పగిలిన ‘ఆజాద్’ తల ఏం చెబుతున్నది?
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:15 AM
జంతర్ మంతర్ విద్యార్థి ఆందోళనలో పాల్గొన్న టీనేజ్ యువతి నిశూ ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్ ఆజాద్ తల పగలగొట్టానని స్వతంత్ర భరద్వాజ్ బహిరంగంగా, నిర్భయంగా వీడియోలో అంగీకరించాడు...
జంతర్ మంతర్ విద్యార్థి ఆందోళనలో పాల్గొన్న టీనేజ్ యువతి నిశూ ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్ ఆజాద్ తల పగలగొట్టానని స్వతంత్ర భరద్వాజ్ బహిరంగంగా, నిర్భయంగా వీడియోలో అంగీకరించాడు. జూన్ 23, 2026న తాను చేసిన దాడిలో గాయపడిన సంజయ్ ఆజాద్ తలపై ఏడు కుట్లు వేయాల్సి వచ్చిందనీ, అయినా తనపై ఎలాంటి కేసు, సెక్షన్ల ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాననీ స్వతంత్ర భరద్వాజ్ గర్వంగా ప్రకటించాడు. తాను వేసుకున్నది ఢిల్లీ పోలీసుల బూట్లు అనీ, కావాలంటే చూడమనీ చెప్పాడు. తన చేతుల్లో ఢిల్లీ పోలీసుల లాఠీ పట్టుకున్న స్వతంత్ర భరద్వాజ్ ఫొటోలు, వీడియోలు అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రులతో తన ఫొటోలు, ఆ మంత్రులు తనకు పెద్దన్నలనీ, తనను ఎవరూ ఏమీ చేయలేరనీ ప్రకటించుకోవడం... ఇవన్నీ అధికార యంత్రాంగంలో తనకున్న పలుకుబడినీ, కీలకమైన మంత్రులతో సన్నిహిత సంబంధాలనీ తెలియజేస్తున్నాయి. ఒకవేళ తనను జైలుకు పంపించినా, విడుదలై వచ్చిన తర్వాత దాడులు కొనసాగించి బుద్ధి చెబుతానని ఎలాంటి జంకూ గొంకూ లేకుండా ప్రకటించాడు.
ప్రభుత్వం ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో స్పందించింది: సంజయ్ ఆజాద్ తలకు తగిలిన దెబ్బ పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదనీ, అది ‘చిన్నపాటి గాయం’ మాత్రమేననీ ప్రకటించింది. విద్యార్థులు, ప్రతిపక్షాలు, న్యాయవాదులు గంటల తరబడి ధర్నా చేసి, నిరసన తెలిపాక మాత్రమే స్వతంత్ర భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేశారు. పాలకుల అడుగులకు మడుగులొత్తే ప్రధాన స్రవంతి మీడియా కూడా తనవంతు పాత్రను పోషించి, అతడిని ఒక ‘హిందూత్వ కార్యకర్త’ అనీ, ‘ఇన్‌ఫ్లూయెన్సర్’ అనీ అభివర్ణిస్తూ భరద్వాజ్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేసింది. జూన్ 9, 2024న రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ, ఎర్రకోట వద్ద ఆగస్టు 15, 2026న స్వాతంత్ర్య దినోత్సవాలకూ స్వతంత్ర భరద్వాజ్ ఆహ్వానాలు అందుకోవడం యాదృచ్ఛికమైనవని మనం అనుకోలేం.
దేశ రాజధాని నగరం నడిబొడ్డున ఇదంతా జరగడం మన ముందున్న పరిస్థితులకు అద్దం పడుతున్నది. దేశంలో నెలకొని ఉన్న రాజకీయ వాతావరణాన్ని అది స్పష్టంగా తెలియజేస్తున్నది. వీటిని చూస్తుంటే చరిత్రలో ఇటలీలో బీభత్సాన్ని సృష్టించిన బ్లాక్ షర్ట్స్, జర్మనీలో భయానక హింసకు పేరుపొందిన బ్రౌన్ షర్ట్స్ బృందాలు మనకు గుర్తుకువస్తాయి.
ఇటలీలో ఫాసిస్టు హింసపై చరిత్రకారుడు జాన్‌ఫుట్ ఒక వివరమైన పుస్తకాన్ని రాశాడు. అందులో, ‘‘మృతదేహాల గుట్టలు, పగిలిన తలలు, హింసా బాధితులు, తగలబడిన పుస్తకాలు, సహకార సంఘాల విధ్వంసం, కార్మిక సంఘాల కార్యాలయాల కూల్చివేతలు... వీటి పునాదుల మీద ఫాసిజం నిర్మాణమైంది’’ అని జాన్‌ఫుట్ అంటాడు. ‘‘దుడ్డు కర్రా! దుడ్డు కర్రా! చెడిన బుర్రలకూ చికిత్సకూ నువ్వే మందు’’ అన్నది బ్లాక్ షర్ట్స్ బృంద గీతం. ముస్సోలిని భక్తుడు, జర్నలిస్టు మాన్లియో మోర్గాని మాటలలో చెప్పాలంటే, ‘‘ఎవరినైనా ఏ విషయంలోనైనా ఒప్పించాలంటే దుడ్డుకర్ర, రివాల్వర్‌లకూ మించిన సాధనాలు లేనే లేవు’’. ఈ మాటలు కొందరికి వీనుల విందుగా వినిపిస్తాయంటే ఆశ్చర్యం లేదు. జర్మనీలో హిట్లర్ అనుచర బ్రౌన్ షర్ట్స్ బృందంపై చరిత్రకారుడు డానియెల్ సీమెన్స్ వివరమైన పరిశీలన జరిపాడు. ‘‘1932లో ప్రాంతీయస్థాయిలో కలవరపెట్టిన ఘటనలు, ఏడాది తర్వాత నాజీల అధికారిక విధానంగా మారాయి. వాటి పర్యవసానాలు విస్తృతమైనవి. జర్మన్ పోలీసు బలగాలలో ఇప్పుడు సుదీర్ఘ కాలంగా పనిచేసిన అధికారులతో పాటు, స్థానిక మూక ముఠాల సభ్యులు కూడా భాగమయ్యారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి గస్తీ తిరగడం మొదలుపెట్టారు,’’ అని డానియెల్ సీమెన్స్ పేర్కొన్నాడు. తాను ‘ఢిల్లీ పోలీసు’ మాదిరిగా స్వేచ్ఛగా ఎప్పుడైనా తిరుగుతానని స్వతంత్ర భరద్వాజ్ బాహాటంగా ప్రకటించుకున్నాడు. ఈ దాడులను అడ్డుకోకుంటే సంభవించే ప్రమాదకరమైన పరిణామాలకు చరిత్ర ఒక సూచిక.
ఇది కేవలం సంజయ్ ఆజాద్, నిశూ ఆజాద్ అనే ఇద్దరు తండ్రీకూతుళ్ల పోరాటం కాదు. ‘ఇది ఆజాదీ (స్వేచ్ఛ) కోసం; ఆకలి, అవమానాల నుంచి స్వేచ్ఛ కోసం; దోపిడీ, పీడనల నుంచి స్వేచ్ఛ కోసం; విద్వేష విషం నుంచి స్వేచ్ఛ కోసం; ఆధిపత్య అహంకారం నుంచి స్వేచ్ఛ కోసం పోరాటం’ అని హిందీ కవి బాబా నాగార్జున్ అరవై ఏళ్ల క్రితం రాసిన పై కవిత ఈ పంక్తులతో ముగుస్తుంది: ‘‘తగలబడి మోడైన చెట్టు కొమ్మ మీద కూర్చున్న కోయిల గొంతెత్తి పాడింది/ ఏమీ చేయలేక నిలబడిపోయింది పాలకుల తుపాకీ’’.
సుధా కిరణ్
(కవి, రచయిత)
ఈ వార్తలు కూడా చదవండి..
సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు
గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్
పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News