మోదీ ఘటనా ఘటన సమర్థత ఏమైంది?
ABN , Publish Date - Aug 12 , 2026 | 03:26 AM
జూలై 20న దేశ రాజధానిలో విద్యార్థులపై పోలీసులు రకరకాల ఆయుధాలతో జరిపిన దాడులు సృష్టించిన గాయాల నుంచి చాలా మంది కోలుకునే ఉంటారు. అయితే అప్పటి నుంచీ పార్లమెంటు సమావేశాలు మాత్రం దాదాపు...
జూలై 20న దేశ రాజధానిలో విద్యార్థులపై పోలీసులు రకరకాల ఆయుధాలతో జరిపిన దాడులు సృష్టించిన గాయాల నుంచి చాలా మంది కోలుకునే ఉంటారు. అయితే అప్పటి నుంచీ పార్లమెంటు సమావేశాలు మాత్రం దాదాపు స్తంభించిపోయాయి. విద్యార్థులపై పోలీసు దాడులకు ఆదేశాలు ఎవరు జారీ చేశారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వచ్చి చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ వర్షాకాల సమావేశాల్లో సజావుగా జరగడమే లేదు.
ఒకవైపు దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుండగా మరో వైపు పార్లమెంటులో నినాదాలు రాజకీయ వాతావరణాన్ని స్తంభింపచేస్తున్నాయి. ‘పేపర్ చోర్, గద్దీ ఛోడ్’ అని నిన్నటివరకూ నినదించిన ప్రతిపక్షాలు ఇప్పుడు ‘అమిత్ షా జవాబ్ దో, చందాచోర్, గద్దీ ఛోడ్’ అని అని నినాదాలు చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అధికార పార్టీ సభ్యులు కూడా మంగళవారం మకరద్వారం వద్ద ప్రతిపక్షాలను నిలదీస్తూ ‘రాహుల్ గాంధీ జవాబ్ దో..’ అని నినాదాలు చేశారు. ఇండియా కూటమి భాగస్వామి జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో ఉన్న జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీతో అధికార పార్టీ సభ్యులకు అవకాశం లభించింది. నినాదాలు చేస్తున్న పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య పార్లమెంటు భద్రతా సిబ్బంది గోడలా నిలుచోవలసి వచ్చింది. ఈ రణగొణ ధ్వనుల మధ్య కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వార్తలు కూడా కొట్టుకుపోయినట్లు కనిపిస్తోంది.
వర్షాకాల సమావేశాల్లో ఏవో అద్భుతాలు జరుగుతాయనుకున్నవారు, మోదీ సర్కార్ అనుకున్న విధంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎఫ్‌సీఆర్ఐ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అనుసంధాన్ బిల్లు మొదలైన వాటిని ఆమోదం పొందేలా చేయగలుగుతుందని భావించినవారు ఇప్పుడు నిరాశ చెందే ఉంటారు. ఈ బిల్లులను ఆమోదింపచేసేందుకు నరేంద్రమోదీ టీమ్ రంగం సిద్ధం చేసింది. బెంగాల్‌లో విజయం తర్వాత రెచ్చిపోయిన ఉత్సాహంతో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎంపీలను చీల్చి ఒక అనామక పార్టీలో చేరేలా చేశారు. ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన ఎంపీలను తమ వైపుకు లాగారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపునకు తిప్పుకున్నారు. తమిళనాడులో విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతునిచ్చిన తర్వాత ఇండియా కూటమినుంచి వైదొలగిన డీఎంకేతో బేరసారాలు ఆడారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీతో కూడా మంతనాలు జరిపారు. ఏ పార్టీనైనా ఎప్పుడైనా చీల్చగల, ఎవరినైనా దెబ్బతీయగల నరేంద్రమోదీ ఏదైనా సాధించగలరని ఆయన మద్దతుదారులు ఉప్పొంగిపోయారు. మోదీకి దాసోహమై, ఆయన చర్యలకు భయభ్రాంతులై ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఇక ఆయనకు తిరుగులేదని, ఆయన అడుగుజాడలను అనుసరించడం మినహా చేయగలిగేదేమీ లేదనే నిర్ధారణకు వచ్చారు.
నిజానికి గత రెండేళ్ల నుంచీ అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలు విదేశీ విధానం విషయంలో మోదీని ఆత్మరక్షణలో పడవేస్తున్నాయి. గత రెండు నెలలుగా దేశ వ్యవహారాలలో సంభవించిన అనేక పరిణామాలు ఆయన కల్పించిన భయోపేత వాతావరణాన్ని తుత్తునియలు చేశాయి. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, విద్యార్థుల ఆందోళన, పిల్లలు మోదీని అవహేళన చేయడం, ఆయన ప్రతి చర్యనూ ప్రశ్నించడం మోదీ అజేయశక్తిని మొట్టమొదటసారి దెబ్బతీసింది. ఈ ఆందోళన ఫలితంగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి రావడం దేన్నైనా లెక్కచేయని తత్వాన్ని మార్చుకునేలా చేసింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రకంపనలు సృష్టించడంతో బీజేపీ, సంఘ్‌ను పునరాలోచనలో పడేలా చేశాయనడంలో సందేహం లేదు. రైతు ఉద్యమం మాదిరే ఈ ఉద్యమాన్ని కూడా అణిచివేస్తే సద్దుమణిగి పోతుందనుకున్నవారు కింకర్తవ్య విమూఢులయ్యారు. పరాన్న జీవులు, బొద్దింకలు అని విమర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విద్యార్థుల కేసులు వినడం ప్రారంభించారు. తొలుత అతుల్ లిమాయే వంటి ఆర్ఎస్ఎస్ నేతలు విద్యార్థుల ఆందోళనను దేశద్రోహం క్రింద అభివర్ణించినా ఆ తర్వాత మోహన్ భాగవత్ ఆలస్యంగానైనా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ‘పక్షులకు కూడా పొడిచే హక్కు ఉంది’ అని ఆయన తాజాగా ప్రకటించారు. ‘మనం వారి మాట వినాలి. వారితో మనం మాట్లాడలేకపోయాం. అందుకే వారు నిరసన తెలిపారు.’ అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా యువతను మెప్పించే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లు, రీల్స్ చేయడం మొదలుపెట్టారు. మంత్రులు సైతం విద్యార్థుల పరిభాషలో డెలులూ, ఫోమో అంటూ మాట్లాడసాగారు. ఈ నెల 8న ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాలని, నిజమైన పరిష్కారాల కోసం ధైర్యం ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చేసింది అదే కదా! వారే కనుక ప్రశ్నించే ధైర్యం చేయకపోతే ప్రశ్న పత్రాల లీక్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేందుకు ఆగమేఘాలపై బిల్లును ప్రవేశపెట్టేవారే కాదు. ఈ నెలరోజుల సమావేశాల్లో పార్లమెంటులో చెప్పుకోదగినదేమైనా ఉన్నదంటే ఈ బిల్లు ఆమోదం పొందడం మాత్రమే.
మన సనాతన ధర్మంలో ప్రశ్నకు అత్యంత విలువైన స్థానం ఉన్నదని బీజేపీ సిద్ధాంతకర్తలకు వేరే చెప్పనక్కర్లేదు. భగవద్గీత, ఉపనిషత్తులు ప్రశ్నకు ప్రాధాన్యమిచ్చాయి. సత్యాన్ని అన్వేషించే క్రమంలో ప్రశ్నించే స్వేచ్ఛకు, అన్వేషణకు ఇచ్చిన విలువ మన సంస్కృతిలో మరి దేనికీ లేదు. తాము తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అనైతిక పనులు, తాము కుప్పకూల్చిన వ్యవస్థలు, అవినీతి కార్యకలాపాలను ప్రశ్నించాలంటే భయపడే పరిస్థితి ఇంతకాలం ఎదురయింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో కొద్దిగా మార్పు వస్తున్నట్లు కనపడుతోంది.
విద్యార్థుల ఆందోళన సద్దుమణిగిందో, లేక కొత్త ప్రాంతాల్లో తలెత్తుతుందో, లేక ఇతరేతర శక్తులకు ప్రోత్సాహం కల్పిస్తుందో చెప్పలేము కాని మోదీ విజృంభణ వల్ల దెబ్బతిన్న ప్రతిపక్షాలకు మాత్రం ఎక్కడలేని ఉత్సాహాన్ని కల్పించింది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఘన విజయం, ఇండియా కూటమి పార్టీల్లో చీలిక, విభేదాల వల్ల దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతిపక్షాలు ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్‌గాంధీ నిర్వహించిన ‘ఛాత్రోంకి ఘూంజ్’కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరు కావడం కీలక పరిణామంగా భావించవచ్చు. రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు సృష్టించిన మోదీ వ్యతిరేకతను తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే పార్లమెంట్‌లో ఆద్యంతం వేడిని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడా వేడి వీధుల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నది.
సున్నా కన్నా ఎంత ఎక్కువైనా కాంగ్రెస్‌కు మంచిదే. కాని శిఖరస్థాయికి చేరుకున్న బీజేపీకి మాత్రం పడిపోకుండా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ తిరుగులేని నేతగా ఉన్న నరేంద్రమోదీకి విద్యార్థులు, ప్రతిపక్షాలు మాత్రమే సమస్య కాదు. పార్టీలోనూ, సంఘ్ లోనూ ఆయనకు అంతర్గత సమస్యలు లేకపోలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఆయన నియమించిన నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీటులో పార్టీ ఓడిపోవడం సాధారణ విషయం కాదు. నిజానికి మోదీ కీలకమైన పదవుల్లో నియమించిన నేతల విషయంలో పార్టీలో అసంతృప్తి రగులుతూనే ఉన్నది. ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో తిరుగుతూ, పార్టీ కార్యదర్శి స్థాయి నేత అపాయింట్‌మెంట్ కోసం కూడా గంటలతరబడి వేచి చూసిన రేఖాగుప్తాను ముఖ్యమంత్రిగా నియమించడంపై తీవ్ర అసంతృప్తి ఉన్నది. ఉజ్జయిని భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాతే మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఫలానా నేత ఉన్నారన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అసోం, పశ్చిమబెంగాల్‌లో ఇతర పార్టీల నుంచి వచ్చి ముఖ్యమంత్రులైనవారి గురించి తప్ప బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనామక నేతల పేర్లు చెప్పేందుకు కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రుల సంగతి అటుంచితే ఇటీవల కేంద్రంలో ఇద్దరు మంత్రులు వివాదాస్పదులయ్యారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వస్తే, పర్యావరణ మంత్రి భూపేంద్రయాదవ్ కార్యాలయంలో అనేకమందిని పీఎంఓ చెప్పాపెట్టకుండా తొలగించింది. ఇందుకు ఏ అవినీతి కార్యకలాపాలు కార ణమో ఎవరూ చెప్పడం లేదు. గత ఆరునెలలుగా కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, నితిన్ నబీన్ తన టీమ్‌ను ప్రకటిస్తారని పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ మార్పులు ఎప్పటికప్పుడు వాయిదాపడుతూనే ఉన్నాయి. ఈ మార్పులను పార్టీలో కొందరు ప్రతిఘటించినందువల్లే అవి ఆగిపోయాయని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీలో పరిస్థితులు అనుకున్నంత సవ్యంగా లేవని ఢిల్లీ అధికార నడవాలలో తిరిగే వారికి అర్థమవుతుంది. దీనికి తోడు అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ బీజేపీ నైతిక మూలాల్ని దెబ్బతీసిందనడంలో సందేహం లేదు.
ఇంతకీ మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఎప్పుడు ప్రవేశపెడతారు? కేరళ, తమిళనాడు ఎన్నికల తర్వాత తెరపైకి వచ్చిన ఎఫ్‌సీఆర్ఐ బిల్లును ఆమోదింపచేయగలుగుతారా? రెండు రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేమ్స్ డేవిడ్ వాన్స్ మోదీకి ఫోన్ చేయడానికి, ఈ బిల్లు ప్రవేశపెట్టకపోవడానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ ప్రశ్నలకు జవాబులు రావాల్సి ఉన్నది. నిజానికి సమస్య బిల్లులు ఆమోదింపచేయకపోవడం కాదు, ఆ బిల్లులు ఆమోదింపచేసేందుకు ప్రజాస్వామికంగా ప్రయత్నాలు చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లడమే. సమస్యలపై ఆందోళనను వ్యక్తం చేసిన వారిని తూష్ణీకరించడమే కొత్త సమస్యలకు దారితీస్తోంది. మోదీ వ్యవహారశైలి ఆయన సహజ స్వభావమే కావచ్చు కాని ఆ స్వభావం అన్ని వేళలా విజయం సాధించబోదని మారుతున్న కాలం చెబుతోంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
వార్తలు కూడా చదవండి...
'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్
ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?
Read Latest AP News And Telangana News And National News
And Telugu News