Share News

ట్రంప్‌ కొత్త అస్త్రం!

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:18 AM

అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేతి నుంచి సుంకాల అస్త్రాన్ని లాక్కుని, దానిని వాడే అధికారం నీకు లేదని హెచ్చరించింది. అమెరికన్‌ కాంగ్రెస్‌కు...

ట్రంప్‌ కొత్త అస్త్రం!

అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేతి నుంచి సుంకాల అస్త్రాన్ని లాక్కుని, దానిని వాడే అధికారం నీకు లేదని హెచ్చరించింది. అమెరికన్‌ కాంగ్రెస్‌కు మాత్రమే ఉన్న ఆ విశేషాధికారాన్ని నువ్వెలా చెలాయిస్తావని ప్రశ్నించింది. ఇప్పుడు, అమెరికా చట్టసభలే మరింత శక్తిమంతమైన అస్త్రాన్ని ట్రంప్‌ చేతిలో పెట్టి, నీకు నచ్చినప్పుడు, నచ్చినరీతిలో గిట్టనివారిమీద ప్రయోగించుకోవచ్చునని సర్వాధికారాలూ కట్టబెట్టింది. రష్యా–ఇరాన్‌లపై కఠిన ఆంక్షలూ నియంత్రణలే లక్ష్యంగా తయారైన లిండ్సే గ్రాహం చట్టం, రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న లేదా దానిమీద విధించిన ఆంక్షలను తప్పించుకోవడానికి సహకరిస్తున్న దేశాలను ఆర్నెల్లలోగా దారికితెస్తుంది. చైనాతో పాటు, 88శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటూ, అందులో అత్యధికం రష్యా చమురు మీదే ఆధారపడిన భారత్‌ ఈ చట్టానికి స్పష్టమైన లక్ష్యం కనుక ఆందోళన సహజం.

ఏ రేటు సుంకంతో ఎవరిని టార్గెట్‌ చేయాలి, ఎవరిని మినహాయించాలన్నది ట్రంప్‌ దొరవారు నిర్ణయిస్తారు. బుల్లెట్లు దట్టించిన తుపాకీని ట్రంప్‌ చేతిలో పెట్టి, శత్రువును నువ్వే నిర్ణయించుకోవచ్చునని అమెరికన్‌ కాంగ్రెస్‌ స్వేచ్ఛనిచ్చింది కనుక, ఆ చట్టంలోని నిబంధనలకంటే ట్రంప్‌ మానసిక స్థితి సుంకాల నిర్ణయంలో కీలకపాత్ర పోషిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. చైనా జోలికి ట్రంప్‌ ఎలాగూ పోవడం లేదు కానీ, భారతదేశం మీదో ఆప్తమిత్రుడైన నరేంద్రమోదీపైనో ట్రంప్‌కు ఉన్న అభిప్రాయాలు, అభిమానాల ఆధారంగా నిర్ణయాలు ఉండవచ్చు. ఈ చట్టం మీద భారతదేశం గట్టిగానే స్పందించింది. మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ఇంధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా 140కోట్ల భారతీయుల ఇంధన భద్రతకు తాము కట్టబడివున్నామని విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది. తమ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని, ఉభయదేశాల సంబంధాల మీదా పడే ప్రభావాలను అమెరికా ప్రతినిధులకు గుర్తుచేశామని కూడా ఆ ప్రకటన పేర్కొంది. ఏం చేయాలో ఇంకా తేల్చుకోలేదని దీని అర్థం అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, విదేశీ ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదనీ, తాను ఇదే దారిలో కొనసాగుతూ, ఎటువంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నానని భారత్‌ చెప్పినట్టయిందని కూడా మరికొందరు విశ్లేషిస్తున్నారు.


ఈ చట్టాన్ని రేపటి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో ట్రంప్‌ ముడిపెడతారన్న వాదనల్లో అతిశయోక్తి ఏమీ లేదు. భారత్‌ ఇప్పటివరకూ చేసుకున్న తొమ్మిది స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలూ మనకే అనుకూలంగా ఉన్నాయని అంటూ, అమెరికాకూడా ప్రిఫరెన్షియల్‌ రేట్‌ విషయంలో సానుకూలంగా స్పందిస్తే, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని భారత్‌ వెంటనే ప్రకటిస్తుందని పీయూష్‌ గోయల్‌ ఇటీవలే ఓ మాటన్నారు. ఎంతోకాలంగా నానుతున్న ఈ వ్యవహారాన్ని కొలిక్కితీసుకురావడానికి ట్రంప్‌ ఈ కొత్త అస్త్రాన్ని చూపుతారన్న భయం అందుకే. అమెరికా అధ్యక్షుడుగా ఎవరున్నా, ఇతర దేశాలను హెచ్చరించడం, బెదిరించడం కొత్తేమీ కాదు. ఇక, అమెరికా ఫస్ట్‌ నినాదంతో, దేశీయ రాజకీయాల కోసం ఇతర దేశాలతో కయ్యానికి దిగడంలో ట్రంప్‌కు ఎవరూ సాటిరారు. కెనడా సహా నాటో దేశాలన్నింటికీ ట్రంప్‌ చర్యలూ చేష్టలూ దినదినగండంగానే ఉన్నాయి. భారత్‌ విషయంలోనూ ట్రంప్‌ ఎన్నడూ మొహమాటలకు పోలేదు, మినహాయింపులూ ఇవ్వలేదు. పైపెచ్చు, అదనపు సుంకాలు, ప్రతీకార సుంకాల పేరిట మన ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఆయన ప్రయత్నించాడు. ఉక్రెయిన్‌ మీద రష్యా యుద్ధానికి దిగినందుకు భారత్‌ సహా అనేక దేశాలు శిక్ష అనుభవించాల్సి వస్తున్నది. కానీ, అంతకంటే అత్యంత నష్టదాయకమైన యుద్ధాన్ని ఇరాన్‌ మీద ట్రంప్‌ ఆరంభించినా మిగతా ప్రపంచమంతా మౌనంగా భరించాల్సి వస్తున్నది. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించడంలో అమెరికాను మించినదేదీ లేదు. తరతమ భేదాలు లేకుండా అమెరికన్‌ కాంగ్రెస్‌ ముక్తకంఠంతో ఆమోదించిన లిండ్సే గ్రాహం బిల్లు దాని వ్యవహారశైలికీ, ఏకపక్ష వైఖరికీ నిదర్శనం. ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివిన ట్రంప్‌ దానికి అధ్యక్షుడుగా ఉన్నందున ఎంతటి విపరిణామానికైనా సిద్ధంగా ఉండక తప్పదు. మధ్యంతర ఎన్నికల ముంగిట ఉన్న ఆయన ఎదుటివారిని లొంగదీసుకోవడానికి ఎన్ని అస్త్రాలైనా ప్రయోగిస్తారు. నిలబడాలా, సాగిలబడాలా అన్నది మనమే తేల్చుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 04:18 AM