Share News

అడుగడుగున గుడి ఉంది..

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:22 AM

ఈ మధ్య గుంటూరులోని స్వధర్మ సేవాసంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జి ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ ‘మా చిన్నప్పటికంటే ఇప్పుడు...

అడుగడుగున గుడి ఉంది..

ఈ మధ్య గుంటూరులోని స్వధర్మ సేవాసంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జి ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ ‘మా చిన్నప్పటికంటే ఇప్పుడు దేవాలయాల సంఖ్య చాలా పెరిగింది, భక్తులు సైతం పెద్దసంఖ్యలో ఆలయాలకు వెళుతున్నారు. అయినప్పటికీ, సమాజంలో అశాంతి, అభద్రత, అరాచకం పెరిగిపోయాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది.

ఏ ఆలయానికి వెళ్లినా భక్తులతో కిటకిటలాడిపోతున్నట్టుగానే, పుట్టేబిడ్డ మొదలు వృద్ధుల వరకు ఏదో రోగంతో బాధపడుతున్న ఫలితంగా ఆస్పత్రులూ కిటకిటలాడుతున్నాయి. అశాంతి, అభద్రత పెరిగిపోతూండటంతో కాస్తంత ప్రశాంతత ప్రసాదించమని జనం దేవుళ్ళ దగ్గరకు వెళ్లి మొక్కుకోవటం హెచ్చింది. ఫలితంగా గ్రామాలు మొదలు పట్టణాల వరకు ఆసుపత్రులు పాఠశాలల కంటే ఆలయాలు అధికంగా వెలుస్తున్నాయి. బాధలతో సతమతమవుతున్న ప్రజలకు దేవుడే దిక్కు అన్న పరిస్థితిని పాలకులు కల్పిస్తున్నారు. ఉన్న ఆలయాలు చాలవు అన్నట్లుగా మరిన్ని నిర్మాణాలకి అనుమతులు సైతం మంజూరు చేస్తున్నారు. ప్రపంచంలోనే సంపన్నుడైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం వితరణతో తెలుగురాష్ట్రాల్లోనే కాక, దేశవ్యాప్తంగా దేవాలయాలను నిర్మిస్తున్నారు. ‘తెలుగునాట భక్తి రసం/ తెప్పలుగా పారుతోంది/ డ్రైనేజీ స్కీములేక/ డేంజరుగా మారుతోంది’ అని అభ్యుదయ కవి గజ్జెల మల్లారెడ్డి ఏనాడో చెప్పాడు. అప్పటికంటే ఇప్పుడు భక్తిరసం మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. మల్లారెడ్డి కంటే నేడు అటువంటి గొంతులు పెరిగినా ఆ ఉధృతిని ఆపలేకపోతున్నాయి. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడుతున్న పాలకవర్గ పార్టీల విధానాల ఫలితంగా సమస్తమూ కాలుష్యం బారిన పడ్డాయి. ఆర్థిక అంతరాలు పెరిగి పేదలు మరింత పేదలుగా, ధనవంతులు కుబేరులుగా తయారవుతున్నారు. అత్యధికశాతం ప్రజలకు సరైన ఆహారం అందక, గతంలో కంటే రోగాలు పెరిగి, ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

తమ జీవితాలు కొడిగట్టిపోవటానికి ప్రభుత్వాల విధానాలే కారణమన్న సత్యం సాధారణ ప్రజలు గ్రహించనంతకాలం, పూర్వజన్మ పాపాలు, ఇప్పుడు పడుతున్న కష్టాలు పోవాలంటే దేవుడే దిక్కు అన్న భావనతో వారు ఉన్నంతకాలం గుళ్ళు కిటకిటలాడుతూనే ఉంటాయి. వారు ఆ మూఢనమ్మకంలో ఉన్నంతకాలం నాయకులను ప్రశ్నించరు, తిరుగుబాటు చేయరు. పాలకులకు కావలసిందీ ఇదే కనుక, గుళ్ళూగోపురాలను పోటీపడి మరీ నిర్మిస్తున్నారు, భక్తిరసాన్ని ఏరుల్లా ప్రవహింపచేస్తున్నారు.

ముప్పాళ్ళ భార్గవశ్రీ

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 05:22 AM