Share News

ఆర్థిక స్వేచ్ఛ పేరుతో 1/70 చట్ట సమీక్షా?!

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:19 AM

‘గిరిజనులకు మేలు చేయని 1/70’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో (సెప్టెంబర్‌ 2న) మంధనపు రామారావు రాసిన వ్యాసంలో లేవనెత్తిన అనేక అంశాలు ప్రశ్నించదగినవి. రెగ్యులేషన్ 1/70 రద్దుకోరుతూ సుప్రీంకోర్టులో....

ఆర్థిక స్వేచ్ఛ పేరుతో 1/70 చట్ట సమీక్షా?!

‘గిరిజనులకు మేలు చేయని 1/70’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో (సెప్టెంబర్‌ 2న) మంధనపు రామారావు రాసిన వ్యాసంలో లేవనెత్తిన అనేక అంశాలు ప్రశ్నించదగినవి. రెగ్యులేషన్ 1/70 రద్దుకోరుతూ సుప్రీంకోర్టులో వేలాది మంది గిరిజనేతరులు దాఖలు చేసిన కేసు నేపథ్యంలో ఈ వాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘1/70 చట్టం గిరిజనుల భూమిని కాపాడింది, కానీ వారి ఆర్థిక స్వేచ్ఛను హరించింది’ అన్నది ఆయన ప్రధాన వాదన. పక్క మండలాల్లో ఎకరానికి రూ.40–50 లక్షలు పలుకుతున్న భూమి, 1/70 పరిధిలో రూ.10 లక్షలు కూడా పలకడం లేదని ఆయన ఎత్తిచూపారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. కానీ దాని ఆధారంగా చట్టాన్ని బలహీన పరచాలనుకోవడం చారిత్రక వాస్తవాలను, రాజ్యాంగ లక్ష్యాన్ని విస్మరించడమే అవుతుంది. ఆదివాసీ సమాజానికి భూమి కేవలం మార్కెట్ వనరు కాదు.. అదే జీవనాధారం, సంస్కృతి, సామాజిక అస్తిత్వం కూడా. అందుకే రాజ్యాంగ నిర్మాతలు అయిదో షెడ్యూల్ ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ కల్పించారు.

వ్యాసకర్త తానే స్వయంగా ఒక కీలక వాస్తవాన్ని అంగీకరించారు– ‘1970 తర్వాత గిరిజనేతరుల నుంచి చట్టబద్ధమైన క్రయవిక్రయాల ద్వారా గిరిజనులకు కొత్తగా సంక్రమించిన భూమి చాలా తక్కువ’ అని. ఈ ఒక్క వాక్యం ఆయన మొత్తం వాదననే బలహీనపరుస్తున్నది. గిరిజనులు స్వేచ్ఛా మార్కెట్‌లో భూమిని కొనలేకపోవడానికి కారణం చట్టం కాదు.. వారి ఆర్థిక వెనుకబాటుతనం, రుణ లభ్యత లేమి. రెగ్యులేషన్ ఆంక్షలు ఉన్నప్పటికీ మోసపూరిత ఒప్పందాలు, బినామీ లావాదేవీల ద్వారా వేలాది ఎకరాల గిరిజన భూమి ఇప్పటికే గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. గిరిజనుల జీవితాలు ఆర్థికంగా ఛిద్రమైపోయాయి. నేటికీ 50 శాతానికి పైగా ఏజెన్సీ భూమి గిరిజనేతరుల ఆధీనంలోనే ఉందని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.

‘గిరిజనేతరుల మధ్య వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు, ఒప్పందాలు, ఇతర మార్గాల ద్వారా పెద్ద ఎత్తున భూ లావాదేవీలు జరిగాయి. ఈ వ్యవహారాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అక్రమంగా పెద్ద ఎత్తున సంపాదించుకున్నారన్నది బహిరంగ రహస్యం’ అని వ్యాసకర్త పేర్కొన్నారు. ఇది రెగ్యులేషన్ 1/70కి వ్యతిరేకమైన ఆధారం కాదు, చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరాన్ని బలపరిచే వాస్తవం. చట్టాన్ని ఉల్లంఘించి జరిగిన లావాదేవీలపై నిలదీయాల్సింది పోయి, చట్టం వల్లే నష్టం జరిగిందని చెప్పడం ఏకపక్ష వాదనగా కనిపిస్తున్నది. అసలు ప్రశ్నించాల్సింది చట్టాన్ని కాదు.. వ్యవస్థల వైఫల్యాలను, ఓటు బ్యాంకు రాజకీయాలను.


కోనేరు రంగారావు భూ కమిటీ (2004) ఇదే విషయాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది. గిరిజనులకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులు అమలుకాకపోవడం, భూ రికార్డుల్లో లోపాలు పాలనా వైఫల్యాలేనని పేర్కొంది. భద్రాచలం ఏజెన్సీలో సుమారు రూ.75 కోట్లు విలువ చేసే 15 వేల ఎకరాల భూమి ఒక చెల్లని ప్రభుత్వ ఉత్తర్వు కింద గిరిజనేతరుల అధీనంలో ఉన్నట్లు, ఉట్నూర్ మండలంలో సుమారు 21,062 ఎకరాల భూమి పాత పట్టా కింద నమోదై ఉన్నట్లు కమిటీ గుర్తించింది. చెల్లని పట్టాలు రద్దు చేసి భూమిని గిరిజనులకే కేటాయించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయినా, ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన యంత్రాంగమే వెనుకంజ వేసింది. పైగా 2016 నుంచి తెలంగాణలో ‘సాదా బైనామా’ క్రమబద్ధీకరణతో గిరిజనేతరుల అక్రమ భూముల క్రమబద్ధీకరణ మరింత పెరిగింది. రెవెన్యూ రికార్డుల శుద్ధి, కంప్యూటరీకరణ పేరుతో గిరిజనుల భూమి గిరిజనేతరుల పేర నమోదయిపోయింది. ఈ ఉదాహరణలన్నీ చెప్పేది ఒక్కటే– లోపం చట్టంలో లేదు, దాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థలో ఉంది. ‘గిరిజన రైతు తన భూమికి సరైన సమయంలో సరైన విలువ పొందడానికి 1/70 చట్టం అడ్డంకిగా మారింది’ అన్న వాదన వాస్తవానికి పూర్తి విరుద్ధం. రెగ్యులేషన్ చేసేది ఒక్కటే.. గిరిజనేతరులకు గిరిజన భూమి వెళ్లకుండా అడ్డుకోవడం. గిరిజనుడు తన భూమిని మరొక గిరిజనుడికి విక్రయించుకోవచ్చు; అందుకు తగిన మార్కెట్ అనుసంధానం కల్పించాల్సింది ప్రభుత్వమే. గిరిజన భూమి విలువ పెరగకపోవడం చట్టం లోపం కాదు, చిత్తశుద్ధి లేని పాలకుల వైఫల్యం.

గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక అవకాశాలు పెరగాలన్న వ్యాసకర్త ఆందోళన సహేతుకమే. కానీ దానికి పరిష్కారం భూమిని స్వేచ్ఛా మార్కెట్‌కు వదిలేయడం కాదు. ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ అనుసంధానం, సూక్ష్మ రుణ సదుపాయాల ద్వారా ఆర్థిక సాధికారతే నిజమైన పరిష్కారం. వాస్తవానికి చర్చించాల్సింది చట్టాన్ని సమీక్షించడం కాదు, రాజ్యాంగం కల్పించిన రక్షణలను సమర్థవంతంగా అమలు చేయడం ఎలాగన్నదే. భూమిని కోల్పోయిన ఆదివాసీ కేవలం ఆస్తిని మాత్రమే కాదు, తన సంస్కృతిని, గుర్తింపును కూడా కోల్పోతాడు. అసలు ప్రశ్నకు జవాబు... రెగ్యులేషన్ 1/70ను మరింత పటిష్ఠంగా అమలు చేయడంలోనే ఉంది, దాన్ని బలహీనపరచడంలో కాదు.

డా. పల్లా త్రినాథరావు

ఈ వార్తలు కూడా చదవండి..

సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు

గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్

పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 01:19 AM