అడకత్తెరలో గల్ఫ్ దేశాలు!
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:38 AM
ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం గల్ఫ్ దేశాలకు ఒక బాధాకరమైన వాస్తవం. ఆ యుద్ధం గల్ఫ్ దేశాలు కోరుకున్నది కాదు. తమ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని...
ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం గల్ఫ్ దేశాలకు ఒక బాధాకరమైన వాస్తవం. ఆ యుద్ధం గల్ఫ్ దేశాలు కోరుకున్నది కాదు. తమ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని ఈ దేశాల్లో కొన్ని అమెరికాను గట్టిగా హెచ్చరించాయి కూడా. కానీ అమెరికా ఎప్పటిలాగే తన గల్ఫ్ మిత్ర దేశాల మాటను పెడచెవిన పెట్టి, ఇజ్రాయెల్ అనుకూల ఎజెండాకే మొగ్గుచూపింది.
దశాబ్దాలుగా, ఈ గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు అస్థిరస్థితిలోనే ఉన్నాయి. ఇరాక్ యుద్ధం ప్రభావం నుంచి అవి నేటికీ పూర్తిగా కోలుకోలేదు. సద్దాం హుస్సేన్‌ను అధికారం నుంచి తొలగిస్తే షియా ప్రజలు ఎక్కువగా ఉన్న ఇరాక్ క్రమంగా ఇరాన్ ప్రభావంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని సౌదీ అరేబియా నాయకులు నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌కు నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు కొన్ని దశాబ్దాలుగా భయపడుతూ వచ్చిన పరిస్థితే నిజమయ్యింది. తొమ్మిదికోట్ల జనాభాతో అనేక జాతులతో కూడిన ఇరాన్ అస్థిరత అంచులకు చేరుతున్నది. సున్నీ ఆధిపత్యం ఉన్న అరబ్ దేశాలకూ – షియా దేశమైన ఇరాన్‌కూ మధ్య ఈ ఉద్రిక్తతలకు మతపరమైన కారణాలు క్రీ.శ. 7వ శతాబ్దంలోనే మొదలయ్యాయి. మహమ్మద్ ప్రవక్త తర్వాత నాయకత్వం ఎవరికి దక్కాలి అనే ప్రశ్నతో ఈ విభేదాలు మొదలయ్యాయి. సరైన వారసుడు ఇమామ్ అలీ అని నమ్మిన అనుచరులను ‘షియత్ అలీ’ (‘షియా’) అని పిలుస్తారు. ఆయన కుమారుడు ఇమామ్ హుస్సేన్ కర్బలావద్ద క్రీ.శ.680లో యాజిద్ సైన్యం చేతిలో మృతి చెందడం ఈ విభేదాన్ని ఇంకా తీవ్రతరం చేసింది. దీంతో సున్నీలకు (‘సున్నహ్’ సంప్రదాయాన్ని అనుసరించేవారు), షియాలకు మధ్య దూరం మరింత పెరిగింది. 16వ శతాబ్దంలో సఫావిద్ సామ్రాజ్య పాలనలో ఇరాన్ అధికారికంగా ‘ట్వెల్వర్ షియా’ దేశంగా మారింది. షియా ప్రజలు ఇరాక్, అజర్‌బైజాన్, బహ్రెయిన్, సిరియా, లెబనాన్, యెమెన్, సౌదీ అరేబియా, ఇండియా, పాకిస్థాన్ దేశాలలో కూడా గణనీయంగా నివసిస్తున్నారు.
షియా–సున్నీల మధ్య వైరం 20వ శతాబ్దం దాకా కూడా కొనసాగింది. సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలూ రెండూ ఇస్లాం సామ్రాజ్య (‘ఉమ్మా’) నాయకత్వం కోసం పోటీ పడ్డాయి. సౌదీ అరేబియా జీసీసీ దేశాలకు నాయకత్వం వహిస్తూనే, 57 దేశాలతో కూడిన ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్’ (ఓఐసీ) దేశాల్లో కూడా కీలక హోదా సాధించింది. ముఖ్యంగా ఇరాన్ ప్రభావాన్ని నిలువరించే దిశగానే దాని ఈ ప్రయత్నాలన్నీ కొనసాగాయి. మరోవైపు, 1979 విప్లవం తర్వాత ఇరాన్ పలు ముస్లిం సమస్యలతో పాటు పాలస్తీనా సమస్యను కేంద్రంగా చేసుకుని వాదిస్తూ ఇస్లాం సామ్రాజ్య నాయకత్వ స్థానంలో తనను నిలుపుకునే ప్రయత్నం చేసింది.
సున్ని–షియా ఉద్రిక్తతలు ఆ ఇరుపక్షాల జనాభా సమాన స్థాయిలో ఉన్న ఇరాక్, లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లో తరచుగా చెలరేగాయి. సౌదీ అరేబియా – ఇరాన్‌లు ఎక్కడా ప్రత్యక్షంగా యుద్ధం చేసుకోకపోయినా, ఈ సున్నీ–షియా ఉద్రిక్తతలు చెలరేగిన దేశాల్లో భిన్న పక్షాలకు మద్దతు ఇస్తూ పరోక్ష యుద్ధాలు చేశాయి. జీసీసీ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉండటం కూడా ఇరాన్‌కు కోపం తెప్పిస్తున్న మరో ముఖ్యమైన అంశం. తమ దేశాన్ని కట్టడి చేసేందుకే అమెరికా ఈ వ్యూహాన్ని పాటిస్తున్నదని ఇరాన్ నమ్మకం. ప్రస్తుత యుద్ధానికి మూల కారణం పాలస్తీనా అంశంపై ఇరాన్–ఇజ్రాయెల్‌ల మధ్య రాజుకున్న వైరమే. ముస్లిం సామ్రాజ్యం (‘ఉమ్మా’)పై ఆధిపత్యం కోసం తన ప్రయత్నాల్లో భాగంగా పాలస్తీనా అంశంపై ఇరాన్ మాట్లాడుతూ వచ్చింది. ఈ విషయంలో ఇరాన్ వాదనలనూ, దాని అణ్వాయుధ లక్ష్యాలనూ ఇజ్రాయెల్ తన ఉనికికే ముప్పుగా భావించింది. 2023 అక్టోబర్ 7 దాడుల తర్వాత హమాస్, హెజ్‌బొల్లాలను ఇజ్రాయెల్ అణచివేయడంతో ఆగకుండా, ఇరాన్ వైపు కదలింది. ఇరాన్ మీద పైచేయి సాధించడానికి ఇదే అదనుగా భావించింది.
ఈ ఘర్షణ జీసీసీ దేశాల పాలిట ప్రమాదకరంగా మారింది. అమెరికా–ఇజ్రాయెల్ దేశాలకూ, ఇరాన్‌కూ మధ్య యుద్ధం జరుగుతుందనీ, దాని ప్రతికూల ప్రభావం తమ ప్రాంతంపై పడుతుందనీ ఈ దేశాలు ఎప్పటినుంచో భయపడుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌తో దీటుగా ఇరాన్ ప్రతిదాడి చేయలేకపోవచ్చు. కానీ జీసీసీ దేశాల్లోని ప్రజాజీవనంపైన, వ్యాపారాలపైనా ఇరాన్ కలిగిస్తున్న నష్టం అపారం. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేస్తే అందుకు ప్రతిగా ఇరాన్ తమపై దాడి చేస్తుందని జీసీసీ దేశాలు ముందే అంచనా వేశాయి. ముఖ్యంగా తమ ప్రధాన ఆదాయ వనరులైన ఆయిల్, గ్యాస్ స్థావరాలపై దాడులు జరుగుతాయని అవి భయపడుతూనే ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిని ముడి చమురు, గ్యాస్ ఎగుమతులకు పనికిరాకుండా చేయడమన్నది ఇరాన్ కీలక వ్యూహం. జీసీసీ దేశాలు ఆ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్‌లు నిర్మించడానికి గతంలో ప్రయత్నించాయి, కానీ పూర్తిగా సఫలం కాలేదు. ఇరాన్ చిన్నచిన్న స్పీడ్‌బోట్లను గుంపులు గుంపులుగా ఉపయోగిస్తూ శత్రు నౌకలకు, చమురు ట్యాంకర్లకు నష్టం కలిగిస్తున్నది.
యుద్ధంవల్ల నష్టాన్ని భరించే సామర్థ్యం ఇరాన్‌తో పోలిస్తే గల్ఫ్ దేశాలకు చాలా తక్కువ. ఆయిల్–గ్యాస్ వ్యాపారాలు దెబ్బతిని, పర్యాటకుల రాక తగ్గి, షాపింగ్ మాల్సూ హోటళ్లూ ఖాళీ అయి, ఆ దేశాల్లో భద్రత లేదన్న చెడ్డపేరు పెరిగిపోతుంటే ఆ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అలాగని ఇరాన్ పట్ల ప్రతీకారం తీర్చుకునే శక్తి కూడా వాటికి లేదు. ఈ విషయంలో అమెరికాని నమ్ముకుని ముందడుగు వేసే సాహసం అవి చేయలేవు. గతంలో ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్ వంటి దేశాలతో ఘర్షణల సమయంలో తన మిత్ర దేశాలను నడిమధ్యలో వదిలేసిన చరిత్ర అమెరికాకు ఉంది. రేపు అమెరికా తోడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇరాన్ మాత్రం తప్పించుకోలేని వాస్తవంలా పొరుగునే ఉంటుంది. ఇరాన్ చెప్పడానికైతే తన దాడులు జీసీసీ దేశాల్లో ఉన్న అమెరికన్ స్థావరాలపై మాత్రమే అని అంటోంది. కానీ వాస్తవం వేరు. దుబాయ్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాల్లోని నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలపై ఇరాన్ డ్రోన్లు దాడి చేస్తున్నాయి. అలాగే ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లోని ఆయిల్–గ్యాస్ స్థావరాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడో చెప్పలేం కానీ, ఏదో ఒక రోజు ఈ యుద్ధం ముగియక తప్పదు. అప్పుడు ఇజ్రాయెల్–అమెరికా దేశాలు తమ గెలుపును చాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇరాన్ కూడా అంతే చేయచ్చు. కానీ అప్పటికే ఇరాన్‌కూ జీసీసీ దేశాలకూ మధ్య సంబంధాలు ఇకపై సరిదిద్దుకోలేనంతగా పాడైపోతాయి. అంతిమంగా, తమ ప్రమేయం ఏమీ లేకుండా ఈ యుద్ధంలో నష్టపోయేవి గల్ఫ్ దేశాలే!
భరత్‌భూషణ్ బాబు ఆరెకట్ల
వ్యాసకర్త రిటైర్డ్ ఐఐఎస్ అధికారి
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News