Share News

శిక్షణకు వచ్చి రూ. 1.65 కోట్ల బంగారు బిస్కెట్ల చోరీ

ABN , Publish Date - Feb 17 , 2026 | 09:47 AM

ఓ జువెల్లరీ షోరూంలోని సేల్స్‌ విభాగంలో శిక్షణ కోసం వచ్చిన ఓ యువకుడు రూ. 1.65 కోట్ల విలువ గల బంగారు బిస్కెట్లు చోరీ చేసి పరారయ్యాడు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

శిక్షణకు వచ్చి రూ. 1.65 కోట్ల బంగారు బిస్కెట్ల చోరీ

  • పంజాగుట్ట జోయాలుక్కాస్‌ షోరూంలో ఘటన

  • విజయవాడలో నిందితుడి అరెస్టు

హైదరాబాద్: ఓ జువెల్లరీ షోరూంలోని సేల్స్‌ విభాగంలో శిక్షణ కోసం వచ్చిన ఓ యువకుడు రూ. 1.65 కోట్ల విలువ గల బంగారు బిస్కెట్లు చోరీ చేసి పరారయ్యాడు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌(Hyderabad)లోని పంజాగుట్ల జోయాలుక్కాస్‌ జువెల్లరీ షోరూంలో జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామానికి చెందిన కారంపూడి గోపాలకృష్ణ (25) జోయాలుక్కాస్‌ షోరూంలోని సేల్స్‌ విభాగంలో పని చేయడానికి వ్యక్తులు కావాలని వచ్చిన ప్రకటనను గమనించి దరఖాస్తు చేసుకున్నాడు.


ఆరు నెలల శిక్షణకు ఎంపికైన అతడు రెండు నెలల క్రితం పంజాగుట్టలోని షోరూంలో చేరాడు. ఎంపికైన వారికి షోరూంలోని పై అంతస్తులో వసతి కల్పించి అదే షోరూంలో శిక్షణ ఇస్తున్నారు. రెండు నెలలుగా దుకాణానికి సంబంధించిన అన్ని అంశాలను గమనించిన ఆ యువకుడు.. ఈ నెల 14న పథకం ప్రకారం బంగారు బిస్కెట్లు ఉన్న బాక్స్‌లో నుంచి వంద గ్రాముల బరువు ఉన్న పది బంగారు బిస్కెట్లను దొంగలించాడు. వాటిని షూ, సాక్సులలో పెట్టుకుని అప్పటికే షోరూం వెనుక భాగంలోని వీధిలో ఉంచిన తన ద్విచక్ర వాహనాన్ని తీసుకుని విజయవాడకు పారిపోయాడు.


city4.4.jfifఅదే రోజు రాత్రి షోరూం వేళలు ముగిసే సమయంలో సిబ్బంది బంగారు బిస్కెట్లు ఉన్న బాక్స్‌, స్టాక్‌ తనిఖీ చేయగా పది బంగారు బిస్కెట్లు కనిపించలేదు. దీంతో సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ రోజు గోపాలకృష్ణ అక్కడ ఉన్నట్టు గమనించారు. అదే రోజు రాత్రి షోరూం ప్రతినిధి సెబాస్టియన్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌ఫోన్‌, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గోపాలకృష్ణ విజయవాడలో ఉన్నట్టు గుర్తించారు.


zzz.jfifఆదివారం అతడిని అదుపులోకి తీసుకుని బంగారు బిస్కెట్లు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.నాగరాజు, ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, సిబ్బందిని ఖైరతాబాద్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి అభినందించారు. నగల దుకాణ యజమానులు, నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 17 , 2026 | 10:01 AM