Share News

లిఖిత రూపాల నిరంకుశత్వం

ABN , Publish Date - Aug 10 , 2026 | 07:02 AM

మన దేశంలో - సహజంగానే - కులవ్యవస్థ వ్యాప్తికీ, కొనసాగింపుకీ లిఖిత సంప్రదాయం ఉపకరించింది. 'విధిరాత'కి సర్వత్రా విధేయత లభించింది.

లిఖిత రూపాల నిరంకుశత్వం

మన దేశంలో - సహజంగానే - కులవ్యవస్థ వ్యాప్తికీ, కొనసాగింపుకీ లిఖిత సంప్రదాయం ఉపకరించింది. 'విధిరాత'కి సర్వత్రా విధేయత లభించింది. అర్ధం కానిదల్లా 'బ్రహ్మలిపి' అయింది. అయితే ఇది కొద్దిరోజుల్లో కొంతమంది ఒక చోట గుమిగూడి చేసిన కుట్ర కాదు; శతాబ్దాలపాటు క్రమేపీ దేశమంతటా వ్యాపించిన భావజాలం.

మాట్లాడే జంతువు మనిషి మాత్రమే. సుమారు లక్ష సంవత్సరాల క్రిందట భాషకు మౌలిక రూపాలు ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞుల అంచనా. ఆదిమ మానవులు గుంపులుగా వేటాడేటప్పుడు, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, జంతువు జాడను తెలియపరచుకుంటూ ముందుకి సాగిన కాలంలో శబ్దాలు, అనుకరణలు, మాటలు అవసరమయ్యాయి. వేట ముగిసాక, రాత్రిపూట మంట చుట్టూ చేరి, మాంసం తింటూ, ఆ రోజున జరిగిన సాహసాల్ని పిల్లలకు వివరించినప్పుడు కథలు పుట్టి ఉండవచ్చు. మాటలు, పాటలయ్యాయి; పాటకి నృత్యం తోడైంది. సాహిత్యం, సంగీతం, భాషతోనే వికసించాయి. భాష అనే ఉమ్మడి సాధనమే మానవ సమూహాల తొలి అస్తిత్వ ప్రకటన.


లిపి తరవాతెప్పుడో (సుమారు క్రీ.పూ.3000) పుట్టింది. తిండిని పోగు చేసుకుంటూనో, వేటాడుతూనో, లేదా పశుపోషకులుగానో జీవించిన తెగలకు లిపి అవసరం లేదు. నదీ తీరాలలో స్థిర వ్యవసాయం మొదలై, పట్టణాలు వెల్లివిరిసాక – నాగరికులకు ఎన్నో వస్తువులు, దినుసులు, వస్త్రాలు, మద్యం, వగైరాలు అవసరమ య్యాయి. అదనపు ఫలసాయం, వస్తు మార్పిడి, ఇతర ప్రాంతాలలో దొరికే వస్తువులను సంపాదించుకోవడానికి తోడ్పడ్డాయి. డబ్బు వాడుకలోకి వచ్చాక, దూర దేశాలతో వ్యాపారం సుగమం అయింది. నౌకా రవాణా వృద్ధి చెంది, రేవులు నగరాలయ్యాయి. ఈ క్రమంలోనే లిపి అవసరమైంది. సింధునదీ ప్రాంతంతో సహా అన్ని ప్రాచీన నాగరికతలలోనూ వర్తకుల ముద్రలకు, సుంకాల పట్టీలకు, పాలకుల ప్రకటనలకు లిపి ఆధారమైంది. శిలాక్షర రూపాల్లో శాసనాలు లిఖించబడ్డాయి.


తర్వాతి దశలో అంతవరకూ మౌఖికంగా ఉండిన జానపద గాథలకు లిఖిత రూపం ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఆ రాతలు చిలవలు పలవలుగా విస్తరించాయి. ఒకే మూలకథ వివిధ ప్రాంతాల్లో, కాలాల్లో లిఖిత రూపాల్లోకి రూపాంతరం పొందింది. ఈ ప్రక్రియ, పండితుల పూనికతో, పాలకుల ఆధ్వర్యంలో జరిగింది. మౌఖిక రూపాలకు ఉండే స్థానికత, భిన్నత్వం, స్థలకాల విశేషాలకు అనుగుణంగా మలుచుకొనే ఒదుగుబాటు– లిఖిత రూపాలకు లోపిస్తుంది. అవి శాశ్వత శాసనాలుగా, మార్చలేని బోధనలుగా తొందరలోనే అవతరిస్తాయి. దీన్నే ఆధునిక భాషా శాస్త్రానికి ఆద్యుడైన స్విస్ భాషాశాస్త్రవేత్త ఫెర్డినాండ్ డి సాసూర్ (1857–1913) ‘లిఖిత రూపాల నిరంకుశత్వం’ అన్నాడు. అతడి ప్రతిపాదనలను మన దేశానికి, మన ప్రాంతాలకు అన్వయించే ప్రయత్నం ఈ వ్యాసం.


పురాణాలు, ధర్మ సూత్రాలు, ముఖ్యంగా పవిత్ర గ్రంథాలు వెలువడ్డానికి లేఖనం గొప్ప వెసులుబాటుని కల్పించింది. స్థానిక విశ్వాసాల సముదాయాలు మతరూపంలో వ్యవస్థీకృతం అయ్యాయి. మనదేశంలో మాత్రం ఒక వైపు తెగల విశ్వాసాలు, మరో వైపు వ్యవస్థీకృత మతం చెట్టాపట్టాలు వేసుకుంటూ కొనసాగుతున్నాయి. చరిత్రకారుడు డి.డి. కోసంబి (1907–1966) చెప్పినట్లు – కొత్తగా ప్రవేశించిన ఏ వ్యవస్థయినా పాత వ్యవస్థను పూర్తిగా తొలగించలేకపోవడం, అన్ని పురాతన పద్ధతులూ, లోలోపలి పొరలుగా కొనసాగడం, మన దేశపు ప్రత్యేకత. ఇందుకు మరో ఉదాహరణ – వేల ఏళ్లపాటు కొనసాగిన వేదాల మౌఖిక రూపం. ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా, ఉచ్చారణలో మార్పులు లేకుండా, ఈ పరంపర కొనసాగడం గొప్ప విశేషం. పవిత్ర బోధనలను ముఖస్థం చేయడమే సరైన పద్ధతి అని పూర్వీకుల భావన కావచ్చు; లేదా లిఖిత రూపంలో ఉంటే అవి ఎవరి చేతిలోకి వెళ్లి మైల పడతాయో అనే భయం కావచ్చు. నిష్ఠాపరులైన బ్రాహ్మణులకు తప్ప వేరెవరికీ అందుబాటులో లేని వేదాలను మినహాయిస్తే, పంచమ వేదమైన మహాభారతాన్నీ, అలాగే రామాయణ భాగవతాలనూ, పామరులకు విడమర్చి చెప్పేందుకై పండితులు అవసరం. ప్రవచనకారుల దృష్టి కథా, కథానాలకన్నా సామాన్య జనులు గ్రహించాల్సిన ధర్మ సూక్ష్మాలపైనే ఎక్కువగా ఉంటుంది. అన్ని వ్యవస్థీకృత మతాలలోనూ, పవిత్ర గ్రంథాల్లోని ఒక్క అక్షరాన్ని కూడా మార్చకూడదని సంప్రదాయవాదులు పట్టుబడతారు. ఆ విధంగా శాశ్వత ప్రాతిపదికపై సమాజాన్ని కట్టడి చేయగల సాధనాలను పాలకులు సమకూర్చుకున్నారు. ముద్రణాయంత్రం లిఖిత సంప్రదాయ సుస్థిరతకి, వ్యవస్థీకృత మతాల వ్యాప్తికి, విశేషంగా తోడ్పడింది.


మన దేశంలో – సహజంగానే – కులవ్యవస్థ వ్యాప్తికీ, కొనసాగింపుకీ లిఖిత సంప్రదాయం ఉపకరించింది. ‘విధిరాత’కి సర్వత్రా విధేయత లభించింది. అర్థం కానిదల్లా ‘బ్రహ్మలిపి’ అయింది. అయితే ఇది కొద్దిరోజుల్లో కొంతమంది ఒక చోట గుమిగూడి చేసిన కుట్ర కాదు; శతాబ్దాలపాటు క్రమేపీ దేశమంతటా వ్యాపించిన భావజాలం. పాలకుల ఉనికిని కాపాడుకోవడానికీ, ప్రజల్ని నియంత్రించేందుకూ అత్యంత సామర్థ్యవంతమైన ఆలోచనా చట్రమే పాలకవర్గ భావజాలంగా పరిణమిస్తుంది. మౌఖిక భాషాభివృద్ధి దిగువనుండి, లిఖిత రూపం ఎగువనుండి – తమ ప్రయాణాలను ఆరంభించాయి. ఈ క్రమంలో కులవ్యవస్థ కీలకమైన పాత్రను పోషించింది. నిజానికి భారతదేశంలో – ప్రాచీన కాలంలోనైనా, ఆధునిక యుగంలోనైనా – ఏ ఒక్క అభివృద్ధి ప్రక్రియ లేదా మార్పు కూడా కులవ్యవస్థకి బాహ్యంగా జరగలేదు. సామాజిక చలనం తీవ్రతరమైన సందర్భాలలో కూడా కులం బలహీన పడలేదు సరి కదా, కొత్త నిర్మాణాల్లోనూ విడదీయలేని భాగం అవుతూ వచ్చింది.


అత్యధిక సంఖ్యలో వినియోగదారులను చేరుకొనేందుకై సినిమా, టీవీ, ప్రింటు మీడియాలకు ప్రామాణిక భాష అవసరం అవుతుంది. సహజంగానే, అది ఆధిపత్య ప్రాంతాల మాండలికం అవుతుంది. ఆర్థికాభివృద్ధిలో, నదీజలాలతో సహా అన్ని సహజవనరుల అందుబాటులో తేడాల మూలంగా ఏర్పడే అసమానతలు, అంతర్గత దోపిడీ, ఉప–వలసీకరణలకి దారి తీస్తాయి. ప్రాంతీయ అస్తిత్వ ప్రకటనల్లో పైకి స్పష్టంగా కనిపించేది మాండలికం అని పిలువబడే భాష; ఆ వెనుకనే ఉండేవి చరిత్ర, సంస్కృతి. ఆర్థిక వెనుకబాటుతనం. తీవ్రమైన అసంతృప్తి, అస్తిత్వ చైతన్యాన్ని జ్వలింపజేస్తుంది; వేర్పాటువాద ఉద్యమాలు మొదలవుతాయి. అందుచేత మాండలిక భిన్నత్వం వెనుక పెద్ద కథే దాగి ఉంటుంది.


అదృష్టవశాత్తూ, ఈ నాణేనికి రెండవ పార్శ్వం కూడా ఉంది. ఇటీవలి కాలంలో, ఇంతవరకూ చదువుకి దూరంగా ఉంచబడిన సమూహాల చేతుల్లో అక్షరం ఆయుధంగా మారింది. స్వీయ అనుభవాల ప్రకటన లిఖిత రూపాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ఇది ప్రజాస్వామ్యకీకరణ వైపుగా మొదటి అడుగు. అక్షరాస్యత అందుబాటులోకి వచ్చాక, వారి కోసం ఎవరో కలం పట్టే అవసరం లేకుండా పీడిత సమూహాల సభ్యులే స్వయంగా రచనలు చేసే స్థాయికి ఒక్క తరంలోనే చేరుకున్నారు. నిజానికి అక్షర ప్రపంచంలోకి దూసుకొచ్చారు. ఈ రాక వెనుక గ్రామీణ పాఠశాలల్లో నిబద్ధతతో పని చేస్తూన్న ఉపాధ్యాయుల అదృశ్య పాత్ర చెప్పుకోతగ్గది. దీనికొక నేపథ్యం ఉన్నది.


సామ్రాజ్యవాద వ్యతిరేకత పెల్లుబికిన కాలంలో విద్యావంతులైన మధ్యతరగతి, అగ్రవర్ణ సమూహాలలో దేశ విముక్తి కోసమై ఆకాంక్ష బలపడింది. దానికి అనుబంధంగా సమానత్వం, సామ్యవాదం, ఆదర్శాలుగా నిలిచాయి. ఆ దశలోనే భారత రాజ్యాంగ నిర్మాణానికి బీజాలు పడ్డాయి. అభ్యుదయవాద లిఖిత సాహిత్యం ఉవ్వెత్తున ఎగసిపడి, పీడిత జనులకు దగ్గరయ్యే ప్రయత్నాలను ఉద్యమరూపాల్లో తీవ్రతరం చేసింది. ప్రజాహితంగా నడిచే ఏ ఉద్యమమైనా చైతన్యాన్ని రగిలిస్తుంది. అది ఎక్కడో, ఎప్పుడో, ఎవరో ఒకర్ని తాకుతుంది. ప్రజా కళారూపాలకు అభ్యుదయ, విప్లవోద్యమాలు సముచిత స్థానం కల్పించాయి.


బాధితులు తమ స్వరాన్ని వినిపింపజేయడం మొదలైనప్పుడు, ఆత్మకథలు, లిఖిత ప్రపంచానికి తెలియని జీవిత వృత్తాంతాలు, వెలువడడం సహజం. ఆ రచనలన్నీ ప్రధానంగా మాండలికాల్లో, యాసతో ఉంటాయి. వాటి నూతనత్వం, అప్పటికే వేళ్లూని ఉన్న లిఖిత వ్యవస్థల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే కొత్త తరానికి అది సరిపోదు. ధిక్కారంగా కొనసాగుతున్న ఈ చైతన్యం, స్వంత వేదికల నిర్మాణ దశకు చేరుకున్నది. ప్రత్యామ్నాయ విలువలను ప్రతిపాదిస్తూ, అన్ని సమూహాలనూ కలుపుకుపోగల సంఘటిత ఇంకా ఏర్పడలేదు. ఆ దశకు చేరినప్పుడు సమానత్వమే ఆదర్శంగా కలిగిన సామ్యవాద చైతన్యం ఆ సంఘటనను ముందుకి నడిపిస్తుంది.


సంఘటింగానో, అసంఘటితంగానో – మౌఖిక రూపాలు లిఖిత ప్రపంచంలోకి ప్రవహిస్తూన్న సుదినాలు మనవి. భాష పాత్రోచితంగా ఉండాలా? రచన మొత్తం మాండలికంలో ఉండాలా? ఇతర మాండలీకులను చేరుకొనేదేట్లా? ఇవన్నీ రచయితల నిర్ణయాలే. అచ్చ తెలుగుకి పెద్ద పీటను కేటాయించడం, సంస్కృత సమాసాల విషయంలో సంయమనం – ఈనాటి సంకేతాలు.


మరో వైపు, అనువాదాలలో టెక్నాలజీ ఉపయోగం మెరుగుపడుతోంది. అది మాండలికాల మధ్య కూడా వారధి కాగలదా? ఇన్నాళ్లూ రచయితలు, చదువరులను మాత్రమే చేరుకొనే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు పుస్తకాలను చదివి వినిపించే సాధనాలు వాడుకలోకి వచ్చాయి. పాడ్‌కాస్ట్‌లు శ్రోతలను చేరుకుంటున్నాయి. అంటే లిఖిత రచన మౌఖికంగా మారి, శ్రోతలను చేరుకుంటోంది! శ్రోతలు అక్షరాస్యులు కానక్కరలేదు. (పూర్వం రేడియో నాటికలు ఈ పని చేసాయి). రెండు భిన్న ప్రపంచాల మధ్య అగాధాన్ని పూడ్చడానికి టెక్నాలజీ సహకరిస్తున్నది.


లిఖిత ప్రపంచం ఇన్నాళ్లూ విధించిన నిరంకుశత్వాన్ని ఇప్పటికే ఛేదించిన నేటి రచయితలు, రాబోయే రోజుల్లో టెక్నాలజీని వినియోగిస్తూ, విభిన్న ఇతివృత్తాలు, మాండలికాలు, యాసలను వెలికి తీస్తూ, ప్రజల నానుడికి గొంతునిస్తూ, కొత్త పాఠక లోకాన్ని సృష్టించుకుంటారు. మన సాహిత్యం మరింత విస్తరిస్తుంది, శోభిల్లుతుంది. నూతన సమాజానికది మార్గదర్శకం అవుతుంది.

ఉణుదుర్తి సుధాకర్

90006 01068



వార్తలు కూడా చదవండి...

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క

తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్‌

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 07:38 AM