Share News

‘22ఎ’ భయం పోగొట్టాల్సింది ప్రభుత్వమే!

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:49 AM

రిజిస్ట్రేషన్ ఏక్ట్ 1908లోని ‘సెక్షన్ 22–ఎ’ కొన్ని భూములను, పత్రాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడంతో పాటు, ఎండోమెంట్ భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ రోడ్లు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్...

‘22ఎ’ భయం పోగొట్టాల్సింది ప్రభుత్వమే!

రిజిస్ట్రేషన్ ఏక్ట్ 1908లోని ‘సెక్షన్ 22–ఎ’ కొన్ని భూములను, పత్రాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడంతో పాటు, ఎండోమెంట్ భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ రోడ్లు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్, ధార్మిక, కేంద్ర ప్రభుత్వ భూములకు కూడా రక్షణ కల్పిస్తుంది. కానీ, మన రాష్ట్రంలో క్షేత్రస్థాయి విచారణ జరపకుండా అనేక సొంత భూములను ‘22–ఎ’లో చేర్చారు. అది ప్రజలకు సమస్యగా మారింది.

ఉదాహరణకు ఒక సన్నకారు రైతు ముప్పై ఐదేళ్ళ క్రితం మూడు ఎకరాల వ్యవసాయ భూమిని రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా కొన్నాడు. ధరణి పుస్తకం వచ్చింది. రైతు బంధు, రైతు భరోసా ఇస్తున్నారు. డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. అలాగే మరొకరు రెండు వందల గజాల స్థలం కొనుక్కుని అన్ని ప్రభుత్వ అనుమతులతో పాటు బ్యాంకు లోను కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు ఇచ్చేసింది. వీరు ఇరువురు అన్ని కాగితాలు ఉన్నాయన్న నమ్మకంతో ఏదో తక్షణ అవసరార్థం ఆస్తిని అమ్ముకోవాలనుకున్నారు. కొనాలనుకున్న వ్యక్తులు విచారణ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఆ సర్వే నంబర్లు 22–ఎ నిషేధిత జాబితాలో ఉన్నాయి అని తేలింది. కాబట్టి లీగల్‌గా అన్ని కాగితాలు ఉన్నప్పటికీ వీరు ఆ స్థలాన్ని గాని, ఇంటిని గాని అమ్ముకోలేరు.

అది ప్రభుత్వ భూమి అయితే కొన్నప్పుడో, రైతుబంధు/భరోసా తీసుకున్నప్పుడో, లేదా ఇల్లు కట్టుకున్నప్పుడో, లోను తీసుకున్నప్పుడో... ఏదో ఒక దశలో అడ్డంకి రావాలి. అలాగాక అది ప్రభుత్వ భూమి కాదనుకుంటే ‘22–ఎ’లోకి ఎలా వచ్చినట్టు? ఎలాంటి సమాచారం లేకుండా ఒక పట్టా సర్వే నెంబరును నిషేధిత జాబితాలో చేర్చే అధికారం స్థానిక తహసిల్దారుకు ఎవరు ఇచ్చారు? గౌరవ న్యాయ స్థానం ప్రకారం ‘22–ఎ’ అనేది చట్టబద్ధమైన అధికారిక ముద్రగా ఉండాలి. సంబంధిత రికార్డుల పరిశీలన జరగాలి. కానీ చాలా సందర్భాల్లో అదేమీ జరగటం లేదు, ఏ నిబంధనలనూ పాటించడం లేదు. ఈ సమస్యలన్నీ సాధారణ ప్రజలకు తెలియవు. వారు కూడబెట్టుకున్న డబ్బులతో ఒక స‍్థిరాస్తిని కొంటారు. అది అమ్మబోయినప్పుడు అసలు విషయం తెలుస్తుంది.

ప్రభుత్వం తన పరిధిలో భూములకు కస్టోడియన్‌గా ఉండాలి, నిజమే. కానీ అదే సమయంలో బాధితులకూ న్యాయం జరగాలి. అలా జరగాలి అంటే ఈ ప్రక్రియలో అధికారులు కీలకపాత్ర పోషించాలి. నిషేధానికి గల కారణాలను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలి. ఏ క్లాజు కింద నిషేధించబడిందో స్పష్టంగా తెలపాలి. ఇందుకోసం విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో ఒక టీం లేదా ఫోరమ్ ఉండాలి. అన్ని కేటగిరీలలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్దిష్ట గడువులో ఆదేశాలు జారీ చేసే నైపుణ్యం గల వ్యవస్థ ఏర్పాటు కావాలి. అవసరమయితే ఒక ఆర్డినెన్సు తీసుకుని రావాలి.


స్థిరాస్తులను కొనేవారు కూడా వాటిని కొనేటప్పుడు విచారించి, వివరాలు తెలుసుకునే కొనాలి. ముందుగానే కొనాలనుకున్న భూమి, ప్లాటు, ఫ్లాట్ ఏ క్యాటగిరిలో ఉందో తెలుసుకోవాలి. కొంటున్నప్పుడు కాయితాలు, స్థలం అన్నీ చూసుకోవాలి. ఈ బాధ్యత కొనేవాడిదే. కానీ ఏ పొరపాటు లేకుండా సాధారణ పౌరుడు కొనుగోలు చేసిన ఆస్తిని నిషేధం పేరున అడ్డుకోవడం సరైనది కాదు. ‘22ఎ’ చట్టం ప్రభుత్వానికీ పౌరుడికీ మధ్య ఘర్షణగా ఉండకూడదు. పౌర సమాజానికి భరోసాను ఇవ్వగలిగేలా ఉండాలి. అవినీతి, నిర్లక్ష్యం, అహంకారంతో వ్యవహరిస్తున్న అధికారులపై కఠినంగా ఉండకపోతే కష్టం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కేటగిరీలలోని నిషేధిత జాబితాలో చేర్చిన భూమిని, ప్లాటును, ఫ్లాటును కొనుగోలు చేసిన వారిని ఆదుకోవాలి. వారు తమ ఆస్తిని అమ్ముకునేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలి. బాధితులకు ఫలితాలు అందాలి అంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలి.

వి. బాలరాజు

రిటైర్డు తహశీల్దారు

ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్

ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 01:49 AM