Share News

ఏఐ: సామాన్యుడే సృష్టికర్త కావాలి!

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:43 AM

మానవాళి చరిత్రలో అత్యంత శక్తిమంతమైన విప్లవం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఎవరికి ఉపయోగపడుతుంది అనే చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. ఈ గొప్ప సాంకేతికత కేవలం బడా కార్పొరేట్లకే...

ఏఐ: సామాన్యుడే సృష్టికర్త కావాలి!

మానవాళి చరిత్రలో అత్యంత శక్తిమంతమైన విప్లవం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఎవరికి ఉపయోగపడుతుంది అనే చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. ఈ గొప్ప సాంకేతికత కేవలం బడా కార్పొరేట్లకే పరిమితమై వారి ధనదాహాన్ని తీర్చడానికే ఉపయోగపడుతుందా? లేక పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్లి ప్రజలను నియంత్రించే సాధనంగా మారుతుందా? అనే భయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా ఏఐని ప్రజాస్వామ్యీకరించితే అది మానవాళికి అంతులేని ప్రయోజనాలను కలిగిస్తుంది.

ఏఐ ప్రజాస్వామ్యీకరణకు అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని ఆయా దేశాల ప్రభుత్వాలు, ప్రజా సమూహాలు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం ఏఐ రంగంలో ‘పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్’ టూల్స్ సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఓపెన్ సోర్స్ విధానంలో లభించే ఈ టూల్స్... కేవలం పెద్ద పెద్ద టెక్ కంపెనీలకే పరిమితం కాకుండా సామాన్యుడికి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు శక్తిమంతమైన ఏఐ టూల్స్‌ను ఉపయోగించాలంటే ఓపెన్ ఏఐ లేదా ఆంత్రోపిక్ వంటి సంస్థలకు భారీగా డబ్బు చెల్లించాలి. అయితే కొన్ని కంపెనీలు తమ మోడళ్ల ‘ఓపెన్ వెయిట్స్’ను ఉచితంగా విడుదల చేయడంతో ఏఐ ప్రజాస్వామ్యీకరణకు మరింతగా ఊతం లభించింది.

కోడింగ్ రాని సామాన్యుడు, చిన్న వ్యాపారి, విద్యార్థి కూడా ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యవంతమైన ఏఐ టూల్స్‌ను ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోవచ్చు. దీంతో ఏఐ సాంకేతికత కేవలం సిలికాన్ వ్యాలీలోని కొన్ని కంపెనీల చేతుల్లోనే ఉండిపోకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి సొంతం అవుతుంది. భారత్‌ లాంటి దేశాలు ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్‌ను ఉపయోగించి.. మన స్థానిక భాషలు (తెలుగు, హిందీ...), సంస్కృతికి అనుగుణంగా సొంత ఏఐ వ్యవస్థలను తయారుచేసుకోవచ్చు. పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్ టూల్స్ ప్రతి ఒక్కరికీ ఒక ‘వ్యక్తిగత మేధావి’లాగా తోడుంటాయి. ఇది మానవ ఆలోచనలకు రెక్కలు తొడుగుతుంది.

ఈ ఓపెన్ సోర్స్ టూల్స్ ద్వారా సాఫ్ట్‌వేర్ లేదా అప్లికేషన్లను ఇంట్లోనే కూర్చుని డిజైన్ చేయవచ్చు. ఒక చిన్న ఆలోచన ఉన్న వ్యక్తి, ఈ టూల్స్ సహాయంతో కోడింగ్ నేర్చుకుని, రాత్రికి రాత్రే ఒక కొత్త యాప్‌ను లేదా వ్యాపార నమూనాను సృష్టించగలడు. విద్యార్థులు, శాస్త్రవేత్తలు క్లిష్టమైన డేటాను విశ్లేషించడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ టూల్స్ అపరిమితమైన శక్తిని ఇస్తాయి.


ఓపెన్ సోర్స్ ఏఐ మోడళ్లను ఉపయోగించి సొంత ఏఐ ఏజెంట్లను రూపొందించుకోవచ్చు. వీటిని అనుకూలమైన సొంత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని, కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ లేకుండా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధమైన ఏర్పాటు వల్ల వ్యక్తిగత డేటాను బయటి క్లౌడ్ సర్వర్లకు పంపాల్సిన అవసరం తగ్గి, గోప్యతను మెరుగ్గా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏఐ ఏజెంట్ల వాడకం ద్వారా వారు శ్రమించే సమయం తగ్గిపోతోంది. వారి పనిలో క్రియేటివిటీ పెరుగుతుంది. భారీ సర్వర్లు, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ల అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోనే ఏఐ సేవలను పొందుతారు. అందరూ వాడుకునేలా, మనకు అనుకూలమైన ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. ఇందుకు చొరవ తీసుకునేలా సర్కారుపై ప్రజా సమూహాలు ఒత్తిడి తేవాలి.

పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది మానవాళికి లభించిన ఒక గొప్ప వరం. ఇది ప్రతి సామాన్యుడిని ఒక ఆవిష్కర్తగా మార్చగల శక్తిని కలిగి ఉంది. అయితే, ఈ సాంకేతికత దుర్వినియోగం కాకుండా చూడటానికి సరైన ప్రభుత్వ నిబంధనలు, నైతిక బాధ్యత అవసరం. సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడినప్పుడు మాత్రమే ఏఐ ప్రజాస్వామ్యీకరణ నిజమైన ప్రగతికి బాటలు వేస్తుంది.

గమిడి శ్రీనివాస్

జర్నలిస్ట్

ఈ వార్తలు కూడా చదవండి..

సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు

గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్

పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 12:43 AM