Share News

అలుపెరుగని అభ్యుదయ సాహిత్య ప్రయాణం

ABN , Publish Date - May 22 , 2026 | 01:10 AM

మార్క్సిజం తాత్విక సిద్ధాంతంగా, అంతర్జాతీయ వాదం స్వభావంగా, శ్రామిక వర్గం పక్షపాతంగా, బోల్షెవిక్ విప్లవం తక్షణ స్ఫూర్తిగా, సమసమాజం స్వప్నంగా ప్రపంచమంతా పుట్టిన సాహిత్యం అభ్యుదయ...

అలుపెరుగని అభ్యుదయ సాహిత్య ప్రయాణం

‘‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’’

శ్రీశ్రీ: జయభేరి, 1933, జూన్ 2

మార్క్సిజం తాత్విక సిద్ధాంతంగా, అంతర్జాతీయ వాదం స్వభావంగా, శ్రామిక వర్గం పక్షపాతంగా, బోల్షెవిక్ విప్లవం తక్షణ స్ఫూర్తిగా, సమసమాజం స్వప్నంగా ప్రపంచమంతా పుట్టిన సాహిత్యం అభ్యుదయ సాహిత్యం. ప్రపంచ అభ్యుదయ సాహిత్యంలో అంతర్భాగం భారతీయ అభ్యుదయ సాహిత్యం; అందులో అంతర్భాగం తెలుగు అభ్యుదయ సాహిత్యం. అభ్యుదయ సాహిత్యానికి ప్రచారవేదిక అభ్యుదయ రచయితల సంఘం (అరసం). భారతదేశంలో 1936లోను, తెలుగునాట 1943లోను అరసం సంస్థలు పుట్టాయి. తెలుగు అభ్యుదయ సాహిత్యం 1933 జూన్ రెండున అచ్చయిన శ్రీశ్రీ ‘జయభేరి’ కవితతో మొదలైంది. తొంభై మూడేళ్ళ చరిత్ర నింపుకున్నది. అభ్యుదయ రచయితల సంఘం ఎనభై మూడేళ్ల చరిత్ర నింపుకున్నది.

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఇరవయ్యవ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో ఈ నెల 23, 24 తేదీలలో జరుపుకుంటున్న నేపథ్యంలో ఒకసారి సింహావలోకనం చేసుకుంటే వందలకొద్దీ అభ్యుదయ రచయితలు అభ్యుదయ సాహిత్య చరిత్ర నిర్మాణం చేశారు. వందలకొలది సాహిత్య కార్యకర్తలు అరసం నిర్మాణంలో పాల్గొన్నారు. వీరి లక్ష్యం ప్రజావ్యతిరేక సాహిత్య నిర్మూలనం, ప్రజానుకూల సాహిత్య నిర్మాణం.

అరసానిది గానీ, అభ్యుదయ సాహిత్యానిది గానీ నల్లేరు మీద బండి నడకగా సాగిపోలేదు. శరవేగంగా పరిగెత్తిన రోజులున్నాయి. మందకొడిగా నడిచిన రోజులూ ఉన్నాయి. రాజకీయ పరిణామాల ప్రభావంతో అరసం కూడా ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1955–65 దశాబ్దాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో స్తబ్దతా దశాబ్దం అన్నారు గానీ, అది నిజం కాదని రుజువు చేయడంలో అభ్యుదయ సాహిత్యం కూడా ఆధారమైంది. అయినా 1965 తర్వాత దిగంబర కవిత్వం, విప్లవ సాహిత్య కాలంలో అరసం, అభ్యుదయ సాహిత్యం తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్నాయి. హేళనకు గురయ్యాయి. అయితే ఏ ఉద్యమానికైనా గుంటమిట్టలు ఉంటాయని ఆ తర్వాత తెలుగు సమాజం, సాహిత్య పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇదిలా ఉంచుదాం.


భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలను ధిక్కరించి, సామ్యవాద వ్యవస్థకు అనుకూలంగా భావ ప్రచారం చేసేది అభ్యుదయ సాహిత్యం. ఇది ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచేది. శ్రమదోపిడీ, మతమౌఢ్యం, ఆధిపత్య ఉన్మాదం, సాంఘిక వివక్ష వంటి తిరోగమన అంశాలను శత్రువులుగా పరిగణిస్తుంది అభ్యుదయ సాహిత్యం. ఇది సమాజాన్ని భౌతిక దృష్టితో, వర్గం దృక్పథంతో విశ్లేషిస్తుంది. అదే సమయంలో సంక్లిష్టమైన భారతదేశ సామాజిక నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని అస్తిత్వ వాదాలను అరసం ఆలింగనం చేసుకుంటుంది.

అసమ సమాజంలో అరసం పీడితుల పక్షం వహిస్తుంది. మానవ సంబంధాలలో ఆర్థికాంశం పాత్రను రుజువు చేయడంతో, శ్రమదోపిడీని ప్రతిఘటించడంతో మొదలై, క్రమంగా అనేక సాంఘిక వివక్షలను, ఆధిపత్యాలను ప్రతిఘటించే దశకు చేరుకుంది అభ్యుదయ సాహిత్యం. అరసం ఈ పరిణామాన్ని ప్రచారం చేసింది. 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించని అరసం, 1991 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆఖరి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం ఒక పరిణామం. ప్రపంచీకరణ దుష్పరిణామాలను ఎండగట్టడంలో అరసం గానీ, అభ్యుదయ సాహిత్యం గానీ వెనకపడలేదు. ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రపంచీకరణ కథలు పుస్తకం వచ్చింది. ఇటీవల ఢిల్లీలో భారతీయ రైతుల తిరుగుబాటును సమర్థించడంలో అరసం క్రియాశీలక పాత్ర నిర్వహించింది. కవి సమ్మేళనం నిర్వహించి ‘హలంతో కలం’ కవిత్వ సంకలనం తెచ్చింది. అలాగే మణిపూర్‌లో మహిళలను దిగంబరంగా ఊరేగించి... ఆధిపత్యవాదులు చేసిన అమానుషత్వం మీద అరసం కవి సమ్మేళనం నిర్వహించి ‘మణిపూర్ మంటలు’ అనే కవితా సంకలనం తెచ్చింది. తెలుగు ప్రజలు బలిదానంతో, ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని పాలకులు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడానికి ప్రయత్నించినప్పుడు అరసం తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ఉక్కుకవనం’ అనే కవితా సంకలనం తెచ్చింది. అరసం వంటి సంస్థ అసంఖ్యాకంగా పుస్తకాలను ప్రచురించడం విశేషం. ఈ తరం కోసం కథ, ఈ తరం కోసం కవిత అనే పేర్లతో గురజాడ నుంచి అనేక మంది ప్రజారచయితల కవితలను, కథలను దాదాపు 100 సంపుటాలు ప్రచురించింది. ఈ తరం కోసం వచన కవిత, ఈ తరం కోసం గేయ కవిత అనే మరో రెండు సంపుటాలు కూడా అరసం ప్రచురించింది. అవి విశేషంగా పాఠకాదరణ పొందాయి. ఇటీవలి గ్రంథాలయ పునరుజ్జీవనోద్యమంలోను, తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమంలోను అరసం ఇతర ప్రజాతంత్ర సాహిత్య సంస్థలతో కలిసి కృషి చేసింది.


ఇంకా ముందుకు పోతే తెలంగాణ రైతాంగ పోరాటంలోను, జమీందారీ వ్యతిరేక ఉద్యమంలోనూ అభ్యుదయ రచయితలు శ్రామికులు, పీడితులు రైతుల పక్షాన నిలిచారు. అభ్యుదయ రచయితలు అనగానే శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, సోమసుందర్, రెంటాల, సినారె, గంగినేని, కుందుర్తి, నయాగరా కవులు, సురవరం ప్రతాపరెడ్డి, విద్వాన్ విశ్వం, సి.వి, కొడవటిగంటి కుటుంబరావు, మా గోఖలే, లక్ష్మీకాంతం మోహన్, దాశరథి రంగాచార్య, శారద, గజ్జెల మల్లారెడ్డి, ఉప్పల లక్ష్మణరావు, సుంకర వాసిరెడ్డి, సి.వి కృష్ణారావు, కేతు విశ్వనాథరెడ్డి వంటి మహా రచయితలు పాఠకుల ముందు నిలుస్తారు.

సృజన సాహిత్యంతో పాటు, సాహిత్య విమర్శలోనూ అభ్యుదయవాదులు అసమాన పాత్ర నిర్వహించారు. ఎం.ఆర్ చంద్ర, కొ.కు, శ్రీశ్రీ, రా.రా, వల్లంపాటి, సింగమనేని, ఆర్వీయార్, కె.వి.ఆర్, కొలకలూరి, వై.విజయకుమార్, నిడమర్తి, సొదుం రామ్మోహన్ వంటి అనేక మంది గుర్తుకొస్తారు.

అరసానిది ఆర్థిక సమానవాదమైనా, సామాజిక న్యాయవాదాన్ని విస్మరించదు. పైగా సామాజిక న్యాయవాదులతో చేతిలో చేయివేసి నడుస్తున్నది. అందుకే ఈ 20వ మహాసభలను ‘‘పురోగామి చింతనాశీలుర ఐక్యతాదిశగా’’ అనే ప్రధాన అంశం కేంద్రంగా నిర్వహిస్తున్నది.

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

ఈ వార్తలు కూడా చదవండి...

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 01:10 AM