Share News

మనిషి దప్పికతో దండిగా వ్యాపారం!

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:49 AM

ఈ నెల నుంచి ఎండలు పెరిగి, అనేక ప్రాంతాల్లో తాగు నీటి సమస్య తీవ్రం కానుంది. సామాన్య ప్రజలు కిలోమీటర్ల దూరం మండుటెండలో నడిచి వెళ్లి గుంతల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన...

మనిషి దప్పికతో దండిగా వ్యాపారం!

ఈ నెల నుంచి ఎండలు పెరిగి, అనేక ప్రాంతాల్లో తాగు నీటి సమస్య తీవ్రం కానుంది. సామాన్య ప్రజలు కిలోమీటర్ల దూరం మండుటెండలో నడిచి వెళ్లి గుంతల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత పాలక ప్రభుత్వాలు, నేటి మోదీ ప్రభుత్వం తాగునీటిని ప్రజలకు అందించే విధానాలు చేపట్టకుండా, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు కనుసన్నల్లో దేశ జల విధానాలు రూపొందించి, నీటి ప్రైవేటీకరణ విధానాలు అమలు జరిపాయి, జరుపుతున్నాయి. 2002లో భారత ప్రభుత్వం జాతీయ జల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం ప్రభుత్వాలు ఎక్కడ సాధ్యమైతే అక్కడ జల వనరుల ప్లానింగ్, అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఒక దశాబ్ద కాలంలోనే దేశంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో నడిచే ప్రాజెక్టుల సంఖ్య 300కు చేరింది. కానీ నీటి సరఫరాలో ఇతర దేశాల్లో లాగానే భారత్ లోనూ ప్రైవేట్ రంగం విఫలమైంది.

ప్రకృతి సహజమైన నీరు సకల జీవరాశులకు సహజంగా లభించాలి. ప్రజల తాగు, సాగు అవసరాలకు నీరు అందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. కానీ ఆ బాధ్యతను నెరవేర్చడంలో పాలక ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. ప్రభుత్వాల నుంచి నీటిపై హక్కులు పొందిన కార్పొరేట్‌ సంస్థలు నీటి ద్వారా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఫలితంగా సహజ నీటి వనరులపై ప్రజలు హక్కు కోల్పోతున్నారు. ఏ ప్రైవేటీకరణ అయినా బడా వ్యాపారుల కోసమే అన్నది వాస్తవం. ప్రైవేట్ కంపెనీలు అధిక మొత్తంలో లాభాలు గడించడమనే కోణం నుంచి నీటి నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాయి తప్ప ప్రజల అవసరాల కోణంలో ఆలోచించవు. దీర్ఘకాలిక మనుగడ దృక్పథం వాటికి ఉండదు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల ద్వారా బహుళజాతి సంస్థలు ప్రజా నీటి వనరులను ప్రైవేటీకరించి తమతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలని అర్ధవలస దేశాలపై విపరీతమైన ఒత్తిడి చేస్తున్నాయి.


నీటి వ్యాపారం ద్వారా బడా కంపెనీలు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుండగా, ప్రజల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. నేడు దేశంలో మూడు వేల ఆర్గనైజ్డ్ కంపెనీలు, మరో 12వేల అన్‌–ఆర్గనైజ్డ్ కంపెనీలు ఉన్నాయని అంచనా. పెప్సీ, కోకాకోలా బహుళజాతి కంపెనీలు పలు బ్రాండ్లతో నీటి వ్యాపారం ద్వారా వేలకోట్ల భారత సంపదను కొల్లగొడుతున్నాయి. 2022 నాటికి భారత్‌లో రూ.43,663 కోట్ల నీటి వ్యాపారం జరిగింది. 2025–26 నాటికి మార్కెట్ నీటి విలువ రూ.69వేల కోట్లుగా ఉంటుందని అంచనా. 2031 నాటికి సుమారు లక్షా 2వేల కోట్ల మార్కెట్ పరిమాణానికి చేరుకుంటుందని ఆర్థికవేత్తల అంచనా. బడా సంస్థల నీటి వ్యాపారం వల్ల 2050 నాటికి భారతదేశంలో నీటి సంక్షోభం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అనేక నివేదికలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే సహజ నీటి వనరులపై ప్రజలదే హక్కు అని, నీటి వనరులను ప్రైవేటీకరణ చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని, బహుళజాతి సంస్థల నీటి వ్యాపార అనుమతులు రద్దు చేయాలని ప్రజలు ఉద్యమించాలి.

బొల్లిముంత సాంబశివరావు

ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం

విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్

జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 01:49 AM