బ్రిక్స్‌లో ‘విశ్వగురు’ ఏమి సాధిస్తుంది?
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:22 AM
‘నేనూ అమెరికాలో దక్షిణాదికి చెందినవాడినే, మీరూ ఇండియాలో దక్షిణాదికి చెందినవారే’ అని 1994లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అప్పటి భారత ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు స్వయంగా ఫోన్ చేసి....
‘నేనూ అమెరికాలో దక్షిణాదికి చెందినవాడినే, మీరూ ఇండియాలో దక్షిణాదికి చెందినవారే’ అని 1994లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అప్పటి భారత ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. దేశంలో ఉధృత ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి అమెరికన్ కార్పొరేట్ శక్తుల దృష్టి భారత్ పైకి మళ్లించేలా చేసిన తర్వాత జరిగిన సంభాషణ ఇది. ఆ తర్వాత నరసింహారావు స్వయంగా అమెరికా వెళ్లి క్లింటన్‌తో విస్తృత చర్చలు జరిపారు. భారత్‌ను అమెరికా దేనిగురించైనా ఒత్తిడి చేసిందా అన్న అర్థంలో విలేఖరులు ‘whether your arm was twisted?’ అని పీవీని అడిగారు. అప్పుడు ఆయన తన చేయిని చూపించి ‘చెక్కుచెదరకుండా ఉన్నది. మీ అధ్యక్షుడు కనీసం తాకను కూడా లేదు..’ అని జవాబిచ్చారు. ‘మీరు ఆ మాట అన్నందుకు మీకు ఎంతో కృతజ్ఞుడిని ప్రధాని గారూ’ అని క్లింటన్ వెంటనే వ్యాఖ్యానించారు. భారత్–అమెరికా మైత్రిలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన పీవీ, ఆ అగ్రరాజ్యంతో సంబంధాలను పెట్టుబడులు, టెక్నాలజీకే పరిమితం చేస్తూనే రష్యా, చైనా, ఇరాన్, అరబ్ దేశాలతో సంబంధాలను పటిష్ఠం చేశారు. వ్యూహాత్మక స్వతంత్రత, బహుళ దిశలతో కూడిన దౌత్యనీతిని అవలంబించిన పీవీ భారత క్షిపణి కార్యక్రమానికి, అణ్వస్త్ర పరీక్షలకు రంగం సిద్ధం చేస్తూనే వచ్చారు. ఆయన తర్వాత ప్రధానమంత్రి అయిన వాజపేయి... అమెరికా ఆంక్షలకు వెరవకుండా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. చివరకు అమెరికాయే భారత్‌కు మళ్లీ స్నేహహస్తం చాచే పరిస్థితులు కల్పించారు. క్లింటన్ భారత్‌లో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు 22 సంవత్సరాల తర్వాత భారత్‌లో పర్యటించడం అదే మొదటిసారి.
ఈ పరిణామాలు ఏమి నిరూపించాయి? ప్రపంచ రాజకీయాల్లో భారత్‌ను ఎవరూ శాసించలేరని, ఎవరైనా శాసించే పరిస్థితులు వస్తే భారత్ తన మార్గం తాను అవలంబిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ‘భారతదేశానికి సహజసిద్ధంగా అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించగలిగే శక్తి ఉన్నది. ఇండియా చరిత్ర, నాగరికత, భౌగోళిక పరిస్థితులే అందుకు కారణం’ అని మన తొలి ప్రధాని పండిట్ నెహ్రూ 1949లోనే ప్రకటించారు. అయితే ఇవాళ అంతర్జాతీయ దౌత్యంలో ఒక పరిణామాత్మక సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం.
అమెరికా, సోవియట్ ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కూడా భారతదేశం అలీనోద్యమాన్ని ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా వ్యవస్థీకృతం చేసింది. ఆ తర్వాత అనేక కీలక అంతర్జాతీయ వ్యవస్థల రూపకల్పనలో ప్రముఖ స్థానం పోషించింది. 2009లో ప్రధాని మన్మోహన్‌సింగ్ హయాంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాలతో బ్రిక్స్ ఆవిర్భావంలోనూ భారత్ కీలకపాత్ర పోషించడం ఆ సముజ్వల చరిత్ర కొనసాగింపే అనడం సత్యదూరం కాదు. ‘మనం ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితుల్లో కలిసికట్టుగా కార్యాచరణ చేపట్టాల్సిన అర్థవంతమైన అవకాశం మనకు లభించింది’ అని మన్మోహన్‌సింగ్ 2013లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించినప్పుడు వినే అవకాశం నాకు లభించింది. అదే ఏడాది బీజింగ్ పొలిమేరల్లో చైనా ప్రభుత్వం తమ కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ పార్టీ స్కూలు సభ్యులకు మన్మోహన్ సింగ్ ద్వారా పాఠాలు చెప్పించిన అపురూప కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. చైనా భావి నాయకులను తయారు చేసే ఆ పాఠశాలలో ఒక విదేశీ ప్రభుత్వాధినేతతో పాఠాలు చెప్పించడం ఒక అరుదైన ఘట్టం.
ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ షరతుల నేపథ్యంలో బ్రిక్స్ ఆధ్వర్యంలో 2012లో జరిగిన సదస్సులో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా మన్మోహన్ సింగ్‌దే. ఏ షరతులూ లేకుండా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి భారత్‌లో మెట్రో, ఆర్ఆర్‌టీఎస్, గ్రామీణనీటి పారిశుధ్యం వంటి అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు లభిస్తూనే ఉన్నాయి.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 11 నుంచి 14 తేదీల మధ్య జరుగుతున్న బ్రిక్స్ సమావేశాలు ఈ నేపథ్యంలోనే మనం అర్థం చేసుకోవల్సి ఉన్నది. 2014లో నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత పీవీ, మన్మోహన్‌సింగ్ హయాంలో నెలకొల్పిన బహుళ సంబంధాల దిశకు భిన్నంగా అమెరికాను అధికంగా ఆలింగనం చేసుకున్నారనే విమర్శలు వచ్చినప్పటికీ ఇవాళ భారత్ తన అడుగులను సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని గ్రహించినట్లు కనపడుతోంది. బ్రిక్స్ ఇప్పుడు ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్టుతో సహా 11 దేశాలకు విస్తరించింది. మరో 10 దేశాలను భాగస్వామ్య దేశాలుగా చేర్చుకున్నారు. ప్రపంచంలో 50శాతానికి పైగా జనాభాకు ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది. గ్లోబల్ జీడీపీలో బ్రిక్స్ దేశాల వాటా ఇంచుమించు 40శాతంగా ఉన్నది. ఇరాన్‌పై దాడి, అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు, అమెరికా ఫస్ట్ పేరుతో విపరీత విధానాల ద్వారా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల ఆర్థిక ప్రయోజనాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లకల్లోలం చేస్తున్న పరిస్థితుల్లో బ్రిక్స్ ఒక బలమైన వ్యవస్థగా ప్రభవిస్తుందనడంలో సందేహం లేదు. ఇవాళ అమెరికా ధోరణిని పొరుగు కెనడాతో పాటు సుదూర ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా ప్రతిఘటిస్తున్నాయి.
ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు భూమికగానే గత నెలాఖరులో కిర్గిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సు జరిగింది. నిజానికి 2023లో ఢిల్లీలో ఎస్‌సీఓ సదస్సు జరగాల్సి ఉండగా, అమెరికాతో ఘర్షణ పడే పరిస్థితుల్లో భారత్ లేకపోవడంతో వ్యూహాత్మకంగా ఆన్‌లైన్ సమావేశం జరపాల్సి వచ్చింది. అయితే తాజా సమావేశంలో ఇరాన్ భూభాగంపై జరిగిన సైనిక దాడులను ఖండిస్తూ, పశ్చిమాసియా స్థిరత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడంలో భారత్ చొరవ చూపడం అత్యంత కీలక పరిణామమని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యవస్థలో అన్ని దేశాలకూ సమాన ప్రాతినిధ్యం ఉండాలని, అభివృద్ది చెందిన దేశాలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ఆర్థిక స్వావలంబనతో పాటు బహుళ ధ్రువ వ్యవస్థ ఏర్పడాలని భారత్ ప్రతిపాదించడం విస్మరించదగిన విషయం కాదు.
బ్రిక్స్ న్యూఢిల్లీ సదస్సులో రష్యా, చైనాలతో పాటు ఇతర దేశాలను భారత్ ఎంత మేరకు ప్రభావితం చేయగలదో చూడాల్సి ఉన్నది. వెస్ట్‌కు వ్యతిరేకం కాకుండా అదే సమయంలో వెస్ట్ మాత్రమే ప్రపంచ దేశాలను శాసించకుండా ఉండాలనే తన వైఖరిపై చైనా, రష్యాలను బ్రిక్స్ సమావేశంలో భారత్ ఒప్పించడమంటే కత్తిమీద సాము చేయడం వంటిది. అమెరికా డాలర్‌కు పోటీగా బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా భారత్ అంగీకరించే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికే స్థానిక కరెన్సీల ద్వారా బ్రిక్స్ దేశాల్లో వాణిజ్యం జరుగుతున్న రీత్యా యూపీఐ వంటి వ్యవస్థల అనుసంధానం ద్వారా దేశాల మధ్య వేగవంతమైన డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టాలని భారత్ ప్రతిపాదిస్తోంది. డాలర్ పెత్తనాన్ని బలంగా ఎదుర్కోగలిగిన పరిస్థితులూ, అవసరమూ లేదని మనదేశం భావిస్తోంది. భారత్ యథా ప్రకారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోను, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల్లోనూ సంస్కరణలను కోరుతోంది. వీటిపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉన్నది.
అన్నిటికన్నా భారత్‌కు ముఖ్యమైనది చైనా ఆధిపత్యాన్ని సమతుల్యం చేయడం. బ్రిక్స్ పూర్తిగా చైనా ప్రభావంలోకి వెళ్లకుండా భారత్ వీలైనంత మేరకు ప్రయత్నాలు చేస్తుందనడంలో సందేహంలేదు. అంతేకాక బ్రిక్స్ వేదికపై చైనాతో ఏర్పడే సంబంధాల ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించి, ప్రశాంత పరిస్థితులను కల్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చైనా సైనిక అధికారులతో భారత సైనికాధికారులు సరిహద్దుల్లో చర్చలు జరపడం ఇందుకు నిదర్శనం. బ్రిక్స్‌లో ఇరాన్, యూఏఈ వంటి దేశాల భాగస్వామ్యం మూలంగా భారత్‌కు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చమురు, ఇంధన భద్రత, సముద్ర వాణిజ్య మార్గాలు, గల్ఫ్ దేశాలతో ఆర్థిక సంబంధాలు పటిష్ఠం చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేగాక బ్రిక్స్ మూలంగా లిథియం, రేర్ ఎర్త్, నికెల్ వంటి కీలక ఖనిజ వనరులపై పరస్పర సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీకండక్టర్లు, సౌర, పునరుత్పాదక ఇంధన వ్యవస్థల నిర్మాణానికి దోహదం కలుగుతుంది.
సమావేశాలకు కొద్ది రోజుల ముందు 7.8శాతం అభివృద్ధి రేటు గురించి స్వయంగా ప్రకటించిన నరేంద్రమోదీ అభివృద్ధి చెందిన దేశాల్లో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవాలనుకుంటున్న విషయం స్పష్టమవుతోంది. ఇటీవల దేశాన్ని కుదిపివేసిన విద్యార్థుల ఆందోళనలు, ద్రవ్యోల్బణం, ఉపాధి వంటి సమస్యలు, ఇతరేతర రాజకీయ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్న నరేంద్రమోదీకి బ్రిక్స్ వంటి ప్రపంచ స్థాయి సదస్సును విజయవంతంగా నిర్వహించడం అత్యంత ఆవశ్యకం. ఈ సదస్సును భారత్‌లో నిర్వహించడం ద్వారా... ఇంట గెలవడంతో పాటు రచ్చ గెలిచానని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సును భారత్ సాధారణ దౌత్య వేదికగా భావించలేం. అది ప్రపంచ రాజకీయాల్లో భారత్ తన స్వతంత్ర స్థానాన్ని ఎంతవరకు స్థాపించుకోగలదో పరీక్షించే వేదిక కానున్నది. అందువల్ల ఈ సదస్సులో ఆమోదించే న్యూఢిల్లీ డిక్లరేషన్ భారత్‌కు అతి ముఖ్యమైనది. ప్రపంచ శక్తుల మధ్య కేవలం సమతుల్యం సాధించడమే కాదు, మన నాగరికత, చరిత్ర, నైతిక విలువల ద్వారా ప్రపంచ వ్యవస్థకు కొత్త విలువలను రూపొందించడంలో కీలకపాత్ర పోషించే శక్తిగా ఎదగగలిగినప్పుడే భారత్‌కు విశ్వగురు స్థానం లభించినట్లు భావించాల్సి ఉన్నది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు
గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్
పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News