Share News

పొరుగున మరో సెగ

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:45 AM

రాబోయే ఐదురోజులు యుద్ధవిరామాన్ని పాటించాలని పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ నిర్ణయానికి వచ్చాయి. ఈద్‌–ఉల్‌–ఫితర్‌ సందర్భంగా ఘర్షణలకు కాస్తంత విరామం ఇవ్వాలని...

పొరుగున మరో సెగ

రాబోయే ఐదురోజులు యుద్ధవిరామాన్ని పాటించాలని పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ నిర్ణయానికి వచ్చాయి. ఈద్‌–ఉల్‌–ఫితర్‌ సందర్భంగా ఘర్షణలకు కాస్తంత విరామం ఇవ్వాలని సౌదీ అరేబియా, ఖతార్‌, తుర్కియే కోరినమేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. అఫ్ఘానిస్థాన్‌ ఏమాత్రం కాలుదువ్వినా, పాకిస్థాన్‌మీద డ్రోన్‌ దాడుల వంటివి జరిగినా తాము తక్షణమే భీకరదాడులకు ఉపక్రమిస్తామని పాక్‌ హెచ్చరించింది. పాక్‌ నిర్ణయంమీద తనకు ఏ అభ్యంతరం లేదని, అలాగే కానిద్దామని అఫ్ఘానిస్థాన్‌ కూడా ప్రకటించడంతో రాబోయే ఐదురోజులు కాస్తంత విరామం, కొద్ది ప్రశాంతత. పాకిస్థాన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. కాబూల్‌లోని ఒక చికిత్సా కేంద్రంమీద వైమానికదాడులతో నాలుగువందలమంది ప్రాణాలు హరించిన పాకిస్థాన్‌, అంతర్జాతీయంగా వచ్చిన అపకీర్తిని, అప్రదిష్టనూ ఇలా కాస్తంత కడుక్కొనే ప్రయత్నం చేస్తోంది.

అఫ్ఘానిస్థాన్‌లో పెద్దసంఖ్యలో మృతదేహాలను ఖననం చేస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారమైనాయి. రెండువేల పడకల డ్రగ్‌ ట్రీట్‌మెంట్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్‌ మీద పాక్‌విమానాలు విరుచుకుపడటంతో ఈ మరణాలు సంభవించాయని, వందలాదిమంది రోగులు గాయపడ్డారని అఫ్ఘానిస్థాన్‌ ప్రకటించింది. తాను ఉగ్రస్థావరాలమీదే దాడులు చేశానని పాకిస్థాన్‌ చెప్పుకుంటోంది. మాదకద్రవ్యాల సాగు, ప్రపంచవ్యాప్త సరఫరాల్లో అఫ్ఘానిస్థాన్‌కు ఉన్న చెడ్డపేరు తెలిసిందే. మత్తుకు అలవాటుపడినవారి సంఖ్య కూడా ఇక్కడ విపరీతంగా పెరిగిపోయింది. తాలిబాన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత, రవాణాను నియంత్రించకపోయినా, జనం మత్తువదిల్చే అంశంలో శ్రద్ధపెట్టిందని అంటారు. అందులో భాగంగానే, ఇప్పుడు దాడికి గురైన పునరావాసకేంద్రాన్ని సైతం ఇటీవలికాలంలో భారీగా విస్తరించి, ఆధునికీకరించింది. తాను ఉగ్రవాద స్థావరాలనే ధ్వసం చేశానని పాకిస్థాన్‌ అంటున్నప్పటికీ, ఈ దాడిలో ఒమీద్‌ పునరావాసకేంద్రం నేలమట్టమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అది రీహాబిలిటేషన్‌ సెంటర్‌ కాదని, తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) టెర్రరిస్టుల సెంటరని పాకిస్థాన్‌కు స్పష్టమైన సమాచారం ఉండి, దాడి జరిపినపక్షంలో, ఆ మాటైనా నిర్దిష్టంగా చెప్పాలి, ఆయుధాగారంగా వాడుతున్నారనుకుంటే ఆధారాలతో నిరూపించాలి. అంతేకానీ, ఊచకోతకు పాల్పడి కూడా అడ్డగోలుగా సమర్థించుకోవడం సరికాదు. వైమానిక దాడుల అనంతరం రోగులను రక్షిస్తున్న చిత్రాలు ఏవీ కూడా పాక్‌ వాదనను సమర్థించడం లేదు. యావత్‌ ప్రపంచం దృష్టి ఇరాన్‌ యుద్ధంమీద ఉండగా, తనను ఎవరూ ప్రశ్నించరు, పట్టించుకోరు అన్న ధీమాతో పాకిస్థాన్‌ ఈ ఉన్మాదానికి పాల్పడింది. ఇజ్రాయెల్‌ అధినేత నెతన్యాహూ ఇలాగే గాజాలో ఆస్పత్రులను సైతం ఉగ్రవాదస్థావరాలుగా ముద్రవేసి, వందలాదిమంది రోగులను, వైద్యులను, బాలింతలను ఊచకోత కోశాడు. ఇరాన్‌మీద యుద్ధాన్ని ఆరంభించిన తొలిరోజునే 170మంది స్కూలు పిల్లలను టోమోహాక్‌ మిసైల్‌తో హత్యచేసిన అమెరికా ఆ పాపాన్ని తిరగి ఇరాన్‌మీదకు నెట్టివేసే ప్రయత్నం చేసింది. గాజా ఘాతుకాలను, ఇరాన్‌మీద యుద్ధాన్ని ఖండిస్తున్న పాకిస్థాన్‌ తానూ అదే దుర్మార్గమైన దారిలో నడుస్తోంది.


అఫ్ఘానిస్థాన్‌తో యుద్ధంలో ఉన్నట్టుగా ప్రకటించిన పాకిస్థాన్‌, ఈ ఐదురోజుల విరామం తరువాత మళ్ళీ దాడులు కొనసాగించడం ఖాయం. తమ ఆస్పత్రిమీద దాడిచేసిన పాకిస్థాన్‌కు గట్టిజవాబు చెప్పి తీరుతానని తాలిబాన్‌ కూడా ప్రతిజ్ఞచేసింది. గత ఏడాది, అమెరికా అధ్యక్షుడు బగ్రాం ఎయిర్‌పోర్టు అప్పగింత విషయంలో తాలిబాన్‌మీద ఆగ్రహించి, ఫలితం అనుభవిస్తారని శపించిన తరువాతే పాకిస్థాన్‌ మరింతగా అఫ్ఘాన్‌మీద విరుచుకుపడటం ఆరంభించింది. మరోపక్క, భారత్‌–తాలిబాన్‌ సాన్నిహిత్యం కూడా బలపడటం మొదలైంది. ఒకరినొకరు సమర్థించుకోవడంతో మొదలై, పరస్పరం రాకపోకలవరకూ అది విస్తరించింది. అయితే, అఫ్ఘానిస్థాన్‌–పాకిస్థాన్‌ యుద్ధం ఎక్కువకాలం సాగితే అనేకశక్తుల ప్రవేశంతో మరింత విస్తరించి, ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అల్‌ఖాయిదా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఇత్యాది ఉగ్రసంస్థలకు తిరిగి ఊపిరివస్తే అది యావత్‌ ప్రపంచానికే ప్రమాదం.

ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం

విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్

జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 01:45 AM