Share News

‘వరి’ వృద్ధికి కారణం ‘కాళేశ్వరం’ కాదు!

ABN , Publish Date - Aug 12 , 2026 | 03:19 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2014లో సుమారు 47 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు విస్తీర్ణం, 2025 నాటికి కోటి 20లక్షల ఎకరాలకు పెరిగింది. వరి సాగు విస్తరణ ద్వారా దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచినా, రైతుల...

‘వరి’ వృద్ధికి కారణం ‘కాళేశ్వరం’ కాదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2014లో సుమారు 47 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు విస్తీర్ణం, 2025 నాటికి కోటి 20లక్షల ఎకరాలకు పెరిగింది. వరి సాగు విస్తరణ ద్వారా దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచినా, రైతుల ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, సహజ వనరుల నాణ్యత, లభ్యత గణనీయంగా క్షీణించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు, వరిలో నమోదైన ఈ గణనీయమైన వృద్ధి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం వంటి నీటిపారుదల ప్రాజెక్టుల వల్లే సాధ్యమైందని కొన్ని రాజకీయ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, వరి పెరుగుదలకు ఈ ప్రాజెక్టులతో సంబంధం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, గత పదేళ్లలో ఎకరాకు వరి దిగుబడిలో కూడా చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు. మరి ఈ పరిస్థితుల్లో వరి ఉత్పత్తిలో నమోదైన ఈ గణనీయమైన వృద్ధికి అసలు కారణాలేమిటి?

మొదటి కారణం: గత పదేళ్లలో మెరుగైన ఋతుపవనాల కారణంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవడం. 2016–17 నుంచి 2025–26 వరకు తెలంగాణలోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా మెరుగైన ఋతుపవనాల ప్రభావంతో సాధారణ సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది. దాంతో దేశవ్యాప్తంగా వరి విస్తీర్ణం, ఉత్పత్తి గణనీయంగా పెరిగాయి. 2015–16లో దేశంలో సుమారు 11 కోట్ల ఎకరాల్లో ఉన్న వరి విస్తీర్ణం, 2025–26 నాటికి 14 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఈ పెరుగుదలలో దాదాపు 77 లక్షల ఎకరాలు (అంటే సుమారు 25 శాతం) కేవలం తెలంగాణలోనే విస్తరించింది. తద్వారా తెలంగాణలో వరి ఉత్పత్తి కూడా ఇదే కాలంలో 78 లక్షల టన్నుల నుంచి 270 లక్షల టన్నులకు పెరిగింది. ఉత్పాదకత (ఎకరాకు దిగుబడి) పెరగడం వల్ల ఈ వృద్ధి నమోదు కాలేదు. తెలంగాణలో వరి ఉత్పత్తిలో నమోదైన గణనీయమైన పెరుగుదలకు ప్రధాన కారణం సాగు విస్తీర్ణం పెరగడమే తప్ప, ఉత్పాదకత హెచ్చడం కాదు.


రెండో కారణం: గత దశాబ్దంలో తెలంగాణలో సగటు కంటే అధిక వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఈ అనుకూల పరిస్థితులు రైతుల్లో భూగర్భ జలాల లభ్యతపై విశ్వాసాన్ని పెంచి, కొత్త బోరు బావుల తవ్వకానికి ప్రోత్సాహాన్ని కల్పించాయి. 2014లో రాష్ట్రంలో సుమారు 16 లక్షల బోరు బావులు ఉండగా, 2023–24 నాటికి వాటి సంఖ్య 31 లక్షలకు చేరుకుంది. ఒక బోరు బావికి సుమారు రూ.2 లక్షల వ్యయమవుతుందని అంచనా. ఈ లెక్కన గత పదేళ్లలో రైతులు సొంత పెట్టుబడులతో అదనంగా ఏర్పాటుచేసిన బోరు బావులపై రూ.30 నుంచి రూ.35 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇది తెలంగాణ వ్యవసాయ చరిత్రలో రైతులు స్వయంగా చేసిన అతిపెద్ద మూలధన పెట్టుబడుల్లో ఒకటి. ఒక బోరు బావి సగటున 2–3 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని పరిగణిస్తే, కొత్తగా ఏర్పడిన 15 లక్షల బోరు బావుల ద్వారా అదనంగా సుమారు 35 నుంచి 40 లక్షల ఎకరాలలో సాగు పెరిగింది. ఈ అంచనాకు రాష్ట్ర నికర సాగునీటి విస్తీర్ణంలో నమోదైన పెరుగుదల కూడా బలాన్ని ఇస్తోంది. 2014 రాష్ట్ర నికర సాగునీటి విస్తీర్ణం 57 లక్షల ఎకరాలు కాగా, 2023–24 నాటికి అది 92 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే, గత పదేళ్లలో రాష్ట్రంలో అదనంగా పెరిగిన నికర సాగునీటి విస్తీర్ణంలో దాదాపు 100 శాతం వృద్ధికి బోరు బావుల విస్తరణే ప్రధాన కారణం. కొన్ని రాజకీయ వర్గాలు అదేపనిగా పేర్కొంటున్నట్లుగా గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత పదేళ్లలో సాగునీటి విస్తీర్ణం పెరిగిందనే వాదన పూర్తి అవాస్తవం.

మూడో కారణం: ప్రభుత్వ వరి కేంద్రీకృత ధాన్య సేకరణ విధానం. సాగునీటి లభ్యత ఒక్కటే రైతు పంట ఎంపికను నిర్ణయించదు. గత ప్రభుత్వ హయాంలో అమలైన ధాన్య సేకరణ విధానం వరి కేంద్రీకృతంగా మారి, ఇతర పంటలను పూర్తిగా పక్కన పెట్టింది. ఫలితంగా రైతుల్లో వరి పండిస్తే ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేస్తుందనే బలమైన నమ్మకం ఏర్పడింది. ఇతర పంటలకు అదే స్థాయి మార్కెట్ భరోసా లేకపోవడంతో వాటి సాగుపై వారి ఆసక్తి పూర్తిగా తగ్గింది. దాంతో పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. వరి ఉత్పత్తి పెరిగినా, సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రత, సహజ వనరుల పరిరక్షణ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడ్డాయి.


నాలుగో కారణం: ఉత్పాదకతలో స్తబ్ధత, సాగు వ్యయంలో పెరుగుదల. వరి సాగు విస్తీర్ణం పెరిగినా, ఉత్పాదకతలో మాత్రం అదే స్థాయి పురోగతి లేదు. 2014లో ఎకరానికి సగటున 20–22 క్వింటాళ్ల వరి దిగుబడి ఉంది. 2025 నాటికి కూడా వరి దిగుబడిలో ఎలాంటి మార్పూ లేదు. దీనికి విరుద్ధంగా, రాష్ట్రంలో రసాయన ఎరువుల ద్వారా పంట పోషకాల (నత్రజని, భాస్వరం, పొటాష్) వినియోగం 2014లో ఎకరానికి సగటున 80 కిలోలు ఉండగా, 2024–25 నాటికి 150 కిలోలకు పెరిగింది. అయినా, వరి దిగుబడిలో మాత్రం గణనీయమైన పెరుగుదల నమోదు కాలేదు. ఎరువులతో పాటు విత్తనాలు, పురుగు మందులు, కలుపు నివారణ మందులు, వ్యవసాయ యంత్రాల అద్దెలు, విద్యుత్, డీజిల్, రవాణా, కూలీల వేతనాలు వంటి అన్ని ఉత్పాదక సాధనాల వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. అంటే రైతుల పెట్టుబడి నిరంతరం పెరుగుతున్నా, దానికి అనుగుణంగా ఉత్పాదకత పెరగలేదు. తెలంగాణలో వరి ఉత్పత్తి పెరుగుదల ప్రధానంగా సాగు విస్తరించడం వల్లే తప్ప, ఎకరాకు దిగుబడి పెరగడం వల్ల కాదు.

ఐదో కారణం: గత దశాబ్దంలో వరికి కనీస మద్దతు ధర సగటున సంవత్సరానికి 4 నుంచి 5 శాతం మాత్రమే పెరిగింది. ఇదే కాలంలో సాగు వ్యయం సంవత్సరానికి 12 నుంచి 15 శాతం చొప్పున పెరిగింది. అంటే నామమాత్రంగా మద్దతు ధర పెరిగినా, సాగు వ్యయాల పెరుగుదలతో పోల్చితే అది చాలా తక్కువ. మరోవైపు, వరి దిగుబడిలో కూడా చెప్పుకోదగ్గ మార్పు లేదు. ఫలితంగా రైతుల వాస్తవ నికర ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగలేదు. ధాన్య సేకరణ పరిమాణం పెరగడం ఒక్కటే రైతుల సంక్షేమానికి సూచిక కాదు. రైతుల సంక్షేమాన్ని నిర్ణయించేది కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం కాదు; పెరుగుతున్న సాగు వ్యయాలను అధిగమించే నికర ఆదాయం. ఈ విషయంలో చెప్పుకోదగ్గ పురోగతి లేదు.

గత పదేళ్లలో వరి ఉత్పత్తిలో వృద్ధి నమోదైనా, అదే సమయంలో భూగర్భ జలాల అధిక వినియోగం జరిగింది. రసాయన ఎరువుల వాడకం పెరిగింది. నేల ఆరోగ్యం క్షీణించింది, వరి పొలాల నుంచి హరిత గృహ వాయువుల ఉద్గారాలూ పెరిగాయి. అలాగే, ప్రభుత్వంపై ధాన్యం కొనుగోలు, నిల్వ, పంపిణీ వ్యయాలు భారీగా పెరగడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి.

ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

ఉపకులపతి, జయశంకర్ తెలంగాణ

వ్యవసాయ విశ్వవిద్యాలయం

వార్తలు కూడా చదవండి...

'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 03:19 AM