పెన్షన్ బెనిఫిట్స్ ప్రభుత్వ సొమ్ము కాదు!
ABN , Publish Date - Sep 10 , 2026 | 07:08 AM
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక భూమిక నిర్వహించింది తెలంగాణ ఉద్యోగ వర్గం. తెలంగాణ వస్తే మెరుగైన ఉద్యోగ జీవితం ఉంటుందని, ఆంధ్ర ఆధిపత్య వివక్షలు ఉండవని, వివిధ వర్గాలకు...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక భూమిక నిర్వహించింది తెలంగాణ ఉద్యోగ వర్గం. తెలంగాణ వస్తే మెరుగైన ఉద్యోగ జీవితం ఉంటుందని, ఆంధ్ర ఆధిపత్య వివక్షలు ఉండవని, వివిధ వర్గాలకు న్యాయబద్ధమైన సామాజిక వాటాలు ప్రత్యేక రాష్ట్రంలోనే పొందగలమని ఉద్యోగులు ఆశించారు. కానీ జరిగింది అందుకు విరుద్ధం. కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేసింది. నెల నెలా మొదటి తారీఖున జీతాలు పొందడాన్ని కూడా ఒక డిమాండ్‌గా దిగజార్చిన దుస్థితికి నెట్టివేసింది. డీఏలు ఇవ్వకపోవడం, పీఆర్‌సీ అమలు చేయకపోవడం, పెన్షనర్ బెనిఫిట్స్‌ను పెండింగ్‌లో పెట్టడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను పాత పెన్షన్ స్కీమ్‌గా మార్చకపోవడం, హెల్త్‌కార్డులను ఉచితంగా ఇవ్వకపోవడం... ఇంకా అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఉద్యోగులను, పెన్షనర్స్‌ను ఇబ్బందులపాలు చేసినందుకు గత ప్రభుత్వం ఫలితం అనుభవించింది.
ఇప్పటి ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆరు డీఏలను ఇవ్వడం లేదు. పీఆర్‌సీ అమలును పట్టించుకోవడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు తాము ఉద్యోగంలో ఉన్నప్పుడు దాచుకున్న సొమ్మును ఇవ్వడం లేదు. పైగా పెన్షనరీ బెనిఫిట్స్ ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలనీ, ఒక్కో ఉద్యోగికి సగటున కోటి పైనే చెల్లించాల్సి వస్తున్నదనీ, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి ఇస్తున్నామనీ ముఖ్యమంత్రి వాపోతున్నారు!
ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చేది ఒక్క గ్రాట్యుటీ మాత్రమే. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేదాకా ఒక ఉద్యోగి తన జీతం నుంచి పైసా పైసా ప్రభుత్వం దగ్గర దాచుకున్న సొమ్మే జీపీఎఫ్, ఇన్సూరెన్స్, కమ్యూటేషన్ బెనిఫిట్స్. ఇవేమీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే కానుకలు కావు. ఉద్యోగుల జీతం సొమ్ము వారికి ఇవ్వకుండా... ‘ఎట్లా ఇచ్చేది? ఎక్కడ నుంచి అప్పులు తెచ్చేది? కోసినా ఒక్క పైసా లేదు, ఉచితాలు తీసి ఇవ్వాలా?’ అని సమాజం ముందు ఉద్యోగులను బద్నాం చేయడం అన్యాయం. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రజలను ప్రత్యర్థులుగా నిలబెట్టే ప్రయత్నం మంచిది కాదు.
ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఏమైంది? ఎటు మళ్లిస్తున్నారు? తెలంగాణ రాకముందు పెన్షనర్స్ పెండింగ్ బిల్స్ అంటూ లేకుండేది. ఒకటీ అరా డీఏలు పెండింగ్ ఉండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక, ఆరు కరువు భత్యాలు పెండింగ్‌లో ఉన్నాయి! బహుశా దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం మనదేనేమో! మిగతా ఏ రాష్ట్రంలోనూ ఈ దుస్థితి లేదు. ఉద్యోగులు కూడా ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే. వారు లేకుండా ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయవు.
ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవుల్లో ఒక్కరోజే ఉన్నా కూడా వారికి పెద్ద ఎత్తున జీతం, పెన్షన్ వస్తుంది. దీని మీద చర్చే ఉండది. ఉద్యోగుల లాగా వారు వారి జీతం నుంచి దాచుకునేది ఏమీ ఉండది. కానీ, ఉద్యోగులు ముప్పై నలభై ఏండ్ల పాటు పనిచేసి కూడబెట్టుకున్న సొమ్మును వారికి ఇవ్వడానికి ఇంత కాలయాపనా?! ఇంకోవైపు ప్రభుత్వ ధనమే తేరగా ఇస్తున్నట్లు ప్రచారం! ఇట్లా ఉద్యోగులను వేలెత్తి చూపే పద్ధతి ఇవ్వాళ్టిది కాదు. గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ ఇదే జరుగుతున్నది.
పెన్షనర్లు దాచుకున్న సొమ్ము వారికి అందక ఈ రెండున్నరేళ్లలో డెబ్బయిమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్లు, సొంతింటి ఏర్పాట్లు, అప్పులు, అనారోగ్యాలు... ఇన్ని సమస్యల నుంచి దాచుకున్న జీపీఎఫ్, ఇన్సూరెన్స్, కమ్యూటేషన్ బెనిఫిట్స్‌తో బైటపడదామంటే ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఇవ్వకపోవడం వల్ల జరిగిన ఆత్మహత్యలు అవి.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యంగా ఇచ్చే డీఏ ప్రభుత్వ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు. ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్ల నుంచి డీఏ ఇవ్వడం లేదు. ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదు అంటూనే, అనేక బహుళ ప్రాజెక్టులను చేపడుతున్నది.
గత దశాబ్దాల నుంచీ ఏ ప్రభుత్వాలూ పీఆర్సీలను సక్రమంగా అమలు చేసిన చరిత్ర లేదు. దానివల్ల వేతన సవరణ జరగడం ఆగిపోయి, కొత్త వేతనాలు అందడం లేదు. ఈ మధ్య క్యాష్‌లెస్ హెల్త్ కార్డుల విషయంలో కూడా బోర్డు ఏర్పాటు, రెఫరల్ హాస్పిటల్ లిస్ట్, కొత్త హెల్త్ కార్డులు ఇవ్వక మునుపే, ఆస్పత్రుల ఓపీ సేవలకు సంబంధించిన అంశాలను పూర్తి చేయకముందే హడావిడిగా ఇప్పటికి అయిదు నెలల నుంచి ఉద్యోగులు, పెన్షనర్స్ నుంచి ఒకటిన్నర శాతం (1.5శాతం) కట్ చేయడం దారుణం. అసలే బెనిఫిట్స్ రాక అల్లాడుతున్న పెన్షనర్ల పెన్షన్ నుంచి హెల్త్ కార్డులు రాకుండానే ఇలా కట్ చేయడం ఆపాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు అప్పుబడిన ఆరు డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. పెన్షనర్స్ దాచుకున్న పెండింగ్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలి. పీఆర్‌సీని అమలు చేయాలి.
జూపాక సుభద్ర
ప్రభుత్వ అదనపు కార్యదర్శి (రిటైర్డ్)
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News