సమతూకమేనా?
ABN , Publish Date - May 22 , 2026 | 01:04 AM
వీధికుక్కల బెడదను నివారించడానికి పోరాడుతున్న భారత సుప్రీంకోర్టు మంగళవారం తీర్పులో తన వైఖరిని మరింత స్పష్టంచేసింది. వీధికుక్కలు మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించినప్పుడు...
వీధికుక్కల బెడదను నివారించడానికి పోరాడుతున్న భారత సుప్రీంకోర్టు మంగళవారం తీర్పులో తన వైఖరిని మరింత స్పష్టంచేసింది. వీధికుక్కలు మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించినప్పుడు రాజ్యం ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదని, ఈ అంశాన్ని జంతు సంక్షేమంగా కాక, ప్రజల ప్రాణభద్రతకు సంబంధించినదిగా పరిగణించాలని న్యాయస్థానం స్పష్టంచేసింది. జీవించే హక్కును పరిరక్షిస్తున్న రాజ్యాంగంలోని 21వ అధికరణం ఈ అంశానికీ వర్తిస్తుందని న్యాయమూర్తులు తేల్చిచెప్పేశారు. ఈ తీర్పుమీద జంతుప్రేమికుల నుంచి విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నప్పటికీ, ప్రజాభద్రతకూ, జంతుసంక్షేమానికీ సమప్రాధాన్యం ఇచ్చిందని సాధారణ ప్రజలు భావిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడికి గురై ఒక చిన్నారి మరణించిన ఘటన ఆధారంగా ఒక ఆంగ్లదినపత్రికలో ప్రచురితమైన కథనం, టెలివిజన్ చానెళ్ళలో జరిగిన చర్చలు సుప్రీంకోర్టు చొరవకు కారణం. జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మహదేవన్‌తో కూడిన బెంచ్ సూమోటోగా కేసు నమోదు చేసి విచారణ ఆరంభించింది. కోర్టు చొరవతో సమాజంలోనూ ఈ అంశంపై లోతైన చర్చ జరిగింది. వీధికుక్కలను స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలన్న తన గత ఆదేశాల విషయంలో ఎలాంటి రాజీలేదని స్పష్టంగా ప్రకటించిన ధర్మాసనం గత తీర్పును సవాలు చేసిన అప్పీళ్ళన్నిటినీ కొట్టివేసింది. దీనితోపాటుగా ప్రధానంగా మూడు అంశాలకు సంబంధించి విస్తృతమైన వివరణలను ఇవ్వడం ద్వారా శునకాల నిర్వహణ, నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రయత్నించింది. ఆస్పత్రులు, స్కూళ్ళు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పర్యాటక కేంద్రాలు ఇత్యాది చోట్ల నుంచి తెచ్చిన వీధికుక్కలను స్టెరిలైజ్ చేసిన తరువాత షెల్టర్లకు తరలించాల్సిందే తప్ప, మళ్ళీ ఆ ప్రదేశాల్లో విడిచిపెట్టకూడదు. రేబిస్ సోకిన లేదా నయంకాని వ్యాధులున్న, దాడులు చేస్తున్న కుక్కలకు కారుణ్య మరణం తప్పదు. దీని అమలులో జంతువుల జనన నియంత్రణ నిబంధనలు, జీవకారుణ్య చట్టం విధానాలను పాటించాల్సిందేనని కోర్టు చెప్పినప్పటికీ, సదరు శునకాల గుర్తింపు నుంచి వాటికి మరణం ప్రసాదించడం వరకూ ఆచరణలో కారుణ్యం ఉంటుందా అని జంతుప్రేమికుల ప్రశ్న. అన్ని కుక్కలనూ పిచ్చికుక్కలుగా ముద్రవేసి అత్యంత నిర్దయగా ఇది అమలు జరిగే ప్రమాదం ఉన్నదని వారి ఆవేదన. వీధి కుక్కలకు జనం అన్నం పెట్టకూడదనీ, ఇందుకోసం మునిసిపాలిటీలే ప్రత్యేక కేంద్రాలు తెరవాలన్న ఆదేశం కూడా ఎంతమేరకు ఆచరణ సాధ్యమని వారి ప్రశ్న.
ఈ తీర్పు నేపథ్యంలో, జిల్లాకు కనీసం ఒకటైనా పూర్తిస్థాయి కుక్కల స్టెరిలైజేషన్, వాక్సినేషన్ కేంద్రాన్ని విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తన ఆదేశాల పర్యవేక్షణను హైకోర్టులకు అప్పగించడం ద్వారా ధిక్కరణలు, ఉల్లంఘనలకు తావులేకుండా సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించింది. షెల్టర్ల ఏర్పాటు విషయంలో ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. జనన నియంత్రణ చట్టాన్ని దశాబ్దాలుగా మొక్కుబడిగా అమలు చేసిన కారణంగా ఉత్పన్నమైన సమస్య ఇది. తన తీర్పులను తానే సవరించుకుంటూ, కఠినంగా ఉంటూ వీధికుక్కల సమస్య పరిష్కారం కోసం కోర్టు ప్రయత్నిస్తోంది. అయితే, ఇకపై కోర్టు కోరుతున్న రీతిలో అంతా జరుగుతుందని కూడా అనుకోనక్కరలేదు. ప్రజలు, జంతుప్రేమికులు చొరవతో మాత్రమే ఇది సాధ్యం. వీధికుక్కల నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన చట్టాలు నిర్దేశించిన లక్ష్యాల్లో సగం కూడా మునిసిపాలిటీల్లో అమలుకావడం లేదు. ఒక నగరంలో కుక్కల సంఖ్య లక్షల్లో ఉంటే, జనన నియంత్రణ చికిత్సలు వందల్లో వేలల్లో మాత్రమే జరుగుతున్నాయి. కనీసం ఎనభైశాతం కుక్కలకు స్టెరిలైజేషన్ జరగనిదే వాటి సంఖ్య అదుపులో ఉండదు. నామమాత్రపు నిధుల కేటాయింపుతో పాటు, వాటి వినియోగం కూడా స్వల్పంగా ఉంటోంది. అబద్ధపు లెక్కలతో అధికారగణమే అత్యధిక సొమ్మును తినేస్తున్నదని జంతుప్రేమికుల వాదన. స్థానిక సంస్థల నిర్లక్ష్యాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, వాక్సినేషన్, స్టెరిలైజేషన్ ప్రక్రియలు నిర్దిష్టంగా జరిగేట్టు చేస్తే కుక్కల సంఖ్య పరిమితుల్లోనే ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు
నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్
దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్
దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News