత్తు జ్ఞానపీఠ్ కోసం ప్రయత్నిస్తున్నాడని ప్రముఖ రచయిత జయమోహన్‌కు ఓ ఎంపీ ఫోన్ చేసి చెప్పారట. వైరముత్తుకు జ్ఞానపీఠ్‌ను నిరసిస్తూ జయమోహన్ అప్పటికప్పుడు తీవ్రపదజాలంతో ఓ వ్యాసం రాశారు. దానికి మద్దతుగా ఇతర రచయితల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వైరముత్తుకు జ్ఞానపీఠ్ ఇవ్వకూడదని పలువురు నేరుగా జ్ఞానపీఠ్ కమిటీకి లేఖలు రాశారు, మరికొందరు బృందాలుగా ఏర్పడి సంతకాల సేకరణ చేశారు. తమకు అవార్డు ఇచ్చే ఉద్దేశం లేదని జ్ఞానపీఠ్ కమిటీ అప్పుడు స్పష్టం చేసింది.
బలమైన కెరటం ఎవరినీ బతిమాలుకుంటూ ముందుకు సాగదు, సునామీలా విరుచుకుపడుతుంది. తన సుడిగాలి ఉధృతితో పాతని తుడిచిపెట్టి చాపచుట్టేస్తుంది. తమిళ కవిత్వంలోకి, సినిమా పాటలోకి వైరముత్తు అలా ఒక మహోద్రేక కెరటంలా ఎగసిపడ్డారు. కొత్త పదాలు, సరికొత్త పద చిత్రాలు, ఊహలకందని ఉపమానాలతో ఉవ్వెత్తున ముంచెత్తారు. కొత్త తరం దాహాన్ని తన కడలి తరగల వంటి పదాలతో సేదదీర్చారు. మృదువైన హృదయ స్పందనలను లలితమైన అక్షరాలతో అలంకరించి ద్రవింపజేసినట్టే, పదునైన భావాలను పిడికిళ్లతో గుప్పించి గుండెలు రగిలింపజేశారు.
తన ప్రయాణంలో కారును ఢీకొన్న సీతాకోక చిలుకను ఉద్దేశించి ‘పిసరంత ప్రాణి/మిల్లీగ్రామంత ప్రాణం... ఒంటి రెక్కతో పాకుతూ/మరో రెక్కకై వెతుకుతుందా? చీమల పుట్టలో వేయి ముక్కలై/సమాధి అయ్యుంటుందా?’ అని సున్నితమైన చింతనను వెలిబుచ్చిన కవి. సైనికుడు మరణించిన సందర్భంలో ‘మీ నాన్న చొక్కాలోంచి వస్తున్నది/నెత్తుటి వాసన కాదు, దేశం వాసన/గుండె రాయి చేసుకో/కన్నీటితో చెరిపేయకు ఈ రక్తం మరకల్ని/భారత స్త్రీ నుదుటికి/మీ నాన్న ఇచ్చిన కుంకుమ రేఖరా అది’ అని వేదనను, ధైర్యాన్ని వ్యక్తీకరిస్తారు.
2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన వైరముత్తు రామసామి 13 జూలై, 1953న తమిళనాడులోని మదురై జిల్లా మెట్టూరు గ్రామంలో రామసామి, అంగమ్మళ్‌కు జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో ప్రకృతిని పెనవేసుకుని పులకించిపోతున్న అతడి స్వప్నాలకు వైగై ‘ఆనకట్ట’ వేసింది. ఆ నదీ వరద ముంచెత్తడంతో అనేక గ్రామాల ప్రజలతోపాటు వారి గ్రామంలోని వారు కూడా నిరాశ్రయులయ్యారు. అలా చెదిరిపోయిన స్వప్నాలు అతడి బాల్యంపై చెరగని ముద్రవేశాయి. తిరువళ్లూర్ ‘తిరుక్కురళ్’ స్ఫూర్తితో పదేళ్ల వయసులోనే కవితలల్లారు. యుక్త వయస్సుకొచ్చేసరికి పెరియార్ రామస్వామి, అన్నాదురై, కరుణానిధి, సుబ్రమణ్య భారతి వంటి అనేక మంది రచనలు, ప్రసంగాలు అతడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే తొలి కవితా సంపుటి ‘ఉదయపు మేఘాలు’ వెలువరిస్తే, అది ఉమెన్స్ కాలేజీలో పాఠ్యాంశం కావడం విశేషం. చెన్నైలోని పచ్చయ్యప్ప కాలేజీలో డిగ్రీ పూర్తి కాగానే మద్రాస్ యూనివర్సిటీ నుంచి తమిళ సాహిత్యంలో ఎమ్మే చేశారు. తర్వాత అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో న్యాయ శాస్త్ర గ్రంథాలను తమిళంలోకి అనువదించే పనిలో చేరారు. దాంతో భాష మీద సాధికారత లభించింది. 1979లో ‘తిరిగి రాసిన తీర్పులు’ పేరిట రెండో కవితా సంపుటి వెలువరించారు. ఆధునిక తమిళ కవితా ఉద్యమంలో అది మైలురాయిగా నిలిచింది.
అప్పటి వరకూ వున్న నైతిక నియమాలపై అతడి కవిత్వం పదునైన విమర్శను ఎక్కుపెట్టింది. అణగారిన వర్గాలను అణచివేయడానికి అమలు చేస్తున్న ‘తీర్పు’లను మార్చి రాయవలసిన సందర్భం వచ్చిందని, సామాజిక స్పృహతో చేసే పోరాటాల ద్వారానే మార్పు సాధ్యమవుతుందని ఎలుగెత్తిచాటారు. ఆ తర్వాత ఏడాది భారతీ రాజా దర్శకత్వంలో, ఇళయరాజా సంగీతంలో వచ్చిన ‘నిళల్గల్’ చిత్రంతో వెండితెరకు పరిచయమవడం ద్వారా వైరముత్తు కొత్త చరిత్రకు ‘తెర’తీశారు. సినిమా పాటల్లో సైతం కొత్త ఆలోచననూ, సరి కొత్త భావనలనూ పలికించి లక్షలాదిమంది ప్రేక్షకుల హృదయాలకు తన అక్షరాలను చేరువ చేశారు. అయితే, సంగీతం గొప్పదా, సాహిత్యం గొప్పదా అనే విషయంలో విభేదాలు తలెత్తడంతో ఆయన ఇళయరాజాతో విడిపోయారు. సుమారు ఐదారేళ్లపాటు ఒడుదుడుకులు ఎదుర్కొన్న వైరముత్తు రెహమాన్ రంగప్రవేశంతో మళ్లీ ఊపందుకున్నారు. నాలుగు దశాబ్దాల పైబడిన కెరీర్‌లో సుమారు ఎనిమిది వేల పాటలు రాసి, ఏడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఫిలింఫేర్, సైమావంటి అవార్డులు అనేకసార్లు ఆయనను వరించి వచ్చాయి.
సినీ గేయ రచనలో అప్రతిహతంగా కొనసాగుతున్నప్పటికీ సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. కవిత్వం, నవలలు, వ్యాసాలు, యాత్రా కథనాలు, అనువాదాలు వంటి వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ సుమారు నాలుగు పదుల పుస్తకాలు వెలువరించారు. ఆయన రచనల్లో ప్రముఖమైనది ‘కల్లికాటు ఇతిహాసం’. బాల్యంలో తాను నిర్వాసితుడైనప్పటి వేదనను ఈ నవల కళ్లకు కడుతుంది. అలాగే గ్రామంలోని స్త్రీల దుస్థితి, లింగ వివక్ష, గృహ హింస, శ్రమకు తగిన గుర్తింపు లేకపోవడం వంటి అంశాలతో ‘కరువాచ్చి కావియం’ అనే నవల రాశారు. ‘మూంద్రమ్ ఉలగపోర్’ నవలలో గ్రామీణ వ్యవసాయ భారతాన్ని చిత్రించారు. గ్రామీణ జీవితంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను చిత్రించిన ఈ మూడు నవలలను పరిశీలిస్తే వైరముత్తు వేర్లు గ్రామంలోనే పాదుకుని వున్నాయని అర్థమవుతుంది. కష్టజీవికి ఇరువైపులా నిలబడేవాడే కవి అంటారు. కానీ, వైరముత్తును చూస్తే కవిగా మారిన కష్టజీవి కనిపిస్తాడు.
‘చందమామ’ అనే/ఒకే ఒక వాక్యాన్ని కావ్యంగా రాసి/అయిపోయిందని చెప్పటానికి/ఇన్ని చుక్కలు పెట్టాడే/ఎవరతను?’ అని భావుకుడిలా ప్రశ్నించినా; ‘సాములూ సాములూ/గవర్మింట్టు సాములూ/ సాలెగూడు తెంపేదానికి/చీటీ తీసుకొచ్చినారా? చీమని నలిపేదానికి/ జీపెక్కొచ్చినారా?/ఆరు గెజాలిల్లు కూలగొట్టను/ఆర్డరు తీసుకొచ్చినారా?’ అని ఆవేదన వ్యక్తం చేసినా; ‘క్రైస్తవ కాకి–హిందూ ఎలుక/జైన జింక–బౌద్ధ పులి/సిక్కు సింహం–ముస్లిం పిల్లి/అడవిలో అలా విడదీసి చూపించగలమా?’ అని వ్యంగ్యోక్తులు విసిరినా; ‘మృత్యుశయ్య మీద వుంది భూమి/రక్త దానం చేసేదెవరు?’ అని నిలదీసినా అది కేవలం వైరముత్తుకే సాధ్యమైన అభివ్యక్తి. ఆయనకు దక్కని గౌరవం లేదు. పద్మశ్రీ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ, కలైమామణి, పావేంద్ర వంటి అవార్డులతోపాటు నాలుగు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు లభించాయి.
ఇంత ప్రతిభాశాలి అయినప్పటికీ వైరముత్తుకు జ్ఞానపీఠ్ రావడం తమిళ సాహిత్య ప్రపంచంలో దుమారం లేపుతోంది. ఆయన వ్యక్తిత్వం గురించి, అవార్డుల కోసం ఏమైనా చేస్తారంటూ పలువురు అనేక కథనాలు వినిపిస్తున్నారు. ఒకసారి వైరముత్తు బొకే, బహుమతులు తీసుకుని ప్రముఖ రచయిత వన్ననిలవన్‌ను కలిసి ‘‘మీరు సాహిత్య అకాడమీ కమిటీలో వున్నారని తెలిసింది. నాకు మీ ఆశీర్వాదాలు కావాల’’ని కోరారుట. దానికి ఆయన ‘‘మీరు పొరబడ్డారు. కమిటీలో వున్నది నేను కాదు, వల్లికన్నన్’’ అని చెప్పగానే, వైరముత్తు తాను తెచ్చిన వాటిని వెనక్కు తీసుకుని మరీ, అక్కడ్నించి వెళ్లిపోయారుట. అలాగే, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత జయకాంతన్ చివరి దశలో వుండగా, ఆయనను కలిసి తన కథల పుస్తకం చేతిలో వుంచి, ఫొటో తీసుకున్నారుట. తరువాత జయకాంతన్ తనను పొగుడుతూ ‘నీకు జ్ఞానపీఠ్ రావాల’ని అన్నట్టు ఒక లేఖను సృష్టించారు. దీనిపై జయకాంతన్ పిల్లలు ఆగ్రహించి, ఆ లేఖ నకిలీదని ప్రకటించారు. 2017లో వైరముత్తు జ్ఞానపీఠ్ కోసం ప్రయత్నిస్తున్నాడని ప్రముఖ రచయిత జయమోహన్‌కు ఓ ఎంపీ ఫోన్ చేసి చెప్పారట. వైరముత్తుకు జ్ఞానపీఠ్‌ను నిరసిస్తూ జయమోహన్ అప్పటికప్పుడు తీవ్రపదజాలంతో ఓ వ్యాసం రాయగా, దానికి మద్దతుగా ఇతర రచయితల నుంచి అనూహ్య స్పందన వచ్చిందట. వైరముత్తుకు జ్ఞానపీఠ్ ఇవ్వకూడదని కోరుతూ పలువురు నేరుగా జ్ఞానపీఠ్ కమిటీకి లేఖలు రాయగా, మరికొందరు బృందాలుగా ఏర్పడి సంతకాల సేకరణ చేశారు. అయితే, తమకు అలాంటి ఉద్దేశం లేదని అప్పుడు జ్ఞానపీఠ్ కమిటీ స్పష్టం చేసింది. ఈసారి కూడా యువ పురస్కార్ విజేతలైన సునీల్ కృష్ణన్, కార్తీక్ బాలసుబ్రహ్మణ్యం సహా కొందరు రచయితలు జ్ఞానపీఠ్ కమిటీకి లేఖలు రాశారు.
జ్ఞానపీఠ్‌కు పోటీగా కోటి రూపాయలతో కొత్త అవార్డుకు సిద్ధమని జయమోహన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు కవితా భారతి భిన్నంగా స్పందించారు. 1975లో జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన అఖిలన్‌ను చౌకబారు కల్పనా సాహిత్యం రాసేవాడని వ్యాఖ్యానించిన జయమోహన్, ఆ అఖిలన్ జ్ఞాపకార్థం 1990లో అఖిలన్ ఫౌండేషన్ నిర్వహించిన నవలా పోటీలో తన ‘రబ్బర్’ నవలకు పదివేల రూపాయల పారితోషికం పొందిన విషయం మర్చిపోరాదని అన్నారు. అది జయమోహన్‌కు గుర్తింపు తీసుకువచ్చిన మొదటి నవల కావడం విశేషం. ఇక ‘మీ టూ’ ఆరోపణలు అందరికీ తెలిసినవే. గాయని చిన్మయితో సహా పలువురు మహిళలు వైరముత్తుపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు చేశారు. కొండవీటి సత్యవతి సహా పలువురు తెలుగు రచయిత్రులు కూడా సంతకాల సేకరణ చేశారు.
వీటన్నిటికీ సమాధానమా అన్నట్టు ‘‘రచన అనేది నాకు ఒక కవచం. ఏ ఆయుధమూ దాన్ని ఛేదించలేద’’ని వైరముత్తు వ్యాఖ్యానించారు. అవార్డులు, పురస్కారాలు అనేవి రచనలకే గానీ, వ్యక్తిత్వాలకు ఇవ్వరని వీళ్లు ఎందుకు గుర్తించలేకపోతున్నారో అర్థం కాదు. ఇటువంటి ఆరోపణలు, విమర్శలు, దాడులు ఆయనకు కొత్త కాదు. అయినా, ఆయన ఎప్పుడూ తన రచనా ప్రస్థానానికి విశ్రాంతినివ్వలేదు. ‘మండుతున్నంత కాలమే అగ్ని, ప్రవహిస్తున్నంత వరకే నది, చలిస్తున్నంత సేపే భూమి, పోరాడుతున్నంత కాలమే మనిషి’ ఉనికిలో వుంటారన్నది వైరముత్తు రచనల, ఆలోచనల తాత్విక సారాంశం. (ఉటంకించిన కవితలు శాంతసుందరి, అవినేని భాస్కర్ అనువదించినవి.)
దేశరాజు 9110569542
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News