సామాన్యుల్లో అసామాన్యుడు
ABN , Publish Date - Mar 13 , 2026 | 02:00 AM
కావూరు సాంబశివరావుకు తన పర భేదం లేదు. తారసపడినవారు తెలిసినవారో, స్నేహితులో అయివుండనక్కరలేదు. పూర్వ పరిచయం లేకున్నా హాయిగా పలకరిస్తారు. మనసు విప్పి మాట్లాడతారు. ఎన్నో...
కావూరు సాంబశివరావుకు తన పర భేదం లేదు. తారసపడినవారు తెలిసినవారో, స్నేహితులో అయివుండనక్కరలేదు. పూర్వ పరిచయం లేకున్నా హాయిగా పలకరిస్తారు. మనసు విప్పి మాట్లాడతారు. ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న ఆత్మీయుడిని కలిసిన అనుభూతిని అందిస్తారు. మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడగలిగే అరమరికలులేనితనం, ప్రేమాస్పద స్పర్శతో సొంత చిన్నాన్ననో, లేదంటే పెద్దన్ననో తలపిస్తారు.
పేరుకు తగ్గట్టే ఆయన బోళా శంకరుడు. ప్రతి ఒక్కరినీ ఇట్టే నమ్మేస్తారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు వినడం తన బలమూ, బలహీనత కూడా నంటారు. వారి మాటలు వినడం వల్ల ఒక్కోసారి నష్టం చవిచూసిన సందర్భాలూ లేకపోలేదు. ఆ తప్పు మరొక్కసారి జరగకుండా జాగ్రత్తపడమని కొందరు ఆయన్ను మందలించేవారు. అయినా ఆయన మాత్రం తన సహజ నైజాన్ని విడిచిపెట్టేవారు కాదు. అయితే ఎవరైనా నమ్మకద్రోహానికి తలపడితే క్షమించేవారు కారు. వారిపై మూడో కన్ను తెరిచేవారు.
ఆరు ఎకరాల సన్నకారు రైతు కుటుంబం నుంచి వచ్చిన కావూరు.. ఊహ తెలియని రెండేళ్ల వయసులోనే తన తల్లిని కోల్పోయారు. అక్కలిద్దరూ చేరదీసి అమ్మలేని లోటును తీర్చారు. ఇందుకు ప్రతిగా జీవిత పర్యంతమూ అక్కల కుటుంబాల యోగక్షేమాలను చూశారు. స్కూటర్ ప్రమాదంలో కన్నుమూసిన మిత్రుడు భాస్కర్ జ్ఞాపకాన్ని పదిలం చేస్తూ, అతని పేరును తన కుమారుడికి పెట్టుకున్నారంటేనే స్నేహానికి, బాంధవ్యానికి ఆయన ఎంతటి విలువ ఇస్తారో తెలుస్తోంది.
చిన్నప్పటి నుంచి ప్రతి అడుగులో పరీక్షలు ఎదుర్కొన్నారు. పరాభవాలు చవిచూశారు. అప్పుల పాలయ్యారు. అయినా రవ్వంత కూడా వెనక్కి తగ్గలేదు. మొండి పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాల తీరాలకు చేరుకోగలిగారు. కుల, మత, ప్రాంత విభేదాలను దరిచేరనీయకుండా ప్రతిభావంతులను దగ్గరకు తీసి ప్రోత్సహించారు. తనతో పాటు సహచరులూ, మిత్రులూ ఎదగాలని కాంక్షించారు. ఏ విజయమైనా సమష్టి కృషి ఫలితమేనని ప్రగాఢంగా విశ్వసించిన ఆయన ఎంత ఎదిగినా ఒద్దికగా, నిరాడంబరంగానే ఉన్నారు. ఎంతటి విశాల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించినా గర్వంతో విర్రవీగలేదు. అహంకారాన్ని దరిచేరనివ్వలేదు. తోటివారితో సంబంధాల్లో రవ్వంత మార్పు ఉండేది కాదు. నడిచివచ్చిన దారులను మరువని ఆయన... మొదటి నుంచి ఎలా ఉన్నారో, విజయాలు సాధించి ఒక స్థాయికి చేరాక కూడా అదేవిధంగా ఉన్నారే తప్ప మిడిసిపడలేదు.
ఇదే సమయంలో తాను నమ్మిన విలువల విషయంలో రవ్వంత రాజీపడలేదు. పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉన్నా లెక్కచేయలేదు. నాడు తెలుగుదేశం పార్టీ ప్రభంజనం రాష్ట్రంలో బలంగా వీస్తున్న సమయంలోనూ, వీరవిధేయ కాంగ్రెస్‌వాదిగా ఎన్టీఆర్‌ను ఎదురొడ్డి నిలిచారే తప్ప, పార్టీ మారాలని అనుకోలేదు. పార్లమెంటేరియన్‌గా సుదీర్ఘ అనుభవం, రాజీవ్‌గాంధీతో సాన్నిహిత్యం ఉన్నా కేంద్రంలో మంత్రి పదవి అందినట్లే అంది చేజారుతూ వచ్చినా ఓపిక పట్టారు. ఎట్టకేలకు మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో జౌళిశాఖా మంత్రిగా అవకాశం లభించింది. పూర్వానుభవం లేదు కనుక, సహాయమంత్రి హోదాను ఇస్తామంటే, నో చెప్పారు. క్యాబినెట్ హోదా కల్పిస్తేనే మంత్రిపదవిని స్వీకరిస్తానని పట్టుబట్టి, తన పంతం నెరవేర్చుకున్నారు. ఇంత పట్టుదలతో, ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితంగా దక్కిన మంత్రిపదవిని, ఆంధ్రప్రదేశ్ విభజనకు మన్మోహన్ క్యాబినెట్ ఆమోదం తెలపడంతో తృణప్రాయంగా త్యజించారు. ఆ తర్వాత మోదీ సమక్షంలో బీజేపీలో చేరినా, అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
అడుగిడిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారాయన. పార్లమెంటు సభ్యుడిగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. ‘కావూరు చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా తాను ప్రాతినిధ్యం వహించిన మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల్లో పలు సంక్షేమ, అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపట్టి అమలు చేశారు. పార్లమెంటులో కూడా చురుగ్గా ఉండేవారు. సభలో చర్చకు రాబోతున్న అంశాలను, పార్లమెంట్ లైబ్రరీలో కూర్చుని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నోట్సు తయారు చేసుకునేవారు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా రాజీవ్ ఉన్నప్పుడు, ఆయన వెనుక సీటులోనే కావూరు సాంబశివరావు కూర్చునేవారు. రాజీవ్‌గాంధీకి ఏ విషయంపైన సందేహం కలిగినా, నివృత్తి కోసం వెనుదిరిగి కావూరు వంక చూసేవారు. కావూరు కూడా స్వయంగా గట్టిపట్టు, విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతూ సభలో పదుగురి అభినందనలు, ప్రశంసలు అందుకునేవారు. పుస్తక పఠనాభిలాషను చివరి వరకూ కొనసాగించారు. తీరుబడి ఉంటే చాలు, ఏదో ఒక పుస్తకంలో లీనమయ్యేవారు.
పార్లమెంటేరియన్‌గానే గాక పారిశ్రామికవేత్తగా, దేశప్రగతికి జీవనాడిగా నిలిచిన కీలకరంగాలకు నారూ నీరూ పోసి, వాటి వికాసంలో ముఖ్య భూమికను పోషించారు. నిర్మాణరంగ పితామహుడిగా పేరొందిన ఆయన దేశ విదేశాల్లో పలు భారీ డ్యామ్‌లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణం వంటి మెగా ప్రాజెక్టులు చేపట్టి దిగ్విజయంగా పూర్తిచేశారు. జాతీయ రహదారుల అభివృద్ధికి చేపట్టిన స్వర్ణభుజి ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించారు. సవాళ్లను స్వీకరించి, ప్రమాదాలను ఎదురొడ్డి సాహసాలెన్నో చేసి దూరతీరాలు, దేశాలలో శాశ్వత మౌలిక వసతులు కల్పించిన ధీరోదాత్తుడాయన. రియల్ ఎస్టేట్ రంగంలోనూ అడుగిడి రాఘవరత్న టవర్స్ వంటి ఎన్నో పెద్ద ప్రాజెక్టులను పూర్తిచేశారు. ఫార్మారంగ విస్తరణకు దోహదపడ్డారు. మెడ్విన్ ఆస్పత్రి స్థాపన ద్వారా ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశ నిర్మాణరంగంలో 70శాతం మంది తెలుగువారు విరాజిల్లుతున్నారంటే అది ఆయన వేసిన బాటే.
తన జీవితంలో చెప్పుకోదగ్గ టర్నింగ్ పాయింట్లు రెండు ఉన్నాయని కావూరు చెప్తుండేవారు. అవేంటంటే... మాజీ ఎంపీ మాగంటి అంకినీడు చెల్లెలు హేమలతను పెళ్లి చేసుకోవడంతో తొలినాళ్లలో అంకినీడు అండదండలు లభించాయి. ఆ తర్వాత కావూరు సొంతంగా ఎదిగారు. 1967లో వరంగల్‌లో నిర్మాణ పనులు చేస్తున్నప్పుడు అక్కడి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో తలెత్తిన విభేదాలతో జీరోకు చేరుకున్నారు. ఎవరి సహాయం లేకుండానే ఎంతో శ్రమించి ఆ కష్టం నుంచి బయటపడి సొంత కాళ్లపై నిలదొక్కుకున్నారు. తొలినాళ్లలో కోట్లలో నష్టాలు చవిచూసినా అధైర్యపడకుండా మొండిధైర్యంతో ముందుకు సాగి, ఆ తర్వాత కాలంలో అద్భుత ఫలితాలు రాబట్టారు.
ప్రతి సంస్థకూ కోర్ ఫిలాసఫీ ఉండాలని, అది సమష్టి నాయకత్వం, ప్రజాస్వామిక మౌలిక సూత్రాల పునాదులపై నిర్మితమవ్వాలని కావూరు ప్రగాఢంగా నమ్ముతారు. తన వారసులు దేశంలోనే ఉంటూ ఇక్కడి ప్రజల సేవలో తరించాలని ఆశించే ఆయన, డబ్బు ధ్యాసలో పడి ఆరోగ్యా్న్ని నిర్లక్ష్యం చేయకూడదని హితవు చెప్పేవారు. ఎంత డబ్బు వెచ్చించినా కోల్పోయిన ఆరోగ్యం తిరిగిరాదని హితవుపలికేవారు.
ఒక్కో కుటుంబంలో ఒకానొక తరంలో సమాజ గతిని మేలిమలుపు తిప్పే కారణజన్ములు ప్రభవిస్తారు. అలాంటి కోవకే చెందిన కావూరు సాంబశివరావు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, సవాళ్లను అధిగమించి, వ్యక్తి నుంచి సమష్టి శక్తిగా ఎదిగి దారిదీపమై ప్రకాశించారు. ఆయన పూర్ణపురుషుడు, ధన్యజీవి. అభిమానుల గుండెల్లో సదా నిలిచి వెలిగే అఖండ జ్యోతి.
గోవిందరాజు చక్రధర్
ఈ వార్తలు కూడా చదవండి..
స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఊతం: మంత్రి నారాయణ
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News