Share News

తీరు మారని ఎస్‌సీఓ

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:59 AM

రెండురోజులు జరిగిన షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం ఇరాన్‌, ఉక్రెయిన్‌ యుద్ధాలమీదా, ఉగ్రవాదం తదితర కీలకాంశాలపైనా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియచెప్పేందుకు...

తీరు మారని ఎస్‌సీఓ

రెండురోజులు జరిగిన షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం ఇరాన్‌, ఉక్రెయిన్‌ యుద్ధాలమీదా, ఉగ్రవాదం తదితర కీలకాంశాలపైనా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియచెప్పేందుకు ఉపకరించింది. ప్రధాన సదస్సు లాంఛనప్రాయం కావచ్చునేమోగానీ, మరో పక్కన జరిగే చిన్నచిన్న సమావేశాలు, దేశాధినేతల మధ్య సాగే భేటీలు మనసువిప్పి మాట్లాడుకోవడానికి వీలుకల్పిస్తాయి. ఇటువంటి ప్రపంచస్థాయి వేదికలమీద నాయకులు చేసే వ్యాఖ్యలే కాదు, వారి చర్యలూ చేష్టలూ సైతం లోతైన విశ్లేషణలకు అవకాశం ఇస్తాయి, ఊహాగానాలకు సైతం దారితీస్తాయి.

మధ్య ఆసియాలోని పూర్వపు సోవియట్‌ ప్రాంతాలైన మిగతా సభ్యదేశాలను అటుంచితే, చైనా, రష్యా, భారత్‌, పాకిస్థాన్‌, ఇరాన్‌లు ప్రధానంగా ఉన్న ఈ కూటమి వర్తమాన పరిణామాల రీత్యా మరింత కీలకం. బిష్కెక్‌లో భారతప్రధాని నరేంద్రమోదీ చాలా అంశాల మీద భారత్‌ వైఖరిని విస్పష్టంగా ప్రకటించారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ ఇస్తున్న మద్దతును ఖండిస్తూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం ఏకం కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ తరహా ఖండనమండనలు, హెచ్చరికలు, హితవులూ కొత్తవీ కావు, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా అమలు చేస్తున్న పాకిస్థాన్‌ మనసు మార్చలేవు కూడా. కానీ, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ నిరవధికంగా అమలు చేస్తున్నదని ఈ తరహా వేదికల మీద ప్రకటించడం భారత్‌ ప్రతీకార చర్యలకు బలాన్ని చేకూరుస్తుంది. సింధు నదీజలాల విషయంలో భారత్‌ తీసుకున్న వైఖరిని అన్ని ప్రపంచ వేదికల మీదా తప్పుబడుతున్న పాకిస్థాన్‌ను నిలువరించాలన్నా, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేవరకూ పొరుగు దేశంతో వైరమే తప్ప, మాటామంతీ ఉండదన్న భారత్‌ నిర్ణయానికి విలువ చేకూరాలన్నా పాక్‌ నిజస్వరూపం ఎప్పటికప్పుడు మిగతా ప్రపంచానికి తెలియచెప్పక తప్పదు.

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో జరిగిన భేటీలో ఉభయదేశాల మధ్యా వాణిజ్యం కొనసాగింపే కాక, దానిని మరింతగా పెంచడం గురించి మోదీ మాట్లాడటం విశేషం. ఇరాన్‌తో లావాదేవీలు జరిపే దేశాలను ఆర్థిక ఆంక్షలతో, సుంకాలతో కఠినంగా శిక్షిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో మోదీ మాటలకు ప్రాధాన్యం ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయినప్పుడు, ఉక్రెయిన్‌ యుద్ధం గురించి మోదీ ప్రస్తావించి, మాస్కో, కీవ్‌ల మధ్య శాంతినెలకొల్పడంలో భారత్‌ దౌత్యపరంగా సహకరిస్తుందని కూడా అన్నారు. యుద్ధం వద్దని గతంలోనూ పలుమార్లు మోదీ చెప్పినప్పటికీ, సమీపకాలంలో ముగింపు సూచనలు కనిపించక, నిరవధికంగా సాగుతూ యుద్ధం మరింత తీవ్రమవుతున్న దశలో ఆ నాలుగు మంచి మాటలకు కచ్చితంగా విలువా గౌరవం ఉంటాయి. ఏకకాలంలో అనేక సంఘర్షణలు సాగుతూ, ప్రపంచాన్ని అవి తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణంలో, అన్ని విధాలా బలమైన భారతదేశం వాటి నివారణలో చురుకైన పాత్ర పోషించడం లేదన్న విమర్శలు లేకపోలేదు.


ఈ పాతికేళ్ళలో ఎస్‌సీవో భౌతికంగా విస్తరించిందే తప్ప, చాలా విషయాల్లో ఏకమాటమీద నిలబడలేకపోయిందన్న వాదన కాదనలేనిది. భిన్న ప్రయోజనాలు, భౌగోళికార్థిక లక్ష్యాలున్న దేశాల కూటముల్లో ఇది సహజం. 2001లో ఐదుదేశాలతో మొదలైన ఈ సంస్థ 2017లో భారత్‌, పాకిస్థాన్‌లను, 2023లో ఇరాన్‌, మరుసటి ఏడాది బెలరూస్‌ను చేర్చుకుంది. ‘డైలాగ్‌ పార్ట్‌నర్స్‌’గా మరో పద్నాలుగుదేశాలున్నాయి. ఆవిర్భావ లక్ష్యాలకు అనుగుణంగా ఈ వేదిక వడివడిగా అడుగులు వేయలేదన్న విమర్శలను అటుంచితే, చైనా, పాకిస్థాన్‌ల వేధింపులు, బెదిరింపులూ కూడా మనకు తప్పడం లేదు. అయితే, చైనాతో సయోధ్యకు కూడా ఈ కూటమి ఉపకరిస్తున్నమాట నిజం. సమీపకాలంలోనే కనీసం రెండుసార్లు భారత్‌, చైనాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను సరిదిద్దుకోవడానికి ఈ వేదిక తోడ్పడింది. అలాగే, మధ్య ఆసియా దేశాలతో భారత్‌ తన వాణిజ్యాన్ని పెంచుకోవడానికి కూడా పనికొస్తోంది. భారత్‌–ఉజ్బెకిస్థాన్‌లు తమ ద్వైపాక్షిక సంబంధాలను పై స్థాయికి తీసుకుపోయి, వాణిజ్యాన్ని పెంచుకోవడానికి అంగీకరించడం, యురేనియం సరఫరాలపై ఒప్పందం కుదరడం దీనికి ఉదాహరణ. అమెరికా ఆధిపత్యాన్ని నిలువరించడం లక్ష్యంగా ఆవిర్భవించిన ఈ కూటమి ఆ పని ఎంతమేరకు చేయగలిగిందన్నది అటుంచితే, పాతికేళ్ళ ప్రస్థానాన్ని సమీక్షించుకొని, పెడధోరణులను సరిదిద్దుకోవాల్సిన తరుణం ఇదే.

ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్

ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 01:59 AM