Share News

రైతులు, కూలీలు ఏకమైతేనే కార్పొరేట్లకు సవాలు!

ABN , Publish Date - Sep 10 , 2026 | 03:12 AM

భారత వ్యవసాయ రంగం నేడొక కీలక మలుపు దగ్గర ఉన్నది. ఒకవైపు ప్రజలకు అన్నం పెట్టే రైతు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాడు. మరోవైపు వ్యవసాయం, భూమి, నీరు, అడవులు, ఆహార మార్కెట్లపై...

రైతులు, కూలీలు ఏకమైతేనే కార్పొరేట్లకు సవాలు!

భారత వ్యవసాయ రంగం నేడొక కీలక మలుపు దగ్గర ఉన్నది. ఒకవైపు ప్రజలకు అన్నం పెట్టే రైతు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాడు. మరోవైపు వ్యవసాయం, భూమి, నీరు, అడవులు, ఆహార మార్కెట్లపై కార్పొరేట్ సంస్థల పట్టు రోజురోజుకూ పెరుగుతున్నది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. వ్యవసాయ కూలీకి ఏడాది పొడవునా పని దొరకడం లేదు. గ్రామీణ పేదలు భూమి, ఇల్లు, ఉపాధి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివాసీలు తరతరాలుగా ఆధారపడిన అడవి, భూమి, నీటి వనరులను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.

స్వాతంత్ర్యం అనంతరం వ్యవసాయ రంగంలో ప్రభుత్వం కల్పించిన కొన్ని రక్షణ వ్యవస్థలను నూతన ఆర్థిక విధానాల కాలం నుంచి క్రమంగా బలహీనపరుస్తున్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించి కార్పొరేట్ మార్కెట్‌కు అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది. రైతు భూమిని కలిగి ఉన్నప్పటికీ, ఉత్పత్తి ప్రక్రియపై అతని నియంత్రణ క్రమంగా తగ్గిపోతోంది. అతను కంపెనీల నుంచి విత్తనాలు కొనాలి, కంపెనీల నుంచి ఎరువులు, పురుగు మందులు కొనాలి, బ్యాంకు లేదా ప్రైవేటు రుణదాతల నుంచి అప్పు తెచ్చుకోవాలి, చివరకు తన పంటను మార్కెట్‌లో అమ్మేటప్పుడు కూడా ధర నిర్ణయించే శక్తి అతని చేతుల్లో ఉండదు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ కార్పొరేట్ల పరం అవుతున్నది.

కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై హామీ లేకుండా రైతుకు భవిష్యత్తు లేదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్, యంత్రాల ఖర్చులు రైతుపై భారంగా మారుతున్నాయి. కానీ పంట ధర మాత్రం మార్కెట్‌లోని అనిశ్చితులకు లోనవుతోంది. అందువల్ల రైతు డిమాండ్ కేవలం ‘ధర పెంచండి’ అనే ప్రశ్న కాదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50శాతం వద్ద చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అవసరం. పంట పండించిన తర్వాత ధరపై భరోసా, విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వ రక్షణ... ఇవి రైతు సంక్షేమానికి ఎంతో ముఖ్యం.

అలాగే భూమి ప్రశ్నను పక్కన పెట్టలేం. భూ సంస్కరణలు అసంపూర్తిగా ఉండటం, మిగులు భూముల పంపిణీ జరగకపోవడం, పేదలకు ఇచ్చిన భూములపై ఆక్రమణలు, భూ మాఫియా పెరగడం, వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ కోసం ఇతర ప్రాజెక్టుల కోసం మార్చడం వంటి పరిణామాలు గ్రామీణ పేదల భూమి హక్కులను బలహీనపరుస్తున్నాయి. అందువల్ల ‘భూమి ఎవరిది?’ అనే ప్రశ్నతో పాటు ‘భూమి ఎవరి ప్రయోజనం కోసం?’ అనే ప్రశ్న కూడా ముందుకు రావాలి. వ్యవసాయ భూములను విచ్చలవిడిగా వ్యవసాయేతర వినియోగానికి మార్చడం అభివృద్ధి పేరుతో సమర్థించలేం.


గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఒక ముఖ్యమైన భద్రతా వ్యవస్థగా నిలిచింది. ఉపాధి హామీని బలహీనపరచడం అంటే గ్రామీణ పేదలను తక్కువ వేతనాలకు పనిచేసేలా చేసే పరిస్థితిని సృష్టించడం. ఉపాధి హామీ బలహీనపడితే రైతు కూలీకి బేరసారాల శక్తి కూడా తగ్గుతుంది. అందువల్ల పని హక్కును బలహీనపరిచే ఏ చర్యనైనా వ్యతిరేకించాలి. పని కోరిన ప్రతి కుటుంబానికి చట్టబద్ధమైన ఉపాధి, సమయానికి వేతనం, జీవన వ్యయానికి అనుగుణమైన కూలి కల్పించాలి.

గ్రామీణ పేదలపై జరుగుతున్న దాడి కేవలం భూమి, ఉపాధి రంగాలకే పరిమితం కాదు. ప్రభుత్వ విద్యా, వైద్య వ్యవస్థలను బలహీనపరచి ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇవ్వడం పేదలపై మరో రకమైన ఆర్థిక భారాన్ని మోపుతోంది. పేద కుటుంబానికి పిల్లల చదువు, కుటుంబ సభ్యుల వైద్యం రెండూ పెద్ద ఖర్చులుగా మారితే అతని ఆదాయం మొత్తం అప్పులు తీర్చడానికే సరిపోతుంది. కాబట్టి ఉచిత నాణ్యమైన ప్రభుత్వ విద్య, ఉచిత ప్రజా వైద్యం, తక్కువ ధరలకు అవసరమైన మందులు ప్రజల హక్కులుగా అమలు చేయాలి.

గ్రామీణ పేదల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కులం, మతం, ప్రాంతం వంటి విభజనలను ఉపయోగించడం పాలకవర్గాలకు కొత్త విషయం కాదు. రైతు పేదవాడు అయితే తన కులం ఏదైనా అతడి సమస్య ఒకటే. వ్యవసాయ కూలీకి పని, న్యాయమైన కూలి, భూమి, ఇల్లు కావాలి. ఆదివాసీకి అడవి హక్కు కావాలి. దళితుడికి భూమి, గౌరవం, భద్రత కావాలి. మహిళకు సమాన హక్కులు, సమాన వేతనం, హింస నుంచి రక్షణ కావాలి. కాబట్టి కుల అణచివేత, మత విద్వేషం, మహిళలపై హింస, లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా రైతు–కూలీ ఉద్యమం తన పోరాటంలో అంతర్భాగంగా తీసుకోవాలి.


నేటి పరిస్థితుల్లో రైతు ఉద్యమం వ్యవసాయ కూలీ ఉద్యమం నుంచి విడిగా ఉండలేదు. రైతుకు గిట్టుబాటు ధర కావాలి. కూలీకి కనీస జీవన వేతనం కావాలి. రైతుకు చౌక రుణం కావాలి. కూలీకి ఉపాధి హామీ కావాలి. రైతుకు భూమి రక్షణ కావాలి. కూలీకి భూమి, ఇల్లు కావాలి. ఈ డిమాండులన్నింటినీ కలిపే శక్తి రైతు–కూలీ ఐక్యతే! కార్పొరేట్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా, కుల–మత వివక్షకు వ్యతిరేకంగా, ప్రజా వనరుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం నేడు మరింత పెరిగింది.

చిట్టిపాటి వెంకటేశ్వర్లు

అఖిల భారత రైతు కూలీ సంఘం

(సెప్టెంబర్ 11, 12 తేదీల్లో అనంతపురంలో

అఖిల భారత రైతు కూలీ సంఘం మహాసభలు)

ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 03:12 AM