ఆధ్యాత్మిక మజిలీ...శ్రీశైల పాదయాత్ర!
ABN , Publish Date - Feb 15 , 2026 | 10:08 AM
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండలు, కోనల నడుమ వెలసిన అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం. ఇప్పుడంటే రవాణా సౌకర్యాలున్నాయి కానీ... అప్పట్లో అటవీ మార్గాలను అనుసరించి శ్రీశైలానికి కాలినడకన మాత్రమే చేరుకునేవారు.
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండలు, కోనల నడుమ వెలసిన అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం. ఇప్పుడంటే రవాణా సౌకర్యాలున్నాయి కానీ... అప్పట్లో అటవీ మార్గాలను అనుసరించి శ్రీశైలానికి కాలినడకన మాత్రమే చేరుకునేవారు. కాలక్రమంలో భక్తుల సౌకర్యార్థం కొంతమంది రాజులు ఈ మార్గాలను అభివృద్ధిపరిచారు. అయితే శతాబ్దాలుగా శ్రీశైలానికి భక్తులు పాదయాత్రగా తరలివెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. నడకమార్గంలో... దారిపొడవునా ప్రకృతి అందాలు, ప్రాచీన కట్టడాలు యాత్రికులకు మధురానుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం ప్రతీ ఏటా మూడు సందర్భాల్లో శ్రీశైలానికి భక్తులు పాదయాత్రగా వెళ్తుంటారు. శివరాత్రి సందర్భంగా ఆ పాదయాత్ర విశేషాలే ఈ వారం కవర్‌స్టోరీ.
కృతయుగంలో పార్వతీ పరమేశ్వరులు తమ పుత్రులైన వినాయకుడు, కుమారస్వామి వార్లకు ముల్లోకాల ప్రదక్షిణ చేయాలని పరీక్ష పెడతారు. వినాయకుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే సమస్త లోక రక్షకులుగా భావించి, వారి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. దాంతో పరీక్షలో వినాయకుడే నెగ్గినట్లు గౌరీశంకరులు తెలపడంతో అలకవహించిన కుమారస్వామి శ్రీగిరి పర్వతం వైపు వెళ్లి అక్కడే ప్రతిష్ఠుడయ్యాడని ప్రతీతి. తనయుడి అన్వేషణలో కైలాసం నుంచి శ్రీగిరి పర్వతం చేరుకున్న ఉమామహేశ్వరులు అక్కడి ప్రకృతి, సహజ సౌందర్యాలకు ముగ్ధులై... అక్కడే వెలసినట్లు పురాణాల్లో ఉంది.

అందుకే ఈ క్షేత్రాన్ని భూలోక కైలాసంగా పిలుస్తారు. అంతేకాదు.. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కొలువైన ఏకైక దివ్యధామం శ్రీశైలం. ఇంతటి మహిమ గల ఈ క్షేత్రంలో శివపార్వతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జునులుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. కాగా ప్రాచీన కాలం నుంచి శ్రీశైలానికి నాలుగు కాలిబాట మార్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కృష్ణానదికి ఎడమ వైపున నీలిగంగ, జాతరరేవు మార్గాలు ఉండగా... కుడి వైపున శిఖరేశ్వరం, భీమునికొలను నడక మార్గాలు ఉన్నాయి. ఆయా మార్గాలను పరిశీలిస్తే...
నీలిగంగ మార్గం: తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఈ మార్గంలో శ్రీశైలానికి చేరుకునేవారు. ఈ మార్గంలో భక్తులు మొదట నాగర్‌కర్నూలుకు చేరుకుని అక్కడి నుంచి అమ్రాబాద్, తెలకపల్లి మీదుగా ఉమామహేశ్వరానికి వస్తారు. అక్కడి నుంచి అప్పాపురం, భ్రమరాంబ చెరువు, మేడిమ్రాకుల మీదుగా సంగడి గుండాలకు చేరుకుని... నీలిగంగరేవు వద్ద నిర్మించిన కృష్ణానదిని దాటి చుక్కల పర్వతాన్ని ఎక్కి శ్రీశైలానికి చేరుకునేవారు.

జాతరరేవు మార్గం: ఈ మార్గంలో ఉమామహేశ్వరాలయానికి చేరుకుని, మన్ననూరు మీదుగా అప్పాపురం, భ్రమరాంబ చెరువు మేడిమ్రాకుల గుండా అక్కగవిని చేరుకుంటారు. జాతరరేవు వద్ద కృష్ణానదిని దాటి చుక్కలపర్వతాన్ని ఎక్కి, శ్రీశైలానికి చేరేవారు. 14వ శతాబ్దంలో వెలమరాజులు ఈ మార్గాన ఉమామహేశ్వరాలయం నుంచి జాతరరేవు వరకు సుమారు 50 కిలోమీటర్ల పొడవున మెట్ల రహదారిని వేయించారు. కాగా శ్రీశైలానికి చేరుకునే నాలుగు ప్రధాన కాలినడక మార్గాల్లో భీమునికొలను మార్గం మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. ఈ మార్గం గుండానే ప్రతీఏటా మహాశివరాత్రి ఉత్సవాలు, ఉగాది, కార్తీక పౌర్ణమి రోజుల్లో భక్తులు కాలినడకన తరలివెళ్తుంటారు.
శిఖరేశ్వర మార్గం: శ్రీశైలానికి తూర్పు ప్రాంతం నుంచి అంటే కోస్తా ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఈ మార్గంలో శ్రీశైలానికి చేరుకునేవారు. తొలుత ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం చేరుకుంటారు. అక్కడి నుంచి యర్రగొండపాలెం, వెంకటాద్రిపాలెం, గంజివారిపల్లి, దుద్దనాలనగరు మీదుగా తెలుగు రాయని చెరువు వరకు ఎడ్లబండ్లలో చేరుకుని... అక్కడి నుంచి కాలినడకన చిన్నారుట్ల, శిఖరేశ్వరం మీదుగా శ్రీశైలానికి వచ్చేవారు. అదేక్రమంలో మార్కాపురం నుంచి వచ్చే భక్తులు తోకపల్లి, దోర్నాల, చింతల వరకు ఎడ్లబండ్లలో చేరుకుని... అక్కడి నుంచి కాలినడకన చింతల, జంగం మిద్దె, పెద్దారుట్ల మీదుగా చిన్నారుట్లకు చేరుకుని... అక్కడి నుంచి శిఖరేశ్వరం మీదుగా శ్రీశైలానికి చేరేవారు.

భీమునికొలను మార్గం: శ్రీశైలానికి దక్షిణాన, పశ్చిమ ప్రాంతాల నుంచి భక్తులు ఈమార్గం గుండా వచ్చేవారు. దక్షిణ ప్రాంతం నుంచి వచ్చే భక్తులు కడప జిల్లా సిద్ద్దవటం నుంచి నంద్యాల మీదుగా, పశ్చిమ ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగులాంబ అలంపురం క్షేత్రానికి చేరుకుని, అక్కడ తుంగభద్ర నది దాటి... అక్కడి నుంచి ఆత్మకూరుకు చేరుకునేవారు. ఈ మార్గానికి ఆత్మకూరు కూడలిగా ఉండేది. అక్కడి నుంచి కృష్ణాపురం, వెంకటాపురం, ప్రాచీన సిద్దాపురం మీదుగా నాగలూటికి ఎడ్లబండ్లలో చేరుకునేవారు. అక్కడి నుంచి పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం, హఠకేశ్వరం మీదుగా శ్రీశైలానికి వచ్చేవారు. నాలుగు కాలిబాట మార్గాల్లో భీమునికొలను మార్గమే ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీశైల సంస్కృతి, మతాంశాలతో చెప్పలేనంత ముడిపడి ఉన్న కన్నడ భక్తులు కూడా ఈ మార్గం ద్వారానే శ్రీశైలానికి చేరుకుంటారు. కాగా ఈ మార్గంలో నాగలూటి నుంచి శ్రీశైలం వరకు ఉన్నటువంటి కొండ మార్గాల్లో 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు మెట్ల మార్గాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ మార్గం మీదుగానే శ్రీకృష్ణదేవరాయులు, శివాజీ మహరాజ్ శ్రీశైలానికి చేరుకున్నారు.
మధురానుభూతినిచ్చే పాదయాత్ర
శ్రీశైలానికి పాదయాత్ర అంటే... ఓ మధురానుభూతి అని చెప్పవచ్చు. ప్రత్యేకించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలానికి ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుంచే కాకుండా... ఇతర జిల్లాలకు చెందిన శివదీక్షాపరులు, సామాన్య భక్తులు పాదయాత్రగా తరలివస్తుంటారు. కొందరు ఏకంగా తమ స్వగ్రామాల నుంచే నేరుగా శ్రీశైలానికి కాలినడకన వెళ్తుంటారు. మరికొంత మంది భక్తులు ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి వాహనాల్లో చేరుకుని అక్కడి నుంచి పంటపొలాల గుండా నాగలూటి చెంచుగూడేన్ని చేరుకుంటారు.
ఆ తర్వాత 5 కిలోమీటర్ల అటవీ మార్గంలో ప్రయాణించాలి. అక్కడ నాగలూటి వీరభద్రాలయాన్ని సందర్శించి... నాగలూటి తిప్పలు, దామర్లకుంట, నల్లమల కొండలపై అడవిమార్గం గుండా సుమారు 14 కిలోమీటర్లు ప్రయాణించి... పెచ్చెర్వు చెంచుగూడెన్ని చేరుకుంటున్నారు. అక్కడి నుంచి కత్తులకొండ, కోర్కెలకొండ అటవీ ప్రాంతంలో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే... భీముని కొలను ప్రాంతానికి చేరుకుని, ఆ తర్వాత దుర్భేద్యమైన కొండ మార్గంలో కైలాస ద్వారానికి చేరుతున్నారు. అనంతరం 6 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీశైల మల్లన్న దర్శనానికి తరలివెళ్తున్నారు.
పాదయాత్రలో భాగంగా నాగలూటి మెట్లు, అడవి అందాలు, మార్గమధ్యలో ప్రాచీన కట్టడాలు, పెచ్చెర్వులో ఆదిమ చెంచుగిరిజనుల జీవన విధానాలు భక్తులకు కనువిందు చేస్తాయి. నిజానికి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లే భక్త్తులు చాలామంది ప్రయాణంలో కాస్త నీరసించినప్పటికీ కొండకోనలు దాటుతూ.. ‘ఆదుకో మల్లన్న.. చేర్చుకో మల్లన్న..’ అని స్మరిస్తూ శ్రీశైలానికి చేరుకోగానే అమితానందానికి లోనవుతుంటారు.
దారిపొడవునా ఆచారాలు
శ్రీశైలానికి కాలినడకన తరలివెళ్లే పాదయాత్రికులు దారిపొడవునా ఆచారాలు పాటిస్తూ తమ యాత్రను కొనసాగిస్తుంటారు. వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులు తొలుత గోసాయికట్ట ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత నాగలూటి వీరభద్రస్వామిని దర్శించుకుని మెట్ల మార్గం గుండా బయలుదేరుతారు. అక్కడి నుంచి దామర్లకుంట మీదుగా పెచ్చెర్వుకు చేరుకుని... అటునుంచి వెళ్లే క్రమంలో కోర్కెలకొండలో సంతానం కోసం చెట్లకు ఊయలు కట్టడం, సొంతింటి కలలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఒకదానిపై ఒకటి రాళ్లను అమర్చి కోర్కెలు కోరుకోవడం జరుగుతోంది. అక్కడి నుంచి సీతమ్మబావిని సందర్శించి, ఆ తర్వాత భీముని కొలనుకు చేరుకుని, అక్కడ భీముడి విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత కైలాస ద్వారాన్ని చేరుకున్న అనంతరం హఠకేశ్వరాలయాన్ని, సాక్షిగణపతిని దర్శించుకుని మల్లన్న సన్నిధికి చేరుకుంటారు.
కార్తీకమాసంలో కష్టమే ...
మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి కాలినడకన వెళ్లే భక్తులకు ఒక్క నడకయాతన, తాగునీటి కష్టాలు మినహాయిస్తే.. దాదాపుగా ప్రయాణం సులభతరంగానే ఉంటుంది. అయితే కార్తీకమాసంలో శ్రీశైలానికి వెళ్లాలంటే మల్లన్న భక్తులకు కత్తిమీద సాములాంటిదే. ఈ సమయంలో వెళ్లే యాత్రికులకు ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉండవు. నాగలూటి చెంచుగూడెం తర్వాత రహదారంతా గడ్డి ఏపుగా పెరిగి కనీసం దారిని కూడా గుర్తుపట్టలేని స్థితికి మారుతుంది. అలాగే మార్గం వెంట మూడువాగులు యాత్రికులకు అడ్డుపడుతాయి. మోకాళ్లలోతు నీళ్లలో నడవాల్సి ఉంటుంది. చాలామంది ఎక్కువగా రాత్రి ప్రయాణం చేస్తుంటారు. అయితే ఎముకలు కొరికే చలిలో నీటివాగుల్లో ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా కార్తీకమాసంలో నల్లమల అడవిలో విపరీతమైన చలి ఉంటుంది. వన్యప్రాణులు తరచూ సంచరిస్తుంటాయి. ప్రత్యేకించి ఎలుగుబండ్లు, అడవిపందులు ఎక్కువగా పాదయాత్రికుల కంటపడుతుంటాయి. అయితే భక్తులు బృందాలు శివనామస్మరణతో అక్కడక్కడ బాణసంచా పేల్చుతూ.. తమ ప్రాణాలను మల్లన్నే రక్షిస్తాడన్న విశ్వాసంతో ముందుకెళ్తుంటారు.
కన్నడిగుల పుట్టింటి సారె...
ప్రతి ఏటా ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడిగులు వందలాది కిలోమీటర్ల నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా తరలివస్తారు. శ్రీశైల మల్లన్న ధర్మపత్ని శ్రీభ్రమరాంబిక అమ్మవారిని కన్నడిగులు తమ ఆడపడుచుగా భావించి... పుట్టింటి సారెను (పసుపు, కుంకుమ, గాజులు, వస్ర్తాలు, ఒడిబియ్యం) సమర్పించేందుకు శతాబ్దాల కాలం నుంచి కాలినడకన అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. అలాగే అమ్మవారికి మిరియాల చూర్ణాన్ని (మిరియాలపట్టు) కూడా నుదుటన ఉంచేందుకు తీసుకొస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో క్షేత్రానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ సమయంలో భక్తుల రద్దీతో అమ్మవారికి తలపోటు వచ్చిందేమోనన్న భావనతో... తమ ఆడపడుచుకు ఆ కష్టాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో మిరియాల పట్టును తీసుకురావడం సంప్రదాయంగా వస్తోంది. ఎంతో విశేష ప్రాశస్త్యం కలిగిన కన్నడిగుల పాదయాత్ర శ్రీశైల క్షేత్ర ఆవిర్భావం నుంచే కొనసాగుతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
కర్నాటక రాష్ట్రంలోని బైచ్‌వాల్, కణ్ణల్ని, కూడలి, కెంపాలి, సోలాపూర్, బాగల్‌కోట, అత్తిని, బళ్లారి, గుల్బర్గ, హుబ్లీ, సింధిని, కచునూర్, అరికెరి, రాయచూర్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వందలాది కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర చేస్తూ వస్తుంటారు. దాదాపు పక్షం నుంచి నెల రోజుల ముందు తమ సొంత ప్రాంతాల నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. కొంతమంది కాళ్లకు పొడవాటి కర్రలు ధరించి పాదయాత్ర సాగిస్తుంటారు. అటవీమార్గం వరకు కర్రలపైనే నడిచి తమభక్తిని చాటుకుంటారు. కొందరైతే అమ్మవారికి సమర్పించే సారెతో కూడిన కావడిలను మోస్తూ పాదయాత్రగా వెళ్తుంటారు.
అన్నదాన సేవకు ఆదివాసులే ఆద్యులు..!
మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిఏటా శ్రీశైలానికి కాలినడకన వెళ్లే పాదయాత్రికులకు దాతలు దారిపొడవునా అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ అన్నదాన సేవలకు ఆద్యులు నల్లమల ఆదివాసీ చెంచు గిరిజనులే అని చెప్పవచ్చు. కొన్ని శతాబ్దాల క్రితం రెడ్డిరాజులు, కృష్ణదేవరాయుల కాలంలోనే చెంచులు అన్నదాన విడిది కేంద్రాలను ఏర్పాటు చేసి, వారే స్వయంగా వడ్డించేవారు.
అలనాటి సంప్రదాయం ప్రకారమే నేటికి నల్లమలలో అన్నదాన కేంద్రాలు కొనసాగుతున్నట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. ప్రత్యేకించి అటవీ ప్రాంతంలోని గోసాయికట్ట ఆంజనేయస్వామి ఆలయం, నాగలూటి వీరభద్రాలయం, పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం, హఠకేశ్వరం తదితర ప్రదేశాల్లో నిరంతరం అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులు సేవలందిస్తున్నారు. ప్లాస్టిక్ రహితమైన అరటి ఆకులను, స్టీల్ ప్లేట్లు, గ్లాసులను వినియోగిస్తారు. భక్తుల సౌకర్యార్థం అక్కడక్కడ వైద్య ఆరోగ్యశాఖ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. పాదయాత్రలో కాళ్లనొప్పులకు గురైనవారికి ఆయిల్ మసాజ్ చేయడం వంటి సపర్యలు చేస్తుంటారు. మొత్తానికి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన భక్తులు తరలిరావడం అనే సంప్రదాయం తరతరాలుగా నిరంతరాయంగా కొనసాగడం అక్షరాలా ఆ స్వామి కరుణాకటాక్షమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ అద్వితీయమైన ఆధ్యాత్మిక మజిలీ... శ్రీశైల పాదయాత్ర!
- చల్లా నవీన్‌కుమార్ చౌదరి, కర్నూలు
ఫొటోలు: షేక్ మహ్మద్ రఫీ
శ్రీశైల యాత్రలో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని...
చెంచులక్ష్మి మ్యూజియం: శ్రీశైల మహాక్షేత్రం గిరిజనులకు కేంద్రంగా ఉంటుంది. నిజానికి నల్లమల అడువులు చెంచు గిరిజనులకు అండగా ఉంటున్నాయి. నల్లమలకు, చెంచులకు ఉన్న అనుబంధాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశాయి. దానికి ‘చెంచులక్ష్మి మ్యూజియం’ అని పేరు పెట్టారు. శ్రీశైలం ప్రధాన ద్వారం చేరుకున్న అనంతరం టోల్‌గేట్ పక్క భాగంలో ఉంటుంది. ఇందులో చెంచుల జీవితాలు, వారి పద్ధతులు, సంస్కృతి గురించిన విగ్రహాలను ఏర్పాటు చేశారు. నరసింహస్వామి భార్య చెంచులక్ష్మిగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. అందుకే ఈ మ్యూజియానికి ‘చెంచులక్ష్మి మ్యూజియం’ అని పేరు పెట్టారు. ఒక్కొక్కరికి రూ.10 చొప్పున ప్రవేశ రుసుం ఉంటుంది.
ఆక్టోపస్ వ్యూ పాయింట్: ఈ ప్రాంతంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘ఆక్టోపస్ వ్యూ పాయింట్’. కొండల నడుమ ప్రవహించే కృష్ణమ్మను పై నుంచి చూస్తే ఆక్టోప్‌సను పోలి ఉంటుంది. అందుకే ఈ లే అవుట్‌కు ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనే పేరు వచ్చింది. దట్టమైన అడవుల మధ్య నది ఒంపుసొంపుల మార్గంలో ప్రశాంతంగా ప్రవహించడాన్ని ఈ పాయింట్ నుంచి చూడవచ్చు. శ్రీశైలం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోమలపెంటలో ఈ ఆక్టోపస్ వ్యూ ఉంది.
జలపాతాల సందడి: నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో విలువైన వృక్ష సంపద, వన్యప్రాణులతో పాటు ఆహ్లాదపరిచే జలపాతాలు ఆకట్టుకుంటాయి. కొండలపై నుంచి జాలువారే ఈ జలపాతాల అందాలను చూసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతారు. శ్రీశైలం నుంచి 58 కిలోమీటర్ల దూరంలో పచ్చని నల్లమల అడవిలో ‘మల్లెల తీర్థం’ అనే అందమైన జలపాతం కనిపిస్తుంది. సుమారు 150 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ మల్లెలతీర్థం అందాలు అద్భుతం. అలాగే ఉమా మహేశ్వరం జలపాతం, మద్దిమడుగు జలపాతాలు కూడా ఆకట్టుకుంటాయి.
అక్కమహాదేవి గుహలు: శ్రీశైలంలో సాహస యాత్రికులకు ‘అక్కమహాదేవి గుహలు’ ఓ అద్భుతమైన ప్రదేశం. వీటినే సున్నపురాయి గుహలు అని కూడా అంటారు. 12వ శతాబ్దానికి చెందిన అక్కమహాదేవి అనే సాధువు పేరుతో ఈ గుహలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అక్కమహాదేవి తన జీవితాన్ని మల్లికార్జున స్వామికోసం ధ్యానం చేస్తూ అంకితం చేసిందని చరిత్ర చెబుతోంది. కృష్ణానది మీదుగా పడవ ప్రయాణం ద్వారా మాత్రమే ఈ గుహలను చేరుకోవచ్చు. ఈ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఉంది.
ఇష్ట కామేశ్వరీదేవి ఆలయం: ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవారితో పాటు మరో విశిష్ట దేవాలయం ఉంది. అదే ఇష్ట కామేశ్వరీ దేవి క్షేత్రం. దేశంలో ఇష్టకామేశ్వరీ దేవి పేరుతో శ్రీశైలంలో తప్ప మరెక్కడా మరో ఆలయం ఉండదు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే కోరికల్ని ఈ అమ్మవారు నెరవేరుస్తారని నమ్ముతారు. గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఉంటుంది. ఈ క్షేత్రానికి కార్లు వెళ్లలేవు. రోడ్డు మార్గం కూడా సరిగ్గా ఉండదు. 20 కిలోమీటర్ల దూరం దాదాపు గంటసేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
శిఖరేశ్వరం: శ్రీశైలంలో మరో అద్భుత ప్రాంతం ‘శిఖరేశ్వరం’. అందరూ శిఖరం అని పిలుస్తుంటారు. సముద్రమట్టానికి 2,830 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై ఉన్న ఆలయంలో శిఖరేశ్వర స్వామిగా పరమశివుడు కొలువై ఉన్నాడు. శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ శిఖరేశ్వరం ఉంది. ప్రకృతి, ప్రశాంతతకు నిలయంగా ఉన్న ఈ పురాతన క్షేత్రంలో వాస్తుశిల్పం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీశైల ఆలయ ప్రధాన గోపురాన్ని సందర్శిస్తే మోక్షం లభిస్తుందని స్కందపురాణంలో ఉన్నట్లుగా చెబుతారు.
శివయ్య చెంత పాతాళగంగమ్మ: శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో లోయలో ఉన్న పాతాళగంగను పాపాలను పోగొట్టే పవిత్ర ప్రదేశంగా భక్తులు భావిస్తారు. నల్లమల అడవుల్లోని వనమూలికలతో నిండిన ఈ నీటికి అనేక రోగాలను దూరం చేసే శక్తి ఉందని ప్రజల విశ్వాసం. పాతాళ గంగను చేరుకోవాలంటే మెట్ల మార్గం ఉంది. దానికి తోడు రోప్‌వే కూడా టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. భక్తులు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవాలంటే ముందుగా పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి వెళ్తుంటారు.
- కమతం వెంకటకృష్ణ, ఆత్మకూరు
ఈ వార్తలు కూడా చదవండి:
‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!
గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్
Read Latest Telangana News and National News