అన్యాయం చెరలో...
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:04 AM
ఢిల్లీ యూనివర్సిటీ న్యాయవిద్యార్థిని, సామాజిక కార్యకర్త ఆకృతి చౌదరి నిర్బంధం మీద అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సవాలు చేయబోతున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా...
ఢిల్లీ యూనివర్సిటీ న్యాయవిద్యార్థిని, సామాజిక కార్యకర్త ఆకృతి చౌదరి నిర్బంధం మీద అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సవాలు చేయబోతున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలియచేశారు. ఈ తీర్పుతో పాటు, ఆ సందర్భంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణలు తీవ్ర సంచలనం సృష్టించడమేకాక, సమాజం నుంచీ, న్యాయకోవిదులనుంచీ ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రతాచట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద ఆమెను నిర్బంధిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దుచేయడంతోపాటు, ఆ ఆదేశాలమీద సంతకం చేసిన జిల్లా మేజిస్ట్రేట్‌ను జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లు తీవ్రంగా తప్పుబట్టారు. దాదాపు ఐదునెలలుగా జైల్లో ఉన్న ఆకృతిని విడుదల చేయాలని ఆదేశించడంతోపాటు, ఐదులక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటిస్తూ, ఒక విద్యార్థినాయకురాలిపై కఠినమైన ఈ చట్టాన్ని ప్రయోగించడానికి కారకులైన వారందరినుంచీ ఈ మొత్తాన్ని వసూలు చేసి ఆమెకు అందించాలన్న ఈ తీర్పు విశేషమైనది.
హర్యానాతో సమానంగా జీతాలు పెంచాలంటూ ఏప్రిల్‌లో నోయిడా కార్మికులు సాగించిన పోరాటంలో ఆకృతి వారి పక్షాన నిలబడ్డారు. కార్మికుల నిరసన ఉద్రిక్తంగా మారడానికి ఆకృతి సహా మరికొందరు కారకులని పోలీసులు కేసులు పెట్టారు. ఆకృతిపై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగించారు. హింసాత్మక చర్యలకు పాల్పడవలసిందిగా ఆమె తన ప్రసంగాలతో కార్మికులను రెచ్చగొట్టారని, అందుకు ఆడియో వీడియో సాక్ష్యాలున్నాయని దబాయించిన పోలీసులు కోర్టుకు ఒక్కటీ సమర్పించలేకపోయారు. ఈ విద్యార్థిని ప్రసంగమే హింసను ప్రేరేపించిందంటూ పోలీసులు తమ పత్రాల్లో పేర్కొన్న రోజున నిజానికి ఆమె పోలీసుల అదుపులోనే ఉంది. ఆమెను అదుపులో తీసుకున్న తరువాతే సమస్త రికార్డుల సృష్టీ జరిగిందని తేలింది. పలు నిరాధారమైన, అడ్డగోలు ఆరోపణలతో ఒక విద్యార్థినిమీద ఏకంగా జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించడం న్యాయమూర్తులకు సహజంగానే ఆగ్రహం కలిగించింది. ఇదంతా ఒక కట్టుకథ అంటూ న్యాయస్థానం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలను కొట్టివేయడంతోపాటు, ఉన్నతాధికారుల వైఖరిని తప్పుబట్టింది. ఆమెకు నేరచరిత్రలేదు, హింసను ప్రోత్సహించిన ఆధారాలూ లేనందున, ఈమెను ఉదాహరణగా చూపి, ప్రజా ఉద్యమాలకు మద్దతుగా భవిష్యత్తులో ఎవరూ ముందుకు రాకుండా నిలువరించాలన్నది ఉద్దేశం కావచ్చంటూ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛను సంపూర్ణంగా హరించే ఇటువంటి విశేషాధికారాల ప్రయోగం కేవలం అనుమానాలు, అపోహలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఆధారంగా జరగడం సరికాదన్నారు న్యాయమూర్తులు.
సాధారణ నేరాలకు సైతం ఎన్‌ఎస్‌ఏను వాడితే ఎలా? ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అధికారులు ఉత్తర్‌ప్రదేశ్‌ను నిరంకుశ రాజ్యంగా మార్చే ప్రమాదం కనిపిస్తోంది, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగానికే విధేయులు తప్ప, రాజకీయనాయకులకు కాదు అంటూ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఉన్నతాధికారులకు గట్టి హెచ్చరిక. దేశభద్రతకు ప్రమాదకారులనుకొనేవారిపై ప్రయోగించాల్సిన ఒక కఠినచట్టాన్ని కార్మిక ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకు ఒక యువతిపై వాడటం ఆశ్చర్యం. తమ విధానాలను, వైఖరులను ప్రశ్నించే అసమ్మతి గొంతులను అణచివేసేందుకు, భవిష్యత్తులో ప్రశ్నించకుండా నిలువరించేందుకు పాలకులు ప్రయత్నిస్తూనే ఉంటారు. విశేషాధికారాలు దఖలుపడిన ఉన్నతాధికారులు చట్టానికి లోబడి వ్యవహరిస్తూ, దానికి జవాబుదారీగా ఉండాల్సింది పోయి, ఇలా నాయకుల మెప్పుకోసం తహతహలాడటం బాధాకరం. పోలీసుల తప్పుడు ఆరోపణలను ఒక ఉన్నతాధికారి గుడ్డిగా సమర్థించడం, తన అసాధారణ అధికారాలను ఇంత అవలీలగా ప్రయోగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే, స్టేషన్ హౌస్ అఫీసర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ తప్పుచేసిన అందరినుంచీ కోర్టు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసింది. ఎన్‌ఎస్‌ఏ, ఊపా వంటి చట్టాలు వాటి ప్రకటిత లక్ష్యాన్ని దాటి అడ్డుతోవలు తొక్కుతున్నాయని ఈ తీర్పు మరోమారు రుజువుచేసింది. దానిని సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేయడమంటే ఆకృతిని పాలకులు ఇంత సులువుగా వదిలిపెట్టదల్చుకోలేదని అర్థం.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News