సీఈసీ అభిశంసన అవివేకమా?
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:48 AM
అభిశంసనకు అర్హుడు అయ్యేందుకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) ఇంకెంత అనుచితంగా వ్యవహరించాలి? పార్లమెంటులో జ్ఞానేశ్ కుమార్ (సీఈసీ)కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని...
అభిశంసనకు అర్హుడు అయ్యేందుకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) ఇంకెంత అనుచితంగా వ్యవహరించాలి? పార్లమెంటులో జ్ఞానేశ్ కుమార్ (సీఈసీ)కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని తీసుకువచ్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడాన్ని ఒక పత్రికా సంపాదకీయం తప్పుపట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజకీయ పక్షపాతాన్ని చూపుతున్నారని, సంయమనం లేకుండా ప్రవర్తిస్తున్నారని, ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని సకాలంలో ప్రారంభించకపోవడంతో పాటు అశాస్త్రీయంగా అమలుపరుస్తున్నారని సీఈసీపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఒకవైపు అంగీకరిస్తూనే, మరోవైపు అత్యున్నత రాజ్యాంగ అధికారిపై అభిశంసనకు పూనుకోవడం తమనుతాము బలహీనపరచుకోవడమే అవుతుందని ప్రతిపక్షాలను ఆ సంపాదకీయం మందలించింది. చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించుకునే ఒక రాజ్యాంగ ప్రక్రియ (అభిశంసన)ను ప్రతీకాత్మక రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వల్ల ఆ అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థతో ఘర్షణ మరింతగా తీవ్రమయ్యే ప్రమాదమున్నదని ఆ సంపాదకీయం హెచ్చరించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిశంసనకు రాజ్యాంగ నిర్దేశాలు ఏమిటో చూద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరిని ఏ కారణాలతో తొలగించవలసివస్తుందో అటువంటి కారణాలే సీఈసీ తొలగింపునకు కూడా అవసరమని, అంతేకాకుండా సర్వోన్నత న్యాయమూర్తి తొలగింపునకు అనుసరించిన పద్ధతులనే ఎన్నికల సంఘం ప్రధానాధికారి విషయంలోనూ అనుసరించాలని అధికరణ 324(5) స్పష్టంగా పేర్కొంది. ‘నిరూపిత దుష్ప్రవర్తన, అసమర్థత’ ఆధారంగా ఈ తొలగింపు ప్రక్రియను చేపట్టాలి. అయితే ఎన్నికల కమిషనర్ల ప్రవర్తనా సరళి ఏ విధంగా ఉండాలో రాజ్యాంగం నిర్దేశించలేదు. స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థగా ఎన్నికల సంఘం వ్యవహరించేందుకు వీలుగా ఎన్నికల కమిషనర్ల నియామకంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను సుప్రీంకోర్టు సుప్రసిద్ధ ‘అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు (2023) తీర్పులో నిర్దేశించింది. జస్టిస్ కేఎమ్ జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్న తీర్పును వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల నియామకం, విధుల నిర్వహణలో వారి ప్రవర్తనకు నిర్దుష్టమైన ప్రమాణాలను జస్టిస్ జోసెఫ్ ఇలా సూత్రీకరించారు: ఎన్నికల కమిషనర్లు సంపూర్ణ నిజాయితీతో స్వతంత్రంగా వ్యవహరించాలి; రాజకీయ ఒత్తిడిని ఎదిరించగల న్యాయనిష్ఠ ఉండి తీరాలి; అధికారంలో ఉన్నవారిచే ప్రభావితం కాకుండా నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలి; ఎట్టి పరిస్థితులలోనూ న్యాయవిరుద్ధంగా వ్యవహరించని గుణాధిక్యత, నైతిక బలం ఉండితీరాలి. ఈ ప్రమాణాల ప్రాతిపదికన జ్ఞానేశ్ కుమార్ ప్రవర్తనా సరళిని మనం నిశితంగా పరిశీలించాలి.
ఆ ప్రమాణాలతో పాటు కొన్ని యథార్థ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ఇవేమిటో భారతీయ జనతా పార్టీ ఏనాడో చెప్పింది. తొలుత ఎన్నికల కమిషనర్‌గా, ఆ తరువాత ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నవీన్ చావ్లా నియామకం, కొనసాగింపునకు వ్యతిరేకంగా బీజేపీ చాలా న్యాయబద్ధమైన వాదనలు చేసింది. ఏప్రిల్ 8, 2006న రాష్ట్రపతికి సమర్పించిన ఒక విజ్ఞాపన పత్రంలో ఇలా పేర్కొంది: ‘సమస్యల్లా సీఈసీగా నవీన్ చావ్లా నియామకపు చట్టబద్ధత కాదు, ఆయనను ఆ రాజ్యాంగ పదవిలో కొనసాగింపునకు సంబంధించిన ఔచిత్యం’. ఇదే విషయమై ఆ పార్టీ అగ్రనాయకుడు జస్వంత్‌సింగ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక పిటిషన్ సైతం నవీన్ చావ్లా పక్షపాత ప్రవర్తన పట్ల సహేతుకమైన అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. విధుల నిర్వహణలో ఎన్నికల కమిషనర్ చూపవలసిన తటస్థత ఆయన వ్యవహార శైలిలో కానరావడంలేదని జస్వంత్ స్పష్టం చేశారు. 2008లో నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి సైతం– ‘రాజకీయ పక్షపాతం’ చూపుతున్న కారణంగా ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి నవీన్ చావ్లాను తొలగించాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా నవీన్ చావ్లా ఎన్నికల కమిషనర్‌గా కొనసాగి ఆ తరువాత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యారు. అయితే ఈ ఉదంతం ఎన్నికల కమిషనర్ల ప్రవర్తనా సరళి ఏ విధంగా ఉండాలనేదాన్ని విదితం చేసింది.
ఈ నియమాల, యథార్థాల వెలుగులో ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా జ్ఞానేశ్ కుమార్ ‘నిరూపిత దుష్ప్రవర్తన, అసమర్థత’ ఏమిటో చూద్దాం. బహిరంగంగా ప్రజల సమక్షంలో జ్ఞానేశ్ వ్యవహరిస్తున్న తీరు తెన్నులను ఆయన అనుచిత ప్రవర్తనా సరళికి తార్కాణంగా భావించకూడదు. ఎన్నికైన రాజకీయ నాయకులకు విజయచిహ్నంగా వేళ్లు చూపించడం, తన ఎదుట పెద్దగా ప్రజలెవరూ లేకపోయినా, ఓ పెద్ద సమూహం ఉన్నట్టుగా వారికి అభివాదం తెలిపే రీతిలో చేతులు ఊపడం, విలేఖర్ల సమావేశాల్లో రాజకీయ వ్యాఖ్యానాలు చేయడం... మొదలైనవన్నీ హాస్యాస్పదమైనవే కాకుండా పూర్తిగా అభ్యంతరకరమైనవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒక అత్యున్నత రాజ్యాంగ అధికారికి అటువంటి పటాటోపం తగదు. ఆత్మస్తుతి అంతకంటే తగదు. అయితే రాజ్యాంగ అధికారి ‘దుష్ప్రవర్తన’, అసమర్థత’కు సంబంధించిన కఠినమైన రాజ్యాంగ నిర్వచనాల పరిధిలోకి ఆ అసంగత ప్రవర్తనారీతులు రావనే వాస్తవాన్ని కూడా మనం విస్మరించకూడదు. అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఎన్నికల సంఘం ప్రధానాధికారి విధులను జ్ఞానేశ్ కుమార్ నిర్వహిస్తున్న తీరు తెన్నులు ఆ పదవీ గౌరవానికి వన్నె తెచ్చేవిగా లేవు. అయితే మనసా, వాచా, కర్మణా ఉన్నతంగా వ్యవహరించలేని వ్యక్తులు పెద్ద పదవీ బాధ్యతలు చేపట్టకుండా నిరోధిస్తే జరిగేదేమిటి? అధికశాతం రాజ్యాంగ పదవులు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోవడమే కాదూ? ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక హిందీ లోకోక్తితో ఈ వాస్తవాన్ని సువిదితం చేస్తాను: ‘జూటా బడా హై, లేకిన్ పాన్వ్ ఛోటా’ (బూటు పెద్దది, కానీ పాదం చిన్నది). రాజ్యాంగ పదవుల ఉన్నతస్థాయి, వాటిని అధిష్ఠించిన వ్యక్తుల అల్ప నైతికత, సామర్థ్య రాహిత్యం మధ్య ఉంటున్న అంతరాన్ని ఆ లోకోక్తి స్పష్టంగా ఎత్తిచూపింది.
సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ‘దుష్ప్రవర్తన’లోని ఒక తీవ్ర అంశాన్ని ప్రముఖంగా పరిగణనలోకి తీసుకోవల్సి ఉన్నది. దాపరికం లేకుండా ఆయన చూపుతున్న రాజకీయ పక్షపాతమే ఆ అభ్యంతరకర యథార్థం.. ఇందుకు తాజా ఉదాహరణ తృణమూల్ కాంగ్రెస్ నాయకులతో కయ్యాలు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కథ ఏమిటి? భారతీయ జనతా పార్టీకి అననుకూలంగా ఉన్న, ఉండే ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించేందుకు ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలే కాదూ? బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, హోం శాఖ కార్యదర్శిని వేరే బాధ్యతలకు బదిలీ చేయడం బీజేపీతో ఎన్నికల సంఘం జుగల్‌బందికి మరొక స్పష్టమైన తార్కాణం. ప్రధానమంత్రి పట్ల తీవ్ర వ్యతిరేకత కంటే కూడా ఎక్కువగా ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న మరో అంశం ఏదైనా ఒకటి ఉదంటే, అది తప్పకుండా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కర్తవ్య నిష్ఠలో విపక్షాలకు ఏ మాత్రం నమ్మకం లేకపోవడమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నికల సంఘం పట్ల ప్రజల్లో విశ్వాసం అంతకంతకూ తగ్గిపోతోంది. ఒకప్పుడు భారత ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రతిష్ఠాకరంగా వెలుగొందిన ఈ రాజ్యాంగ సంస్థను ప్రజల పరిహాసానికి గురవుతోన్న స్థాయికి దిగజార్చిన ఘనత ప్రస్తుత సీఈసీకే దక్కుతుంది.
అధర్మం, పాక్షికత, అసమర్థత.... ఎంత చెడ్డవి అయినప్పటికీ ‘సర్’ను అమలుపరిచిన తీరుతో పోల్చినప్పుడు, వాటితో వాటిల్లే హాని ఉపేక్షించదగినదే అవుతుంది! చెప్పవచ్చిన దేమిటంటే జ్ఞానేశ్ కుమార్ ఏ ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగబద్ధంగా బాధ్యుడు అయ్యారో, ఆ ప్రజాస్వామ్యం పైనే ఆయన చేసిన అతి పెద్ద దౌర్జన్యం ‘సర్’. ఇదొక కఠోర వాస్తవం, ఒక నిష్ఠుర నిజం. ‘సర్’ పేరిట ఓటర్ జాబితాలను పునః రూపొందించే అధికారాలు ఎన్నికల సంఘానికి ఉన్నాయా లేవా అనే న్యాయ సంబంధ– సాంకేతిక అంశంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని ఇంకా వెల్లడించవలసి ఉన్నది. ఆ తీర్పు ఎలా ఉన్నా, ‘సర్’ ఎటువంటి పర్యవసానాలకు కారణమయిందో అందరికీ తెలిసిందే. ఓటర్ జాబితాల నుంచి ఇప్పటికే ఐదు కోట్ల పేర్లను తొలగించడం జరిగింది. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద సామూహిక ఓటు హక్కు రద్దు ఇది. ఈ ‘మహాకార్యం’ జ్ఞానేశ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఇందుకు ఆయనే ప్రధాన బాధ్యుడు. వయోజన భారతీయుల ప్రజాస్వామ్య హక్కుపై జరిగిన ఈ దాడి అమెరికా దక్షిణాది రాష్ట్రాలలో ఆఫ్రికన్ అమెరికన్లకు ఓటుహక్కును నిరాకరించిన జిమ్ క్రో చట్టాలు కూడా సిగ్గుపడేలా చేస్తోంది. భారత ప్రజాస్వామ్యానికి వాటిల్లే వినాశనకరమైన ముప్పు ఇంతకంటే మరొకటి ఏముంటుంది? ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్‌ను అభిశంసించేందుకు పూనుకోవడం ప్రతీకాత్మకంగా మిగిలిపోయినా, ఆ ప్రయత్నానికి ఎనలేని ప్రాముఖ్యం ఉన్నది. ఎందుకంటే ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల ఆరోపణలను అది ఎత్తిచూపుతుంది. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రజాచర్చను పురిగొల్పుతుంది. రాజ్యాంగానికి జవాబుదారీలా వ్యహరించేలా ఎన్నికల సంఘాన్ని అది నియంత్రిస్తుంది.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఈ వార్తలు కూడా చదవండి..
సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు
మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్
గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News