Share News

ఒక ముగింపు, మరో ఆరంభం!

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:07 AM

‘రాజ్యాంగ విలువలను విశ్వసించే వాజపేయి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో నేను పొత్తు పెట్టుకున్నాను. లౌకికవాద నేతగా, ఓట్లు కైవసం చేసుకునేందుకై హిందువులు–ముస్లింల మధ్య విభేదాలు, వైషమ్యాలు,,,

ఒక ముగింపు, మరో ఆరంభం!

‘రాజ్యాంగ విలువలను విశ్వసించే వాజపేయి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో నేను పొత్తు పెట్టుకున్నాను. లౌకికవాద నేతగా, ఓట్లు కైవసం చేసుకునేందుకై హిందువులు–ముస్లింల మధ్య విభేదాలు, వైషమ్యాలు సృష్టించేందుకు ప్రయత్నించే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీతో కలవలేను’... ఇవి, 2013 జూన్‌లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సందర్భంలో నితీశ్‌కుమార్‌ ఉద్ఘాటనలు.

‘నా రాజకీయ జీవితం మొదలయినప్పుడు బిహార్‌ శాసన వ్యవస్థ ఉభయ సభలలోను, పార్లమెంటు ఉభయ సభలలోను సభ్యుడుగా కావాలని ప్రగాఢంగా కోరుకునేవాణ్ణి’... ఇవి, 2026 మార్చిలో రాజ్యసభకు పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నానని ప్రకటించిన సందర్భంలో నితీశ్‌ చెప్పిన మాటలు!

భారత రాజకీయాలలో పదమూడు సంవత్సరాలు ఒక సుదీర్ఘకాలం. ఒక దశాబ్దం క్రితం మోదీకి దీటైన ప్రత్యర్థిగా ప్రఖ్యాతుడై ఆ తరువాత క్రమంగా ఆ స్థానం నుంచి దిగజారుతూ చివరకు ఇప్పుడు మార్గదర్శక్‌ మండల్‌ వంటి ‘వృద్ధాశ్రమం’లోకి నెట్టివేతకు గురవుతోన్న నేత నితీశ్‌కుమార్‌. కాలం నిర్దయగా తెచ్చిన ఈ మార్పు మోదీ కేంద్రిత రాజకీయ విశ్వంలో అసహజమైనదేమీ కాదు.

నితీశ్‌కుమార్‌ విద్యాధిక రాజకీయవేత్త. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన ఆయన 2005లో బిహార్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ ప్రమాణం చేశారు. బిహార్‌ను ఆ రోజుల్లో భారతదేశ రాజకీయ భ్రష్టత్వానికి చిహ్నంగా పరిగణించేవారు. ఎన్నో ప్రతికూలతలను అధిగమిస్తూ రెండు దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగిన నితీశ్‌, ఆ రాష్ట్ర రాజకీయాలను పునరావిష్కరించారు. అంతకంటే ముఖ్యంగా అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకై ఆయన తనను తాను అనేకసార్లు ప్రభావవంతంగా పునరావిష్కరించుకున్నారు! సమకాలీన భారతదేశంలో నితీశ్‌కుమార్ వలే తరచూ భిన్న పార్టీలతో జట్టు కడుతూ అధికారాన్ని నిలబెట్టుకున్న రాజకీయవేత్త మరొకరు లేరు. ఉన్నా, వారి సంఖ్య చాలా తక్కువ అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆయన రాజకీయ కసరత్తులు అపూర్వమైనవి. నితీశ్‌ తాజా రాజకీయ ప్రస్థానం ఆ అసాధారణ రాజకీయాలకు అంతిమంగా స్వస్తి వాక్యం పలికింది.

ఇప్పుడు నితీశ్‌ పాట్నా అధికార నడవాలకు చాలా దూరంగా ఢిల్లీలోని పార్లమెంటుకు వెళ్లనున్నారు. రెండు దశాబ్దాల పాటు బిహార్‌ రాజకీయాలను నిర్దేశించిన ఘటనా ఘటన సమర్థుడు నితీశ్‌కుమార్‌. అయినా ఇప్పుడు ఆయన పాట్నాను వీడి న్యూఢిల్లీకి వెళ్లిపోక తప్పడం లేదు. బిహార్‌ నుంచి ఆయన నిష్క్రమణ లోగుట్టు ఏమైనప్పటికీ పాలక కూటమిలో అధికార సమతుల్యత నిర్ణయాత్మకంగా మారిపోయింది. మోదీ హయాంలో మాత్రమే ఇటువంటి మార్పులుచోటు చేసుకోవడం పరిపాటి.


బిహార్‌లో అధికారాన్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడమనేది భారతీయ జనతా పార్టీకి చాలా కాలంగా సాధించలేని లక్ష్యంగా ఉండిపోయింది. జాతీయ స్థాయిలో అధికారాన్ని వరుసగా గెలుచుకుంటున్నప్పటికీ బిహార్‌లో మాత్రం అధికార కైవసం ఒక అసంపూర్ణ లక్ష్య సాధనగా మిగిలిపోయింది. రాజకీయాలు ‘మండలీకరణ’ అయిన నేపథ్యంలో అగ్రకులాల పార్టీ అనే ముద్ర నుంచి బీజేపీ బయటపడలేకపోవడం వల్లే బిహార్‌లో బీజేపీకి అధికారం దక్కడం అసాధ్యమైపోయింది. వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి ముఖ్యమంత్రిగా నితీశ్‌ ఇతోధిక కృషి చేశారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ బిహార్‌లో నిలదొక్కుకునేందుకూ బాగా తోడ్పడ్డారు. సుపరిపాలనను అందించడం ద్వారా తన పార్టీ సామాజిక పునాదులను పటిష్ఠ పరచుకోవడంలో సఫలమయ్యారు. ఒక ప్రాంతీయ నాయకుడిగా ఆయనకు లభించిన ప్రజాదరణ, గౌరవ ప్రతిపత్తులు బిహార్‌లో బీజేపీ ఎదుగుదలను ఒక విధంగా కట్టడి చేశాయని చెప్పవచ్చు.

అయితే రోజులన్నీ నితీశ్‌కు అనుకూలంగా లేవు. అసెంబ్లీ లేదా లోక్‌సభకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ బిహార్‌లో బీజేపీకి లభించిన ఓట్ల, సీట్ల సంఖ్య పెరుగుదల విస్మరించలేని రాజకీయ వాస్తవంగా స్థిరపడింది. ఒకప్పుడు నితీశకుమార్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ (యునైటెడ్‌)కు జూనియర్‌ భాగస్వామిగా ఉన్న బీజేపీ క్రమంగా ఎన్డీఏలో ఒక శక్తిమంతమైన పార్టీగా ప్రభవించింది. 2020 శాసనసభా ఎన్నికలలో జనతాదళ్‌(యు) కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకున్నది. ఈ విజయం బిహార్‌లో ఆ పార్టీకి ఒక మేలు మలుపు. నితీశ్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

బిహార్‌లో తమ పార్టీ సొంత కాళ్లపై నిలబడి అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనేది బీజేపీ జాతీయ నాయకత్వ దీర్ఘకాలిక లక్ష్యం. కనుకనే జనతాదళ్‌ (యు) కంటే తమకు ఎక్కువ సీట్లు లభించినప్పటికీ నితీశ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం రాజకీయంగా తమకు శ్రేయస్కరం కాదని బీజేపీ నాయకత్వం గుర్తించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, మహిళలలో ఆయనకు అపారమైన పలుకుబడి ఉన్నది.

ఇప్పుడు నితీశ్‌ను గౌరవప్రదంగా రాజ్యసభకు పంపించడం ద్వారా బీజేపీ ఏకకాలంలో రెండు లక్ష్యాలను సాధించింది. బిహార్‌ అధికార వ్యవస్థల్లో తన సంపూర్ణ ప్రాబల్యాన్ని నెలకొల్పుకోవడంలో సఫలమయింది. ప్రత్యక్ష ఘర్షణ, ఆకస్మిక విచ్ఛిన్నం తదితర గజిబిజి రాజకీయ పరిస్థితులు తలెత్తవలసిన అవసరం లేకుండానే తన ప్రాబల్యాన్ని సంపూర్ణంగా నెలకొల్పుకోగలిగింది. బిహార్‌లో బీజేపీ చాణక్యాన్ని ఒక మృదువైన రాజకీయ తిరుగుబాటుగా అభివర్ణించవచ్చు.


భారత రాజకీయాలలో ఇటువంటి ఎత్తుగడలు కొత్తవేమీ కావు. వ్యూహాత్మక ఉపయుక్తతను కోల్పోయిన నాయకులు గౌరవప్రదంగా క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించేందుకు అవకాశాలను కల్పించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. గవర్నర్లుగా లేదా పార్లమెంటరీ పదవులలో నియమితులు కావడం జరుగుతోంది. బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి నితీశ్‌ గౌరవప్రద నిష్క్రమణకు ఒక విస్తృత ప్రాధాన్యమున్నది. దేశ రాజకీయాలలో అగ్రనాయక ద్వయంగా వెలుగొందుతోన్న నరేంద్ర మోదీ– అమిత్‌ షాల రాజకీయ కార్యాచరణ శైలిని ఆ ఉదంతం పూర్తిగా ప్రతిబింబించింది.

మోదీ–షాల శక్తిమంతమైన నాయకత్వం ఆలంబనతో బీజేపీ ఒక కేంద్రీకృత ఎన్నికల యంత్రాంగంగా పని చేస్తోంది. విజయాలే లక్ష్యంగా ఎన్నికలలో పొత్తులకు ప్రాంతీయ పార్టీలను ఆహ్వానిస్తున్నారు. కొన్ని సందర్భాలలో అటువంటి పొత్తులు తప్పనిసరి కూడా. అయితే పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను శాశ్వత భాగస్వామ్య పక్షాలుగా బీజేపీ పరిగణించడం లేదు. ఆ పొత్తుల చరిత్ర ఒకే రీతిలో ఉంటోంది. తొలుత ఒక కూటమిలో భాగస్వాములవుతారు. ఆ తరువాత కూటమిలోని పెద్ద పార్టీ సంస్థాగతంగా విస్తరిస్తుంది. అంతిమంగా భాగస్వామ్య పక్షాల మధ్య అధికార సమతుల్యత మారుతుంది. ఫలితంగా పొత్తు పెట్టుకున్న భాగస్వామ్య పక్షాన్ని పక్కకు నెట్టివేస్తారు. అసోంలో ఏజీపీతోను, మహారాష్ట్రలో శివసేనతోను, గోవాలో ఎమ్‌జీపీతోను బీజేపీ పొత్తుల చరిత్ర పూర్తిగా ప్రస్తావిత ఘటనల క్రమాన్ని ప్రతిబింబిస్తుందనడం సత్యదూరం కాదు. ప్రాబల్య ప్రాభవాలను కోల్పోయిన ప్రాంతీయ పార్టీల స్థానంలో బీజేపీ బలపడి సుస్థిరమవడమే ఎల్లెడలా జరిగింది.

ఒక విస్తృత ప్రశ్నను కూడా మనం తరచి చూడవలసిన అవసరమున్నది: బిహార్‌ అధికార రంగం నుంచి నితీశ్‌ నిష్క్రమించిన తీరు తెన్నులు జాతీయ పాలక కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు ఎటువంటి సందేశాన్ని పంపుతున్నాయి? శక్తిమంతమైన ప్రాంతీయ రాజకీయ శక్తుల– ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న తమిళనాడులో అన్నాడీఎంకే –తో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన వివిధ చిన్న పార్టీలు నేటి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. పార్లమెంటరీ సంఖ్యా బలానికి ఆ పెద్ద, చిన్న పార్టీల మద్దతు తప్పనిసరి. అయితే సాధ్యమైన ప్రతిచోటా మిత్రపక్షాలను ఉపేక్షించి, నిర్వీర్యపరిచి అధికారాన్ని ఎటువంటి మినహాయింపు లేకుండా స్వాధీనం చేసుకోవడమే బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యమన్న సత్యం ఆ భాగస్వామ్య పక్షాలకు బాగా తెలుసు. కనుకనే తమకు ఏ క్షణంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో అన్న ఆందోళన ఆ పార్టీలలో తీవ్రంగా ఉన్నదన్న వాస్తవాన్ని ఎవరూ కొట్టివేయలేరు.

బీజేపీతో జట్టు కట్టిన ప్రాంతీయ నాయకులకు సమకూరే తక్షణ ప్రయోజనాలు తక్కువేమీ కాదు: కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలకు భరోసా, అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ వ్యవస్థల నుంచి తోడ్పాటు లభిస్తాయి. మరింత ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఎటువంటి బెడద ఉండకపోవచ్చు. అయితే ఇందులో ఒక స్వతస్సిద్ధమైన ప్రమాదం ఉన్నది. ఈ అనుచిత రాజకీయ ప్రాపకం మూలంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు క్రమంగా తమ రాజకీయ ప్రాధాన్యాన్ని కోల్పోతాయి.


ఎన్నికల్లో జయాపజయాలకు ఆవల ఒక విస్తృత ప్రాధాన్యమున్న రాజకీయ వాస్తవం ఉన్నది. జాతీయ రాజకీయ పక్షాలతో బలమైన స్థానం నుంచి చర్చలు నిర్వహించి గత ప్రాంతీయ నాయకత్వ శక్తి సామర్థ్యాలకు నితీశ్‌కుమార్ ఒక నిదర్శనంగా నిలిచారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడానికి నిర్ణయించుకోవడం ద్వారా బిహార్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి నితీశ్‌ వైదొలగడం ఆ సమర్థ నాయకత్వం క్షీణించి పోవడాన్ని స్పష్టంగా సూచిస్తోంది. విస్తృత సంస్థాగత నిర్మాణం, అపరిమిత వనరులు, శక్తిమంతమైన కేంద్ర నాయకత్వం ఉన్న జాతీయ పక్షమే నేటి రాజకీయాలలో అధికార గురుత్వాకర్షణ కేంద్రంగా ప్రభవించింది. కనుకనే బిహార్‌లో ముఖ్యమంత్రి పదవిని వీడి, ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడు కావడానికి నితీశ్‌కుమార్‌ అంగీకరించడం అనివార్యమయింది. బీజేపీ అధికార చాణక్యాలలో పొత్తులు ఎంతగా ఉపయోగకరమైనవి అయినప్పటికీ అవి అరుదుగా మాత్రమే శాశ్వతమైనవి. ఉద్దండ రాజకీయవేత్తలు సైతం అంతిమంగా రంగం నుంచి వైదొలగక తప్పదు. నితీశ్‌ కొత్త ప్రస్థానం ఈ సత్యాలనే స్పష్టం చేసింది.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఈ వార్తలు కూడా చదవండి..

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 02:07 AM