Share News

మీరు యుద్ధాన్ని ఆపగలరు!

ABN , Publish Date - Mar 19 , 2026 | 01:50 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడి మానవత్వానికి వ్యతిరేకమైన ఘోర నేరం. అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయ దిగ్బంధానికి గురై ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఒక దేశంపై అత్యంత శక్తిమంతమైన...

మీరు యుద్ధాన్ని ఆపగలరు!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడి మానవత్వానికి వ్యతిరేకమైన ఘోర నేరం. అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయ దిగ్బంధానికి గురై ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఒక దేశంపై అత్యంత శక్తిమంతమైన రెండు దేశాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్‌ నాయకత్వం హత్యకు గురైంది. మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయి. ఈ దురాగతాలను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆగ్రహపూరిత ప్రదర్శనలు జరుగుతున్నాయి. కానీ ఈ యుద్ధాన్ని ఆపడానికి మార్గం అంటూ ఉందా? ఉందని నేను నమ్ముతున్నాను. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో ఈ ఇద్దరు రాక్షసులకు ఒక బలహీనమైన కోణం ఉంది. అదే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు. కుప్పకూలుతున్న తమ ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడం కోసమే ఈ యుద్ధమంతా.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ విస్తారమైన కంపెనీల నెట్‌వర్క్ నుంచి వచ్చే అపారమైన ఆదాయాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నవి. ఈ వ్యాపారాలలో ఎక్కువభాగం మారణాయుధాల అమ్మకమే. ఆయుధ కంపెనీలే వీటి యుద్ధ యంత్రాంగానికి జీవనాధారాలు. ఈ కంపెనీలు యుద్ధాలు, విధ్వంసంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఇరాన్‌ అక్కడక్కడా బహుళజాతి గిడ్డంగులను పేల్చివేసిన ఘటనలు జరిగాయి. కానీ ఇది వ్యర్థం. ఎందుకంటే ప్రతి సదుపాయానికీ బీమా ఉంటుంది. వారికి ఎక్కడ ముఖ్యమో, ఎక్కడ బాధ కలుగుతుందో అక్కడ దెబ్బ కొట్టడమే దీనికి పరిష్కారం. సాధ్యమైనంత వరకు ప్రతి అమెరికన్, ఇజ్రాయెల్ కంపెనీలను, వాటి ఉత్పత్తులను బహిష్కరించడం ద్వారానే ఇది సాధ్యం.

ఇజ్రాయెల్–అమెరికన్ సైనిక పరికరాలను కొనడం ఆపాలని మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. తగ్గిన ఆదాయాలతో, యుద్ధంపై చేసే భారీ వ్యయాన్ని ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు తట్టుకోలేవు. ఈ కంపెనీలు నష్టాల్లో ఉన్నప్పుడు, వారి సొంత ప్రజలే యుద్ధాన్ని ఆపడానికి ఆందోళనలు చేస్తారు. అనతికాలంలోనే దీని ప్రభావం ఆ వ్యవస్థలపై కనిపిస్తుంది. ఉదాహరణకు– మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ ఆర్డర్‌ను రద్దు చేసినప్పుడు, అక్కడి సోమర్‌సెట్‌లోని యోవిల్ పట్టణం మొత్తం మూసివేయవలసి వచ్చింది. దాని ఫలితంగా అప్పటి రక్షణమంత్రి మైఖేల్ హెసెల్టైన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఒకే ఒక్క రద్దు ఇంతటి ప్రభావాన్ని చూపగలదు.


మనం తాగే ప్రతి కోలా, తినే ప్రతి అమెరికన్ పిజ్జా, బర్గర్, చిప్స్ ప్యాకెట్, మనం వాడే ప్రతి ఆంగ్లో–అమెరికన్ పరికరం, చూసే హాలీవుడ్ సినిమా, కొనే ప్రతి అమెరికన్ డెనిమ్ ప్యాంటు... ఇలా మనం ఏదైనా అమెరికన్ లేదా ఇజ్రాయెల్ కంపెనీతో వ్యాపారం చేసే ప్రతిసారీ మనం ఈ యుద్ధానికి డబ్బు సమర్పిస్తున్నాం. ఇరాన్‌లో పురుషులు, మహిళలు, పిల్లలను పేల్చివేసే బాంబులకు పరోక్షంగా డబ్బు చెల్లిస్తున్నాం. మనం డబ్బు చెల్లించకపోతే, అమెరికా– ఇజ్రాయెల్ ఈ అమానుషమైన యుద్ధాన్ని నడపలేవు. ఈ యుద్ధాన్ని మనం ఓడించగలం! వాటి వస్తు బహిష్కరణ ఇప్పుడే.. తక్షణమే!

డా. పుచ్చలపల్లి మిత్ర

ఈ వార్తలు కూడా చదవండి..

సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్

గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 01:51 AM