బహుజన ఆత్మగౌరవ వాగ్గేయకారుడు
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:20 AM
తెలుగు సాంస్కృతిక చరిత్రలో విలక్షణ కలం, గళం మాస్టార్జీ. ఐదు దశాబ్దాల పాటు పాటకే తన జీవితాన్ని ధారపోసిన చరిత్ర తనది. అది మాత్రమే కాదు. ఎర్రపాటల ప్రభంజనం సమాజాన్ని పదునెక్కిస్తున్న...
తెలుగు సాంస్కృతిక చరిత్రలో విలక్షణ కలం, గళం మాస్టార్జీ. ఐదు దశాబ్దాల పాటు పాటకే తన జీవితాన్ని ధారపోసిన చరిత్ర తనది. అది మాత్రమే కాదు. ఎర్రపాటల ప్రభంజనం సమాజాన్ని పదునెక్కిస్తున్న కాలంలో తనదైన ప్రత్యేక దారిని వేసుకున్నారు. ఈ దేశంలో ఏ మార్పు రావాలన్నా ముందు సామాజిక అంతరాలు తొలగాలనే ఎరుక తనకు మొదటి నుంచే ఉంది. అట్లా తన యవ్వనకాలాన్ని కళకు అంకితం చేశారు. ఇల్లు మరిచి, పల్లె మరిచి జాతిని మేల్కొల్పడానికి సిద్ధమయ్యారు. నలుగురు నడిచిన దారిలో నడవడం ఎవరికైనా సులభమే. అదే తానే కొత్త మార్గాన్ని వేసుకోవడమంటే మాటలు కాదు. ఎన్నో ఎదుర్కోవాలి. నిందలు, విమర్శలు, సూటిపోటి మాటలు, ఒకటేమిటి ప్రతిరోజూ తనకొక సవాలే. అలాంటి సవాళ్లను ఎదుర్కొన్న మాస్టార్జీ తన ఆత్మగౌరవ సాంస్కృతిక జెండాను తెలుగు నేల మీద ధిక్కారంతో ఎగరేసి నిలబడ్డారు. 1970ల్లోనే గద్దర్ మొదలయ్యారు. విప్లవ పాటను భుజానికెత్తుకున్న విఠల్‌రావే తర్వాత గద్దర్‌గా మారారు. అదే కాలంలో జననాట్యమండలి కళాకారులకు నృత్యరూపకాలు నేర్పడానికి వెళ్లిన గంగధారి శ్రీరాములే ఈ మాస్టార్జీ. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గద్దర్‌కు, గద్దర్ వంటి ఇతర కళాకారులకు పాటకు అనుగుణమైన అడుగులు వేసే లయాత్మకతను నేర్పింది మాస్టార్జీనే. ఈ విషయాన్ని గద్దరే పలుమార్లు వేదికల మీద చెప్పారు. విప్లవోద్యమ పాట జానపదాలు, పల్లెసుద్దులు, కవాలీ వంటి బాణీను సృజియించింది. కానీ మాస్టార్జీ పాట అలా కాదు, పాటకు అదనంగా లలిత సంగీత ఒరవడిని జతచేశారాయన.
ఇక వస్తువు పరంగా కూడా మాస్టార్జీ కొత్త పంథాను ఎత్తుకున్నారు. అదే మూలవాసీ తాత్విక సిద్ధాంతం. కొత్త శివమూర్తి, గ్యార యాదయ్య, ఎర్ర ఉపాళి వంటి వారికంటే ముందే మాస్టార్జీ మూలవాసీ దృక్పథంతో పాటలు రాశారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే తన ‘గులాంగిరి’ పుస్తకంలో పేర్కొన్నట్టు భారతదేశ చరిత్రను ఆర్యులకు ముందు, ఆర్యులకు తరువాతగా చూశారు. సమస్త రంగాలు సాంస్కృతిక దురాక్రమణకు గురైన కుట్రను బద్దలుకొట్టినవాడు మాస్టార్జీ. మార్క్సిస్ట్ ఫిలాసఫీలో కులాన్ని ఉపరితల అంశంగా మాత్రమే చూసే దృష్టికోణాన్ని తప్పుపట్టారాయన. కుల సమస్య పరిష్కారం కానంతవరకూ ఈ దేశంలో విప్లవం రాదన్న అంబేడ్కర్‌ను ఆవాహన చేసుకున్నారు. అందుకే కుల సమస్యను ప్రధానం చేస్తూ అనేక పాటలు రాశారు. విప్లవోద్యమంలో కులం మీద అడపాదడపా ఒకటి రెండు పాటలు వచ్చి ఉండవచ్చు. కానీ, అవి మాస్టార్జీ వలె కుల సమస్యకు పరిష్కారాన్ని అంబేడ్కరిజంలో చూపినవి కావు. మాస్టార్జీ ఏ పాటను తీసుకున్నా అది అంబేడ్కర్ పొలిటికల్ ఫిలాసఫీ పాఠాన్ని బోధిస్తుంది. ఈ సమాజం ఇట్లా ఎందుకుందో చారిత్రకంగా తెలియజేస్తుంది. అదీ మాస్టార్జీ పాటకున్న తాత్విక బలం.
ఇక ౧990లకు వచ్చేసరికి విప్లవోద్యమం ఒకవైపు, అస్తిత్వ చైతన్యం మరోవైపు తెలుగు సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి కాలంలో కాన్షీరాం తెలుగునాట అడుగుపెట్టారు. ఆ సమయంలో కాన్షీరాంకు మాస్టార్జీ పాట మీద గొప్ప భరోసా కలిగింది. బహుజనులను చైతన్యం చేసే పాటను మాస్టార్జీ మాత్రమే సృష్టించగలడనే నమ్మకం కలిగింది. నూటికి ఎనభై ఐదుశాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం రావాలన్న కాన్షీరాం పిలుపునందుకుని అనేక పాటలు రాశారు మాస్టార్జీ. ఆధిపత్యకులాల దోపిడీ కోటల గుట్టును రట్టు చేశారు. అగ్రవర్ణ పార్టీలు ఎట్లా బహుజనులను మభ్యపెడుతుంటాయో చెబుతూ ‘‘జోజోర దళితన్న’’ వంటి పాటలు రాశారు. ‘‘వింటివా మల్లన్న కాలేజీ సదువుల్ల కులం చేసే గమ్మత్తు’’ అంటూ విద్యా వ్యవస్థలోని కులం కుళ్లును కూడా ఎండగట్టారు. ‘‘ఎద్దుకూర తిన్నోడే ఎంత ముద్దుగున్నాడే’’ అంటూ దళితుల ఆహారపు అలవాటును ఆత్మగౌరవంతో ఎలుగెత్తి చాటారు. 2001లో దక్షిణాఫ్రికా డర్బన్ సదస్సులో పాల్గొని అప్పటికప్పుడు ‘‘Black is beauty’’ అనే పాటను రాసి, పాడి, ప్రపంచ దేశాల అభిమానులను సంపాదించుకున్నారు.
ఇట్లా మాస్టార్జీ పాటల్లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నప్పటికీ ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట ‘‘అందుకో దండాలు బాబా అంబేడ్కరా...’’. ఈ పాటకు కూడా యాభయ్యేళ్లు నిండాయి. అంబేడ్కర్ పేరు అంతగా సామాన్య జనానికి తెలియని కాలం అది. అలాంటి కాలంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను ఈ పాట ద్వారానే మాస్టార్జీ అందించారు. నేటి వరకూ అంబేడ్కర్ మీద ఎన్ని పాటలొచ్చినా, తెలుగులో అంబేడ్కరిస్ట్ ఉద్యమానికి తలమానికమైన పాట ఇదేనంటే అతిశయోక్తి కాదు. ఈనాటికీ ఇదొక ప్రార్థనాగీతం. ఈ పాటలో మాస్టార్జీ సరికొత్త ప్రయోగం చేశారు. చరణాల్లో మొదటి సగం వరకూ ప్రధాన గాయకుడు పాడితే, వింటున్న జనమే మిగిలిన సగాన్ని పూరించేలా పాటను మలిచారు. అట్లా అంబేడ్కర్‌ను ప్రజల వద్దకు చేర్చిన ‘‘కల్చరల్ కమాండర్’’ మాస్టార్జీనే.
ఒక్క అంబేడ్కర్‌నే కాదు, బహుజన మహనీయులైన బుద్ధుడు, రవిదాస్, జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి, సాహు మహారాజ్, పెరియార్ నారాయణ గురు, అన్నాబావు సాటే, సదాలక్ష్మీ, జాషువా, కాన్షీరాం, గద్దర్‌ల మీద పాటలు రాశారు. నిరక్షరాస్యులైన ప్రజలకు అందరూ తెలిసే అవకాశం లేని లోటును మాస్టార్జీనే కొంత పూడ్చారు.
బహుజన వాగ్గేయకారుడిగా విశేషమైన కృషి చేసిన మాస్టార్జీ పాట దగ్గరే ఆగిపోలేదు. సాంస్కృతిక కార్యకర్తగా తన తోటి కళాకారులను కూడగట్టి ఒక సైన్యాన్ని తయారు చేశారు. విశ్వజన కళామండలి ఏర్పాటు చేశారు. బీఎస్ రాములు, వీఆర్ నారగోని, గూడ అంజయ్య వంటి వారితో కలిసి ‘దరకమే’ స్థాపించారు. మాస్టార్జీ స్థాపించిన దళిత కళామండలికి ఇప్పుడు యాభయ్యేళ్లు. ప్రజలను ఆలోచింపజేయడంలో పాట అవసరమైన చోట పాట, నృత్యరూపకం అవసరమైతే బ్యాలేలు, అలాగే ‘‘రిక్షా రాజయ్య, స్కోరెంత?, అఖండ విప్లవజ్యోతి అంబేడ్కర్, ఇందాకటిది ఉందా?, ఈ పిచ్చికి పేరు పెట్టండి, వందగొంతులు వెయ్యి ప్రశ్నలు, ఔను మల్లా (వీధి నాటకం), కాముడు, అమ్మా... ఆవు’’ వంటి నాటికలు రచించి, ప్రదర్శించారు. అలాగే అంగుళీమాలుడు, ఎర్రగబ్బిలం, రాజు–రాయలు–మంత్రి తిమ్మరుసు వంటి నాటకాలు రచించారు. మట్టిపూలు అనే కవితా సంపుటిని ప్రచురించారు. ఇక ‘గుర్తుకొస్తున్నాయి’ కథా సంపుటితో పాటు మాస్టార్జీ రాసిన అనేక పాటలను వివిధ సందర్భాల్లో పుస్తకాలుగా వెలువరించారు. అవే 1. దళిత గీతాలు, 2. మూలవాసుల పాటలు, 3. బౌద్ధగీతాలు, 4. వెన్నెల గానం, 5. సమతాగీతాలు, 6. విశ్వనరుడు, 7. బహుజన పితామహులు (సీడీ), 8. కుర్రో కుర్రు, 9. చైతన్య గీతమాలిక (సీడీ), 10. గురు రవిదాసు పాటలు, 11. బీఎస్పీ పాటల (సీడీ)ను వెలువరించారు. ఇట్లా సామాజిక న్యాయ పోరాటంలో మాస్టార్జీ పాట, కళ పోషించిన పాత్ర వందలాదిమందిని ప్రభావితం చేసింది. కులనిర్మూలన దిశగా ప్రజలను చైతన్యం చేసే సాంస్కృతిక శక్తిగా నిలిచింది.
పసునూరి రవీందర్
(మాస్టార్జీ స్థాపించిన ‘విశ్వజన కళామండలి’కి యాభై ఏళ్లు.
సెప్టెంబర్ 7న రవీంద్రభారతిలో సభ)
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News