ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? దీని ప్రత్యేకత ఏంటి?
ABN , Publish Date - Mar 18 , 2026 | 08:02 PM
ఉగాది తెలుగువారి నూతన సంవత్సర వేడుక. ఇది వసంత రుతువు ఆరంభాన్ని, కొత్త జీవిత ఆశలను సూచిస్తుంది. ఈ పండుగ రోజున ఉగాది పచ్చడి చేసే సంప్రదాయం ఉంది. అయితే.. ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? దీని ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఉగాది తెలుగువారి నూతన సంవత్సర వేడుక. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. 2026లో మార్చి 19న జరుపుకుంటారు. ఉగాది.. వసంత రుతువు ప్రారంభాన్ని, కొత్త ఆశలను సూచిస్తుంది. ఇది షడ్రుచుల(ఆరు రుచుల) సమ్మేళనం. జీవితంలోని కష్టసుఖాలు, ఆనందాన్ని, బాధలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. అయితే.. అసలు ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? దీని ప్రత్యేకత ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి తెలుగు నూతన సంవత్సర ఆరంభానికి ప్రతీకగా, జీవితంలో ఎదురయ్యే షడ్రుచులను(కష్టసుఖాలను) సమానంగా స్వీకరించాలనే సందేశంతో చేస్తారు. వేపపువ్వు, కొత్త బెల్లం, చింతపండు, మామిడికాయ, ఉప్పు, కారంల సమ్మేళనమైన ఈ పచ్చడి.. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తూ కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.
ఉగాది పచ్చడి వెనుక ఉన్న అంతరార్థం, ఆరు రుచులు:
వేపపూత: చేదు రుచిని కలిగి ఉంటుంది. జీవితంలో వచ్చే బాధలు, కష్టాలను సూచిస్తుంది.
బెల్లం: తీపి రుచిని ఇస్తుంది. సంతోషం, ఆనందాన్ని సూచిస్తుంది.
చింతపండు: పుల్లటి రుచిని కలిగిఉంటుంది. జీవితంలో కొత్త అనుభవాలు, ఆశ్చర్యాలను సూచిస్తుంది.
మామిడికాయ: వగరు, పులుపు కలగలిసిన అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. కొత్త సవాళ్లు, ఆశలను సూచిస్తుంది.
కారం: కోపాన్ని సూచిస్తుంది.
ఉప్పు: ఉప్పు భయాన్ని సూచిస్తుంది.

ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు:
లేత మామిడికాయ ముక్కలు - అర కప్పు
వేపపూత - కొద్దిగా
కొత్త చింతపండు - ఒక కప్పు
బెల్లం - అర కప్పు
కారం - టీస్పూన్
ఉప్పు - తగినంత
ఉగాది పచ్చడి తయారీ విధానం:
ముందుగా నిమ్మకాయ సైజు అంత కొత్త చింతపండు రసాన్ని తీసుకుని.. ఇందులోనే బెల్లం వేసి, పూర్తిగా కరిగే వరకు బాగా కలపాలి.
చింతపండు, బెల్లం మిశ్రమంలో సన్నగా తరిగిన లేత మామిడికాయ ముక్కలు, శుభ్రం చేసుకున్న వేపపూత, పచ్చిమిర్చి ముక్కలు లేదా కారం పొడి, చిటికెడు ఉప్పువేసి బాగా కలపాలి.
ఉగాది పచ్చడి కొంచెం పలుచగా ఉంటేనే తాగడానికి బాగుంటుంది. మిశ్రమం మరీ చిక్కగా ఉంటే.. తగినన్ని నీళ్లు కలుపుకోవడం మంచిది.
ఉగాది పచ్చడిని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు:
మామిడి: రోగనిరోధక శక్తి పెంచుతుంది, జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది.
బెల్లం: శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది.
చింత పండు: జీర్ణవ్యవస్థను సులభతరం చేస్తుంది, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది.
మిర్చి: ఇమ్యూనిటీ పెంచుతుంది, నొప్పిని తగ్గిస్తుంది.
ఉప్పు: డీహైడ్రేషన్ నివారిస్తుంది.
వేపపూత: రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవ్యాధులను తగ్గిస్తుంది, సీజనల్ రుగ్మతలను నివారిస్తుంది.
ఉగాది పచ్చడి కేవలం సంప్రదాయ వంటకం మాత్రమే కాదు. ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారవుతూ, జీవితంలో సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించమని గుర్తు చేస్తుంది. మితంగా తీసుకోవడం ద్వారా దీని ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా పొందవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News