కారుణ్య న్యాయం
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:56 AM
ప్రమాదవశాత్తూ గాయపడి దాదాపు పదమూడేళ్ళుగా కోమాలో ఉన్న ఒక యువకుడి కారుణ్యమరణానికి అనుమతించి సుప్రీంకోర్టు సముచిత నిర్ణయం తీసుకుంది. చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న...
ప్రమాదవశాత్తూ గాయపడి దాదాపు పదమూడేళ్ళుగా కోమాలో ఉన్న ఒక యువకుడి కారుణ్యమరణానికి అనుమతించి సుప్రీంకోర్టు సముచిత నిర్ణయం తీసుకుంది. చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో నాలుగో అంతస్థు బాల్కనీనుంచి హరీశ్ రాణా కిందపడి నేరుగా తలకు పెద్ద దెబ్బతగలడంతో శరీరం కదలలేని స్థితికి చేరుకుంది. కోమాలో ఉన్న తమ కుమారుడిని ఇంట్లో ఉంచుకొని తల్లిదండ్రులే సేవలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసి వృద్ధిలోకి వస్తాడని, వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడని ఆశించే అమ్మానాన్నలకు ఇది అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి. కోలుకుంటాడన్న ఆశ లేశమైనా లేని కన్నకొడుకును కళ్ళముందు పెట్టుకొని జీవించడం వారికి కూడా నిత్యనరకమే. ఆ కుర్రవాడి పరిస్థితి, తల్లిదండ్రుల వేదనను మనసుతో చూసి అర్థం చేసుకున్నందువల్లనే న్యాయమూర్తులు గద్గదస్వరంతో ఈ తీర్పు చెప్పారు. గౌరవప్రదమైన మరణానికి వీలుగా రాణాకు చికిత్స నిలిపివేయవచ్చునని ప్రకటించడంద్వారా దేశంలో తొలిసారిగా ఒక వ్యక్తికి సర్వోన్నత న్యాయస్థానం కారుణ్యమరణాన్ని ప్రసాదించింది.
అరుణాషాన్‌బాగ్ కేసులో పాసివ్ యుథనేసియా కోసం దశాబ్దాలపాటు సాగిన న్యాయపోరాటం ఈ నిర్ణయంతో ఒక కొలిక్కివచ్చిందని అనుకోవాలి. కుమారుడి మరణానికి అనుమతి కోసం రెండేళ్ళకు పైగా వివిధ స్థాయిల్లో న్యాయపోరాటం చేసిన హరీశ్ తల్లిదండ్రులు ఎంత నరకాన్ని అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో కాదుపొమ్మన్న సర్వోన్నత న్యాయస్థానమే ఆ తరువాత తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకొని, వైద్యనివేదికలను తిరిగి పరిశీలించి, ఆ కుర్రవాడి పరిస్థితి మీద అవగాహనకు వచ్చింది. వైద్యనివేదికల ప్రకారం పదమూడేళ్ళుగా ఆ కుర్రవాడి ఆరోగ్యంలో కించిత్తు మార్పు కూడా లేకపోవడం, ఇతరులమీద పూర్తిగా ఆధారపడివుండటం, రోగిని రక్షించాల్సిన వైద్యులు తమ విధి ఎంతకాలం నిర్వర్తించినా అంతిమంగా ప్రయోజనం ఉండదని రూఢీకావడం ఇత్యాది అంశాలను పరిగణనలోకి తీసుకొని కోర్టు హరీశ్ రాణా కారుణ్యమరణానికి బాధాతప్తహృదయంతో అంగీకరించింది. ఈ తీర్పు సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను బట్టి న్యాయమూర్తులు ఎంత మథనపడ్డారో, రాజ్యాంగ సూత్రాలు, వైద్య సంబంధిత వాస్తవాలు, వ్యక్తిగత గౌరవం వంటి అంశాలను ఎంత చక్కగా సమన్వయం చేశారో అర్థమవుతుంది.
కారుణ్యమరణాలకు సంబంధించి ఒక సమగ్ర చట్టం తీసుకురావాలని, భావోద్వేగాలతో ముడిపడిన అంశం కనుక అది పొందికైన రీతిలో ఉండాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ తీర్పు సందర్భంగా సూచించింది. 2011లోనూ ఆ తరువాత 2018లోనూ అరుణాషాన్‌బాగ్ కేసులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని చర్చించి మార్గదర్శకాలను రూపొందించింది. మహారాష్ట్రలోని కింగ్ ఎడ్వర్డ్ ఆస్పత్రిలో పాతికేళ్ళ వయసులో నర్సుగా చేరి, మరో ఏడాదిలో తన సీనియర్ డాక్టర్‌ను వివాహం చేసుకోవాలనుకున్న అరుణ ౧973లో ఒక వార్డు బాయ్ పాశవిక లైంగికదాడితో మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్ళిపోయారు. ఆమె కారుణ్యమరణం కోసం జర్నలిస్టు పింకీ విరానీ న్యాయపోరాటం చేసినప్పటికీ, అరుణ మెదడు పనిచేస్తున్నదని వైద్యబృందం ధ్రువీకరించడం, ఆస్పత్రి సిబ్బంది చికిత్స నిలిపివేసేందుకు నిరాకరించడంతో కేసు వీగిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు జీవచ్ఛవంలా ఆస్పత్రిలో ఉన్న అరుణాషాన్‌బాగ్ తన 66వ ఏట 2015లో కన్నుమూశారు. అరుణ విషయంలో కారుణ్యమరణం సాధ్యపడకపోయినా, ఆమె కేసు దేశాన్ని ఆ దిశగా కదిలించింది. ఆచరణ, అమలుకు సంబంధించిన విధివిధానాల విషయంలో అప్పుడు పడని అడుగు 2018లో పడింది. మరణం కోసం అచేతనస్థితిలో ఎదురుచూస్తున్నవారికి విముక్తినిచ్చేందుకు పాసివ్ యుథనేసియా విధానాన్ని సుప్రీంకోర్టు ఆ తీర్పులో సమర్థించింది. జీవించే హక్కుకు పరిపూర్ణత సిద్ధించాలంటే మరణం కూడా అంతే గౌరవంగా జరిగిపోవాలన్న భావనతో ఆ తీర్పు ప్రకటించింది. ‘పాసివ్ యుథనేసియా’తో పాటు, చికిత్సకు వీలుకాని రోగంతో తీసుకుంటున్న వారు ఆరోగ్యం క్షీణిస్తున్న దశలోనే తమ మరణం విషయంలో అభీష్టాన్ని వ్యక్తంచేసే ‘లివింగ్ విల్’ అవకాశాన్ని కూడా కోర్టు ఆ తీర్పులో ఇచ్చింది. కారుణ్యమరణాలు, లివింగ్ విల్ విషయంలో కేంద్రప్రభుత్వం నిబంధనలు రూపొందించేవరకూ సుప్రీంకోర్టు ప్రకటించిన విధివిధానాలు అమలులో ఉంటాయి. కానీ, దుర్వినియోగ భయంతోనో, అనుమానంతోనో నిర్దిష్ట చట్టాలు చేయకుండా ఊరుకోవడం సముచితం కాదు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఊతం: మంత్రి నారాయణ
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News