అది యూపీ ముఠా పనే!
ABN , Publish Date - Feb 03 , 2026 | 07:45 AM
నగరంలోని కోఠిలో కాల్పులు, దోపిడీ ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అయితే... ఈ దోపిడీకి పాల్పడింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానాకి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.
కోఠీలో కాల్పులు, దోపిడీ ఘటనలో పురోగతి
అంతర్రాష్ట్ర ముఠాతో లోకల్ దొంగలకు లింకు
పాతబస్తీలో నిందితులు తలదాచుకున్నట్లు నిర్ధారణ
నేడో రేపో వివరాలు వెల్లడించనున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ: కోఠిలో కాల్పులకు తెగబడి రూ.6 లక్షలు దోపిడీ చేసిన ఘటనలో సిటీ పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. ఇప్పటికే మూడు టీమ్‌లను యూపీ, బిహార్, ఢిల్లీ(UP, Bihar, Delhi)కి పంపిన ఉన్నతాధికారులు మరో 8 టీమ్‌లను పాతబస్తీలో మోహరించారు. సుమారు 1000 సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను వడపోసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద టవర్ డంప్‌లను చెక్ చేయగా కొన్ని కీలకమైన సాంకేతిక ఆధారాలు లభించినట్లు సమాచారం. యూపీకి చెందిన ముఠానే ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది.
అంతర్రాష్ట్ర ముఠాతో లింకులు
హైదరాబాద్(Hyderabad)లోని లోకల్ దొంగలు యూపీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠాకు సహకారం అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగల కోసం పాతబస్తీలో పోలీసులు గాలిస్తున్న క్రమంలో ఓ పాత దొంగ పారిపోతున్నట్లు గమనించారు. అతన్ని పట్టుకొని విచారించగా పాత నేరస్థుడు కావడంతో భయంతోనే పారిపోవడానికి ప్రయత్నించినట్లు తేలింది. ప్రస్తుతం దొంగల కోసం పోలీసులు యూపీలో గాలిస్తున్నారు. నేడో రేపో నిందితులను పట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే వారికి హైదరాబాద్‌లో సహకరించిన ముఠా ఎవరు..? ఎవరు షల్టర్ ఇచ్చారు..? దోపిడీ ఘటన జరిగిన ముందు రోజు రాత్రి వారు ఎక్కడ బస చేశారు..? లోకల్ ముఠాకు, అంతర్రాష్ట్ర ముఠాకు ఉన్న లింకుఏంటి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
వచ్చిన మార్గంలోనే గాయబ్
బాధితుడు రిన్షాద్ కన్నా ముందుగానే కోఠి ఏటీఎం సెంటర్‌కు చేరుకున్న నిందితులు పక్కాప్లాన్ ప్రకారమే దోపిడీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాచిగూడ నింబోలి అడ్డాలో స్కూటీని పడేసి, దుస్తులు మార్చుకున్న అనంతరం చాంద్రాయణగుట్ట, బార్కస్ మీదుగా పాతబస్తీలోకి ప్రవేశించినట్లు కనుగొన్నారు. ఎంజే మార్కెట్ నుంచి కోఠికి వచ్చిన మార్గాన్ని పరిశీలించగా బార్కస్ నుంచి ఉదయాన్నే బయల్దేరి పథకం ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. దీన్ని బట్టి దోపిడీ దొంగలు ఏ మార్గం నుంచి కోఠికి వచ్చారో.. దోపిడీ అనంతరం అదే ప్రాంతానికి చేరుకొని గాయబ్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News