Share News

నీట్‌: చేయాల్సిందేమిటి?

ABN , Publish Date - May 22 , 2026 | 01:07 AM

ఏఐ, జీపీఎస్, ఎన్‌క్రిప్ట్ వాల్ట్‌లున్నా 48 గంటలు ప్రశ్నపత్రాన్ని కాపాడలేకపోవడం వ్యవస్థ వైఫల్యం. రేయింబవళ్లు కష్టపడిన విద్యార్థుల శ్రమ వృథా అయింది. ‘నీట్‌’ పరీక్ష రద్దుతో 650 మార్కులు ఆశించిన ...

నీట్‌: చేయాల్సిందేమిటి?

ఏఐ, జీపీఎస్, ఎన్‌క్రిప్ట్ వాల్ట్‌లున్నా 48 గంటలు ప్రశ్నపత్రాన్ని కాపాడలేకపోవడం వ్యవస్థ వైఫల్యం. రేయింబవళ్లు కష్టపడిన విద్యార్థుల శ్రమ వృథా అయింది. ‘నీట్‌’ పరీక్ష రద్దుతో 650 మార్కులు ఆశించిన రాజస్థాన్‌కి చెందిన ప్రదీప్, ఢిల్లీకి చెందిన అన్షిక, గోవాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మన పరీక్షా వ్యవస్థ విద్యార్థులకు సేవ చేయడానికా, లేక మోసం చేయడానికా? జూన్ 21న తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేయగా, కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచలేకపోయింది. సికార్‌లో ‘గెస్ పేపర్’ పేరుతో చక్కర్లు కొట్టిన 400 ప్రశ్నల్లో దాదాపు 140 ప్రశ్నలు అసలు పేపర్‌తో సరిపోవడం, ఒక్కో కాపీ లక్షల రూపాయలకు అమ్ముడవ్వడం, సీబీఐ విచారణకు దారి తీసిన ఈ వ్యవహారం ‘డిజిటల్ ఇండియా’ సమర్థతను ప్రశ్నిస్తోంది. ఎన్టీఏ ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త వివాదం వెలుగులోకి రావడం వ్యవస్థాగత వైఫల్యం.

‘డిజిటల్ ఇండియా’గా ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంటున్న దేశంలో ఇలాంటి లీకులు ఎందుకు జరుగుతున్నాయన్నది ప్రశ్న. ఎన్క్రిప్టెడ్ వాల్ట్స్‌, జీపీఎస్ ట్రాకర్లు, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ నిఘా వంటివి ఉన్నా, ఒక ప్రశ్నపత్రం పరీక్షకు 48 గంటల ముందు బయటకు రావడం అంటే వ్యవస్థలో అవినీతి, సమన్వయహీనత తీవ్రంగా ఉన్నాయని అర్థం. అమెరికాలో జీఆర్ఈ, టోఫెల్ నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ కంప్యూటర్ అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని అనుసరిస్తుంది. ప్రతి అభ్యర్థికి వేర్వేరు ప్రశ్నలు రావడం వల్ల పేపర్ లీక్‌కు అవకాశం ఉండదు. చైనా గావ్కావో పరీక్షలో మిలిటరీ స్థాయి భద్రత అమలు చేస్తారు. టైమ్–లాక్ డిజిటల్ బాక్సులు పరీక్ష ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే తెరుచుకుంటాయి. దక్షిణ కొరియాలో ప్రశ్నపత్రం రూపొందించే వారిని పూర్తిగా వేరుచేసిన సెల్స్‌లో ఉంచుతారు; ఒక వ్యక్తి మొత్తం పేపర్ చూడలేడు.


భారత్‌లో కూడా ‘బ్లాక్ చైన్’ ఆధారిత ఆడిట్ ట్రైల్ వ్యవస్థ అమలు చేయాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్‌ను దశలవారీగా ప్రవేశపెట్టి, డైనమిక్ క్వశ్చన్‌ బ్యాంక్‌ను ఉపయోగిస్తే ఒకే పేపర్‌తో లక్షల మంది పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం లేకపోతే అత్యాధునిక టెక్నాలజీ కూడా విఫలమవుతుంది. అందుకే ప్రత్యేక ‘నేషనల్ ఎగ్జామినేషన్ అథారిటీ చట్టం’ తీసుకురావాలి. పరీక్షా మోసాలపై ప్రత్యేక దర్యాప్తు విభాగం ఏర్పాటు చేసి, అరెస్టు అధికారాలు కల్పించాలి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం–2024 ప్రకారం పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానాలను కఠినంగా అమలు చేయాలి. ఒకే రోజు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించే విధానాన్ని పునఃపరిశీలించాలి. ఏడాదిలో పలుమార్లు పరీక్షలు నిర్వహించే ‘రోలింగ్ ఎగ్జామ్ విండో’ విధానం తీసుకురావాలి. ప్రశ్నపత్రాల ముద్రణను పూర్తిగా ప్రభుత్వ భద్రతా యంత్రాంగం ఆధీనంలోకి తీసుకురావాలి. కేంద్ర బడ్జెట్ ముద్రణ ప్రక్రియ తరహాలోనే పరీక్షా పత్రాల ముద్రణ కూడా జరగాలి. వీటి తయారీ, ముద్రణలో పాలుపంచుకునే సిబ్బందిని నిర్దేశించిన ప్రాంగణానికి పరిమితం చేయాలి. పరీక్షలు ముగిసే వరకు ప్రొఫెసర్లను కూడా ఏకాంతంలో ఉంచాలి. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ ధృవీకరణతో పాటు రియల్ టైమ్ ఏఐ ఫేస్ మానిటరింగ్ అమలుచేయాలి. ప్రశ్నపత్రాల పంపిణీకి స్మార్ట్ టైమ్–లాక్ వాల్టులు ఉపయోగించాలి. పరీక్ష ముగిసిన వెంటనే ఓఎంఆర్ స్కానింగ్‌ను కేంద్ర సర్వర్లకు నేరుగా అనుసంధానిస్తే మధ్యలో మార్పులు చేసే అవకాశం తగ్గుతుంది. విద్యార్థులు నమ్మకం కోల్పోతే, దేశ భవిష్యత్తే నష్టపోతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి.

వనగంటి నవీన్‌కుమార్

ఈ వార్తలు కూడా చదవండి...

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 01:07 AM