Share News

బ్రిటన్‌ కొత్త యుద్ధం!

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:41 AM

వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్లపై బ్రిటన్‌ వాణిజ్య నిషేధం విధించింది. ఇజ్రాయెల్‌ ఆక్రమిత ప్రాంతాలనుంచి వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతులను నిషేధించడంతో పాటు, ఫైనాన్సింగ్‌, నిర్మాణ...

బ్రిటన్‌ కొత్త యుద్ధం!

వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్లపై బ్రిటన్‌ వాణిజ్య నిషేధం విధించింది. ఇజ్రాయెల్‌ ఆక్రమిత ప్రాంతాలనుంచి వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతులను నిషేధించడంతో పాటు, ఫైనాన్సింగ్‌, నిర్మాణ రంగాలకు సంబంధించిన లావాదేవీలేవీ వాటితో జరగబోవని బ్రిటన్‌ ప్రకటించింది. ఈ నిర్ణయానికి ఫ్రాన్స్‌, కెనడాలు మద్దతు ప్రకటిస్తూ, తాము కూడా ఈ నిషేధంలో భాగస్వాములవుతున్నట్లు ప్రకటించాయి. మరోపది చిన్నాచితకా దేశాలు కూడా చేయికలిపాయి. ఆండ్రీ బర్న్‌హమ్‌ ప్రధాని అయిన తరువాత ఇజ్రాయెల్‌ విషయంలో యునైటెడ్‌ కింగడమ్‌ విదేశాంగవిధానంలో వచ్చిన విశేషమైన మార్పుగా విశ్లేషకులు దీనిని అభివర్ణిస్తున్నారు.

ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ బ్రిటన్‌ విదేశాంగమంత్రి ఇజ్రాయెల్‌ మీద ఘాటైన వ్యాఖ్యలే చేశారు. వెస్ట్‌బ్యాంక్‌లో ‘సెటిలర్‌ టెర్రరిస్టులు’ పాలస్తీనాజాతి నిర్మూలనకు పాల్పడుతున్నారని, వారి ఇళ్ళను కూల్చివేస్తూ, మౌలికసదుపాయాలు ధ్వంసం చేస్తూ ఘోర అకృత్యాలకు ఒడిగడుతున్నారని, అంతర్జాతీయ సమాజం కళ్ళముందు జరుగుతున్న ఈ ఘాతుకాలకు తాము సిగ్గుపడుతున్నామని అన్నారాయన. వెస్ట్‌బ్యాంక్‌ను ఇజ్రాయెల్‌ తన అధీనంలోకి తెచ్చుకోవడాన్ని మొత్తంగా తప్పుబడుతూ, దానిని అంతర్జాతీయ నియమాలకు విరుద్ధంగా సాగిన దురాక్రమణగా అభివర్ణించారాయన. ఈ విధంగా నిర్వచించకపోతే అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని మనం గుర్తించనట్టు అవుతుందని, రేపటి న్యాయానికి ఈ గుర్తింపు ప్రాతిపదిక కావాలని అన్నారాయన. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్‌, అమెరికా గట్టిగా ఖండించాయి. బ్రిటన్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలకు ఉపక్రమించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. యూదు ప్రజలపై బ్రిటన్‌ చూపుతున్న వివక్ష ఇది అంటూ, ప్రతిగా అమెరికానుంచి ప్రతీకార చర్యలు తప్పవని ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి సంకేతాలు ఇచ్చారు కూడా.


ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్లు ఇటీవలికాలంలో బాగా పెరగడంతోపాటు, మరిన్ని ఆవాసాలను స్థిరపరచే దిశగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. తూర్పు జెరూసలేంలో మరో పన్నెండువందల ఆవాసాలతో ఈస్ట్‌ 1 సెటిల్‌మెంట్‌ ప్రాజెక్టును విస్తరించేందుకు ఇజ్రాయెల్‌ అడుగులు వేస్తున్న తరుణంలో బ్రిటన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణ ద్వారా వెస్ట్‌బ్యాంక్‌ను ఉత్తర, దక్షిణభాగాలుగా చీల్చి, స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఆవిర్భావానికి మోకాలడ్డాలన్నది ఇజ్రాయెల్‌ ఆలోచన. ఈ కొత్త సెటిల్‌మెంట్‌తో రమల్లా, బెత్లహామ్‌, హెబ్రాన్‌ వంటి ప్రధాన పాలస్తీనా నగరాలతో ఆక్రమిత తూర్పు జెరూసలేమ్‌ను భౌగోళికంగా తెంపివేయడం ఆ పథకంలో భాగం. ఆగస్టులో నెతన్యాహూ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించగానే, స్వతంత్ర పాలస్తీనా దేశానికి భవిష్య రాజధానిగా అనుకుంటున్న ఈ పురాతన నగరాన్ని ఏకాకిని చేసే కుట్రపై పాలస్తీనియన్లు తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. తాము ప్రతిపాదిస్తున్న ద్విదేశ సిద్ధాంతానికి రేపటిరోజుల్లో ఉనికి లేకుండా చేసే కుట్రగా యూరోపియన్‌ దేశాలు ఈ పరిణామాన్ని ఖండించాయి. గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండ మీద నోరుమెదపని ఈ దేశాలు, తదనంతర కాలంలో పాలస్తీనా రాజ్యం గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. పాలస్తీనాను గుర్తించే ప్రతీ దేశంలోనూ ఒక సెటిల్‌మెంట్‌ తయారుచేస్తాం జాగ్రత్త అని ఇజ్రాయెల్‌ మంత్రి ఒకరు హెచ్చరించారు కూడా. తమ ఈస్ట్‌ 1 ప్లాన్‌తో పిండదశలోనే పాలస్తీనా దేశాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నామని ఇజ్రాయెల్‌ బహాటంగానే చెబుతోంది.

బ్రిటన్‌ చర్యలు విశేష ప్రభావం చూపేవి కావన్న విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా సెటిల్‌మెంట్లనుంచి జరిగే దిగుమతులనే నిషేధించడం, భవిష్యత్తులో సదరు ఆవాసాల నిర్మాణానికి దోహదపడే సర్వీసులకు మాత్రమే నిషేధాన్ని పరిమితం చేయడం, ఆ ప్రాంతాల్లో హింసను ప్రోత్సహించే వ్యక్తులు, వ్యవస్థలపై చర్యలకు సంకల్పించడం, దురాక్రమణలకు ప్రత్యక్షంగా ఉపకరించే ఆయుధాల ఎగుమతులపైనే నియంత్రణ చర్యలు ఉంటాయనడం పరిమిత ప్రభావం చూపేవే. ఈ ఆంక్షలను దాటించి వ్యవహారాలు నడపడం కూడా పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. రెండేళ్ళలో గాజాను సర్వనాశనం చేయడానికి అమెరికా ప్రత్యక్షంగా, యూరప్‌ పరోక్షంగా ఇజ్రాయెల్‌కు సహకరించాయి. గాజా మారణకాండ కొనసాగుతున్న కాలంలోనే వెస్ట్‌బ్యాంక్‌లో వందలాదిమంది పాలస్తీనియన్లను హతమార్చి, వేలాదిమందిని అక్కడనుంచి ఇజ్రాయెల్‌ తరిమికొట్టింది. వెస్ట్‌బ్యాంక్‌ను పూర్తిగా విలీనం చేసుకొనే దిశగా అడుగులు పడుతున్న తరుణంలో, అమెరికా అండదండలు దండిగా ఉన్న ఇజ్రాయెల్‌తో యూరప్‌ అట్టకత్తి యుద్ధాలు చేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు

గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్

పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 12:41 AM