తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఇవే..
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:46 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పురాతనమైన, మహిమాన్వితమైన శైవక్షేత్రాలు ఉన్నాయి. మహా శివరాత్రి రోజున ఈ క్షేత్రాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివెళ్తారు. ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: మహా శివరాత్రి దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పురాతనమైన, మహిమాన్వితమైన శైవక్షేత్రాలు ఉన్నాయి. మహా శివరాత్రి రోజున ఈ క్షేత్రాలకు భక్తులు వేలసంఖ్యలో తరలివెళ్తారు. ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎక్కడున్నాయో చూద్దాం..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ శైవక్షేత్రాలు:
1.శ్రీశైలం(నంద్యాల జిల్లా): ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. అష్టాదశ శక్తి పీఠాలలో (భ్రమరాంబ దేవి) ఒకటి. ఇక్కడ శివుడు ‘మల్లికార్జున స్వామి’గా కొలువై ఉన్నాడు.
2. శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): ఇది ‘పంచభూత లింగాలలో’ ఒకటి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివుణ్ని వాయులింగంగా పూజిస్తారు. రాహు-కేతు పూజలకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి.
3. మహానంది(నంద్యాల జిల్లా): నల్లమల కొండలలో మహానంది అతి ప్రాచీనమైన ఆలయం. ఇక్కడ నంది విగ్రహం, ఎల్లప్పుడూ ప్రవహించే స్వచ్ఛమైన నీటి కోనేరు ప్రత్యేక ఆకర్షణ. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు.
4. యాగంటి(నంద్యాల జిల్లా): ఇక్కడి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో భారీ నంది విగ్రహం పరిమాణం పెరుగుతూ ఉండటం వింతగా చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో కాకులు ఎగరవు ఇక్కడ ప్రతీతి.
5. తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షా రామం భీమేశ్వర స్వామి ఆలయం.. హిందూ పురాణాల్లో ఎంతో గొప్ప స్థానం కలిగింది. మహా శివరాత్రి రోజున ఇక్కడ భక్తులు కిటకిటలాడుతుంటారు.
తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాలు:
1. వేములవాడ(రాజన్న సిరిసిల్ల): తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటి వేములవాడ. ఇక్కడ రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. భక్తులు స్వామివారికి ‘కోడె మొక్కు’ చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
2. కాళేశ్వరం(జయశంకర్ భూపాల్‌పల్లి): ఇక్కడ ఒకే పానవట్టంపై శివుడు(ముక్తేశ్వరుడు), యముడు(కాళేశ్వరుడు) ఇద్దరూ కొలువైన ఉండటం ఎంతో ప్రత్యేకగా చెప్పుకుంటారు.
3. రామప్ప ఆలయం(ములుగు): యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలోకి శివుడిని ‘రామలింగేశ్వర స్వామి’ అని పిలుస్తారు.
4. వేయి స్తంభాల గుడి(హన్మకొండ): ఇది శివుడు, విష్ణువు, సూర్యుడు కొలువై ఉన్న త్రికూటాలయం. ఇక్కడికి నిత్యం దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు.
5. కీసరగుట్ట(మేడ్చల్-మల్కాజిగిరి): హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి.
6. కొమురవెల్లి మల్లన్న(సిద్దిపేట): శివుడు కొమురవెల్లి మల్లన్న రూపంలో కొలువుదీరిన పవిత్ర స్థలం.
పవిత్ర పంచారామ క్షేత్రాలు:
పురాణాల ప్రకారం.. కుమారస్వామి, తారకాసురుడిని సంహరించినప్పుడు, ఆ రాక్షసుడి మెడలోని అమృత లింగం ఐదు ముక్కులుగా విడిపోయి ఐదు వేర్వేరు ప్రదేశాల్లో పడిందట. ఆ ఐదు చోట్ల వెలసిన శివలింగాలనే ‘పంచారామ క్షేత్రాలు’ అని అంటారు.
1.అమరారమం(అమరావతి): పల్నాడు జిల్లా కృష్ణా నది తీరాన వెలిసి ఉంటాడు అమరలింగేశ్వర స్వామి. ఇక్కడి శివలింగం చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకే అభిషేకం చేయడానికి అర్చకులు మెట్లు ఎక్కి వెళ్తారు. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి.
2. ద్రాక్షారామం: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వెలసి ఉంటాడు భీమేశ్వర స్వామి. ఈ శైవక్షేత్రాన్ని ‘దక్షిణ కాశి’ అంటారు. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి(మాణిక్యాంబా దేవి). ఇక్కడ శివలింగం సుమారు 14 అడుగుల ఎత్తు ఉంటుంది.
3. సోమరామం(గునుపూడి): పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. చంద్రుడు(సోముడు) ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పండితులు చెబుతుంటారు. ఇక్కడి శివలింగం రంగులు మారుతుందని భక్తులు నమ్ముతారు. అమావాస్య నాడు గోధుమ రంగు, పౌర్ణమి నాటికి తెలుపు రంగులోకి మారుతుందని చెబుతుంటారు.
4. క్షీరారామం(పాలకొల్లు): పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో వెలసిన క్షీర రామలింగేశ్వర స్వామి. ఈ లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడని పండితులు చెబుతారు. ఇక్కడి ఆలయ గోపురం చాలా ఎత్తుగా(సుమారు 120 అడుగులు) ఉంటుంది.
5. కుమారారామం(సామర్లకోట): కాకినాడ జిల్లా సామర్లకోటలో కుమార భీమేశ్వర స్వామి ఆలయాన్ని కుమారస్వామి నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ద్రాక్షారామం ఈ ఆలయం రెండూ ఒకే నిర్మాణ శైలిని పోలి ఉంటాయని చెబుతుంటారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News