నివాసయోగ్య నెలవులుగా నగరాలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 02:03 AM
ఢిల్లీ ఏమవుతోంది? నా ఢిల్లీ కోసం రోదిస్తున్నాను. ఏదీ ఆ ఢిల్లీ? అభివృద్ధి అస్తవ్యస్తతలో ఆత్మను కోల్పోయిన నగరమది. అవును, ఢిల్లీ నా ఊరు. మా కుటుంబంలో అనేక తరాల వారి చరిత్ర ఢిల్లీతో...
ఢిల్లీ ఏమవుతోంది? నా ఢిల్లీ కోసం రోదిస్తున్నాను. ఏదీ ఆ ఢిల్లీ? అభివృద్ధి అస్తవ్యస్తతలో ఆత్మను కోల్పోయిన నగరమది. అవును, ఢిల్లీ నా ఊరు. మా కుటుంబంలో అనేక తరాల వారి చరిత్ర ఢిల్లీతో ముడివడివున్నది. విమల వాయు వీచికలు, నిర్మలమైన నీరు, మనిషి ప్రాథమిక శ్రేయస్సుకు అవసరమైన ప్రతిదీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే ఆరాటం నడిపించిన నా వృత్తి జీవితాన్ని చాలావరకు ఈ ఢిల్లీ నగరంలోనే గడిపాను. ఎటు చూసినా, ఎల్లెడలా చెత్తా చెదారం; రోడ్లపై గుంతలు; వాహనాల రాకపోకల్లో క్రమ రాహిత్యం; రద్దీ, రద్దీ, రద్దీ. చట్టవిరుద్ధంగా నిర్మాణమైన భవనాలు; రోడ్ల నిర్వహణను అస్తవ్యస్తం చేస్తున్న వాహనాల పార్కింగ్; నగరవాసుల తాగునీటి అవసరాలను బొత్తిగా తీర్చలేకపోతున్న మంచినీటి సరఫరా; చెంతనే సాగుతున్న, ఎవరికీ పట్టని యమునానది ఇప్పుడు ఒక మురుగునీటి వాహిని... సరే ఢిల్లీని అపఖ్యాతిపాలు చేసిన వాయుకాలుష్యం... నగర సమస్యలు ఎన్నని చెప్పను? వాటికి పరిమితి లేదు. అయినా చెప్పడమెందుకు? ఢిల్లీవాసులకు అవి నిత్య అనుభవాలే కదా. ఇప్పుడు మనం అడగవలసిన ప్రశ్నలు– పట్టణ సేవల పరిస్థితిని సరి చేయడం సాధ్యమవుతుందా? లేక బాగు చేయలేనంతగా ఆ సేవలు అధ్వానమైపోయాయా? ఆవేదనతో ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. పౌర సదుపాయాలు మృగ్యమైపోవడం పట్ల ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేయాలి? ఈ అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకుని మన సువిశాల దేశంలో మరే నగరమూ మరో ఢిల్లీలా కాకుండా జాగ్రత్త పడాలని చెప్పేందుకే నా యీ గోస అంతా. మరింత స్పష్టంగా చెప్పాలంటే భారతీయ నగరాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఢిల్లీలా మహా అస్తవ్యస్త ప్రదేశాలుగా పరిణమించకుండా మనం జాగరూకత వహించాలి.
ఇది చాలా ముఖ్యం. పట్టణీకరణే వైట్ కాలర్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ప్రాథమిక ఆలంబనగా ఉన్నది. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వలసలను గతంలో వలే ఆమోదించడం లేదు. ఈ పరిస్థితుల్లో యువ, నిపుణ కార్మికులకు స్వదేశంలోనే జీవనోపాధి అవకాశాలు అందివస్తున్నాయి. అయితే యువ భారతీయులకు మంచి ఆదాయాన్ని సమకూర్చడమే కాదు, అంతకంటే ముఖ్యమైన అవసరాలను తీర్చవలసి ఉన్నది. వారికి, వారి పిల్లలకు నాణ్యమైన జీవన పరిస్థితులను కల్పించాలి. మాల్స్, రెస్టారెంట్స్, నైట్ లైఫ్ మాత్రమే కాదు కొన్ని ప్రాథమిక అవసరాలను తప్పనిసరిగా సమకూర్చాలి. నిర్మలమైన నీరు, స్వచ్ఛమైన గాలి, విద్య, గృహ వసతి లేకపోతే ఎలా? ప్రతిభావంతులను ఆకర్షించి వారి సేవలను స్థిరంగా ఉపయోగించుకునేందుకు ఇవన్నీ అవసరం. మరింత స్పష్టంగా చెప్పాలంటే జీవనయోగ్యమైన నగరాలను అభివృద్ధిపరచుకోవాలి. నగరాలలో జనాల చలనశీలతకు ప్రణాళికలు రూపొందించాలి. రోడ్లు నిర్మించడమే సరిపోదు. ఇది చాలా కీలకమైన విషయం.
ప్రజల చలనశీలత అనేది వారి గృహవసతి, జీవనోపాధులతో ముడివడి ఉన్నది. నగరాలు పెరుగుతున్న కొద్దీ భూమి ధరలు కూడా పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలే చిన్న ఫ్లాట్‌ను కూడా కొనుక్కోలేని క్లిష్ట స్థితిలో ఉంటే, ఇక పేదల సంగతి చెప్పేదేముంది? నగర సేవా రంగానికి వీరు కీలకమైనవారు. ‘అనధికారిక’ చట్టవిరుద్ధ కాలనీలలో లేదా మురికివాడల్లో వీరు నివసిస్తున్నారు. విషాదమేమిటంటే వీరు నివసించే ప్రాంతాలు నగర పర్యావరణ పరిరక్షణకు కీలకమైనవి. సాధారణంగా హరిత ప్రాంతాలు, నీటి వనరుల సమీపాన అవి ఉంటున్నాయి.
దుర్భర జీవన పరిస్థితులను భరించడం, నగర జీవన యాతనలను సహించడం నగరవాసులకు తప్పనిసరి. గృహ వసతి చౌకగా లభించే శివారు ప్రాంతాల్లో నివసించడం వారికి అనివార్యమైపోయింది. అక్కడి నుంచి పని ప్రదేశాలకు వారు రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. మధ్యతరగతి ప్రజలు కూడా నగర శివారు ప్రాంతాల్లోనే ఉంటున్నారు. నగరంలో ఉన్న తమ కార్యాలయాలకు వెళ్లేందుకు, తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు వారు చాలావరకు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు. దీని వల్ల నగరంలోని రోడ్లపై రద్దీ పెరుగుతోంది. ఏ విధంగా చూసినా నగరమే అన్ని విధాలా నష్టపోతోంది.
నగరాలు పెరుగుతున్నాయి.. విస్తరిస్తూ పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలలో అతి ముఖ్యభాగం ఆ అభివృద్ధికి ‘వెన్నెముక’గా చెప్పితీరాల్సింది ప్రజా రవాణా సదుపాయాలు. శివారు ప్రాంత ప్రజలు నగరంలోని తమ పని ప్రదేశాలకు వచ్చి వెళ్లేందుకు అనువుగా ఈ రవాణా సదుపాయాలను ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిపరచాలి. ప్రజలు నడిచి వెళ్లగలగాలి లేదా సైకిల్‌పై వెళ్లాలి. బస్సుల్లో ప్రయాణించాలి లేదా మెట్రో సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. అవసరమైన పక్షంలో మాత్రమే కారును ఉపయోగించుకోవాలి. ఒక ఆధునిక నగరం.. నిత్యం రవాణా స్తంభనతో సతమతమవుతూ ఉండే ఢిల్లీ, బెంగళూరులా ఉండకూడదు సరే, ఇతర మౌలిక సదుపాయాల– విద్య, వైద్యం, మంచి నీరు మొదలైనవి– ఆవశ్యకతను విస్మరించలేము. నగరాలను నివాసయోగ్యంగా చేసేవి ఇవే కదా. అయితే మాస్టర్ ప్లాన్‌ను అమలుపరచడం కంటే మరేదీ అత్యంత ముఖ్యమైనది కాదు. ఢిల్లీ మాస్టర్ ప్లాన్ బహుశా బ్రిటిష్‌వారి కాలం నాటిదై ఉంటుంది. ఉల్లంఘనే దాని ఆచరణగా ఉన్నది సుమా!
చెప్పవచ్చినదేమిటంటే పట్టణ పరిపాలన స్వరూప స్వభావాలపై దృష్టి కేంద్రీకరించడం చాలా ముఖ్యం. మన నగరాలలో పూర్తిగా అసంబద్ధ పాలనా పద్ధతులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు.. ఆ తరువాత వారు తమ బాధ్యతలు నిర్వర్తించడానికి వీలులేకుండా చేస్తారు. తత్ఫలితంగా తమకు ఏది లాభప్రదమో అది చేసేందుకే వారు ప్రాధాన్యమిస్తారు. దీంతో అస్తవ్యస్తత మరింత పెరుగుతుంది. దేశ పాలక వర్గాలు నివసించే న్యూఢిల్లీలో ఆ నగరానికి ప్రజాస్వామ్య పాలన పనిచేయకుండా చేస్తున్నారు. కొంతమంది అధికారులు నగర పాలన చేస్తున్నారు. ఈ అలవాటు ఇతర నగరాలకు కూడా వేగవంతంగా వ్యాపిస్తోంది. పట్టణీకరణ స్వభావం వనరుల దక్షతతో ఉండాలి, జీవనోపాధులను సంరక్షించాలి, పౌరుల ప్రాథమిక అవసరాలను తీర్చాలి. బాలలకు పాఠశాలలు, ఆట మైదానాలు సమకూర్చేదిగా ఉండాలి. ఢిల్లీ తరహా నగర నిర్మాణ స్వప్నాలను త్యజించినప్పుడే అవి సుసాధ్యమవుతాయి.
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ డైరెక్టర్ జనరల్,
‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)
ఈ వార్తలు కూడా చదవండి..
స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఊతం: మంత్రి నారాయణ
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News