Share News

లద్దాఖ్‌కు ఊరట

ABN , Publish Date - Mar 19 , 2026 | 01:42 AM

సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్‌వాంగ్‌చుక్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఆర్నెల్లనాటి తన అరెస్టునూ, నాలుగు రోజుల క్రితం జరిగిన విడుదలనూ ఒక మంచి థ్రిల్లర్‌గా...

లద్దాఖ్‌కు ఊరట

సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్‌వాంగ్‌చుక్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఆర్నెల్లనాటి తన అరెస్టునూ, నాలుగు రోజుల క్రితం జరిగిన విడుదలనూ ఒక మంచి థ్రిల్లర్‌గా అభివర్ణించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో లద్దాఖ్‌లో జరిగిన అల్లర్లకు కారకుడుగా, వాటిని ఎగదోసిన దేశద్రోహిగా జోధ్‌పూర్‌ జైల్లోకి అతడిని నెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఈ కేసు చివరివిడత విచారణ తేదీకి మూడురోజుల ముందు ఆయనను విడిచిపెట్టేయాలని నిర్ణయించింది. తన విడుదల లద్దాఖ్‌ ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికీ కూడా ఉపకరిస్తుందని, భవిష్యత్‌ చర్చలకు మార్గాన్ని సుగమం చేస్తుందనీ ఆయన వ్యాఖ్యానించాడు. కేంద్రం తనను వదిలేసినప్పటికీ, సర్వోన్నత న్యాయస్థానం తన కేసును కొనసాగించి, తీర్పు నమోదుచేసి భవిష్యత్తులో జాతీయభద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తిచేశారు. తనపై ఎన్‌ఎస్‌ఏ ఎత్తివేయడం లద్దాఖ్‌లో శాంతి సుస్థిరతలను కాపాడేందుకేనని కేంద్రం ప్రకటించడం, అన్ని వర్గాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం బాగుందని, ఉద్యమాల ద్వారా తాము ఎంతోకాలంగా కోరుతున్నది కూడా ఇదేనని ఆయన గుర్తుచేశారు. ఇంతమంచి జనం మీకు ఎక్కడ దొరుకుతారు? ఒకదశకు వచ్చాక విరక్తిచెంది, ఆగ్రహావేశాలతో చర్చలను వదిలేసి తుపాకులు పట్టుకొనేవాళ్ళనే చూస్తున్నాం కదా? అంటున్నారాయన.


వాంగ్‌చుక్‌ను విడుదల చేసి కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో తనకు గర్వభంగం కలిగే ప్రమాదం కనిపించిందో, న్యాయమూర్తులతో మరిన్ని చీవాట్లు తినడం ఎందుకని అనిపించిందో, కేసు కొనసాగి, తీర్పు అనంతరం వాంగ్‌చుక్‌ను విడుదల చేయాల్సివస్తే లద్దాఖీయులు మరింత రెచ్చిపోతారన్న భయమే కలిగిందో తెలియదు కానీ, ఆర్నెల్లక్రితం ఢిల్లీపెద్దలకు దేశవ్యతిరేకిగా, దుష్టశక్తిగా కనిపించిన మనిషే ఇప్పుడు శాంతిభద్రతల పరిరక్షకుడనిపించాడు. ఆయన నిర్బంధం విషయంలో కోర్టు ఇప్పటికే తన అసంతృప్తిని ప్రకటించింది. ప్రసంగాలతో జనాన్ని రెచ్చగొట్టి, హింసకు పాల్పడేట్టు చేశాడన్న కేంద్రం వాదన, ఆ ప్రసంగాల అనువాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టుకు సముచితంగా అనిపించలేదు. మరీ అంత లోతుగా తవ్వితీయనక్కరలేదంటూ ఈ ఆరోపణల్లో డొల్లతనాన్ని కోర్టు ఇప్పటికే ప్రశ్నించింది. రేపు కోర్టులో కేసు నిలవదని అర్థమై కేంద్రం ముందుగానే వెనకడుగువేసింది. అయితే, అతనిపై జాతీయ భద్రతాచట్టాన్ని అంత సులువుగా ఉపసంహరించుకున్న కేంద్రం, గతంలో అరెస్టుకు వీలుగా చేసిన తీవ్రమైన ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా గాలికివదిలేసింది. ఆయనకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని, పలు విదేశీపర్యటనలు అనుమానస్పదమైనవని, అక్రమంగా విదేశీ విరాళాలు పోగేసుకున్నాడని, ఆయన నిర్వహిస్తున్న ఎన్జీవోలో బోలెడన్ని అక్రమాలు జరిగాయని ఆరోపించిన కేంద్రం వాటిపై ఇప్పుడు ప్రజలకు కనీస వివరణ ఇవ్వకపోవడం సరికాదు. గిట్టనివారిని జైల్లోకి నెట్టడానికీ, పరిస్థితులు అనుకూలించనప్పుడు బయటకు తేవడానికీ కేంద్రం ఇటువంటి డొల్ల ఆరోపణలు చేస్తుందని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. నోటికొచ్చిన ఆరోపణలతో జైల్లోకి నెట్టి, న్యాయప్రక్రియలతోనూ నిమిత్తం లేకుండా తమకు నచ్చినప్పుడు వదిలేయడం ద్వారా ఒక పౌరుడి హక్కులతోనూ, జీవితంతోనూ హాయిగా ఆడుకోవచ్చునని వాంగ్‌చుక్‌ ఉదంతం నిరూపించింది. అందుకే ఆయన తన కేసులో తీర్పు ఇచ్చి ఎన్‌ఎస్‌ఏ దుర్వినియోగాన్ని నివారించమని కోరుతున్నాడు. గతంలో తాను తీసుకున్న నిర్ణయం తప్పు అనీ, జరిగింది తప్పిదమనీ కేంద్రం అనుకోకపోతే అదే దేశవ్యతిరేకిని మళ్ళీ బయటి సమాజంలోకి ఎందుకు వదిలేస్తుంది? అన్న ప్రశ్న సమంజసమైంది. ఆయన ఎంతకాలం నిర్బంధంలో ఉంటే లద్దాఖ్‌ తమకు అంత దూరమవుతుందని కేంద్రానికి అర్థమైంది. లద్దాఖ్‌లో ఆయన ప్రభావం ఎంతటిదో ఈ ఆర్నెల్లకాలంలో పాలకులకు మరింత స్పష్టంగా తెలిసొచ్చింది.

చర్చలకు, శాంతిపరిరక్షణకు ఆయన విడుదల దోహదం చేస్తుందని చెబుతున్న కేంద్రం రేపటి రోజుల్లో సైతం ఆయనను దూరంపెట్టే ప్రయత్నాలేవీ చేయకూడదు. వాంగ్‌చుక్‌ పాత్ర, ప్రమేయం లేని కొత్త ఎత్తుగడలు, నాటకాలకు పూనుకోకూడదు. దేశ సరిహద్దు ప్రాంతమనీ, అక్కడి ప్రజాందోళనలు దేశ భద్రతకు ప్రమాదకరమన్న వాదనతో ఆయనను అరెస్టుచేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల తరువాత కూడా అవే అంశాలనూ, లద్దాఖ్‌ సంక్షేమాన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్

గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 01:42 AM