Devotional: పచ్చని సీమలో.. ప్రభల తీర్థం
ABN , Publish Date - Jan 11 , 2026 | 10:45 AM
భూమాత పరిచిన పచ్చని తివాచీల్లాంటి వరిచేలు... అందమైన కొబ్బరిచెట్ల నడుమ... నేలకు దిగి వచ్చిన ఇంద్రధనస్సులా సాగుతుంది కోనసీమ ‘ప్రభల తీర్థం’. అదొక దృశ్య కావ్యం లాంటిది.
భూమాత పరిచిన పచ్చని తివాచీల్లాంటి వరిచేలు... అందమైన కొబ్బరిచెట్ల నడుమ... నేలకు దిగి వచ్చిన ఇంద్రధనస్సులా సాగుతుంది కోనసీమ ‘ప్రభల తీర్థం’. అదొక దృశ్య కావ్యం లాంటిది. చూడటానికి రెండు కళ్లు చాలవు. సంక్రాంతికి కోనసీమలో కన్నులపండువలా సాగే... కోవెల లేని ఈ తీర్థం విశేషాలే ఈవారం కవర్‌స్టోరీ.
జీవన విధానంలో ఆధునికత ఎంత ప్రబలంగా చొరబడుతున్నా.. కోనసీమవాసులకు ప్రతీ సంక్రాంతికి, సంప్రదాయం చెక్కు చెదరకుండా ఆధ్యాత్మిక విందు చేసే పెద్ద పండుగ ‘ప్రభల తీర్థం’. సంక్రాంతికి ముంగిళ్లన్నీ రంగవల్లులతో శోభాయమానమవుతాయి. పైరుపచ్చని కోనసీమలో ఆ వన్నెలకు అదనపు రంగులు అద్దుతోంది ప్రభల తీర్థం. ఆధ్యాత్మికతకు, అందాన్ని జోడించే ఆ వన్నెల పర్వం ‘కోనసీమ ఏకాదశ రుద్రుల జగ్గన్నతోట ప్రభల తీర్థం’.
ఏకాదశ రుద్రులు కొలువయ్యేదిక్కడే...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో గుడి, గోపురం లేకుండా... సుమారు 450 ఏళ్ల క్రితం నుంచి సంక్రాంతి కనుమ పండుగనాడు ఈ తీర్థాన్ని వైభవంగా నిర్వహిస్తారు. మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు జరిగే ప్రభల తీర్థంచారిత్రాత్మకమైనదిగా, పవిత్రమైనదిగా పేర్కొంటారు. ప్రాచీన కాలం నుంచి ఈ ప్రభల తీర్థాన్ని తొలిసారిగా జగ్గన్నతోటలోనే నిర్వహిస్తున్నారని మొసలపల్లిలోని భోగేశ్వరస్వామి ఆలయంలో ఉన్న రాగిశాసనాన్ని బట్టి తెలుస్తోంది.

ఈ ప్రాంతంలో ఎలాంటి గుడి, గోపురం లేకుండానే ఏడెకరాల కొబ్బరితోటలో తీర్థం నిర్వహించడం విశేషం. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు కొలువుదీరేది దేశం మొత్తం మీద జగ్గన్నతోటలోనే అంటారు. 17వ శతాబ్దంలో సంక్రాంతి కనుమనాడు ఏకాదశ రుద్రలు లోకకల్యాణార్థం జగ్గన్నతోటలో సమావేశమై, చర్చించారని చారిత్రక కఽథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగ్గనాఽథ మహారాజు (జగ్గన్న) తోటలో జరిపే ప్రభల తీర్థానికి విచ్చేసి... ఏకాదశ రుద్రులను దర్శించుకునేవారని, అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని ‘జగ్గన్నతోట’గా పిలుస్తున్నారని చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తోంది.
ప్రధాని మెచ్చారు...
కనుమ రోజు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవానికి ప్రతి ఏటా ఒక ప్రత్యేకత ఉంటుంది. 2020 సంవత్సరంలో గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు జగ్గన్నతోట ప్రభల తీర్థం విశిష్టతను గురించి దేశ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయడంతో... ఆయన స్పందించి ప్రత్యుత్తరం రాశారు. ఏకాదశ రుద్రుల ఆశీస్సులు ప్రతీ ఒక్కరిపై ఉండాలని ప్రధాని ఆకాక్షించారు. 2021లో శృంగేరి పీఠానికి చెందిన శ్రీ విధుశేఖరభారతీ స్వామీజీ ఏకాదశ రుద్రుల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సందేశాన్ని అందించారు. 2023లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశకటంగా జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం థీమ్‌ను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఏకాదశ రుద్రుల చరిత్రను ముద్రించారు. 2025లో భారత పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఉత్సవ్ విభాగంలోని ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్ జాబితాలో ఈ తీర్థానికి చోటు దక్కింది.

రెండెడ్ల బండ్ల సవారీ...
కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి దేశవిదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు హాజరవుతుంటారు. ప్రత్యేకంగా అలంకరించిన ఈశ్వరుడి ప్రతిరూపంగా పిలిచే ప్రభలను గ్రామాల్లో ఊరేగిస్తే... శాంతి సౌభాగ్యాలు చేకూరతాయనేది పూర్వీకుల విశ్వాసం. ఈ తీర్థానికి సంప్రదాయబద్ధంగా బండెనక బండి కట్టి, రెండెడ్ల బళ్లపైనే ప్రజలు వస్తుంటారు. కోనసీమలోని పచ్చని కొబ్బరిచెట్ల నడుమ దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ ప్రభల ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతాయి. ఆకుపచ్చని కొబ్బరాకులతో అల్లిన తడికలతో రెండెడ్ల బళ్లకు గూడును కట్టి, వాటిలో ప్రయాణిస్తూ ప్రభల తీర్థాలకు రావడం ఈ ప్రాంత మహిళలకు మహా సరదా.

ఆద్యంతం... ఉత్కంఠభరితం...
జగ్గన్నతోటకు ప్రభలను తీసుకువచ్చే తీరు తిలకించేందుకు నిజంగానే రెండు కళ్లూ చాలవు. మిగిలిన ప్రభల మాట ఎలా ఉన్న గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర్‌కౌశికను దాటుకుంటూ వచ్చే సుందర దృశ్యాలను చూసేందుకు లక్షలాది మంది ఆసక్తిగా వేచి చూస్తారు. అప్పటికే రైతులు పొలాల్లో నారుమడులు వేయడంతో, చేలలో వరిపంట పచ్చదనం నిండుగా కనిపిస్తుంది. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రుకు చెందిన యువకులు ‘అశ్చర్భ శరభ, అల్లల వీర’ అంటూ బరువైన ప్రభలను భుజాలపై మోస్తూ పంటచేలను తొక్కుకుంటూ తీసుకువస్తారు. అనంతరం జగ్గన్నతోటకు చెంతనే ఉన్న అప్పర్‌కౌశిక నదిని ఈ రెండు ప్రభలను దాటించే తీరు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ దృశ్యాలు చూపరులకు ఆధ్మాత్మిక కనువిందు చేస్తాయి.

కొలువుదీరే ఏకాదశ రుద్రులు వీరే...
తీర్థంలో 11 మంది రుద్రులు కొలువై ఉంటారు కాబట్టి భక్తులు ప్రభల వేడుకను కనురెప్ప వేయకుండా చూస్తుంటారు. వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి (విశ్వేశ్వరరుద్రుడు), గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి (సర్వేశ్వరరుద్రుడు), నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి (తికాగ్నికాలరుద్రుడు), కె.పెదపూడి మేనకేశ్వరుడు (మహాదేవ రుద్రుడు), పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి (శ్రీమన్మహాదేవరుద్రుడు), ముక్కామల రాఘవేశ్వరస్వామి (కాలాగ్ని రుద్రుడు), వక్కలంక విశ్వేరస్వామి (త్రిపురాంతక రుద్రుడు), మొసలపల్లి మధుమానాంత భోగేశ్వరస్వామి (నీలకంఠ రుద్రుడు), పాలగుమ్మి చెన్నమల్లేశ్వరుడు (మృత్యుంజయ రుద్రుడు), గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి (సదాశివరుద్రుడు), ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి (త్య్రంబకేశ్వర రుద్రుడు)లను ఈ ఉత్సవంలో దర్శించుకోవడం పుణ్యఫలంగా భావిస్తారు. కాగా, ఈ 11 ప్రభల్లో అయినవిల్లి మండలం నుంచి నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, అమలాపురం మండలం నుంచి పాలగుమ్మి చెన్నమల్లేశ్వరుడు, మిగిలిన 9 ప్రభలు అంబాజీపేట మండలం నుంచి వస్తాయి. ఇవే కాకుండా కోనసీమ జిల్లా వ్యాప్తంగా వేర్వేరు చోట్ల కూడా స్థానికంగా ప్రభల తీర్థాలు జరుగుతుంటాయి. ఎన్ని జరిగినా జగ్గన్నతోట జోష్‌ను వర్ణించలేం.
42 అడుగుల ప్రభలు...
ఈ ప్రభలు అన్నింటిలోకి ఎత్తయిన ప్రభలు తొండవరం, వాకలగరువు ప్రభలు. ఇవి 42 అడుగుల ఎత్తులో ఉంటాయి. తొండవరంలోని తొండేశ్వరస్వామి ఆలయ కమిటీ ఈ ప్రభలను రూపొందిస్తుంది. తొండవరం, వాకలగరువు, గున్నేపల్లి గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉండే తొండవరం, వాకలగరువు జంక్షన్‌లో ప్రభల తీర్థం జరుగుతుంది. తొండవరం ప్రభలను గ్రామం నుంచి తీర్థానికి తీసుకువచ్చే సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న విద్యుత్ లైన్లను తొలగిస్తారు. ప్రభలను తయారు చేయడంలో యువకులే ముఖ్యపాత్రను పోషిస్తారు.

సంప్రదాయబద్ధంగా ఈ ప్రభలను తయారు చేయడంలో పెద్దల సూచనలతో యువకులు ప్రభల తయారీకి శ్రమిస్తారు. తాటిపట్టితో తయారుచేసిన సూలం, మర్రి, టేకు కలపతో తయారుచేసిన బల్లవెదురు, పోక గెడలతో ప్రభలను తయారుచేసి... రంగు రంగుల వస్ర్తాలు, నెమలిపింఛాలు, పూలు, ధాన్యం కుచ్చులతో అందంగా అలంకరించి, ఉత్సాహంగా గ్రామాల్లో ఊరేగిస్తారు.
450 ఏళ్లకు పైగా వైభవోపేతంగా జరుగుతున్న జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవాన్ని... రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు నిర్ణయం తీసుకుందని, త్వరలోనే జీవో కూడా విడుదలవుతుందని ఇటీవల ప్రకటించారు. అదే జరిగితే ఈ తీర్థానికి మరింత శోభ చేకూరుతుందనడంలో సందేహం లేదు.
- ఇసుకపూడి ప్రఫుల్‌కుమార్, అంబాజీపేట
ఐదు తరాల నుంచి...
‘‘జగ్గన్నతోట ప్రభల తీర్ధానికి వచ్చే ప్రభలకు ఆతిథ్యం ఇచ్చే మొసలపల్లి శ్రీ భోగేశ్వరస్వామి వారి ప్రభను మా కుటుంబసభ్యులు ఐదు తరాల నుంచి ముస్తాబు చేస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా ప్రతిఏటా మూడు రోజులపాటు మేము ఎంతో శ్రమించి ఈ ప్రభను తయారు చేస్తాం. ప్రభను తయారు చేయడం పూర్వజన్మసుకృతంగా భావిస్తాం. ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రభను ముస్తాబు చేసి, తీర్థంలో కొలువుదీరుస్తాం’’.
- మానేపల్లి రాంబాబు, మొసలపల్లి
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News