Share News

ఏఐకి బానిసలం కాదు, యజమానులం కావాలి!

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:23 AM

గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్ –2026’ ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసే ఒక వాస్తవాన్ని...

ఏఐకి బానిసలం కాదు, యజమానులం కావాలి!

గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్ –2026’ ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసే ఒక వాస్తవాన్ని వెల్లడించింది. దేశంలో మొత్తం గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అర్హత (ఎంప్లాయబిలిటీ) 56.35 శాతానికి పెరిగినప్పటికీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అర్హత మాత్రం 71.5 శాతం నుంచి 70.15 శాతం దిగువకు పడిపోయిందని తెలిపింది. మరో పరిశ్రమ సర్వే– ‘ఆ ఏడాది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 83శాతం మందికి చదువు పూర్తయ్యే నాటికి ఉద్యోగం లేదా ఇంటర్న్‌షిప్‌ అవకాశం రాలేదు’ అని వెల్లడించింది. మన దేశం ఏటా సుమారు పదిహేను లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది. అయితే, ‘ఉద్యోగానికి అర్హత’ కలిగి ఉండటానికీ, ‘ఉద్యోగం పొందటానికీ’ మధ్య చాలా తేడా ఉంది.

చరిత్రలో ఇప్పటివరకు నాలుగు పారిశ్రామిక విప్లవాలు జరిగాయి. అవి: ఆవిరి యంత్రం, విద్యుత్‌, మైక్రోచిప్‌, పరస్పరం అనుసంధానమై పనిచేసే మేధో వ్యవస్థలు. వీటి తీరుతెన్నులను గమనిస్తే.. మొదటి విప్లవానికి భారత్‌ దూరంగా ఉండిపోయింది. రెండో విప్లవంలో ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. మూడు, నాలుగో విప్లవాల నాటికి క్రమంగా ఇతర దేశాలతో సమాన స్థాయిలో పోటీ పడేలా తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. అయితే ప్రస్తుత ఐదో విప్లవం భిన్నమైనది. ఈ ఏఐ విప్లవాన్ని తీర్చిదిద్దడంలో భాగస్వామ్యమయ్యే అవకాశం భారత్‌కు మొదటిసారి వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటామా? వృథా చేసుకుంటామా? అన్నది ఇప్పుడు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అడుగుపెడుతున్న తరం మీదే ఆధారపడి ఉంది.

ఇటీవల ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు నేను యథాలాపంగా ఒక మాట అన్నాను. అదేమిటంటే... ‘మీ రంగంలో లోతైన జ్ఞానం, అవగాహన సంపాదిస్తే మీరు ఏఐ సాధనాలకు యజమాని అవుతారు. లేదంటే వాటికే బానిసవుతారు’ అని. దీని అర్థం ఏఐని వ్యతిరేకించడం ఎంతమాత్రమూ కాదు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి సాంకేతిక పరిజ్ఞానమూ (క్యాలిక్యులేటర్‌, కంప్యూటర్‌, సీఏడీ సాఫ్ట్‌వేర్‌ వంటివి) తమ రంగంపై లోతైన అవగాహన ఉన్నవారి సామర్థ్యాన్ని మరింత పెంచింది. అలాగే, విషయం పట్ల తగినంత అవగాహన లేని వారి లోపాలను కూడా బయటపెట్టింది. ఏఐ కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తోంది. అయితే, ఏఐని ఉపయోగించగలిగేంతగా తమ రంగంపై లోతైన అవగాహన ఉన్నవారికి, లేని వారికి మధ్య అంతరం గతంలో కంటే వేగంగా పెరుగుతోంది.


ఉద్యోగ అర్హతకు సంబంధించిన గణాంకాలు ఒక చేదు నిజాన్ని వెల్లడిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా చాలామంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ డిగ్రీని సామర్థ్యాన్ని పెంచుకునే మార్గంగా కాకుండా, ఒక అర్హత పత్రంగా మాత్రమే భావించారు. పరీక్షలను ఎలాగోలా నెట్టుకురావడం, అత్తెసరు మార్కులు తెచ్చుకోవడం, లోతైన పరిజ్ఞానం అవసరం లేని ఉద్యోగాల కోసం ప్రయత్నించడం... వంటివాటికే ప్రాధాన్యమిచ్చారు. గతంలో ఈ విధానం ఎంతోకొంత సత్ఫలితాలను ఇచ్చింది. కానీ రాబోయే తరానికి ఇది పనికిరాదు. ఒకప్పుడు తగినంత నైపుణ్యం లేని పట్టభద్రులకు కూడా దొరికే చిన్న చిన్న ఉద్యోగాల్లోని పనులను ఇప్పుడు ఏఐ వేగంగా, తక్కువ ఖర్చుతో, మానవ వనరుల కంటే సమర్థవంతంగా చేస్తోంది. అలాగే, ప్రస్తుతం ఈ ఏఐ గురించి ఉన్న అపోహలు మరే సాంకేతిక సాధనం గురించి లేవేమో! దీన్ని నేర్చుకోవడం ఎంతో కష్టమని, కేవలం కంప్యూటర్ నిపుణులకే ఇది సాధ్యమని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఏఐని సమర్థవంతంగా ఉపయోగించడం.. ఇంచుమించు ఓ వాహనం నడపడం లాంటిదే. అయితే దాన్ని బాగా నడపాలంటే ముందుగా మన రంగంపై మనకు అవగాహన ఉండాలి.

ఇది కేవలం సాంకేతిక రంగానికే పరిమితమైన అంశం కాదు. ఉదాహరణకు.. థర్మోడైనమిక్స్‌పై లోతైన అవగాహన ఉన్న ఓ మెకానికల్‌ ఇంజినీర్‌ ఏఐని ఉపయోగించి ఇంజిన్‌ సామర్థ్యాన్ని ఇంకాస్త మెరుగుపరచడం ఎలాగో సులభంగా గుర్తించగలడు. సెమీకండక్టర్‌ సాంకేతికత, భౌతికశాస్త్రంపై పట్టు ఉన్న ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌.. చిప్‌ ఎందుకు విఫలమైందో కొన్ని నిమిషాల్లోనే కచ్చితంగా తెలుసుకోగలడు. అలాగే ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు, సివిల్‌ ఇంజినీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు.. ఇలా తమ రంగంలో లోతైన అవగాహన ఉన్నవారెవరైనా ఏఐ సాయంతో ఆయా రంగాల్లోని సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలరు. తమ అభివృద్ధికి బాటలు వేసుకోగలరు. అలాంటి వారికి ఈ ఏఐ విప్లవం ఎంతగానో దోహదం చేస్తుంది.

ఇప్పుడు ఏం మారాలి? విద్యార్థులను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా తర్ఫీదునివ్వడం మానేయాలి. సొంతంగా ఆలోచించగలిగేలా వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాలి. బట్టీ పట్టడం, మార్కుల కోసం పరుగెత్తడం, ఏదోలా సీజీపీఏ కాపాడుకోవడం వంటి పరీక్షా కేంద్రిత విధానాలను ప్రోత్సహించకూడదు. వాటికి బదులుగా ఇంజినీరింగ్‌ విద్యలో నిజమైన అనుభవాధారిత అభ్యాసానికి ప్రాధాన్యం ఇవ్వాలి.


ఇతరులకంటే ఏదో ఒక విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకున్నవారే ఈ ఐదో పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహిస్తారు. ఇంతకుముందు జరిగిన ప్రతి పారిశ్రామిక విప్లవంలోనూ భారత్‌ నేర్చుకునే దశలోనే ఉంది. కానీ ఏఐతో వస్తున్న ఈ విప్లవంలో మొదటిసారిగా ముందు వరుసలో నిలిచే అవకాశం మన దేశానికి వచ్చింది. మరి కాబోయే ఇంజినీర్లు పూర్తి సన్నద్ధతతో కాలేజీల్లో అడుగుపెడతారా? లేక, కేవలం అడుగుపెట్టడానికే పరిమితమవుతారా? అన్నదానిపై వారి కెరీర్‌ మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది.

ప్రొ. బంగారుబాబు పొపూరి

ఎన్‌ఐటీ, వరంగల్

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 04:23 AM