నేపాల్ విలయం.. ప్రకృతి ప్రతీకారం!
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:34 AM
ఇటీవలి నేపాల్ విలయం వేలాది కుటుంబాలను విషాదాంధకారంలోకి నెట్టివేసింది. హిమాలయ మంచు కొండల శిఖరాగ్రంలో హిమానీపాతం, రాళ్లు, మట్టి కలిసి భోటేకోశీని చివరకు భయంకరమైన బురద నదిగా...
ఇటీవలి నేపాల్ విలయం వేలాది కుటుంబాలను విషాదాంధకారంలోకి నెట్టివేసింది. హిమాలయ మంచు కొండల శిఖరాగ్రంలో హిమానీపాతం, రాళ్లు, మట్టి కలిసి భోటేకోశీని చివరకు భయంకరమైన బురద నదిగా మార్చివేశాయి. దాంతో గత ఆగస్టు 26న నేపాల్ సహా, టిబెట్ వెంబడి పలు గ్రామాలు, పట్టణాల్లోని సరిహద్దు పోస్టులు, పెద్ద ట్రక్కులు, రహదారులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు, ప్రజలను కీటకాల్లా ఆ బురద వరద మింగేసింది. పదకొండు వందల మందికి పైగా ప్రజల మరణానికి, 4,858 మంది ప్రజల అదృశ్యానికి, జీవజాలం నాశనానికి, లక్షల కోట్ల ఆర్థిక నష్టానికి ఈ విలయం కారణమయ్యింది. తమను తుడిచిపెట్టబోయే ఆ బురద సునామీ నుంచి తప్పించుకోడానికి ప్రాణభయంతో పరిగెడుతున్న చిన్న చిన్న మానవరూపాల దృశ్యాలు దిగ్భ్రాంతి కలిగించాయి. ప్రకృతి జరిపిన ఈ దాడి విస్తృతి మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ తరహా దాడిని తట్టుకునే, నివారించగలిగే దృక్కోణం, సామర్థ్యం ఏ మానవ భద్రతా వ్యవస్థకూ లేకపోవడం దురదృష్టకరం.
నాగాలాండ్, అస్సాం రాష్ట్రాల్లో.. జూలైలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన వరద విపత్తుతో పోలిస్తే నేపాల్ ప్రళయం చాలా పెద్దది. ఈ రెండు సందర్భాల్లోనూ కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఇవి మారుతున్న వాతావరణ సరళి, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులకు సంబంధించినవి. మానవ తప్పిదాలే ఈ విలయాలకు ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. ఎత్తైన హిమాలయాలలోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థల ద్వారా, అలాగే దిగువ కొండలు, నదుల ద్వారా ప్రకృతి పదేపదే హెచ్చరికలు పంపినప్పటికీ, ఆ అంశాలను మనం పట్టించుకోలేదు. వాతావరణ మార్పు వచ్చేసింది, అది దాని సహజ స్థితికి తీసుకురాలేని దశకు వేగంగా చేరుకుంటోంది. తత్కారణంగా.. వేల మీటర్ల ఎత్తులో ఉన్న హిమానీనదం శిథిలమవడం వల్లగానీ, విస్ఫోటనం చెందే ప్రమాదంలో ఉన్న హిమానీనద సరస్సుల వల్లగానీ, కొండచరియలు విరిగి పడటానికి కారణమయ్యే తీవ్ర వర్షాల వల్ల గానీ, లేదా బలహీన ప్రాంతాలలో ఉధృతంగా ప్రవహించే వరద నీటి ప్రవాహం వల్ల గానీ తీవ్రమైన వాతావరణం, వర్షాలు, తుపానులు, భారీ వరదల వంటి మరిన్ని విపత్తులకు మనం సిద్ధంగా ఉండాలని ప్రకృతి చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉంది.
ఆ హెచ్చరికల్ని మన పాలకులు నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధి పేర పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకులు, వారిని పోషించే కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్ల జేబుల నింపడం తప్ప మరేమీ చేయని ప్రతిష్ఠాత్మకమైన ఆరు/ నాలుగు లేన్ల హైవేలు సహా, మొత్తం హిమాలయ– టిబెట్ ప్రాంతంలోని అన్ని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిలిపివేయాలి. సామ్రాజ్యవాది చైనా నిర్మిస్తున్న భారీ నీటి ప్రాజెక్టు, హైడ్రో ఎలక్ట్రిక్, మిలటరీ నిర్మాణాలు నిలిపివేయకపోతే ప్రకృతి క్రోధానికి ప్రజలు బలి కాకతప్పదు. ఆ నిర్మాణాల వల్ల హిమాలయ ప్రాంతం, తూర్పు పర్వతాల్లో కొండ చరియలు విరిగిపడి వేలాది మంది ప్రజలకు జీవన్మరణ సమస్యలు సృష్టిస్తున్నాయి. నేపాల్ వంటి విపత్తు సంభవిస్తుందనే భయంతో హిమాలయ ప్రాంత ప్రజలు అన్ని జల విద్యుత్ ప్రాజెక్టులనూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చైనా, భారత్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి అన్ని దేశాల నిపుణులంతా ప్రమాదాలను అంచనా వేసి, రక్షణ ప్రణాళికలను రూపొందించుకోవాలి.
ప్రకృతిపై మనం సాధించే విజయాల గురించి మరీ ఎక్కువగా గర్వపడకూడదు. ఎందుకంటే, అటువంటి ప్రతి విజయానికీ ప్రకృతి మనపై ప్రతీకారం తీర్చుకుంటుంది. నిజమే, ప్రతి విజయం మొదట మనం ఆశించిన ఫలితాలనే ఇస్తుంది; కానీ తదుపరి దశలలో అది పూర్తిగా భిన్నమైన, ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. అవి తరచుగా ఆ తొలి ఫలితాలనే రద్దు చేసేలా ఉంటాయి. అంటే.. ప్రకృతిపై మనం ఒక విజేతలాగా ఆధిపత్యం చలాయించలేమని ప్రతి అడుగులోనూ అది మనకు గుర్తుచేస్తోంది.
ప్రపంచ దేశాలు వాతావరణ మార్పు, భూతాపం అనే సమస్యలపై ఎన్నిసార్లు అంతర్జాతీయ సమావేశాలు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకున్నా కార్పొరేట్ శక్తుల అత్యాశకు అవి ఆచరణయోగ్యం కాకుండా పోతున్నాయి. భూగోళంలోని అన్ని రకాల జీవ–నిర్జీవ వ్యవస్థలు, ప్రక్రియలన్నీ కార్పొరేట్ సంస్థల స్వార్థానికి కోలుకోలేని విధ్వంసక స్థితికి చేరుకుంటున్నాయి. ‘ప్రకృతి మన కొనసాగింపు’ అనే స్పృహ, దృక్కోణం లేకుండా కేవలం మానవ అవసరాలను తీర్చే వినియోగ వస్తువుగాను, సంపదగాను ప్రకృతిని చూసే రాజకీయార్థిక విధానాన్ని విడనాడకపోతే మానవజాతి కూడా అంతరించిపోతున్న జీవరాశుల జాబితాలో చేరే ప్రమాదం ఉంది. ప్రకృతి–సమాజాల మధ్య ఆదాన ప్రదానాల క్రమాన్ని పునరుజ్జీవింపజేసే దృక్పథంతో కూడిన సమాజం కోసం ప్రజలు ఈ గ్లోబల్ కార్పొరేట్ పక్షపాత ప్రభుత్వాలను, రాజ్యాలను జెన్‌జీ ఉద్యమ స్ఫూర్తితో నిలదీయాల్సిన అవసరాన్ని నేపాల్ బురద వరద బీభత్సం నొక్కి చెబుతోంది.
వెన్నెలకంటి రామారావు (జర్నలిస్ట్)
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్
ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News