ఏపీ ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Aug 28 , 2026 | 07:38 AM
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్.. వారి జీవితాల్లో వెలుగులు పంచాలని కోరుకున్నారు. ఈ రాఖీ పౌర్ణమి సహోదర భావం, ప్రేమానుబంధాలు నింపాలని దేవుడిని ప్రార్థించారు.
సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..
‘రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ పర్వదినం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం నింపాలని కోరుకుంటున్నాను. ఈ రాఖీ పౌర్ణమి మీ జీవితాల్లో వెలుగులు పంచాలని, ప్రేమానుబంధాలు నింపాలని, సహోదర భావంతో సమాజం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కమారు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’ అని ఎక్స్ పోస్టు చేశారు.
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు: లోకేశ్
'తోడబుట్టిన అక్కాచెల్లెళ్లు లేని నాకు దేవుడే కోట్లాది మంది సోదరీమణులను తోడుగా ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కాచెల్లెళ్లు చూపించే ప్రేమాభిమానాలు మరువలేను. మహిళా లోకం ఆత్మీయత నాలో మరింత బాధ్యతను పెంచింది. విద్యార్థి దశ నుంచే ఆడవారిని గౌరవించేలా పిల్లలకు నైతిక విలువల పాఠాలు బోధిస్తున్నాం. మహిళల భద్రత, సాధికారత ప్రజా ప్రభుత్వం బాధ్యత. ప్రాణ సమానమైన తెలుగింటి అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏడేళ్లు కష్టపడితే టీచర్ అయ్యాను
జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్పు