Share News

సంక్రాంతికి వచ్చారు.. దోచుకెళ్లారు!

ABN , Publish Date - Jan 24 , 2026 | 10:25 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం దాదాపు సగం ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో.. వేరే ప్రాంతాలకు చెందిన దొంగలు నగరానికి చేరుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే.. ఈ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంక్రాంతికి వచ్చారు.. దోచుకెళ్లారు!

- ఇంకా చిక్కని దొంగల ఆచూకీ

- నగరంలో వరుస స్నాచింగ్‌లు, దోపిడీలు

- ఒకేరోజు 8 ఇళ్లలో దోపిడీ

హైదరాబాద్‌ సిటీ: సంక్రాంతి(Sankranthi)కి వచ్చారు.. దోచుకెళ్లారు ఇదేదో సినిమా టైటిల్‌ అనుకుంటే పొరపాటే.. నగరంలో వరుస స్నాచింగ్‌లు, వరుస దోపిడీ దొంగల హల్‌చల్‌ కథ ఇది. పండుగకు నగరం నుంచి అంతా సొంతూళ్లకు వెళుతుంటారు. ఇదే అదనుగా దోపిడీ దొంగలు రెచ్చిపోయి ఒకేరోజు వరుసగా 8 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మరో ఘటనలో గంట వ్యవధిలో వరుసగా మూడు స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. మూడేళ్ల క్రితం కూడా సంక్రాంతి సమయంలోనే రెండు గంటల వ్యవధిలో వరుసగా ఏడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. అదే తీరున ప్రస్తుత స్నాచింగ్‌లు జరగడం గమనార్హం. సీసీ కెమెరాల పరంగా, టెక్నికల్‌గా ఎంతో అభివృద్ధి సాధించిన నగరంలో నేరస్థులు నేటికీ పట్టుపడకపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.


చోరీ చేసిన బైక్‌పై స్నాచింగ్‌లు..

సికింద్రాబాద్‌ పరిధిలోని గోపాలపురంలో పల్సర్‌ బైక్‌ను చోరీ చేసిన ఇద్దరు దొంగలు ముఖానికి మాస్కులు ధరించి వరుస చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి హల్‌చల్‌ చేశారు. మొదట హయత్‌నగర్‌ పరిధిలోని కుంట్లూరులో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని 3 తులాల పుస్తెలతాడును తెంపుకొని పరారయ్యారు. దాని విలువ రూ. 4.80లక్షలు. ఆ తర్వాత నాగోల్‌ పరిఽధిలోని అంధుల కాలనీకి చెందిన మనెమ్మ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును తస్కరించారు. దాని విలువ రూ. 3.75లక్షలు. అక్కడి నుంచి కొత్తపేటకు వెళ్లి అక్కడ ఓ మహిళ (ఆదిలక్ష్మి) మెడలోంచి 3 తులాల పుస్తెలతాడును లాక్కోవడానికి ప్రయత్నించగా.. ఆమె గట్టిగా పట్టుకుంది. దాంతో సగం గొలుసు మాత్రమే దొంగల చేతికి చిక్కింది. దాని విలువ రూ. 2.25లక్షలు.


అంతర్రాష్ట్ర ముఠానా..? లోకల్‌ దొంగలా..?

నగరంలో వరుసగా గొలుసు చోరీలకు పాల్పడి హల్‌చల్‌ చేసింది లోకల్‌ దొంగలా..? లేక అంతర్రాష్ట్ర ముఠాలా అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్‌ బృందాలు టెక్నికల్‌ ఎవిడెన్స్‌లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే దొంగలు నగరం దాటి వెళ్లిపోయారా..? నగరంలోనే నక్కి ఉన్నారా..? అనేది తెలియలేదు. కనీసం పల్సర్‌ బైక్‌ జాడ కూడా పోలీసులు గుర్తించలేకపోయారు.


city6.2.jpg

2023లోనూ ఇదే తరహాలో..

2023లో జనవరి 7న ఇదే తరహాలో చైన్‌ స్నాచర్‌లు రెచ్చిపోయారు. ముఖానికి మాస్కులు ధరించి, పల్సర్‌ బైక్‌పై వచ్చిన దుండగులు వృద్ధ మహిళలనే టార్గెట్‌ చేశారు. ఉదయం 6:10కి ఉప్పల్‌లో ప్రారంభించిన స్నాచింగ్‌లు వరుసగా నాచారం, హబ్సిగూడ, చిలకలగూడ మీదుగా వెళ్లి సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌పేటలో ఉదయం 8:10కి ముగించారు. సరిగ్గా రెండు గంటల్లో ఏడు స్నాచింగ్‌లకు పాల్పడిన దుండగులు రామ్‌గోపాల్‌పేట పరిధిలో బైక్‌ను పడేసి పరారయ్యారు. 2026 జనవరిలోనూ ఇదే తరహాలో పల్సర్‌బైక్‌ను చోరీ చేసి, దానిపై తిరుగుతూ వరుస స్నాచింగ్‌లకు పాల్పడటం, ఆ దొంగల జాడ ఇప్పటి వరకు దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.`


టెక్నాలజీ ఉన్నా దొరకని దొంగలు..

దేశంలోనే ఎక్కడాలేని విధంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నది ఇక్కడే. దేశంలో ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాల్లో 60 శాతం కెమెరాలు కూడా నగరంలోనే ఉన్నాయి. ప్రతి కెమెరాను పోలీస్‌ స్టేషన్‌, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలకు అనుసంధానం, మొత్తం పది లక్షల కెమెరాలను మానిటర్‌ చేయగల ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ సిస్టం. ట్రై కమిషనరేట్‌ పరిధిలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోయేలా టెక్నాలజీ వినియోగం నగరం సొంతం. అయినా.. అంతర్రాష్ట్ర దొంగలు అవేమీ లెక్కచేయట్లేదు. నగరంలో చైన్‌ స్నాచింగ్‌లకు, ఇళ్ల దోపిడీలకు వెనకాడట్లేదు. ఇంత టెక్నాలజీ ఉన్నా నేటికీ వారి ఆచూకీ తెలియకపోవడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి

మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..

జగన్‌ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2026 | 10:25 AM