పశ్చిమాసియా సంక్షోభంలో మహాపరాధులు
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:45 AM
‘మానవ వ్యవహారాలలో దుష్టశక్తుల పాత్రపై మీరు మరి కొంచెం ఎక్కువగా ఆలోచించాలి...’– ఇటీవల కీర్తిశేషుడు అయిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఆంద్రే బెటీల్ ఒక వ్యక్తిగత లేఖలో నాకు అలా...
‘మానవ వ్యవహారాలలో దుష్టశక్తుల పాత్రపై మీరు మరి కొంచెం ఎక్కువగా ఆలోచించాలి...’– ఇటీవల కీర్తిశేషుడు అయిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఆంద్రే బెటీల్ ఒక వ్యక్తిగత లేఖలో నాకు అలా సూచించారు. నేను నా రచనా వ్యాసంగంలో గాంధీ లాంటి సజ్జనులు, సత్ సంకల్పుల మీదనే దృష్టిని కేంద్రీకరిస్తున్నానని ఆయన భావించారు. అయితే సజ్జనుల కంటే ఎక్కువగా చరిత్రను దుష్టస్వభావులే సృష్టిస్తున్నారు, నిర్మూలిస్తున్నారు. ఇది నిజం. పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధం ప్రజ్వరిల్లినప్పుడు ప్రొఫెసర్ బెటీల్ సూచన నాకు జ్ఞప్తికి వచ్చింది. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసికట్టుగా ఇరాన్‌పై పోరాడుతున్నాయి. ఈ వినాశనకర ఘర్షణకు ప్రధాన కారకులైన ఆ మూడు దేశాల నాయకుల వ్యక్తిత్వాలను యుద్ధం ఎలా సువ్యక్తం చేసిందో నిశితంగా పరిశీలించడం చాలా ముఖ్యం.
తొలుత, యుద్ధం తొలిరోజునే మరణించిన ఇరాన్ అధినేత అయతొల్లా ఖమేనీ విషయాన్ని చూద్దాం. బాంబుల వర్షం కురుస్తున్నా సురక్షిత ప్రదేశానికి వెళ్లడానికి ఖమేనీ నిరాకరించాడు. ఉద్దేశపూర్వకంగా మరణాన్ని ఆహ్వానించాడు. తన అంతిమ రోజుల్లో ఖమేనీ ప్రదర్శించిన ధైర్యం ఆయన నైతిక ఉన్నతికి తార్కాణం. ఈ కారణంగా ఖమేనీని సామ్రాజ్యవాద వ్యతిరేక యోధుడుగా వామపక్ష మేధావులు కొంతమంది కీర్తిస్తున్నారు. ఖమేనీ వీరోచితంగా మరణించాడు, సందేహం లేదు. అయితే ఇది, ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు తన అపార అధికారాలను ఏ విధంగా ఉపయోగించారు అన్న వాస్తవాన్ని అస్పష్టపరచకూడదు.
ఇరాన్ సర్వాధినేతగా ఖమేనీ ముందు మూడు మార్గాలు ఉన్నాయి. అవి, తన ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రతిస్పందించి, రాజకీయ ప్రక్రియల నుంచి మతాచార్యులను ఉపసంహరించి, స్వేచ్ఛాయుత సమాజాన్ని అభివృద్ధిపరచడం. మహిళలపై విధించిన అన్ని ఆంక్షలను తొలగించి దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవితంలో వారిని పూర్తిగా భాగస్వాములను చేసి ఉండవలిసింది. ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలకు ఉన్నట్టుగానే ఇరాన్‌కు అపార చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఆ దేశాలలో లేని విధంగా ఇరాన్‌లో విద్యాధికులు అధికంగా ఉన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు కాలంలో ఇరానియన్ మహిళలు విద్యారంగంలోనూ, వివిధ వృత్తులలోను కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేవారు. గల్ఫ్ దేశాలకు లేని సమున్నత సాంస్కృతిక చరిత్ర ఇరాన్‌కు ఉన్నది. పురాతన నాగరికతకు నెలవైన ఇరాన్ నుంచి చాలామంది సుప్రసిద్ధ తాత్వికులు, మహాకవులు, సంగీతవేత్తలు ప్రభవించారు. సంపద్వంతమైన స్వావలంబన ఇరాన్‌ను నిర్మించేందుకు ఆ సముదాత్త చరిత్రను ఖమేనీ ఉపయోగించుకుని ఉండవల్సింది.
అధికారంలో ఉన్న సుదీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఖమేనీ కృషిచేసి ఉండవల్సింది. లేదూ, సింగపూర్ తరహాలో ప్రజాస్వామ్య పురోగతిని ఉపేక్షించి ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి ఉండవలిసింది. అయితే ఈ రెండు మార్గాలకు భిన్నంగా ఖమేనీ పాలన మూడో మార్గాన్ని అనుసరించింది. స్వదేశంలో ప్రజలపై తీవ్ర అణచివేత విధానాలను అమలుపరిచింది. వైదేశిక నీతిలో విస్తరణవాదానికి ప్రాధాన్యమిచ్చింది. లెబనాన్, యెమెన్‌లో తనకు అనుకూలంగా ఉండే సాయుధ బృందాలను ప్రోత్సహించింది. సిరియాలో అస్సాద్ క్రూరపాలనకు మద్దతునిచ్చింది. తద్వారా ఆ దేశాలు అతలాకుతలమవడంలో కీలక పాత్ర వహించింది. మరీ ముఖ్యంగా ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ దురహంకారపూరితంగా ఇస్లామిక్ ప్రపంచానికి తననుతాను నాయకుడుగా నిర్దేశించుకున్నది. యూదు రాజ్యమైన ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించింది.
ఇజ్రాయెల్‌ను సుదీర్ఘకాలంగా పరిపాలిస్తున్న బెంజమిన్ నెతన్యాహు సైతం ఖమేనీ వలే మత తీవ్రవాది. ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించే వ్యక్తి. కుటుంబ నేపథ్యమే నెతన్యాహును యూదు మత తీవ్రవాదిగా మార్చింది. తండ్రి కరడుగట్టిన మితవాద యూదు చరిత్రకారుడు. సైనికాధికారిగా ఉన్న సోదరుడు 1976లో ఉగ్రవాదుల చెర నుంచి ఇజ్రాయెలీలను విడిపించడంలో ప్రాణాలు కోల్పోయిన వీరుడు. ప్రధానమంత్రిగా నెతన్యాహు, పాలస్తీనియన్లకు స్వతంత్ర దేశం ఏర్పాటును ఎటువంటి మినహాయింపులు లేకుండా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పాలస్తీనియన్ అథారిటీ పట్ల అతడి అణువణువులో అపార ద్వేషమున్నది. ఆ సంస్థ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఒక దశలో హమాస్‌కు సైతం అతడు మద్దతునిచ్చాడు. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి నెతన్యాహు చాలా పైశాచికంగా ప్రతిస్పందించాడు. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో 75 వేల మందికి పైగా పౌరులను హతమార్చింది. లక్షలాది ఇజ్రాయెలీలను నిరాశ్రయులను చేసింది. ఈ చర్యలకుగాను అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం నెతన్యాహుపై యుద్ధ నేరస్థుడుగా అభియోగం మోపింది. నిజానికి అతడిని ఆ విధంగానే పరిగణించితీరాలి. నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో కొనసాగాలంటే వాటి అడ్డు తొలగించుకోవాలి. అందుకే ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రేరేపించి, కొనసాగిస్తున్నాడని నెతన్యాహును పలువురు నిందిస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధంలో మూడో ప్రధాన వ్యక్తి డోనాల్డ్ ట్రంప్ విషయమేమిటి? అధికార లాలసే ఈయననూ నడిపిస్తున్నది. క్రైస్తవ ధర్మాన్ని పరిపూర్ణంగా అనుసరించే వ్యక్తినని ట్రంప్ చెప్పుకుంటాడు. అయితే ఆ ధర్మం నిర్దేశించిన దివ్య ప్రవర్తనా నియమావళిని ఈ మహాశయుడు పాటించడు. ఈ శతాబ్ది మొదటి దశకంలో డెమొక్రాటిక్ పార్టీ సభ్యుడుగా ఉన్న ట్రంప్ ఆ తరువాత 2016లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్షపదవికి ఎన్నికయ్యాడు. 2024లో యుద్ధ వ్యతిరేకత నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ నైజీరియా, సోమాలియాలపై బాంబు దాడులకు ఆదేశించాడు. వెనెజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అమెరికా జైలులో నిర్బంధించాడు.
ఆ తరువాత ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక దాడులు ప్రారంభించాడు. వీటిలో ఏ ఒక్క దేశం నుంచి కూడా అమెరికాకు వాటిల్లే ముప్పు ఏమీ లేదు. శాంతి ప్రియుడినని చెప్పుకున్న ట్రంప్ యుద్ధోన్మాదిగా వ్యవహరిస్తున్నాడు. ట్రంప్ సైద్ధాంతిక వ్యక్తి కాదు. అతడి నిర్ణయాలకు, చర్యలకు మార్గనిర్దేశం చేసేది స్వప్రయోజనాలే. అధికారలాలసతో పాటు అతడిని ఉత్సాహపరిచేవి దురాశ, అహంకారాలే. ఇరాన్‌పై ప్రస్తుత అమానుష దాడిని అమెరికా ఎందుకు ప్రారంభించింది అనే దానికి సహేతుక, తార్కిక, విశ్వసనీయ కారణాలను కనుగొనడం కష్టం. ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లడాన్ని ట్రంప్ సమర్థించుకుంటూ, ఆయన తడవకో కారణం చెబుతున్నాడు. అవి పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. నిజమైన కారణాలు ఏమై ఉండవచ్చు? వీటిపై అనేక ఊహాగానాలు. బరాక్ ఒబామా ప్రభుత్వం ఒసామా బిన్ లాడెన్‌ను తుదముట్టించి అమెరికా ప్రజల మెప్పు పొందినట్టే, ఖమేనీని హతమార్చి, స్వదేశీయుల నుంచి మరింత ఘనమైన ప్రశంసలు పొందాలనే ఆకాంక్షే ఈ యుద్ధానికి ట్రంప్‌ను ప్రేరేపించిందన్నది నేను విన్న ఆ ఊహాగానాలలో ఒకటి. గాజాలో ఒక ‘రివియెరా’ (సముద్ర తీరంలో విలాసవంతమైన పర్యాటక కేంద్రం)ను అభివృద్ధిపరచడం ద్వారా కుటుంబ సిరి సంపదలను ఇతోధికంగా పెంపొందించుకోవాలనే పేరాశతోనే ఇరాన్‌కు వ్యతిరేకంగా, నెతన్యాహు అభీష్టాన్ని నెరవేర్చేందుకు ట్రంప్ సమ్మతించాడని మరి కొందరు వాదిస్తున్నారు. ఇరాన్‌కు వాటిల్లే భారీ విధ్వంసం, ఇరానియన్ల అష్టకష్టాలు చూసి ఆనందించాలనే దుగ్ధ ఉండవచ్చు. ఇరాన్ చమురు నిక్షేపాలు, పెట్రోలియం ఉత్పత్తుల సదుపాయాలను స్వాధీనం చేసుకుని వాటిని తన ఆశ్రితులకు అప్పగించడం మరో లక్ష్యం.
దురహంకారం, దురాశల హానికరమైన కలయికతోనే ఇరాన్‌కు వ్యతిరేకంగా భయంకరమైన యుద్ధానికి ట్రంప్ ఆదేశించారు. పోటెత్తిన ఈ దౌష్ట్యానికి ఖమేనీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న వారితో పాటు వ్యతిరేకిస్తున్న ఇరానియన్లు కూడా ఒకేరీతిలో నలిగిపోతున్నారు. నివాస ప్రదేశాలు, దుకాణాలు, కార్యాలయాలు, చరిత్రాత్మక భవనాలు, సాంస్కృతిక కేంద్రాలపై విచక్షణారహిత భయానక దాడులలో వేలాది ఇరానియన్లు హతమయ్యారు. లక్షల సంఖ్యలో అమాయకులు నిరాశ్రయులయ్యారు. లెబనాన్ లోని పలు పట్టణాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లక్షలాది ప్రజలు ఆప్తులు, ఆస్తులు కోల్పోయి అల్లాడిపోతున్నారు. పశ్చిమాసియా సమస్తం అతలాకుతలమైపోతోంది. చమురు మార్కెట్లు ఇప్పటికే కుదేలయిపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత సంభవించిన అతిపెద్ద ప్రపంచ సంక్షోభమే ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయెల్ యుద్ధం.
ఈ భయంకర సంఘర్షణను ప్రారంభించిన, ఎగదోస్తున్న వారిలో మంచి మనుషులు ఎవరూ లేరు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా నాయకులు అందరూ పాపకర్ములే. అమాయకులను నిర్దయగా హతమార్చేందుకు, ఎదుటి పక్షం వారి బతుకులను నరకప్రాయం చేసేందుకు వెనుకాడని దుష్టులే. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలను సమాన శక్తులుగా పరిగణించకూడదు. వాటి విధ్వంసక సామర్థ్యాలు వేరువేరు. ఇజ్రాయెల్‌తో పోల్చితే ఇరాన్‌కు ఉన్న సైనిక సామర్థ్యం చాలా చాలా తక్కువ. అమెరికా విషయానికి వస్తే మానవాళి చరిత్రలోనే అది అత్యంత బలమైన సైనిక శక్తి. ఇరాన్‌ను ఈ సంఘర్షణలో పూర్తిగా అమాయక బాధితురాలుగా భావించలేము. అయితే ఈ మహాపాపంలో నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్, ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికాకు చాలా పెద్ద భాగస్వామ్యం ఉన్నది. వారే ఈ మహాపాపానికి ప్రధాన బాధ్యులు, పశ్చిమాసియా సంక్షోభంలో మహాపరాధులు.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News