స్త్రీగాత్రం, పురుష పాకం.. గరివిడి లక్ష్మి
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:50 AM
ఈ పాటను 1984లో నా మిత్రుడు పాడుతుండగా విని ‘బాగుందే’ అనుకునేవాడిని. 1970 ప్రాంతంలోనే ‘మందులోడా ఓరి మాయలోడా! మామ రారా గోపి చిన్నవాడా’ అంటూ జనాలు పాడుకునేవారు. దానిని...
బయ్ బయ్యో! బంగారు రమణమ్మ
బాదం చెట్టు కాడ బోరింగు రమణమ్మ!.....
ఈ పాటను 1984లో నా మిత్రుడు పాడుతుండగా విని ‘బాగుందే’ అనుకునేవాడిని. 1970 ప్రాంతంలోనే ‘మందులోడా ఓరి మాయలోడా! మామ రారా గోపి చిన్నవాడా’ అంటూ జనాలు పాడుకునేవారు. దానిని ‘మందలోడా, ఓరి మాయలోడా’ అని కూడా పాడడం విన్నాను. ‘మందలోడ అయితేనేం, మందులోడ అయితేనేం.. బాణీ అదే! ఆ రోజుల్లో బుడబుక్కల పాట (జముకుల పాట, బోనెల పాట), నక్కజంగాల పాట, సన్యాసమ్మ పాట, సితార పట్టుకుని సాతాని వైష్ణవులు పాడే పాటలు, తత్వాలు, హరికథలు, బుర్రకథలు, తూర్పు భాగవతం ఇలా నేను పుట్టి పెరిగిన కళింగాంధ్ర పల్లె రేయింబవళ్లు కిలకిలారావాల తోటలా ఉండేది.
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నక్కలోళ్లు, ఈటీవాళ్లు, గారడీ వాళ్లు, గంగిరెద్దులోళ్లు, గంటసాయిబులు, కొమ్మదాసరులు, కోయదొరలు, మందలోళ్లు, మల్లికార్జునులు తదితర జానపదులతో పల్లె కళకళలాడేది. వారికి వేసిన పిడికెడు బియ్యమే జానపద కళాప్రస్థానానికి ఇంధనం. గౌరీ పౌర్ణిమ వస్తే, గౌరీ కల్యాణ ఉత్సవాలలో భాగంగా పులి వేషాలు, పగటి వేషాలతో, రాత్రిపూట కళాప్రదర్శనలతో కళింగాంధ్ర గ్రామాలు ఆనందభరితంగా సాగిపోయేవి.
ఇలాంటి సందడి మధ్యనే పుట్టిన రెడ్డి విజయలక్ష్మి (రెడ్డోలి బొట్టి?) తన పరిస్థితులు కల్పించిన కష్టజీవితాన్ని సహజాతమైన గానంతో మైమరపిస్తూ, లక్షలాది ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ప్రారంభించింది. ఈ నేలలో అక్కడక్కడా ఖండఖండాలుగా పాడుకుంటున్న పాటల్ని సేకరించి, తన గానంతో వాటికి ప్రాణం పోసి, వేదికల మీద నాట్యం చేయించింది. సొంతంగా పాటలు రాసి, బాణీలు కట్టుకొని, పాడి జానపదులను ఆనందసంద్రంలో ఓలలాడించింది. పగలంతా చెమటోడ్చి శ్రమించిన కర్షకులు, రైతుకూలీలు ఈమె ప్రదర్శనకు ఈలలు, చప్పట్లు, వన్స్ మోర్లతో నీరాజనం పట్టేవారు. వజ్రాలను వెలికితీసి సానబెట్టగల నిపుణి గరివిడి లక్ష్మి. ఆమె సేకరించి సజీవంగా నిలిపిన జానపద గేయాల కంటే, ఇంకా మిగిలిపోయిన ఉలాల పాటలు, ఉయ్యాల పాటలు, దంపుడు పాటలు వేలాదిగా ఉన్నాయి. శ్రామిక జనం ఉన్నన్నాళ్లూ మా నేలలో పాటలు ప్రవహిస్తూనే ఉంటాయి.
ఈ యమ్మి గొంతెత్తి పాడితే అప్పటికే పద్యనాటక రంగంలో బాలగంధర్వుడిగా బిరుదు పొంది, గానంలో శిఖరాయమానుడైన షణ్ముఖి ఆంజనేయరాజు పద్యాలాపన దిగదుడుపై పోయేది. ఇకపై ‘పద్యానికి విరామం, పాటకు పట్టాభిషేకం’ అంటూ రాజుగారు ఆమెను ఆశీర్వదించారంటేనే ఆమె గాత్ర స్థాయి ఎంతో ఊహించవచ్చు. ‘స్త్రీగాత్రం, పురుష పాకం’ అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. గాత్రంతో పాటు వేదికపై ఈమె చేస్తున్న నాట్య చాలనం, ఆయా విద్యలలో ‘మేమే ఉన్నతులం’ అనుకుంటున్న కళాకారులకు కూడా అందని విద్య. ‘నేనే తెల్లవార్లూ పాడి, ఆడేదాన్ని’ అని ఆమె చెప్పుకోవటంలో స్వోత్కర్ష ఇసుమంతైనా లేదు. అప్పటి ఈమె బుర్రకథల వీడియోలే సాక్ష్యాలు. అందుచేతనే షావుకారు జానకిలా, రెడ్డి విజయలక్ష్మి ‘గరివిడి లక్ష్మి’ అయింది. కళింగాంధ్రులు పాటకు చెవి కోసుకునే రకం. డి.వి సుబ్బారావును కూడా అందుకే ఆరాధించేవారు. ఇలా ప్రారంభమైన ప్రవాహం కళింగాంధ్రను ముంచి, ఆంధ్ర అంతటా వ్యాపించి, బరంపురం వరకూ సాగింది.
ఇంత ఉధృతంగా సాగుతున్న జానపదకళ మీద పండితుల పెదవి విరుపులు ఎదురుదాడి చేస్తూనే ఉండేవి. ‘మకరధ్వజుని కొంప ఒక చెంప కనిపింప, చీరగట్టిన దయా చిగురుబోడి’ అంటూ పద్యాలు చదువుకొని ఆనందించే, కళింగాంధ్ర పండితులూ, శిష్టులూ గరివిడి లక్ష్మివి బూతు పాటలనేవారు. బూతే ప్రకృతికి మూలమని తెలిసి కూడా! వామపక్షవాదులు, అభ్యుదయవాదులూ తక్కువేం తినలేదు. ఆమెకు వర్గ చైతన్యం లేదని వదిలేశారు. ఈమె చేయిపట్టి వర్గచైతన్యం కలిగించి ఉంటే ఆమె కథను ఇంకోలా రాసుకొనేవాళ్లం. వంగపండుకు ముందో వెనకో ఇంకా పాడుతూనే ఉండేది. నాజర్ బుర్రకథను సినిమాల్లో పెట్టినట్టే సందర్భానుసారంగా ఈమె బుర్రకథనూ పెట్టి ఉంటే ఆ సినిమా ఘనంగా ఆడేది, ఈమెకు మరింత కీర్తి దక్కేది. గద్దర్, వంగపండు, గోరటి ఇలా ఎంతోమంది తెలుగునాట పల్లెలో పుట్టి, చదువుకొని, పట్టణాలకు ఎదిగి పెద్ద పెద్ద స్థాయిలను, స్థానాలను అందుకున్నారు. వారికి, వారితో పాటు ఎంతోమంది కళాకారులకు ఎన్నెన్నో బిరుదులు, సన్మానాలు, అవార్డులు, పదవులు అందాయి. చదువులేని ఈ పల్లెటూరి పేదపిల్లకు, ఒంటరి మహిళకు ఎవరు ఇప్పిస్తారు అవార్డులన్నీ? అయినా మహానటి సావిత్రి తర్వాత అంతకుమించిన ఒక బయోపిక్ తాను జీవించి ఉండగానే చూడగలగడం గరివిడి లక్ష్మి పొందిన ఘనత. అందుకు కళింగాంధ్ర గర్విస్తోంది. పేరులోనే కళింగాంధ్ర సంస్కృతిని నింపుకున్నవాడు జమ్ము గౌరినాయుడు. ఇక్కడి సంస్కృతిలో అంతరించిపోతున్న పేరు. మట్టిలో పుట్టి పెరిగిన పేద కళాకారిణి జీవితాన్ని చలన చిత్ర రంగానికి ఎక్కించి, ఇక్కడి యాసను, మాండలికాన్ని చివరంటా కొనసాగించి, కళింగాంధ్ర తత్వాన్ని తెలుగునేలలో రెపరెపలాడించినవాడు. గరివిడి లక్ష్మి బుర్రకథకు అప్పటి యువత ఎలా ఉర్రూతలూగారో, అలాగే నేడు సినిమాహాల్లో యువతీ యువకులు ఉర్రూతలూగుతూ చేసే నృత్యహేల అద్భుత సందర్భం.
కళాతపస్సులో ఆనందిస్తూ గడిపిందే గానీ, తనవాళ్లే తనను నమ్మించి గోతులు తీస్తారని గరివిడి లక్ష్మి కానుకోలేకపోయింది. సినిమాలో పాడిస్తానన్న మోసపు హామీలు ఆమెను కృంగదీశాయి. ఇన్ని ఇక్కట్లను భరించలేక తన జీవితాన్ని నివృత్తి మార్గంలో నడిపించి, చీకటిలోకి జారిపోయింది. జమ్ము గౌరినాయుడు ఈ రోజు కాగడా వెలిగించి ఆ వెలుగులో ఈమెను తెలుగునేలంతా తిప్పకపోతే రెడ్డి విజయలక్ష్మి చరిత్రలో కరిగిపోయేది. మట్టిలో మగ్గుతున్న మరింతమంది గరివిడి లక్ష్ములు వెలుగులోకి రావాల్సిన సమయం ఇది.
గార రంగనాథం
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్ఈసీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News