Share News

అభివృద్ధిలో కళలూ భాగమే!

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:54 AM

మానవ జీవితానికి అద్దం పట్టేవి కళలు. కళాకారులు తమ సృజనల ద్వారా ప్రజల మానసిక వికాసానికి, తద్వారా సాంస్కృతిక వికాసానికి తోడ్పడతారు. ఇంత ముఖ్యమైన సాంస్కృతిక, కళారంగాలను పాలకులు...

అభివృద్ధిలో కళలూ భాగమే!

మానవ జీవితానికి అద్దం పట్టేవి కళలు. కళాకారులు తమ సృజనల ద్వారా ప్రజల మానసిక వికాసానికి, తద్వారా సాంస్కృతిక వికాసానికి తోడ్పడతారు. ఇంత ముఖ్యమైన సాంస్కృతిక, కళారంగాలను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కళాకారులు అరుదుగా ఉంటారు కాబట్టి, వాళ్ల ఓట్ల వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండదని భావించి, పాలకులు కళారంగ అభివృద్ధిపై ఆసక్తి చూపడం లేదు. ఎంతో అభివృద్ధి చెందామని చంకలు గుద్దుకుంటున్న ప్రస్తుత సమాజం కంటే గతంలోనే జానపద కళలు, పౌరాణిక, సంప్రదాయ కళలు గ్రామాల్లో విలసిల్లాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసిందే తప్ప ఆ శాఖ ద్వారా కళారంగాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించడం గానీ, ఆ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రయత్నాలు గానీ ఏమీ చేయలేదు. నిజంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన శాఖ లేనప్పుడే సాంస్కృతిక, కళారంగాలకు ఎక్కువ ప్రయోజనం ఒనగూరింది.

సంగీత, సాహిత్య, నాటక, లలితకళా అకాడమీల ఆశయాలు గొప్పగా ఉంటున్నాయి గానీ ఆచరణ మాత్రం శూన్యం. ఈ అకాడమీల చైర్మన్ పదవులు కేవలం అధికార పార్టీ నాయకులకు ఉపాధి కేంద్రాలుగా మారాయి. లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ తాము కళాకారుల పక్షమని గొప్పలు చెప్పుకోవడం తప్ప వీరి వల్ల కళారంగానికి గానీ, కళాకారుల సంక్షేమానికి గానీ ఏ మాత్రం ఉపయోగం లేదు. ముఖ్యమంత్రిని కలిసి కళారంగం స్థితిగతులను వివరించి నిధులు రాబట్టాలన్న కనీస ఆలోచన వీరిలో ఎవరికీ లేదు.

కళలు నశించి, కళాకారులు అంతరించిన తర్వాత సమాజానికి సంభవించే నష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా సాంస్కృతిక మంత్రిత్వశాఖ, కళారంగంపై దృష్టి పెట్టాలి. అందుకోసం పనిచేసే వ్యక్తులను, సంస్థలను సంప్రదించాలి. బడ్జెట్‌లో కనీసం ఏటా రూ.500 కోట్లు కేటాయించి కళారంగాన్ని, కళాకారులను కాపాడుకోవాలి. కళాకారులకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కళాకారులకు ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించి, వృద్ధ కళాకారులకు నెలకు రూ.10 వేలు చెల్లించాలి. ఉండడానికి కనీసం రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కళాకారులకు ఇవ్వాలి. స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం రిజర్వేషన్ ఎలా ఉందో అలాగే కళాకారులకు కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తే యువ కళాకారులు ఈ రంగంలోకి రావడానికి ఉత్సాహం చూపుతారు. పక్క రాష్ట్రం తెలంగాణలో ‘సారథి’ పేరుతో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ కూడా నైపుణ్యం కలిగిన కళాకారులను ఎంపిక చేసి కాపాడుకోవాలి. ప్రభుత్వం నాటక ఉత్సవాలను విస్తృతంగా నిర్వహించాలి. ముఖ్యంగా నంది నాటకోత్సవాలు చాలా విస్తృతంగా క్రమం తప్పకుండా అన్ని విభాగాలకూ విస్తరింపజేయాలి. ప్రభుత్వం ద్వారా అందే అవార్డులు రివార్డులను తమ పార్టీ వారికి లేదా రికమండేషన్ ద్వారా వచ్చిన వారికి కాకుండా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఇవ్వాలి. పురస్కారాలను వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఇస్తే అసలైన నైపుణ్యం కలిగిన కళాకారులు ఏమైపోతారు?!


కళాకారులు తమ కళా ప్రదర్శన చేసుకోవడానికి కళాక్షేత్రాలు లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య. కళాక్షేత్రాల నిర్మాణం విస్తృతంగా జరగాలి. మండల కేంద్రాలలో ఓపెన్ థియేటర్లను నిర్మించాలి. ఎఫ్‌డీసీ ద్వారా సాహిత్య కళారంగాలను అభివృద్ధి పరచుకోవడానికి ప్రత్యేకమైన క్యాలెండర్ ఏర్పాటు చేయాలి. మన సంస్కృతి, సంప్రదాయ కళలను బతికించుకోవాలని గొప్పలు చెప్పుకునే దానికంటే నిధులు కేటాయించి ఆచరించటం ముఖ్యమైన అంశం. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు, లక్షల కోట్ల రూపాయల డబ్బు, బంగారం మాత్రమే కాదు. మనిషి మనిషిగా జీవించటానికి కళారంగం ఎంతగానో దోహదపడుతుంది. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, ముఖ్యంగా ప్రభుత్వం.

పి. చంద్రనాయక్

ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి అధ్యక్షుడు

ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్

ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 01:54 AM