Share News

సమస్య ‘ఆదివాసీలు వర్సెస్ గిరిజనేతర పేదలు’ కాదు!

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:25 AM

షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నిబంధన, ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రెగ్యులేషన్ 1/1970 రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు మరోసారి పరిశీలిస్తోంది. పిటిషనర్లు ...

సమస్య ‘ఆదివాసీలు వర్సెస్ గిరిజనేతర పేదలు’ కాదు!

షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నిబంధన, ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రెగ్యులేషన్ 1/1970 రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు మరోసారి పరిశీలిస్తోంది. పిటిషనర్లు దీన్ని తమ హక్కులకు అడ్డంకిగా చూస్తుండగా, ఆదివాసీ సమాజాలు దీన్ని తమ అస్తిత్వానికి రక్షణ కవచంగా చూస్తున్నాయి. చర్చ మొత్తం ‘1/70 ఉండాలా వద్దా’ అనే ద్వంద్వంలో ఇరుక్కుపోయింది, కానీ సుప్రీంకోర్టు ముందున్న అసలు ప్రశ్న అంతటితో ముగియదు.

ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరూ ఒకే సామాజికవర్గం కాదు. ఒకవైపు చారిత్రక జన్మహక్కులు కలిగిన మూల ఆదివాసులు ఉన్నారు. మరోవైపు జీవనోపాధి కోసం అటవీ ప్రాంతాలకు చేరుకున్న దళిత, బీసీ, మైనార్టీ, మైదాన గిరిజన పేద కుటుంబాలు ఉన్నాయి. ఇంకోవైపు బినామీగా వందల ఎకరాలు ఆక్రమించిన భూస్వామ్య, వాణిజ్య శక్తులు ఉన్నాయి. కాబట్టి ‘గిరిజనులు–గిరిజనేతరులు’ అనే ఒకే మూసలో ఈ సమస్యను చూడటం వాస్తవాన్ని వక్రీకరించడమే.

1/70 చట్టం పాలకవర్గం జాలితో ఇచ్చిన కానుక కాదు. బిర్సా ముండా, కొమురం భీమ్ పోరాటాల నుంచి శ్రీకాకుళ ఆదివాసీ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వరకూ సాగిన ప్రజా త్యాగాల ఫలితం. అయితే మైదాన ప్రాంతాల్లో సీలింగ్ చట్టాల వైఫల్యం, బినామీ వ్యవస్థ, అసైన్డ్ భూముల ఆక్రమణతో పాటు వ్యవసాయ రంగంలో వచ్చిన అసమాన మార్పులు, గ్రామీణ చేతివృత్తుల క్షీణత, భూమి కేంద్రీకరణ, ఇంకా ఉపాధి అవకాశాల తగ్గుదలతో పేదలు, దళితులు, బీసీలు, మైనార్టీలు ఏజెన్సీ ప్రాంతాలకు వలస వెళ్లక తప్పలేదు. ఈ భూరహిత పేదల ఏజెన్సీ వలసను రాజ్యపు భూ విధాన వైఫల్యంగా గుర్తించాలి. కానీ దాన్ని 1/70 వైఫల్యంగా చిత్రీకరించడంలోనే అసలు సమస్య ఉంది. ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తూ అనేక వాణిజ్య శక్తులు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములను ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

జీవనోపాధి కోసం చారిత్రకంగా ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చిన నిరుపేదల పరిస్థితి వేరు, వనరులు దోచుకోవడానికి వచ్చిన బడా శక్తుల వ్యూహం వేరు. కానీ రాజ్యపు విధాన వైఫల్యమే ఈ సమస్యను ‘ఆదివాసీలు వర్సెస్ గిరిజనేతర పేదలు’ అనే ఘర్షణగా మార్చి, బడా కబ్జాదారులను బాధ్యత నుంచి తప్పించింది. నిజానికి, రాజ్యాంగ పరిరక్షణకు, మానవీయ దృష్టికి మధ్య వైరుధ్యం సృష్టించాల్సిన అవసరం లేదు. మూల ఆదివాసుల హక్కులను కాపాడుతూనే, ఇతర పేదల జీవన సమస్యకు ప్రత్యేక పరిష్కారం చూపడం సాధ్యమే.


ఈ అవగాహన ఆధారంగా ప్రభుత్వం ఆరు చర్యలు తక్షణమే చేపట్టాలి: 1) ఏజెన్సీ ప్రాంతాల్లోని కుటుంబాల భూమి వినియోగం, నివాస కాలం, జీవనాధార పరిస్థితులపై రెవెన్యూ రికార్డులకే పరిమితం కాని సమగ్ర సర్వే చేపట్టాలి. ఈ సర్వేలో సామాజిక, ఆర్థిక, చారిత్రక సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా జీవనోపాధి కోసం పరిమిత భూమిలో అడవిని నరుక్కుని పోడు సాగు చేసుకుంటున్న నిరుపేద కుటుంబాలను, పెద్ద ఎత్తున భూములను ఆక్రమించిన లేదా వాణిజ్య ప్రయోజనాలతో వినియోగిస్తున్న వ్యక్తులు, సంస్థలను వేరు చేయాలి. 2) ఆ సర్వే ఆధారంగా మూల ఆదివాసుల సంప్రదాయ భూములు, పెద్ద ఎత్తున జరిగిన ఆక్రమణలు, జీవనోపాధి కోసం పరిమిత సాగులో ఉన్న పేద కుటుంబాలు అనే మూడు వర్గాలుగా భూములను వర్గీకరించాలి. 3) ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు సాగు చేస్తూ జీవిస్తున్న ఎస్సీ, బీసీ, మైనార్టీ, మైదాన గిరిజన నిరుపేద రైతుల ఉనికిని గుర్తించే ఈ ప్రక్రియలో అధికారుల రికార్డులతో పాటు స్థానిక ఆదివాసీ గూడేల సంపూర్ణ ఆమోదాన్ని తప్పనిసరి చేయాలి, గూడెం ఆమోదం లేని ఏ క్లెయిమూ చెల్లకూడదు. దీనివల్ల బడా పెత్తందారులు చిన్న రైతుల ముసుగులో బినామీలుగా అవతరించే అవకాశం మూసుకుపోతుంది. 4) కుటుంబ జీవనాధారానికి ఎంత భూమి అవసరమో రెండు, మూడు ఎకరాలు అని ముందే ప్రకటించకుండా, కుటుంబ పరిమాణం, భూమి నాణ్యత, వర్షపాతం, పంటల స్వభావం, సాగు విధానం, స్థానిక వ్యవసాయ పరిస్థితులు, కుటుంబ జీవన వ్యయం వంటి అంశాల ఆధారంగా నిపుణుల కమిషన్ ఒక ప్రమాణాన్ని రూపొందించాలి. ఈ ప్రమాణమే భవిష్యత్తు విధానానికి ఆధారంగా ఉండాలి. 5) ఈ ప్రక్రియలో మూల ఆదివాసుల భూమిని ఇతర పేదల సమస్యకు పరిష్కారంగా చూపకూడదు. ఇతర పేదలకు ప్రత్యామ్నాయం అవసరమైతే అది ఆదివాసుల భూ హక్కులకు భంగం కలగని ప్రాంతాల్లోనే ఉండాలి. 6) ఈ ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగానికే పరిమితం కాకూడదు. ఆదివాసీ గూడేల ప్రతినిధులు, దళిత బహుజన సంఘాలు, మైనార్టీ ప్రతినిధులు, మైదాన ప్రాంత గిరిజన సంఘాలు, రైతు సంఘాలు, సామాజిక శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య సంస్థలు కలిసే విస్తృత సంప్రదింపుల ద్వారానే దీనికి సామాజిక విశ్వసనీయత లభిస్తుంది.


ఈ ప్రణాళిక అమలైనప్పుడు సుప్రీంకోర్టు ముందున్న వివాదాన్ని విస్తృత సందర్భంలో చూడవచ్చు. 1/70ను రద్దు చేయాలా కొనసాగించాలా అనే ద్వంద్వానికి బదులు, దాన్ని కొనసాగిస్తూ చుట్టూ ఏర్పడిన వైరుధ్యాలను ఎలా పరిష్కరించాలనే విధానాన్ని రాజ్యం సుప్రీంకోర్టు ముందుంచాలి. అప్పుడే ఈ వివాదం ‘గిరిజనులు వర్సెస్ గిరిజనేతరులు’ చట్రం నుంచి బయటపడుతుంది. మూల ఆదివాసుల జన్మహక్కు రాజీపడే విషయం కాదు. అలాగే ఇతర పేదల జీవనాధారం నిర్లక్ష్యం చేయదగినది కాదు. వీరిరువురి మధ్య న్యాయమైన వంతెన నిర్మించాల్సిన బాధ్యత రాజ్యానిదే.

పాపని నాగరాజు

సత్యశోధక మహాసభ

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 04:25 AM