Hyderabad: సంక్రాంతికి ఊరెళితే ఇళ్లు గుల్ల..
ABN , Publish Date - Jan 17 , 2026 | 07:05 AM
సంక్రాంతి పండుగకు ఊరెళితే ఇళ్లు గుల్ల అయిపోయిన సంఘటన నగరంలోని చెంగిచర్లలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ ఇంటితో సహా 8 ఇళ్లలో దోపిడీ జరిగింది. పక్కా ప్లాన్‌తో తెల్లవారుజామున చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- హెడ్ కానిస్టేబుల్ ఇంటితో సహా 8 ఇళ్లలో దోపిడీ
- చెంగిచర్లలోని రెండు కాలనీల్లో కత్తులతో స్వైర విహారం
- పక్కా ప్లాన్‌తో శుక్రవారం తెల్లవారుజామున చోరీ
- రూ. 50 లక్షల విలువైన బంగారం.. రూ.25 లక్షల వెండి, రూ.2 లక్షల నగదు మాయం
- కేసు దర్యాప్తునకు 10 ప్రత్యేక బృందాలు
- ఉత్తరాది దొంగల ముఠాగా అనుమానాలు
హైదరాబాద్: నగర శివారు ప్రాంత కాలనీల్లోని వారు కొందరు పండుగ సెలవులకు సొంతూరికి వెళ్లగా.. వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని.. ఓ దొంగల ముఠా చోరీలకు పాల్పడింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3.30 గంటల మధ్య చెంగిచర్ల(Chengicherla) ప్రాంతంలోని రెండు కాలనీల్లో కత్తులతో స్వైర విహారం చేస్తూ ఈ ముఠా సభ్యులు హెడ్ కానిస్టేబుల్ ఇంటితో పాటు 8 ఇళ్ల తాళాలు పగుల గొట్టారు. రూ.50 లక్షల విలువైన బంగారం ఆభరణాలు, రూ.25 లక్షల విలువైన వెండి ఆభరణాలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు.
ఈ ఘటన బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెంగిచర్లలోని కనకదుర్గ కాలనీ, అనుశక్తి కాలనీల్లోని కొందరు ఇళ్లకు తాళాలు వేసి సంక్రాంతి పండుగకోసం సొంతూళ్లకు వెళ్లారు. ముందే రెక్కీ చేసిన దొంగల ముఠా పక్కా ప్లాన్‌తో శుక్రవారం తెల్లవారుజామున ఆ ఇళ్లలో దొంగతనానికి పాల్పడింది. సొంతూళ్లకెళ్లిన వారు శుక్రవారం ఉదయం వచ్చి చూసే సరికి ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉండటంతోపాటు లోపల వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.
దీంతో బాధితులు మేడిపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనాలు జరిగిన కాలనీలు, ఇళ్లను ఉప్పల్ జోన్ డీపీసీ సురేశ్ కుమార్, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి పరిశీలించారు. క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. బాధితుల్లో పోలీసు హెడ్ కానిస్టేబుల్ డి.లక్ష్మణ్ కూడా ఉన్నారని ఉప్పల్ డీసీపీ సురేశ్ కుమార్ తెలిపారు. లక్ష్మణ్ ఇంట్లో 19 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.1.50లక్షల పై చిలుకు నగదు దొంగలు దోచుకెళ్లారు.
ప్రభుదాస్ ఇంట్లో 10తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులు, రూ.15 వేల నగదు, రాజు ఇంట్లో 2 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు, ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావు ఇంట్లో 2 తులాల బంగారం, రూ.20 వేల నగదును దొంగలు దోచుకెళ్లారని బాధితులు ఫిర్యాదు చేశారు. మొత్తం 8 ఇళ్లలో చోరీ జరిగిందన్న డీసీపీ సురేశ్ కుమార్.. ఒక ఇంట్లో ఏమీ దొరకలేదని, ఆ ఇంటి యజమాని విశాఖలో ఉన్నారన్నారు. ఎంత చోరీ జరిగిందనే విషయమై స్పష్టత లేదన్నారు.
ఈ కేసును 10 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ బృందాలలు పని చేస్తున్నాయన్నారు. వరుస ఇళ్లలో చోరీ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని డీసీపీ సురేశ్ కుమార్ వెల్లడించారు. దోపిడీ ముఠాలో ముగ్గురు ఉన్నట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైందని, ప్రాథమిక ఆధారాలు లభించాయన్నారు. చేతుల్లో టార్చిలైటుతో వచ్చిన దొంగలు ఇళ్లలో వెలిగే లైట్లను ఆర్పివేసి దొంగతనాలు చేశారని డీసీపీ తెలిపారు. దొంగలు ఉత్తరాది రాష్ట్రాల వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
Read Latest Telangana News and National News