Share News

ఈ తలకిందుల చదువును సరిచేసేదెవరు?

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:28 AM

రైతులకు ఏ ఎరువులు వాడాలో, ఏ పురుగుల మందు ఎంత మోతాదులో వెయ్యాలో చెప్పడానికి ప్రతి గ్రామంలోనూ నిపుణుల్ని నియమిస్తామన్నది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం. ఆ నిపుణులకు...

ఈ తలకిందుల చదువును సరిచేసేదెవరు?

రైతులకు ఏ ఎరువులు వాడాలో, ఏ పురుగుల మందు ఎంత మోతాదులో వెయ్యాలో చెప్పడానికి ప్రతి గ్రామంలోనూ నిపుణుల్ని నియమిస్తామన్నది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం. ఆ నిపుణులకు ఏ ఆరు నెలలో శిక్షణ ఇచ్చి నియమిస్తారు. మరి ఈ నిపుణులకు ఆరు నెలల్లో ఇవ్వగలిగిన పరిజ్ఞానాన్ని రైతులే పాఠశాల విద్యార్థులుగా ఉన్నప్పుడు, ఆ పదేళ్ల చదువులో ఎందుకు ఇవ్వలేకపోయారు? లోతైన క్లిష్టమైన థియరీ అంతా పాఠశాల, ఇంటర్‌ స్థాయిల్లో పెట్టి, నిత్య జీవితంలో అన్వయించుకోగల విద్యను మాత్రం పైస్థాయి కోర్సుల్లో బోధించే తలకిందుల చదువు వల్ల ఏం ప్రయోజనం?

మెకాలే విద్యావిధానాన్ని నిర్మూలించాలని అరవయ్యేళ్లుగా నినదిస్తున్నాం. కానీ ఎలా మార్చాలో, దాని స్థానంలో ఏం ప్రవేశపెట్టాలో ఎవరూ చెప్పడం లేదు. కౌమారంలోని పిల్లలు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకొనే దయనీయమైన, వికృతమైన వ్యవస్థను మాత్రం తయారుచేశాం. ‘చదువు అంటే ఒక ఆనందమైన అనుభూతి కదా! జ్ఞానార్జన ఒక గొప్ప జీవితానుభవం కదా’ అని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ రాశారు. చదువు అంటే ఒక ఆనందమైన అనుభూతి అని భావించే ఒక్క విద్యార్థినైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చూపించగలరా? పాఠశాల స్థాయి పిల్లల ఆనందాన్ని కబళించే ప్రధాన శత్రువు అధిక చదువు. ఒకటో తరగతి విద్యార్థికి మూడు భాషలు నేర్పాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడే మన పాలకులకు విద్యావ్యవస్థపై ఎంత అవగాహన ఉన్నదో అర్థం అవుతుంది! ప్రపంచంలో ఎక్కడైనా ప్రాథమిక విద్యార్థులకు మాతృభాష మాత్రమే నేర్పుతారు. ఇతర భాషలు నేర్చుకోవాలనుకొనేవారు డిగ్రీ స్థాయిలో వారికి ఇష్టమైన భాషలు నేర్చుకుంటారు.

ఒక భాషను నేర్చుకుంటున్నామంటే అందులో కనీసం మాట్లాడటం, రాయడం రావాలి కదా! ఇందులో ఎంతవరకు విజయం సాధించాం? ఒకటో తరగతి నుంచి డిగ్రీ రెండో సంవత్సరం వరకు ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా 14 సంవత్సరాలు చదివిస్తున్నాం, పరీక్షలు పెడుతున్నాం. అయినా ఆ భాషలో ఒక వాక్యం సొంతంగా రాయడం కానీ, మాట్లాడటం కానీ చేయలేకపోతున్నారు. మరి ఈ కాలాన్ని ఎందుకు వ్యర్థం చేసినట్లు? అసలు భాష నేర్చుకోవటంలోని ప్రాథమిక లక్ష్యమైన అభివ్యక్తీకరణ రానప్పుడు దాన్నెందుకు చదివిస్తున్నాం? తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం పాఠశాలల వైపు ఆకర్షితులవటానికి ప్రధాన కారణం ఇంగ్లీషులో మాట్లాడగలగటమే కదా. ఆ పని తెలుగు మీడియంలో కూడా చేయగలిగితే, ఒకటో తరగతి నుంచే పరాయి భాషలో అర్థం అయ్యి, అవ్వకుండా బట్టీలు పట్టే క్షోభ పిల్లలకు ఉండదు. హిందీ పరిస్థితి కూడా ఇంతే. పెద్దయిన తరువాత నాలుగైదు నెలల్లో నేర్చుకోగలిగిన భాషను చిన్న పిల్లలకు పదేళ్ల పాటు బోధించి హింసించటమెందుకు? అసలు చిన్న పిల్లలకు మూడు భాషలు నేర్పడమేమిటి? వీటిలో రెండు భాషలు తగ్గినట్లయితే పిల్లలపై ఎంత బరువు తగ్గేదో ఆలోచించండి. దశాబ్దాల పాటు ప్రయోజనమేమీ కలగజేయని ఈ భాషా విధానాన్ని వెంటనే మార్చేయాలి.


జీవశాస్త్రాన్ని హైస్కూలు నుంచి ఇంటర్‌ వరకు తీసుకుంటే ఇందులో ముఖ్యంగా జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం ఉంటాయి. జంతుశాస్త్రంలో వెన్నెముక గల జీవులు (కార్డేటా), వెన్నెముక లేని జీవులు, ఏకకణ జీవులు, బహుకణ జీవులు, ఇతర లక్షణాల ఆధారంగా వాటి వర్గీకరణ, ప్రోటోజోవా, పొరిఫెరా, ఆర్థోపొడా, ఎకైనోడెర్మేటా వంటి ఫైలాల నుంచి సబ్‌ఫైలాలు, వాటి కుటుంబాలు చివరికి ఆయా జాతుల వరకు వందలాది నామాలు, వాటి సాధారణ లక్షణాలు, బాక్టీరియా, వైరస్‌, జెనెటిక్స్‌, జెనెటిక్‌ కోడ్‌లు, కణాలు, వాటి నిర్మాణం, కణ విభజన, వివిధ వ్యవస్థల నిర్మాణం, పనితీరు... ఇలా ఉన్నతస్థాయి జీవశాస్త్రం అంతా చదివేస్తారు. ఇందులో ఏ జీవీ మనకు బయట కనిపించదు. మైక్రోస్కోపులో చూడాల్సిందే. జీవులను కానీ, అంతర్గత వ్యవస్థలను కానీ, కేవలం ఊహించుకోవలసి రావటం వల్ల అవి అర్థం కావు, నిత్యజీవితంలో ఉపయోగపడవు కాబట్టి ఆసక్తి కలగదు. క్లిష్టమైన లాటిన్‌ పేర్లు గుర్తుండవు.

ఇవన్నీ బట్టీ పట్టి, ఇంత విశదంగా నేర్చుకుంటారు సరే... కానీ, ఇంటర్‌ చదివి వ్యవసాయం చేయదలుచుకున్న విద్యార్థికి పశువులను ఎలా పెంచాలో, వాటికి వచ్చే జబ్బులు ఏమిటో, అవి రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు. గేదెలకు ఏమి ఆహారంగా పెడితే ఎక్కువ పాలిస్తాయో, గొర్రెలను ఎలా కాపాడుకోవాలో, చేపల పెంపకం, పట్టు పురుగులు... ఏమీ తెలియదు. ఇవన్నీ వెటర్నరీ డాక్టరు కోర్సులో ఉంటాయి. మరి మనం పైన చెప్పుకున్న జంతుశాస్త్రమంతా దేనికొరకు చదివినట్లు?

లోతైన, క్లిష్టమైన థియరీ అంతా పాఠశాల, ఇంటర్‌ స్థాయిలో పెట్టి, నిత్య జీవితంలో అన్వయించుకోగల (అప్లికేషన్‌) విద్యను మాత్రం పై కోర్సులో పెట్టారు. నిజానికి అప్లికేషన్‌ కింది స్థాయిలో బోధించినట్లయితే... రోజూ చూసే జీవుల విషయం కాబట్టి విద్యార్థులు ఆసక్తితో చదువుతారు. పదో తరగతిలో చదువు మానేసినా అప్పటి వరకూ చదివిన చదువు నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఆసక్తి ఉన్నవారు పై చదువులకు వెళ్లి లోతుగా చదువుకుంటారు. ఇక్కడ చదవవలసింది అక్కడ, అక్కడ చదవవలసింది ఇక్కడ! ఇదీ మన తలకిందుల చదువు.

వృక్షశాస్త్రంలో కూడా ఇంతే. వరి ఎన్ని రోజుల పంటో, నారుమడి చల్లి... నాట్లు ఎందుకు వేస్తారో, వరికి వచ్చే రోగాలేమిటో, వాటిని ఎలా అరికట్టాలో ఎవ్వరికీ తెలియదు. ఇతర పంటలు, పండ్లు, పూలతోటల పెంపకం, అంట్లు కట్టడం వంటి నిజజీవితంలో ఎంతో ఉపయోగపడే విజ్ఞానం వారికి బోధపడదు. ఏ విధంగానూ ఉపయోగపడని కష్టతరమైన నాలెడ్జిని, ఎందుకు చదువుతున్నామో తెలియకుండా పంటి బిగువున రుబ్బి పరీక్షల్లో రాసి, తరువాత దానితో ఏ ఉపయోగంలేక మర్చిపోతున్నారు.


ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో కూడా ఇంతే. ఎన్నో థియరీలు చదువుతారు. ఇంట్లో ఫ్యూజు పోతే వెయ్యలేరు. పొలంలో మోటారు కానీ, ఇంట్లో ఏ పరికరమైనా కానీ పాడైతే బాగుచేయలేరు. ఫ్రిజ్‌ ఎలా పనిచేస్తుందో చెప్పలేరు. అలాగే కెమిస్ట్రీలో అనేకం చదువుకుంటారు. వాస్తవ జీవితంలో ఏ రసాయనాన్నీ గుర్తించలేరు. మెషీన్లు, ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, నీటిపారుదల, మెటలర్జీ ఇలా ఎన్నో రంగాలలో వాస్తవిక అవసరాలతో సంబంధం లేకుండా చాలా విజ్ఞానాన్ని విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే బోధిస్తున్నాం. నిజజీవిత అవసరాలను మాత్రం ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ వంటి పై స్థాయిల్లో నేర్పుతున్నాం. ఇదీ మన తలకిందుల చదువుల ప్రత్యేకత.

లెక్కల విషయం మరీ దారుణం. సాధారణంగా నిజజీవితంలో ఉపయోగపడేవి అంకగణితంలోని (అర్థమెటిక్‌) వడ్డీ లెక్కలు, సరాసరి, పని, కాలం, దూరం వంటివి. ఇరవై ఏళ్ల క్రితం వరకూ అంక గణితం ప్రతి తరగతిలోనూ సగం సిలబస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకే సంవత్సరంలో ఒక చాప్టర్‌లోకి కుదించారు. ఇక మిగతా సిలబస్‌లో వాస్తవ సంఖ్యలు, కారణాంకాలు, వర్గ సమీకరణాలు, సమితులు, నిరూపక రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి మొదలైనవి ఎన్నో. చదువయ్యాక నిత్య జీవితంలో వీటిని ఎప్పుడైనా ఉపయోగించిన మనిషి నాకింతవరకూ కనిపించలేదు.

ఇవన్నీ పనికిరావని కాదు. ఇవి కేవలం అకడమిక్‌గా కానీ, ఇంజినీరింగ్‌ వంటి కోర్సులలో కానీ ఉపయోగపడుతున్నాయి. టెన్త్‌తోనో, ఇంటర్‌తోనో, డిగ్రీతోనో చదువు ఆపే విద్యార్థి వీటిని ఎక్కడ ఉపయోగించుకోవాలి? దేశంలోని పిల్లలందరూ కనీసం పదో తరగతి వరకైనా చదువుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నిర్బంధ సార్వత్రికవిద్య పేరుతో పిల్లలందరినీ స్కూళ్లలో పెట్టి వారికి అర్థంకాని, లాభంలేని చదువును పది పదిహేనేళ్లపాటు బలవంతంగా చదివించి, వారి సమయాన్ని వృథా చేస్తున్నాం. చదువుపై మన దృక్పథం మారాలి. సిలబస్‌లను సమూలంగా మార్చాలి. చదువంటే నిజంగా ఒక అందమైన, ఆనందమైన అనుభూతిగా చేయవచ్చు. ఈ సాహసం ఎవరు చేస్తారు? ఈ తలకిందుల చదువును ఎవరు తిరిగి సరిగా నిలబెడతారు?

రామ్మూర్తి దండె

తెలుగు పండితులు, యాదాద్రి భువనగిరి జిల్లా

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 04:29 AM