మన కాలపు నిప్పు గొంతుక
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:17 AM
‘ప్రపంచ చరిత్ర అంటే ప్రముఖుల జీవిత సారాంశమే’ అని ప్రసిద్ధ సామాజిక తత్వవేత్త థామస్ కార్లైల్ వ్యాఖ్యానించాడు. ప్రముఖుల జీవితతత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప ప్రపంచ చరిత్రను అధ్యయనం...
‘ప్రపంచ చరిత్ర అంటే ప్రముఖుల జీవిత సారాంశమే’ అని ప్రసిద్ధ సామాజిక తత్వవేత్త థామస్ కార్లైల్ వ్యాఖ్యానించాడు. ప్రముఖుల జీవితతత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప ప్రపంచ చరిత్రను అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఆధునిక కాలాన్ని తీర్చిదిద్దిన ప్రపంచ విప్లవాలు, ఉద్యమాలు, పోరాటాలు ప్రముఖుల జీవితాలతో పెనవేసుకుని ఉంటాయి. తమ తమ జాతులను, ప్రాంతాలను ఆధిపత్య శక్తుల సంకెళ్ల నుంచి బంధ విముక్తం చేయడానికి పలువురు చారిత్రక పురుషులు నిర్విరామ కృషి చేశారు. అటువంటి ప్రముఖుల జాబితాలోనే కాళోజీ నారాయణరావుకు చోటు దక్కుతుందనడంలో సందేహం లేదు. ఒక శతాబ్ది భారత సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, ఆర్థిక పరిణామాలకు– ప్రత్యేకించి తెలంగాణ చరిత్రకు కాళోజీ జీవితం ఒక ప్రతిబింబం.
మూడు తరాల ఉద్యమ వారధి– ఒకే జీవితంలో రాష్ట్రావతరణ కోసం, రాష్ట్ర విభజన కోసం నినదించిన నిప్పు గొంతుక. తెల్లదొరలపై జెండా ఎత్తినా, రజాకార్లపై రంకెలువేసినా, నల్ల దొరలపై నగారా మోగించినా ఎక్కడా కట్టు తప్పని మడమ తిప్పని, పట్టువదలని విప్లవ సేనాని. రాజీలు, లాలూచీలకు తలవొగ్గని నిగ్రహం ఆయన సొంతం. దోపిడీని, ఆధిపత్యాన్ని, అణచివేతను, అసమానత్వాన్ని, అంతరాలను ఎంతమాత్రమూ సహించని కాళోజీ 1914లో మొదటి ప్రపంచ యుద్ధంతోపాటే పుట్టారు. ‘రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ నారాయణరావు’ ఆయన పూర్తిపేరు. రెండు ప్రపంచ యుద్ధాల నడుమ ఆయన ఉద్యమ జీవితం కొనసాగింది. కాళోజీ జీవితం, ఆలోచన, ఆచరణ, ఆశయం విశిష్టమైనవి. ఆయన మూడు వేర్వేరు ప్రజా పోరాటాల్లో– స్వాతంత్య్ర పోరాటం, నిజాం వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో పాలకుల నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని ఎక్కుపెట్టారు. మరీ ప్రధానంగా కాళోజీ జీవితం–తెలంగాణ ఉద్యమం పరస్పరం పెనవేసుకొని వున్నాయి. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గూర్చి కాళోజీ రాసిన పంక్తులు– ‘పుట్టుక నీది, చావు నీది– బ్రతుకు దేశానిది’– ఇవే అక్షరాలా కాళోజీ జీవితానికి వర్తిస్తాయి. ఇక్కడ బ్రతుకు తెలంగాణది.
తన జీవితకాలంలో తలెత్తిన సమస్త ఉద్యమాలతో మమేకమై అలుపెరుగక పోరాడిన యోధుడు కాళోజీ. ఆర్యసమాజం, ఆంధ్రమహాసభలు, గ్రంథాలయోద్యమం, గణపతి ఉత్సవాలు, రజాకార్ల వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు, విశాలాంధ్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, పౌరహక్కుల పోరాటం, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాటం, సారా వ్యతిరేకోద్యమం– ఇలా అన్ని ఉద్యమాలలో ప్రజల పక్షాన గళమెత్తి కలమెత్తిన సమరయోధుడు.
కాళోజీ సంభాషణల్లో అచ్చతెలంగాణ యాస, భాష ఎంతో సహజంగా, సరళంగా, స్వేచ్ఛగా కనిపిస్తాయి. తెలంగాణ భాషను యాసను వెక్కిరించిన వారికి చింతబరిగెలతో చురకలంటించేవారు. రెండున్నర జిల్లాల, రెండున్నర కులాల భాషా సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిరసించారు. ‘మా రచనల్లో వ్యాకరణం మాత్రమే లేదు. మీ రచనంతా వ్యాకరణం తప్ప మరేమీ లేదు’ అని తెలంగాణ కవులను విమర్శించే వారికి సమాధానమిచ్చాడు. కాళోజీ దృష్టిలో భాష రెండు తీర్లు– ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాషే కావాలంటారాయన, అమ్మ భాషను అవహేళన చేసిన వారికి ఇలా వాత పెడతారు... ‘తెలుగు బిడ్డవురోరి తెలుగు మాటలాడుటకు/ సంకోచపడియెదవు సంగతేమిటిరా/ అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు/ సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’. అక్షరాన్ని కాళోజీ అమితంగా ప్రేమిస్తారు. అక్షరమే ఆయుధమంటారు. అక్షరాలకు గెరిల్లా శిక్షణ ఇచ్చి అన్యాయంపై ముప్పేట దాడి చేస్తారు. ‘అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’ అన్న ఒకే ఒక్క వాక్యం యువతరాన్ని చదువులవైపు మరల్చిందని చెప్పడంలో సందేహం లేదు.
బడుగు బలహీనులను, అభాగ్యులను అణచివేయడాన్ని కాళోజీ తిరస్కరించారు. ఆధిపత్యాన్ని ధిక్కరించారు. మంచితనాన్ని, మనిషితనాన్ని, ప్రజాస్వామిక మానవీయ విలువలను ప్రేమించారు. అదే ఆయన తత్వం–వ్యక్తిత్వం. తెలంగాణ సాహిత్యంలో శిఖర సమానుడు, ఉద్యమాలను ఊపిరిగా చేసుకున్న కాళోజీ గూర్చి– ‘కాలుడు మా కాళయ్యను కలకాలం మరచుగాక’ అని ఆయన ఆప్త స్నేహితుడు పీవీ నరసింహారావు ఎంతగా వేడుకున్నా, కాళోజీ వినకుండా... ‘అతిథి వోలె వచ్చినాను– అతిథి వోలె పోతానని’ 2002 నవంబర్ 13న మనల్ని విడిచి వెళ్లిపోయినా, మనకాలపు ఆ మహనీయుని ఆశయాలను, విలువలను పుణికిపుచ్చుకున్నప్పుడే ఆయనకు మనం నిజమైన వారసులమవుతాం.
డా. వంగర భూమయ్య
(పాలమూరు విశ్వవిద్యాలయం)
(నేడు కాళోజీ జయంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు
గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్
పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News